బస్సే కదా.. తగలబెట్టేద్దాం.. రైలే కదా.. నాశనం చేసేద్దాం.. అద్దం కనిపిస్తే పగలగొట్టేద్దాం.! ఇది మనిషిలోని మృగానికి చెందిన ఆలోచనలు మాత్రమే. ఆర్టీసీ బస్సులంటే అది ప్రభుత్వ ఆస్తి. కాబట్టి, తగలబెట్టేయొచ్చు. రైలు కూడా అంతే. తగలబెట్టేయడానికి ఎలాంటి ఇబ్బందులూ లేవు. ప్రభుత్వ కార్యాలయాల్ని ధ్వంసం చేసెయ్యొచ్చు. అప్పుడప్పుడూ ప్రైవేటు ఆస్తుల్ని కూడా ధ్వంసం చేసేస్తుంటారు. ఆ.. మనది కాదు కదా.!
సెంటిమెంట్ ముసుగులో ఏం చేసినా చెల్లిపోతోంది. ఏమన్నా అంటే, 'ఆ సమయంలో భావోద్వేగాలు అలా వుంటాయి..' అని కలరింగ్ ఇచ్చుకోవడం మామూలే. జమ్మూకాశ్మీర్‌లో చూస్తున్నాం ఉద్రిక్త పరిస్థితుల్ని గత కొంతకాలంగా. ఆ ఉద్రిక్తతలకు చలించని భారతీయుడు లేడు. అదక్కడ సర్వసాధారణమైన విషయం. సామాన్యులు చనిపోతారు.. భద్రతాదళాలకు చెందినవారు చనిపోతారు.. తీవ్రవాదులూ చనిపోతారు.. ఇంతా చేసి సాధించినదేమిటి.? ఏమీ లేదు, కేవలం రక్తపాతమే చరిత్రలో మిగిలిపోతోంది.
కాశ్మీర్‌ని చూసి అలా అనుకుంటున్నప్పుడు, ఆ సెగలు చూసి, దేశంలోని యువత కాస్తంత ఆలోచించాలి కదా.! ఆలోచిస్తే, ఎలా.? ఆవేశమొచ్చింది.. పగలగొట్టేస్తారు.. ఆవేశమొచ్చింది.. తగలబెట్టేస్తారు. అది యువరక్తం. సిగ్గు సిగ్గు.. యువరకత్తం కాదది, మానవ మృగాలు చేసే పని. మొన్న, ఆంధ్రప్రదేశ్‌లో సెంటిమెంట్ ముసుగులో రైలు తగలబడింది. ఎవరు నష్టపోయారు.? సామాన్యులే కదా.! చాలా రోజులపాటు ఆ రైలు తిరిగి పట్టాలెక్కలేదంటే, నష్టం ఎవరికి.? అంతకుముందు తెలంగాణలోనూ విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు తమిళనాడు, కర్నాటక భగ్గుమంటున్నాయి.
నిరసనలు తెలపడానికీ ఓ మార్గం వుంటుంది. రహదారుల్ని దిగ్బంధనం చేయొచ్చు.. ర్యాలీలు చేపట్టవచ్చు.. అక్కడితో ఆగితే, చెప్పుకోడానికేముంటుంది.! అందుకే, తగలబెట్టేస్తాం. ఎందుకంటే, మేం నవ యువ భారతావనికి ప్రతినిథులం. చందమామ సంగతులు పరిశోధించి తెలుసుకుంటున్నాం.. ఎక్కడో విశ్వాంతరాల్లో వున్న వింతల్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అయినా మనుషులం నేలమీద నిలబడటం మర్చిపోతున్నాం. ఇదిగో, తాజా నిదర్శనం కర్నాటక – తమిళనాడు తగలబడిపోతున్నాయి.
కావేరీ జలాలు కర్నాటక నుంచి తమిళనాడుకు వెళుతున్నాయి. అక్కడైనా, ఇక్కడైనా కావేరీ జలాలు గొంతు నింపుతున్నది, నేలని తడుపుతున్నది భారతదేశంలోనే కదా. అమెరికాకి వెళుతున్నాం, అక్కడి పౌరసత్వం సంపాదించగులుగున్నాం.. అక్కడ చట్ట సభల్లోనూ స్థానం కోసం పోటీ పడుతున్నాం. కానీ, మన దేశంలోనే 'నువ్వు కన్నడిగుడివి.. నువ్వు తమిళోడివి.. నువ్వు ఆంధ్రోడివి.. నువ్వు తెలంగాణోడివి..' అంటున్నాం. ఎక్కడికి పోతున్నాం మనం.?
అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నామా.? ఇలాంటి ఆటవిక చర్యలతో పాతాళానికి పడిపోతున్నామా.? ఒక్క బస్సు తగలబడితే వచ్చే నష్టం ఎవరికి.? విధ్వంసాలతో లాభమేంటి.? సిగ్గు సిగ్గు.. టెక్నాలజీలో ఎంతో ఎదుగుతున్నాం.. మనిషిగా పాతాళానికి దిగజారిపోతున్నాం. ఓ బస్సు తగలబెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించే రోజు వస్తుందా.? అసలు వస్తుందా.? రాదా.? మనిషి, తాను మనిషినన్న విషయం ఎప్పుడు గుర్తిస్తాడు.? నేను భారతీయుడ్ని.. అన్న ఆలోచన నేటితరం యువతలో బలపడాలంటే ఏం చేయాలి.? ఆ మహాత్ముడే దిగొచ్చినా, దేశాన్ని బాగుచేయగలడా.!