2014: సీనియర్స్‌ షైన్‌ అయ్యారు.. యంగ్‌స్టర్స్‌ సైడ్‌ అయ్యారు!

కొన్నేళ్లుగా యువతరంతో పోటీ పడలేక వెనక్కి తగ్గిన సీనియర్‌ టాప్‌ హీరోలు ఈ ఏడాది తమ సత్తా చాటుకున్నారు. బాక్సాఫీస్‌ని శాసిస్తారని నమ్మిన యుంగ్‌ స్టార్లు ఈసారి తీవ్రంగా నిరాశ పరిచి తమపై పెట్టుబడి…

కొన్నేళ్లుగా యువతరంతో పోటీ పడలేక వెనక్కి తగ్గిన సీనియర్‌ టాప్‌ హీరోలు ఈ ఏడాది తమ సత్తా చాటుకున్నారు. బాక్సాఫీస్‌ని శాసిస్తారని నమ్మిన యుంగ్‌ స్టార్లు ఈసారి తీవ్రంగా నిరాశ పరిచి తమపై పెట్టుబడి పెట్టిన వారిని నష్టాల్లోకి నెట్టారు. కొందరేమో ఒక్క రిలీజ్‌ కూడా లేకుండా పూర్తిగా నామం పెట్టేసారు. ఎలా చూసినా ఈ ఏడాది తెలుగు సినిమాకి పెద్దగా కలిసి రాలేదు. టాప్‌ స్టార్ల సినిమాలు బోల్తా కొట్టడంతో మీడియం రేంజ్‌ సినిమాల మీదే బాక్సాఫీస్‌ డిపెండ్‌ అవ్వాల్సి వచ్చింది. ఈ ఏడాదిలో ఏ హీరో ఎలా ఫేర్‌ చేసాడనేది చూద్దాం పదండి…

స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌!

రెండేళ్ల పాటు ఈ టైటిల్‌ ఎవరికీ దక్కకుండా పవన్‌కళ్యాణ్‌ ఎగరేసుకుపోయాడు. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఈ టైటిల్‌ దక్కించుకోని అల్లు అర్జున్‌ తన కెరీర్‌లో తొలిసారి ‘బిగ్గెస్ట్‌ హిట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ తన వశం చేసుకున్నాడు. ‘రేసుగుర్రం’ చిత్రంతో ఈ ఏడాదికి బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ సాధించిన అల్లు అర్జున్‌ తన మార్కెట్‌ని అమాంతం పెంచేసుకున్నాడు. అతనిపై ఇప్పుడు బయ్యర్లకి ఎంత నమ్మకం పెరిగిందనే దానికి అతని కొత్త సినిమాకి జరుగుతోన్న బిజినెస్సే సాక్ష్యం. టాప్‌ ఫైవ్‌ హీరోస్‌లో బన్నీ లేడని వాదించే వారితోనే తను కూడా ‘రేసుగుర్రమే’ అనిపించేసుకున్నాడు. ఇకపై అతను ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్‌ చేస్తాడనే దానిని బట్టి అల్లు అర్జున్‌ ఫ్యూచర్‌ పొజిషన్‌ డిసైడ్‌ అవుతుంది. 

సూపర్‌స్టార్‌ స్పీడ్‌కి డబుల్‌ బ్రేకర్స్‌!

 వరుసగా మూడు విజయాలు సాధించి నంబర్‌వన్‌ రేసులో దూసుకుపోతోన్న మహేష్‌బాబుకి ఈ ఏడాదిలో అనూహ్యంగా రెండు స్పీడ్‌ బ్రేకర్లు ఎదురయ్యాయి. ‘1 నేనొక్కడినే’ వికటించిన ప్రయోగమని సరిపెట్టుకుందామన్నా… ‘ఆగడు’లాంటి కమర్షియల్‌ ఫార్ములా సినిమా బోల్తా కొట్టడం మహేష్‌కి పెద్ద షాకే ఇచ్చింది. ఈ ఏడాదిలో వచ్చిన అతి పెద్ద డిజాస్టర్స్‌లో రెండు తన ఖాతాలో ఉండడం మహేష్‌కి 2014 చేదు జ్ఞాపకంగా మార్చింది. ఈ డబుల్‌ డిజాస్టర్స్‌ నుంచి కోలుకుని తిరిగి తన స్థానం దక్కించుకోవడానికి మహేష్‌ తన తదుపరి చిత్రం మొదలు పెట్టేసాడు. 2006 తర్వాత మహేష్‌కి దక్కని ఇండస్ట్రీ హిట్‌ని 2015 అందిస్తుందని ఫాన్స్‌ ఆశిస్తున్నారు.

‘టెంపర్‌’ చూపించాల్సిన టైమొచ్చింది

ఎన్టీఆర్‌ మరోసారి డిజప్పాయింట్‌ చేసాడు. ఈ ఏడాదిలో అయినా యాభై కోట్ల షేర్‌ సాధించి తన సత్తాని క్వశ్చన్‌ చేస్తున్న వారికి ఆన్సర్స్‌ ఇచ్చేస్తాడని అనుకుంటే.. ‘రభస’తో ఎన్టీఆర్‌ తన ఖాతాలో మరో డిజాస్టర్‌ వేసుకున్నాడు. ఎలాంటి సినిమా చేయాలనే కన్‌ఫ్యూజన్‌ అతడిని ఇంకా వీడలేదు. కొత్తగా ట్రై చేయాలా… లేక తన స్ట్రెంగ్త్‌ని నమ్ముకోవాలా అంటూ అతను పడుతోన్న తికమక ఎన్టీఆర్‌కి వరుసగా రెండో ఫ్లాప్‌ ఇచ్చింది. పూరి జగన్నాథ్‌ తీస్తున్న ‘టెంపర్‌’లో న్యూ లుక్‌తో ప్రామిసింగ్‌గా కనిపిస్తోన్న ఎన్టీఆర్‌ తన రేంజ్‌ చూపించాల్సిన టైమొచ్చింది. 

నలభై కోట్ల హీరో!

తెలుగు సినిమాకి నలభై కోట్లు రావడం మంచి నీళ్ల ప్రాయం అయిపోయినట్టే అనిపిస్తోంది కానీ ఫ్లాప్‌ అయిన సినిమాలు ఆ మార్కుకి చాలా దూరంలో నిలిచిపోవడంతోనే తెలుస్తోంది అది అంత ఈజీ కాదని. కానీ తన సినిమాల్తో నలభై కోట్ల మార్కుని రామ్‌ చరణ్‌ ఈజీగా దాటేస్తున్నాడు. కాకపోతే నలభై దాటిన తర్వాతే అతని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద హ్యాండ్సప్‌ అనేస్తున్నాయి. కావాల్సినంత పొటెన్షియల్‌, ఫాన్‌ ఫాలోయింగ్‌ ఉంది కానీ… అందుకు తగ్గ సినిమాలు చేయడం లేదనేదానికి ఇది నిదర్శనం అనుకోవాలి. ‘ఎవడు’తో ఒక హిట్‌ అయితే దక్కించుకున్నాడు కానీ యాభై కోట్ల మార్క్‌ మాత్రం చేరుకోలేకపోయాడు. మూస సినిమాలు చేస్తున్నాడనే ముద్ర చెరిపేసుకోవడానికి ‘గోవిందుడు అందరివాడేలే’తో స్టయిల్‌ మార్చాడు. కానీ అదీ పాత ఫార్ములానే పట్టుకు వేలాడడంతో యావరేజ్‌తో సరిపెట్టుకున్నాడు. ట్రాన్స్‌ఫర్మేషన్‌ మోడ్‌లో ఉన్న చరణ్‌కి వచ్చే ఏడాది చాలా కీలకం. రేసులో దూసుకెళతాడో… లేక మేకు కొట్టినట్టు అక్కడే ఉండిపోతాడో చూడాలిక. 

సున్నా చుట్టేసారు!

స్టార్‌ హీరోల్లో పవన్‌కళ్యాణ్‌, ప్రభాస్‌కి ఈ ఏడాదిలో రిలీజ్‌లు లేవు. పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్తో బిజీ కావడంతో ఈ గ్యాప్‌ వచ్చేసింది. తన కెరీర్‌లో ఇలా సింగిల్‌ రిలీజ్‌ లేకుండా కేలండర్‌ తిరిగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ ఈమధ్య కాలంలో పవన్‌ తన సినిమాల మధ్య వేగం పెంచాడు. ఫుల్‌ ఫామ్‌లో ఉండగా… అది కూడా ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన తర్వాత పవన్‌కి బ్రేక్‌ రావడం ఫాన్స్‌కి రుచించలేదు. ఇకపోతే ప్రభాస్‌ ‘బాహుబలి’కే ఈ ఏడాది మొత్తం కేటాయించేసాడు. ‘మిర్చి’ తర్వాత వచ్చిన ఈ రెండేళ్ల గ్యాప్‌ని ‘బాహుబలి’ రెండు వెర్షన్లతో మర్చిపోయేలా చేస్తాడనే నమ్మకాలున్నాయి. ఈ స్టార్స్‌ ఇద్దరితో పాటు రామ్‌ కూడా జీరోతో సరిపెట్టేసాడు. హ్యాట్రిక్‌ ఫ్లాప్స్‌తో తీసుకున్న ఈ బ్రేక్‌ ఎంతవరకు ఫలితాన్నిస్తుందనేది త్వరలో తేలిపోతుంది.

‘పవర్‌’ఫుల్‌ కమ్‌బ్యాక్‌!

వరుసపెట్టి వేధించిన పరాజయాలకి లాస్ట్‌ ఇయర్‌ ‘బలుపు’తో ఫుల్‌స్టాప్‌ పెట్టిన రవితేజ ఇప్పుడు తన సహజ శైలికి విరుద్ధంగా చాలా గ్యాప్‌ తీసుకుంటున్నాడు. ఏడాదికి మూడు లేదా రెండు సినిమాలు చేసే అలవాటున్న రవితేజ ఈసారి కూడా సింగిల్‌ మూవీతో సరిపెట్టాడు. ‘పవర్‌’తో భారీ హిట్‌ కొట్టకపోయినా బయ్యర్లని సేఫ్‌ జోన్‌కి చేర్చి ‘మినిమమ్‌ గ్యారెంటీ హీరో’గా తనకున్న పేరు నిలబెట్టుకున్నాడు. లాస్ట్‌ ఇయర్‌ రవితేజ ఫామ్‌లోకి వచ్చినట్టే ఈ ఏడాది గోపీచంద్‌కి సుడి తిరిగింది. గోపీచంద్‌ ‘లౌక్యం’ ఈ ఏడాదిలో వచ్చిన అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. యాక్షన్‌ సినిమాలు పక్కన పెట్టి, మాస్‌ ఇమేజ్‌ని మర్చిపోయి గోపీచంద్‌ ఈసారి కామెడీతో నెట్టుకొచ్చేసాడు. ఈ బ్రేక్‌ని అతను ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడనేది చూడాలి. 

సీనియర్స్‌ సీన్‌ అయిపోలేదింకా!

మూడు, నాలుగేళ్లుగా యువ హీరోలతో పోటీ పడలేక… మునుపటి వైభవానికి తగ్గ విజయాలు అందుకోలేక ఇబ్బందులు పడ్డ సీనియర్‌ స్టార్స్‌ అందరూ ఒకేసారి ఫామ్‌లోకి వచ్చేసారు. బాలకృష్ణకి ‘లెజెండ్‌’తో నాలుగేళ్ల తర్వాత విజయం దక్కింది. మాస్‌లో తనకున్న పట్టుని బాలయ్య ఈ చిత్రంతో ఇంకోసారి చూపెట్టారు. బాలయ్య విజయ గర్జన నందమూరి అభిమానులకి మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేసింది. 

వెంకటేష్‌ ‘దృశ్యం’ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగించి అద్భుత విజయాన్ని సాధించింది. సీనియర్‌ హీరోలు ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే దానికి ఈ చిత్రం ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. 

నాగార్జున ‘మనం’తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ కైవసం చేసుకున్నారు. నిర్మాతగా తనకి వచ్చిన లాభాల కంటే ఈ చిత్రం కొడుకుగా ఆయనకి ఎక్కువ సంతృప్తినిస్తుంది. ఛాలెంజింగ్‌ కాన్సెప్ట్‌ని యాక్సెప్ట్‌ చేసి డేరింగ్‌గా దానిపై ఇన్వెస్ట్‌ చేసిన నాగార్జున ఇప్పటికీ తాను ట్రెండ్‌సెట్టర్‌నే అనిపించుకున్నారు. 

కొత్త హీరోల కథేంటి?

చిరంజీవి ఫ్యామిలీ నుంచి కొత్తగా వచ్చిన సాయి ధరమ్‌ తేజ్‌ కూడా టాలెంటెడ్‌ అనిపించుకున్నాడు. అతని మొదటి సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ పది కోట్లకి పైగా షేర్‌ సాధించి నిర్మాతలకి సేఫ్‌ వెంఛర్‌ అయింది. బయ్యర్లు పూర్తిగా గట్టెక్కలేదని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి కానీ సాయి ధరమ్‌ తేజ్‌ అయితే మార్కులు కొట్టేసాడు. ఆర్భాటంగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘అల్లుడు శీను’గా మొదటి సినిమాతోనే ఇరవై కోట్లకి పైగా షేర్‌ రాబట్టాడు. అయితే తనయుడిని హీరోగా నిలబెట్టాలనే అత్యుత్సాహంలో బెల్లంకొండ సురేష్‌ మరీ ఎక్కువ ఇన్వెస్ట్‌ చేసేసి చేతులు కాల్చుకున్నాడు. ఈ ఏడాదిలోనే పరిచయం అయిన నాగ శౌర్య అప్పుడే నాలుగు సినిమాలు చేసేసాడు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’లాంటి సినిమాల్తో గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. ఈ నెలాఖరులో మరో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కూడా పరిచయం అవుతున్నాడు. ముకుందపై అంచనాలు బాగానే ఉన్నాయి. అతను ఎలా పర్‌ఫార్మ్‌ చేస్తాడనేది చూడాలి.

కామెడీ హీరోల మాటేంటి?

అల్లరి నరేష్‌కి మళ్లీ నిరాశే మిగిలింది. అతను నటించిన మూడు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి కానీ ఒక్కటి కూడా సక్సెస్‌ కాలేదు. ‘లడ్డుబాబు’, ‘జంప్‌ జిలాని’, ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’లో ఏదీ నరేష్‌ కోరుకుంటోన్న బ్రేక్‌ ఇవ్వలేకపోయింది. సునీల్‌ నటించిన ఏకైక చిత్రం ‘భీమవరం బుల్లోడు’కి మాస్‌ ఆదరణ దక్కింది. 

వైకుంఠపాళిలో నిచ్చెనలు.. పతనాలు!

గత రెండేళ్లలో రెండు మరపురాని విజయాలు అందుకున్న నితిన్‌కి ఈ ఇయర్‌లో ఇంకా అంతటి స్వీట్‌ మెమరీ ఏమీ దక్కలేదు. రిలీజ్‌ అయిన ‘హార్ట్‌ ఎటాక్‌’ జస్ట్‌ యావరేజ్‌ అనిపించుకోగా… ‘చిన్నదాన నీకోసం’ ఈ ఇయర్‌ని సైన్‌ ఆఫ్‌ చేయడానికి సిద్ధంగా ఉంది. నానికి ఒకే నెలలో తగిలిన డబుల్‌ స్ట్రోక్స్‌ నుంచి అతనింకా కోలుకోలేదు. పైసా, ఆహా కళ్యాణం నాని మార్కెట్‌ని కూడా ఎఫెక్ట్‌ చేసాయి. మళ్లీ మొదట్నుంచీ ఆట మొదలెట్టాల్సిన పరిస్థితిలో అతనున్నాడు. చాలా కాలం తనకి దొరక్కుండా దోబూచులాడిన విజయం ‘రన్‌ రాజా రన్‌’తో టాలెంటెడ్‌ శర్వానంద్‌ని వరించింది. ఇక దీనిపై అతనో స్టేబుల్‌ కెరీర్‌ నిర్మించుకోవాలి.

మోహన్‌బాబు, మంచు విష్ణు, మనోజ్‌ కలిసి నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించుకుంది. మోహన్‌బాబు, విష్ణు చేసిన రౌడీ పరాజయం పాలైంది. విష్ణు కామెడీ సినిమాలు పక్కనపెట్టి ‘అనుక్షణం’, ‘ఎర్రబస్సు’లాంటి ప్రయోగాలు చేసాడు కానీ ఫలితం లేకపోయింది. మంచు మనోజ్‌ ‘కరెంట్‌ తీగ’ ఓపెనింగ్స్‌తో సరిపెట్టుకుంది. 

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో బ్రేక్‌ సాధించిన సందీప్‌ కిషన్‌ ఈ ఏడాదిలో తనకి తనే బ్రేక్స్‌ వేసుకున్నంత పని చేసాడు. ‘రారా కృష్ణయ్య’, ‘జోరు’లాంటి సినిమాలు అతని కెరీర్‌కి ఏ విధంగాను హెల్ప్‌ అయ్యేవి కావు. ఎలాంటి సినిమాలు చేస్తే మంచిదనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం బాగా ఉంది. లాస్ట్‌ ఇయర్‌ ‘స్వామి రారా’తో వచ్చిన హిట్‌ని నిఖిల్‌ సద్వినియోగం చేసుకున్నాడు. తొందర పడకుండా మంచి కథ కోసం వేచి చూసి… ‘కార్తికేయ’తో మరో సాలిడ్‌ హిట్‌ సాధించి తనపై కాన్ఫిడెన్స్‌ పెంచేసాడు. 

సాయికుమార్‌ తనయుడు ఆది ఈ ఏడాదిలో మూడు సినిమాలు చేసేసినా ప్రయోజనం శూన్యం. ప్యార్‌ మే పడిపోయానే, గాలిపటం, రఫ్‌ రిజల్ట్స్‌ అతనికి వేకప్‌ కాల్‌. కథల ఎంపికలో నారా రోహిత్‌ తన టేస్ట్‌ చూపిస్తున్నాడు. కానీ అతను కోరుకుంటోన్న కమర్షియల్‌ సక్సెస్‌ మాత్రం వరించడం లేదు. తన సినిమాల్లో కొత్తదనం ఉండాలనుకోవడంతో పాటు ప్రేక్షకుల ఆమోద ముద్ర పొందడం ఎలాగనేది కూడా విశ్లేషించుకోవాలితను.  వరుణ్‌ సందేశ్‌కి ఫ్లాపుల్తో సహవాసం ఈపాటికి అలవాటైపోయుండాలి. ఇప్పటికే అవకాశాలు బాగా తగ్గిపోయాయి కనుక ఇప్పటికైనా తను ఎంచుకునే సినిమాల విషయంలో జాగ్రత్త వహించాలి. సుమంత్‌ అశ్విన్‌ ‘లవర్స్‌’తో సక్సెస్‌ అయి, ‘చక్కిలిగింత’తో చతికిల పడ్డాడు. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఈ బ్యాలెన్సింగ్‌ యాక్ట్‌తో లాభం లేదు. సక్సెస్‌ ప్లస్‌ సక్సెస్సే తప్ప మైనస్‌లకి చోటివ్వకూడదు. సీనియర్‌ హీరోల్లో జగపతిబాబుకి ఊహించని బ్రేక్‌ దక్కింది. ‘లెజెండ్‌’లో విలన్‌గా నటించి తన కెరీర్‌లో ఇంకో ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన జగపతిబాబు ఇప్పుడు సూపర్‌ బిజీ అయిపోయాడు. శ్రీకాంత్‌ రెండు సినిమాల్లో హీరోగా నటించి, గోవిందుడు అందరివాడేలేలో సపోర్టింగ్‌ రోల్‌ చేసాడు. కానీ జగపతికి టర్న్‌ అయినట్టు తనకేం కలిసి రాలేదు. 

ఈ ఇయర్‌లో సీనియర్స్‌ బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారనే పాజిటివ్‌ పాయింట్‌ మినహా చెప్పుకోతగ్గ హై పాయింట్స్‌ లేవు. సూపర్‌స్టార్స్‌ అయిన యంగ్‌ హీరోస్‌ ఫెయిలవడంతో ఆ ఎఫెక్ట్‌ బాక్సాఫీస్‌పై తీవ్రంగా కనిపించింది. 2015లో సీనియర్లు, యంగ్‌స్టర్సు అందరూ కలిసికట్టుగా విజయాలు సాధించి తెలుగు సినిమా కళకళలాడిపోతుందని ఆశిద్దాం. 

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri