కూలి పనికి వెళ్ళేవాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్న రోజులివి. ‘పచ్చబటన్, ఎర్రబటన్ తప్ప ఇంకేమీ తెలియదు..’ అనేవారు కూడా స్మార్ట్ ఫోన్లనే వాడుతున్నారు. అందులో ఫీచర్స్‌ని ఎంతమంది వాడుతున్నారు.? అని లెక్కలు తీస్తే, దాదాపుగా అందరూ స్మార్ట్ ఫీచర్లు వాడుతున్నారనే చెప్పాలి. కొందరికి అవేంటో తెలియక వాడటంలేదేమోగానీ, కాస్తో కూస్తో తెలిసున్నవారెవరూ స్మార్ట్ ఫీచర్లకి దూరంగా వుండలేకపోతున్నారు. అంతలా స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది ఓ వ్యసనంగా మారిపోయింది.
వాట్సాప్, స్కైప్.. ఇలా ఒకటేమిటి సవాలక్ష యాప్స్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో వున్నాయి. ఓ యాప్ మీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అందిస్తుంది. ఇంకో యాప్ మీ బ్యాంకింగ్ వ్యవహారాలకు ఉపయోగపడ్తుంది. మరో యాప్, మీ ప్రయాణాలకు సంబంధించిన విషయాల్ని సరళతరం చేస్తుంది. ఇలా స్మార్ట్ ఫోన్‌లో వుండే యాప్స్ మనిషి నిత్యం చేసే అనేక పనుల్లో ఉపకరిస్తున్నాయి.
ఇప్పటిదాకా అయితే చాలా యాప్స్ ఉచితంగానే అందరికీ అందుబాటులో వున్నాయి. కానీ, భవిష్యత్తులో దేనికదే వినియోగదారుల జేబులకు చిల్లులు పెట్టేయనున్నాయి. ఈ మేరకు పక్కా స్కెచ్ రెడీ అవుతోంది. మనిషి దైనందిన జీవనంలో మొబైల్ ఫోన్ అనేది ఓ అవసరంగా మారిపోతే, స్మార్ట్ ఫోన్ ఓ వ్యసనమైకూర్చుంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు తగ్గిపోయి, స్మార్ట్ ఫోన్‌తో బార్యా, భర్తలు విడివిడిగా ఎంజాయ్ చేస్తున్న రోజులివి. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఇందులో చాలావరకు వాస్తవం వుంది.
ఇంతలా జన జీవనంలో మమేకమైపోయిన స్మార్ట్ ఫోన్, అందులోని యాప్స్, ఫీచర్స్.. జనానికి అందుబాటులో లేకుండా పోతే, ప్రతిదానికీ ఓ రేటు.. అంటూ జేబులకు చిల్లులు పడ్తుంటే, అప్పుడిక ‘స్మార్ట్ మనిషి’ ఏమైపోతాడు.? సింపుల్‌గా చెప్పాలంటే పిచ్చోడైపోవడం ఖాయం. ఎనీ డౌట్స్.?