కమ్యూనిస్టులకేమో విలీన దినం.. కమలనాథులకేమో విమోచన దినం.. మజ్లిస్ పార్టీ దృష్టిలో విద్రోహదినం.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం ఎటూ తేల్చదంతే. కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కొత్తగా విమోచన దినోత్సవం జరపాలంటున్నారు, కనీసం విలీన దినమైనా జరపాల్సిందేనని పట్టుబడుతున్నారు. టీడీపీదీ దాదాపు ఇదే వాయిస్. తెలంగాణ జేఏసీది కూడా 'విలీన' నినాదమే.!
అసలు ఏంటి ఇదంతా.? అంటే, అది సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ జరుగుతున్న రాజకీయం. హైద్రాబాద్ స్టేట్ భారతదేశంలో కలిసిన రోజు అది. మామూలుగా కలవలేదు. దానికి పెద్ద ఆపరేషన్ జరగాల్సి వచ్చింది. నిజాం పాలకులు, హైద్రాబాద్ స్టేట్‌ని స్వతంత్ర రాజ్యంగా (వారి ఉద్దేశ్యంలో స్వతంత్ర దేశం) ప్రకటించేయాలనుకున్నారు. అక్కడే తేడా కొట్టేసింది. కానీ, భారత ప్రభుత్వం హైద్రాబాద్ స్టేట్‌ని, భారతదేశంలో అంతర్భాగంగా మార్చేందుకు ప్రయత్నించింది. పెద్ద యుద్ధమే జరిగింది.
ఈ క్రమంలో కమ్యూనిస్టుల పోరాటం తక్కువేమీ కాదు. నిజాం పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులే. అందుకే, సెప్టెంబర్ 17 విషయంలో కమ్యూనిస్టుల ఆలోచనలు ఖచ్చితంగా వుంటాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో హైద్రాబాద్ స్టేట్ విలీనం జరిగింది గనుక, బీజేపీ పటేల్‌కి గుర్తింపుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17ని గుర్తించాలంటోంది. ఇక, మజ్లిస్ ఒత్తిళ్ళు, మైనార్టీల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకుని, ఎటూ తేల్చుకోలేకపోతోంది తెలంగాణ సర్కార్.
కాస్త చరిత్రలోకి తొంగి చూస్తే, టీఆర్‌ఎస్ నేతలు.. తెలంగాణ వ్యాప్తంగా (ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో) తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేశారు. విద్రోహ దినం అని నినదించిన 'కారు' నేతలూ కూడా అప్పట్లో కన్పించేవారు. మరికొందరు సాఫ్ట్‌గా 'విలీన' దినం అని కూడా అన్నారు. కానీ, అదంతా గతం. ఇప్పుడు అంతా కామప్. అప్పటి ప్రభుత్వాల్ని అస్థిర పరిచేందుకు, తద్వారా తెలంగాణ డిమాండ్‌ని గట్టిగా విన్పించేందుకు టీఆర్‌ఎస్ అత్యంత కీలకమైన సెప్టెంబర్ 17వ తేదీని తనకు కావాల్సిన విధంగా వాడేసుకుని, ఇప్పుడు మాత్రం గాలికొదిలేసింది.
ఎవరికీ ఇబ్బంది లేకుండా 'విలీన దినం' నిర్వహించాలి.. అన్న తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ప్రతిపాదన సబబుగానే వుందని చెప్పక తప్పదు. మామూలుగా అయితే ఆ దిశగా అధికార టీఆర్‌ఎస్, కీలక నిర్ణయం తీసుకుని వుండేదే. కానీ, డిమాండ్ వచ్చింది కోదండరామ్ తరఫున కావడంతో, ఒకటికి పదిసార్లు ఆలోచిస్తోంది. కానీ, ఈ వివాదానికి ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ పడాల్సిందే. లేదంటే, అప్పుడే 'ఇది మతాల మధ్య కుట్ర కోసం జరుగుతున్న రాజకీయ ఆరాటం..' అంటూ అధికార పార్టీ నుంచి 'కామెంట్స్' వచ్చి పడ్తున్నాయి. ఈ వ్యాఖ్యలే తెలంగాణలో సెప్టెంబర్ 17 సాకుగా చూపి అశాంతికి, ఆందోళనలకు, దురదృష్టకర పరిణామాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. మరి, ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 'తెలివైన నిర్ణయం' తీసుకుంటారా.? వేచి చూడాల్సిందే.