కలసి వున్నప్పుడు కొట్టుకోవాలనిపిస్తుంది; విడిపోయి వున్నప్పుడు కలవాలనిపిస్తుంది. రాజకీయంగా విడిపోయిన రాష్ట్రాలు మెల్ల మెల్లగా సాంఘికంగా, సాంసృ్కతికంగా దగ్గర కావాలని పిస్తుంది. విడిపోయిన తొలిదశలో రెండు రాష్ట్రాల మధ్యా వున్న ‘పచ్చి’తనం ఇప్పటికే తగ్గుతోంది. అయినా రాజకీయ నేతలు ఊరుకోరు కదా! నిండా తడిసిన బొగ్గులకు కూడా నిప్పు పెట్టాలని భావిస్తారు. వారి భ్రమ కానీ అంటుకోవు లెండి. తొలి ఏడాదిలో ఈ పనిని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ చేశారు. ఒకరు నీటి దగ్గర కవ్విస్తే, ఇంకొకరు విద్యుత్తు దగ్గర కవ్వించారు. విద్య విషయంలో ఇప్పటికీ ఒకరికొకరు ‘స్థానికత’ ను ముందుకు తేవాలనే ప్రయత్నిస్తారు.
ఈ కవ్వింపులకు చెల్లు చీటీ ఇస్తున్నది ప్రజలే. ఇందుకు హైదరాబాదే ప్రతీక. రాష్ర్టం వచ్చిన తర్వాత, హైదరాబాద్‌లో సెటిలర్లకు ఇబ్బందులుంటాయని భావించారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన పూర్తికాగానే, తెలంగాణ ప్రజలు తమ కల ఫలించిందనుకున్నారు. సీమాంధ్రప్రజలు కూడా ‘షాకు’కు గురయినా తేరుకుని, తమ రాష్ర్టం మీద దృష్టి పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల మీద వచ్చిన కేసులను చూపించి ‘ఆంధ్రనేతల మీద తెలంగాణ పోలీసులు పెట్టిన కేసులు’ అని చెబుతున్నా, నమ్మటానికి ప్రజలు సిధ్ధంగా లేరు.
అయితే రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల ప్రజల మధ్యా సాంసృ్కతిక సంబంధాలు ఎలా వుంటాయన్నది ప్రశ్న. ఇవాళ కుటుంబాలను (న్యూక్లియర్ ఫ్యామిలీస్‌ను)చూశాక, ‘ఉమ్మడి కుటుంబాలే మేలు అన్న భావన కలగవచ్చు. కానీ వెనక్కి వెళ్ళ లేం. అంతే కాకుండా. ‘నాన్న మాట జవదాటడు’ అనే కుటుంబ నీతిలో ‘విధేయతే’ వుంది. ఈ ‘విధేయత’లో స్వేఛ్చకు ఆస్కారం వుండదు. కానీ ‘స్వేఛ్చ’ ను అనుభవిస్తూ, తండ్రి మీద గౌరవమూ భక్తిని పెంచుకోవాలనే కోరిక నేటి తరానిది. అలాగే రాజకీయంగా విడిపోయాక వచ్చే రాష్ర్ట ప్రజలకు వచ్చే స్వేఛ్ఛ తో పాటు, మళ్లీ అనుబంధాలుంటే బాగుండుననే స్థితి వస్తుంది.
ఈ సాంసృ్కతిక అనుబంధానికి ఒక చిహ్నం: భాష.( ఇది రాజకీయానుబంధానికి కూడా చిహ్నమని నెహ్రూ లాంటివారు అనుకున్నారు కానీ, ఆ భావన కాల పరీక్షలో నిలవలేదు.) ఇప్పటికే ‘రెండు తెలుగు రాష్ట్రాలు’ అనటం ఒక జాతీయంగా మారింది. అయితే ఇప్పటి వరకూ ఒకే భాషలోని ఒక మాండలీకం మరొక మాండలీకం ఆధిపత్యం, లేదా ఒక యాస మీద మరొక యాస ఆధిపత్యాన్నే ‘ప్రత్యేక రాష్ర్ట సాధకులు’ ఎత్తి చూపారు. ఇప్పుడు అన్ని యాసలకు సమగౌరవం ఏర్పడి, తెలుగును పెంచుకోవాలన్న మమకారం పెరుగుతుంది.
‘తెలుగు’ అన్నది ఇప్పటికే రాజకీయార్థాలకు కారణమయ్యింది. రాష్ట్రాల మీద కేంద్రం ఆధిపత్యం చెలాయిస్తుందన్న ‘ఫెడరలిజానికి’ ఎవరి పేర్లు వారు పెడితే, ఇక్కడ ‘తెలుగు’ పేరు పెట్టి పార్టీని స్థాపించారు ఎన్టీఆర్. దాంతో ‘తెలుగు’ పదానికి రాజకీయ ముద్ర పడింది.
అలాగే ఉపాధికి, విద్యకీ కూడా ‘భాష’తో ముడిపెట్టారు. బోధనా మాధ్యమం తెలుగులో వుంటేనే జ్ఞానం వస్తుందన్న భావన కూడా లేవదీశారు. ఇవాళ ఇంగ్లీషు తెలిసిన వారే, ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్న వారే ఐటీ రంగంలో ఎక్కువ వున్నారని తెలుసు. ‘తెలుగు మీడియం ’ స్కూళ్ళు ఎన్నిపెడితే తెలుగు అంతగా అభివృద్ధి చెందుతునే వాదనలేవదీశారు.
కానీ భాషకు భావ ప్రకటనే మూలం ( అహంభావ ప్రకటన కాదు.) ఇప్పుడూ ఈ రెండు రాష్ట్రాల ప్రజలు వేల యేళ్ళగా తమ భావ ప్రకటనను తెలుగులో చేసుకున్నారు. మాధ్యమాలొచ్చాక, సినిమాలొచ్చాక, వాటిని మరింత వేగవంతం చేసుకున్నాం. ఇది మరింత పరిపుష్టం అవుతుంది. దూరమయిన కొద్దీ పెరగుతుంది అనురాగం అన్నట్లు… రాబోయే రాజుల్లో తెలుగు అనుబంధానికి చిహ్నమవుతుంది.
సతీష్ చందర్