టీడీపీ, ఆ పార్టీ అనుబంధ పచ్చ మీడియా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసింది. ఆ సామాజిక వర్గంపై మిగిలిన సమాజిక వర్గాల్లో వ్యతిరేకత తెస్తే తప్ప…తాము మళ్లీ అధికారాన్ని దక్కించుకోలేమని టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చింది. అందువల్లే పదేపదే రెడ్డి సామాజిక వర్గంపై వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న దళితులు, గిరిజనులు, మైనార్టీలను రెచ్చగొట్టేందుకు టీడీపీ, పచ్చ మీడియా విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఆయా సామాజిక వర్గాల విజ్ఞత ముందు…వీరి కుయుక్తులు ఏ మాత్రం పనికి రావడం లేదు.
ఈ రోజు టీడీపీకి చెందిన ఓ పచ్చ పత్రికను పరిశీలిస్తే…వారి కమ్మ కులదృష్టి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు కులం గురించి పత్రికలు రాయడానికి సిగ్గుపడేవి. నాయకులు కూడా అంతే. ఇప్పుడు అలాంటి సరిహద్దులేవీ లేవు. ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు, రాయొచ్చనే భావన బలపడుతోంది.
మరీ ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కులప్రస్తావన తేవడాన్ని చాలా మంది తప్పు పట్టారు. ఇది సరైంది కాదని హితవు పలికారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కులాభిమానంతో రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే…దాన్ని మరో రకంగా ఎదుర్కొని ఉండాల్సిందని పలువురు సూచించిన విషయం తెలిసిందే.
ఏపీలో కులజాడ్యం బాగా పెరిగిపోయింది. వైసీపీ అంటే రెడ్లు, టీడీపీ అంటే కమ్మోళ్ల పార్టీ అనే బలమైన ముద్ర ఏర్పడింది. ఈ ధోరణి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ…అది పూలలో దారంలా అంతర్లీనంగా ఉండేది. కానీ ఇప్పుడు అది ఓపెన్ అయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి వైసీపీ అధినేత జగన్ సోషల్ ఇంజనీరింగ్‌ను చక్కగా అమలు పరిచారని టీడీపీ, పచ్చ మీడియా భావిస్తోంది.
టీడీపీకి కమ్మ సామాజిక వర్గం మినహాయించి మిగిలిన కులాలను దూరం చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారని, అదే ఫార్ములాను వచ్చే ఎన్నికల నాటికి తాము కూడా బలంగా అమలు పరిస్తే పోయిన అధికారాన్ని దక్కించుకోవచ్చని టీడీపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. అందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన సామాజిక వర్గం మినహా మిగిలిన కులాలకు దూరం చేసే ఎత్తుగడతో పదేపదే కులం పేరుతో విమర్శలకు టీడీపీ దిగుతుండడాన్ని గ్రహించాల్సి వుంది.
ఈ రోజు ఓ పచ్చ పత్రికను గమనిస్తే…మొదటి పేజీలో ‘700 పోస్టులు…అన్నీ మీ జాతికేనా?’ శీర్షికతో ఓ వార్తను ఇచ్చారు. ఈ వార్త ఉపశీర్షికలుగా ‘పదవులు, సంపదా అన్నీ రెడ్లకేనా? ’, ‘సీఎం జగన్‌పై బుచ్చయ్య చౌదరి ఫైర్’ అంటూ రెడ్లపై విషం కక్కే వార్తను క్యారీ చేశారు. ఇక లోపలి పేజీలో ఇచ్చిన వార్త ఎలా ఉందో చూద్దాం.
‘రాష్ట్రంలో వైసీపీ కులం కోసమే అధికారంలోకి వచ్చిందా? కీలక పోస్టులు, రాష్ట్ర సంపద అన్నీ రెడ్లకేనా? నేను ఏ కులానికీ వ్యతిరేకంకాదు. కానీ, మీరు చేస్తున్న విధానం చూసి తొలిసారి కులం గురించి మాట్లాడుతున్నా. 700 పోస్టులు భర్తీచేస్తే.. మీ కులానికే అగ్రభాగం.
టీడీపీ హయాంలో 100 మందిని కోర్టుల స్టాండింగ్ కౌన్సిల్స్‌గా నియమిస్తే వారిలో 25 మంది రెడ్లే. కమ్మ వాళ్లకు ఒరిగిందేమీ లేదు. కానీ, ఇప్పుడు హైకోర్టులో జీపీలు, న్యాయవాదుల్ని నియమిస్తే అంతా రెడ్లే. కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులు, రాజులు.. ఇలా వీరంతా ఎవరూ లేరా? ఒక సామాజిక వర్గం కోసం మిగతా వారందరినీ బలిస్తావా?’ అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు.
అలాగే ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఆ ప్రకటనలో ఇంకా ఆయన ఏమన్నారంటే… ‘ఒకవేళ ముఖ్యమంత్రికి తమ కులం మీద అభిమానం ఉంటే చూపించుకోవచ్చు. కానీ కమ్మ జాతి ఏం చేసిందని ద్వేషం. మేఘా కృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రోత్సహించలేదా? పట్టిసీమ, పురుషోత్తపట్నం పనులు చేయలేదా? మీకు మాత్రం కమ్మకులంపై ఎందుకంత ద్వేషం. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను కులం అని మాట్లాడావు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్‌ను ఇబ్బంది పెట్టారు. అమరా వతిని ముంచేశారు’ అని బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఏ కులానికి వ్యతిరేకం కాదంటూనే రెడ్లపై బుచ్చయ్య చౌదరి అక్కసు వెళ్లగక్కారు. హైకోర్టులో జీపీలు, న్యాయవాదులంతా రెడ్లే అని చెబుతున్న బుచ్చయ్య …వారికి నాయకత్వం వహించే ఏజీ శ్రీరామ్ ఏ సామాజిక వర్గానికి చెందిన వారో చెప్పి ఉంటే బాగుండేది. ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఏఏ సామాజికవర్గాలకు చెందిన వాళ్లో బుచ్చయ్య చౌదరి చెప్పి ఉంటే బాగుండేది.
అలాగే కమ్మ జాతి ఏం చేసిందని ద్వేషం అని ప్రశ్నిస్తున్న బుచ్చయ్య చౌదరి ప్రశ్నలోనే జవాబు ఉందని ఆయన గ్రహించలేక పోయారు. కేవలం తన జాతిని మాత్రమే ప్రస్తావిస్తున్నారంటే…జగన్ మిగిలిన కులాల వాళ్లకు అండగా నిలిచారనే కదా అర్థం. అమరావతి తమ కులానిదే అని మరోసారి బుచ్చయ్య చౌదరి స్పష్టం చేసినట్టు కాదా? అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్‌ను ఇబ్బంది పెట్టారని బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
దాని సంగతి కాసేపు పక్కన పెడితే ముఖ్యమైన పోస్టుల్లో కేవలం తన సామాజిక వర్గానికి చెందిన వారే ఎందుకున్నారో బుచ్చయ్య చెప్పగలరా? గత ఐదేళ్లలో ఈ రెండు నియామకాలు చాలదా…టీడీపీ కులపిచ్చికి నిదర్శనంగా చెప్పేందుకు? బుచ్చయ్య చౌదరి కులం గురించి మాట్లాడ్డం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా?
ఇదే పచ్చ పత్రికలో మరో వార్త చూద్దాం. అందులోనూ కులం కంపే. రెడ్ల గురించి ఎవరు విమర్శించినా ఈ పత్రికకు ‘కమ్మ’గా ఉంటుంది. ‘ఎక్సైజ్ సీఐ వేధిస్తున్నాడు!’ శీర్షికతో ఓ చిన్న వార్త ఇచ్చారు. మహిళా ఎక్సైజ్ ఎస్ఐ తన ఆవేదనను వ్యక్తం చేసిన సమాచారానికి సంబంధించిన వార్త. ఆ వార్తలోకి వెళితే…
కడప జిల్లా జమ్మలమడుగు ఎక్సైజ్ సీఐ చెన్నారెడ్డి తనను వేధిస్తున్నాడని మహిళా ఎక్సైజ్ ఎస్ఐ చంద్రమణి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తోటి సిబ్బంది ఎదుటే తాను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడినని, తననూ ఎవరూ ఏమీ చేయలేరని, ఎవరికి చెప్పుకున్నా తనకు ఏమీ జరగదని ఆయన చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో నిజానిజాలు విచారణలో తేలే అవకాశం ఉంది. కానీ ఎక్సైజ్ సీఐ వేధింపుల కంటే రెడ్డి సామాజిక వర్గం గురించి విమర్శించడం వల్లే…ఆ వార్తకు ప్రాధాన్యం లభించిందని చెప్పడమే ఉద్దేశం.
కానీ ఒక్కటి మాత్రం నిజం. టీడీపీ, పచ్చ మీడియా చేస్తున్న గోలను చూస్తుంటే…అణగారిన వర్గాల్లో ముఖ్యమంత్రి జగన్ ఎంత బలంగా ప్రజాదరణ పొందారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల ప్రేమకు జగన్‌ను దూరం చేయాలంటే…రెడ్ల సామాజిక వర్గంపై మిగిలిన కులాల్లో ద్వేషాన్ని నింపాలనే పచ్చ కుట్రలు నవ్వు తెప్పిస్తున్నాయి. పచ్చ కామెర్లున్నోళ్లకు లోకమంతా పచ్చగా కనిపించి నట్టు…కులం ప్రాతిపదికన తాము పాలన చేసినట్టే జగన్ చేస్తున్నారని టీడీపీ నమ్ముతోంది.
కానీ వాళ్ల అంచనా తప్పు. ఓటు బ్యాంకును ఏర్పరచుకోవడంలో జగన్ కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్నారని…ఏడాదిన్నర పాలనలో జనం అర్థం చేసుకున్నారు. ఆ నమ్మకాన్ని ఏర్పరచుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఆ వాస్తవాన్ని జీర్ణం చేసుకోలేక రెడ్డి సామాజికవర్గంపై విషం చిమ్మే ప్రచారంతో…సమాజంలో టీడీపీ, పచ్చ మీడియా మరింతగా పలుచన అవుతున్నాయి. ఆ ధోరణే ఆ పార్టీకి, పచ్చ మీడియాకు శాశ్వత సమాధి కట్టబోతోంది.