వివాదాస్పద అంశమైనా తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేయడానికి కమల్‌హాసన్ ఎప్పుడూ మొహమాటపడడు. పరిస్థితులపై ఖచ్చితమైన అభిప్రాయాల్ని వెల్లడిస్తాడు. పది మంది నొచ్చుకునేలా వున్నా, అందులో వాస్తవాన్ని వేలెత్తి చూపుతాడు. అందుకే ఆయన కమల్‌హాసన్ అయ్యాడు.
తమిళనాడు – కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం భగ్గుమంటోన్న విషయం విదితమే. పెట్రోల్ కంటే దారుణంగా కావేరీ జలాలు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్ని తగలబెట్టేస్తున్నాయి. ఈ విషయమ్మీద స్పందించిన కమల్‌హాసన్, అంతర్ రాష్ట్ర జల వివాదాలు, నదీ ప్రవాహంలా ఎప్పటికీ కొనసాగుతూనే వుంటాయన్నాడు. మానవుడు భాష నేర్వకముందు, వానరాల కాలం నుంచీ ఈ వివాదం వుందనీ, చరిత్ర అద్దంలో మన మొహాల్ని ఇలా చూసుకోవాల్సి వస్తుండడం ప్రతి ఒక్కరూ సిగ్గుపడాల్సిన విషయమని కమల్‌హాసన్ తమిళంలో కళాత్మకంగా, కవితాత్మకంగా కడిగి పారేశాడు.
నిజమే మరి, నీటి వివాదాలు సున్నితమైనవే అయినప్పటికీ, జరుగుతున్నదేంటి.? మనిషి, తాను మనిషినన్న విషయం మర్చిపోతే ఎలా.? సాటి మనిషిని కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్పి రాష్ట్రం పేరు చెప్పి ద్వేషించడమేంటి.? సమస్యని అగ్గితో కడిగితే పరిష్కారం లభిస్తుందా.? అగ్గితో వాహనాల్ని కడిగితే ప్రయోజనం వుంటుందా.? అయితే, 'వానరాలతో' ఆందోళనకారుల్ని కమల్ పోల్చడాన్ని ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. ఎందుకంటే, వానరాలకున్న పాటి ఆలోచన మనుషులకి వుందా ఇప్పుడు.? తమిళనాడు, కర్నాటకలో విధ్వంసాలు చూశాక ఆందోళనకారుల్ని వానరాలతో పోల్చితే, వానరాలే సిగ్గుపడతాయి. ఆ సిగ్గు ఆందోళనకారులకి లేకపోవడం దురదృష్టకరం.
ఏదిఏమైనా, 'మనకెందుకులే ఈ వివాదాలు..' అని సో కాల్డ్ ప్రముఖులు ఇంట్లో కూర్చునే సందర్భం కాదిది. ప్రతి ఒక్కరూ విధ్వంసాల్ని ఖండించి తీరాల్సిందే. ఆ పని ధైర్యంగా చేసినవారిలో ప్రకాష్‌రాజ్ తర్వాత కమల్‌హాసన్ చేరాడు. ప్రకాష్‌రాజ్ సుతిమెత్తగా స్పందిస్తే, కమల్‌హాసన్ ఘాటుగా స్పందించాడు. అంతే తేడా.