లోహియా ఉద్యమం వలన జరిగినదేమిటంటే పాలకులు మారారు. వెనకబడిన కులాల నుండి కూడా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యారు. వారందరూ తమ పార్టీ పేర్లలో సామాజికన్యాయం, సోషలిజం, సెక్యులరిజం అనే పదాలనే యిప్పటికే ఉపయోగిస్తారు. కానీ ఆచరణలో, అవినీతి, అసమర్థతలలో యితర పార్టీలకు ఏ మాత్రం భిన్నంగా ప్రవర్తించలేదు. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ దేవెగౌడ (వీరందరూ కులరహిత సమాజం స్థాపిస్తాం అంటూ కొంతకాలం కులనామాలు వర్జించారు, తర్వాత చేర్చేసుకున్నారు), వీరంతా చెప్పుకోదగ్గ ఉదాహరణలు. ముస్లిము, బిసిల ఓట్లతో స్వల్ప మెజారిటీతో అధికారాన్ని పొందుతున్నారు. తమ కుటుంబీకులను వారసులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇది చూసి బిసిలకు వ్యతిరేకంగా దళితులను ఓటు బ్యాంకుగా తీర్చిదిద్ది మాయావతి అధికారంలోకి వచ్చారు. ఆవిడ పాలనా యింత కన్న మెరుగ్గా ఏమీ లేదు. వీళ్లంతా కులం కార్డు వాడిన వారే, దానికి సోషలిజం, సమానత్వం పూత పూసినవారే. లోహియా ప్రవచించిన స్త్రీ, పురుష సమానత్వం ఆ పార్టీల్లో కలికానికి కూడా కానరాదు. (మాయావతి పార్టీలో కూడా ఆమె తప్ప మరో స్త్రీ నాయకురాలు కనబడదు) వాళ్లు స్త్రీల గురించి తేలికగా, హేళనగా మాట్లాడిన సందర్భాలు అనేకం. బిసిలు పాలకులయ్యాక కూడా తమ పరిస్థితి మెరుగుపడిందని బిసిలు ఎవ్వరూ ఒప్పుకోరు. రిజర్వేషన్లు యింకా యింకా కావాలంటూ, బిసిలు, ఓబిసిలు, ఎంబిసిలు.. అంటూ యింకా విడగొడుతూ పోతున్నారు. ప్రతీ కులం తమను బిసిలుగా గుర్తించి ఆ సౌకర్యాలు కల్పించాలని ఉద్యమిస్తోంది. ఇవన్నీ లోహియా కళ్లారా చూడలేదు. ఆయన తన 57 వ యేట 1967లో పోయాడు. కాంగ్రెసు వాళ్లకు గాంధీ ఎలా దొరికాడో యీ బిసి నాయకులకు, సోకాల్డ్ సోషలిస్టు నాయకులకు లోహియా దొరికాడు. ఆయన పేర ప్రతిజ్ఞలు, ప్రమాణాలు చేస్తారు.
లోహియా సోషలిజం ప్రతిపాదనలు వింతగా వుంటాయి. సామాజిక సమానత సాధనలో రిజర్వేషన్లు, కులనిర్మూలనా కార్యక్రమాలు ప్రధాన పాత్ర వహించాలట. కులప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం వున్నంతకాలం ఎవడైనా తన కులాన్ని వదులుకుంటాడా? కులనిర్మూలన సాధ్యమా? చిక్కేమిటంటే లోహియా మేధావి. అనేక అంశాలపై అథారిటీతో మాట్లాడగలడు, పుస్తకాలు రాశాడు కూడా. కానీ అసహనం జాస్తి. వ్యక్తులతో, పరిస్థితులతో సర్దుకోలేడు. మొండివాడు. ఉత్తరాది మీదే ఫోకస్ పెట్టడం చేత ఇంగ్లీషు స్థానంలో హిందీ తెచ్చేయాలని విపరీతంగా గొడవ చేసేవాడు. హిందీ మాతృభాషగా లేని ఎన్నో రాష్ట్రాలవాళ్లు గంగలో కలిసినా ఆయనకు అనవసరం. ఇంగ్లీషును తొలగించాలి, అంతే. అదీ 1950లలో! దేశంలో మిగతా రాష్ట్రాల వారు హిందీని నేర్చుకోవడం కూడా ప్రారంభించలేదు అప్పటికి. ప్రభుత్వోద్యోగాలన్నీ హిందీ భాషీయులే వచ్చి వుండేవి. అదే ఆయనకు కావాలి. ఇలాటి విషయాలపై పార్లమెంటులో తన అనుచరుల చేత అసభ్యంగా అల్లరి చేయించేవాడు. 'హల్లా కరో' అనేది ఆయన 'సుభాషితం'. అప్పటివరకు రాజకీయాల్లో విద్యాధికులు ఎక్కువమంది వుండేవారు, చర్చల్లో హుందాతనం వుండేది. లోహియావాదులు ప్రజల్లోంచి వచ్చినవారు, హిందీలోనే ప్రసంగాలు చేస్తూ పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకుంటూ అల్లరి చేసేవారు. ద్రవిడవాదులు వచ్చాకనే తమిళనాడు రాజకీయాల్లో, సాంఘిక జీవితంలో హుందాతనం, మర్యాద తగ్గిపోయాయని పరిశీలకులు అంటారు. లోహియా వాదులందరిలో ఆగడం చేసే లక్షణం కామన్. జార్జి ఫెర్నాండెజ్ ఎంత మేధావి ఐనా కావచ్చు, కానీ పబ్లిసిటీ కోసం గోల చేయడం, నియమాలను పాటించకపోవడం, నోరు పారేసుకోవడం – వీటిలో లోహియా శిష్యరికం కనబడుతుంది.
లోహియాకు నెహ్రూ కాంగ్రెసుతో, కమ్యూనిస్టులతో మాత్రమే కాదు, సోషలిస్టులతో కూడా పడలేదు. కాంగ్రెసు నుంచి 1948లో బయటకు వచ్చిన సోషలిస్టు పార్టీ 1953లో ఆచార్య కృపలానీ నాయకత్వంలోని కెఎంపిపి (కృషికార్ మజ్‌దూర్ ప్రజా పార్టీ) పార్టీని కలుపుకుని ప్రజా సోషలిస్టు పార్టీ (పిఎస్‌పి) అయింది. కేరళలో (అప్పట్లో కొచ్చిన్ రాష్ట్రం)లో 1954 ఫిబ్రవరిలో ఆ పార్టీకి 19 సీట్లు వచ్చి మైనారిటీ ప్రభుత్వాధినేతగా పట్టం థాను పిళ్లయ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1954లో తిరువాన్కూర్ ప్రాంతంలోని తమిళులు ప్రతిపక్షంలో వున్న కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో తమ జిల్లాలోని కన్యాకుమారి వంటి కొన్ని ప్రాంతాలను తమిళనాడులో కలపాలంటూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. పోలీసుల మీద రాళ్ల వర్షం కురిపించారు. వారిని అదుపు చేయడానికి పిళ్లయ్ ప్రభుత్వం పోలీసుల చేత కాల్పులు జరిపించింది. నలుగురైదుగురు ఆందోళనకారులు చనిపోయారు. ఉత్తర ప్రదేశ్‌లో మరో రకం ఆందోళన చేసి జైల్లో వున్న లోహియా (ఆయన మొత్తం 18 సార్లు జైలుకెళ్లాడు) యీ వార్త చదివి, దేశంలోని మొట్టమొదటి సోషలిస్టు ప్రభుత్వం ప్రజలపై కాల్పులు జరపడమా? నాన్సెన్స్, పిళ్లయ్ రాజీనామా చేయాల్సిందే అని పట్టుబట్టాడు. పిఎస్‌పి కార్యవర్గం సమావేశమైంది. ప్రజలకు నష్టం కలుగుతున్న అలాటి పరిస్థితుల్లో సైతం కాల్పులు జరపకపోతే ఎలా? అని కొందరు వాదించారు. ఫైనల్‌గా ఒక కమిటీ వేసి ప్రభుత్వంది పొరపాటు వుందా లేదాని విచారించాలని, కమిటీ రిపోర్టు వచ్చాక పిళ్లయ్‌పై చర్య తీసుకోవాలో వద్దో ఆలోచించాలని తీర్మానం చేశారు. లోహియాకు అది నచ్చలేదు. పిఎస్‌పి పార్టీని చీల్చి సోషలిస్టు పార్టీ పెట్టాడు. కొన్నాళ్లకు అంటే 1964లో పిఎస్‌పి నుంచి కొంతమంది కలిస్తే దాన్ని ఎస్‌ఎస్‌పి (సంయుక్త సోషలిస్టు పార్టీ) అన్నారు. 1963లో లోకసభకు ఎన్నికయ్యారు. 1967లో కాంగ్రెసుకు వ్యతిరేకంగా లోహియా శిష్యులు సంయుక్త విధాయక దళ్ ప్రభుత్వాలు ఏర్పరచారు. లోహియా అది మాత్రం చూడగలిగారు. అవి కుప్పకూలేలోపున పోయారు. తెలుగునాట కూడా లోహియాకు అభిమానులు బాగానే వున్నారు. ఆయన శతజయంతి సందర్భంగా వారు 'క్రాంతదర్శి లోహియా' అనే పుస్తకాన్ని వెలువరించారు. ఇలాటి లోహియాకు శిష్యుడై ఆయన మేధావితనం జోలికి పోకుండా, అరాచకవాదాన్ని పుణికి పుచ్చుకున్న వాడు రాజ్ నారాయణ్ !
రాజ్ నారాయణ్ 1952లో ప్రజా సోషలిస్టు పార్టీ (పిఎస్‌పి) తరఫున ఉత్తర ప్రదేశ్ ఎసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 1954లో లోహియాతో బాటు పిఎస్‌పి నుండి బయటకు వచ్చేసి ఆయన సోషలిస్టు పార్టీలో చేరి దాని ద్వారా 1957లో ఎన్నికయ్యాడు. 1964-72 మధ్య ఎస్‌ఎస్‌పి. 1971-72 మళ్లీ సోషలిస్టు పార్టీ, 1972-74 సోషలిస్టు పార్టీ (లోహియా), ఈ లోగా రాజ్యసభకు 1966-72 ఎన్నికయ్యాడు. 1971 ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో రకరకాల కాంబినేషన్స్‌తో మంత్రివర్గాలు ఏర్పడ్డాయి. కమలాపతి త్రిపాఠీకి ముఖ్యమంతి పదవి కట్టబెట్టడంతో కోపం వచ్చి కాంగ్రెసు నుంచి జన కాంగ్రెసు పెట్టి జన సంఘ్, కమ్యూనిస్టుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పరచిన చరణ్ సింగ్ ను రాజ్ నారాయణ్ ఘాటుగా విమర్శించి అతనికి 'చెయిర్ సింగ్' అనే నిక్‌నేమ్ పెట్టాడు. అది చాలా పాప్యులర్ అయింది. అలాటి చరణ్ సింగ్‌తోనే చేతులు కలిపి అతని భారతీయ క్రాంతిదళ్‌లో 1974-77 వరకు వున్నాడు. 1977లో అది జనతా పార్టీలో విలీనమైంది. రెండేళ్లు తిరక్కుండా చరణ్ సింగ్, రాజ్ నారాయణ్ యిత్యాదులు జనతా పార్టీ (సెక్యులర్) పేర దాన్ని చీల్చి రెండేళ్లు పార్టీ నడిపారు. 1980 ఎన్నికలలో అది ఇందిరా గాంధీ చేతిలో చావుదెబ్బ తింది. దాంతో రాజ్ నారాయణ్ 1981 నుండి 83 వరకు డెమోక్రాటిక్ సోషలిస్టు పార్టీ అని పెట్టాడు. మళ్లీ 1983-84 మధ్య జనతా పార్టీలో చేరాడు. 1984లో సోషలిస్టు పార్టీ పెట్టాడు. ఇలాటి రాజ్ నారాయణ్ 1971లో ఇందిరపై పోటీ చేసి ఓడిపోయినా సాంకేతిక విషయాలపై, అంటే ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వాధికారుల సేవలను ఉపయోగించుకుంది కాబట్టి ఎన్నిక కొట్టివేయాలి అని వాదనతో కోర్టుకి వెళ్లాడు. (సశేషం) (ఫోటో – రామ్ మనోహర్ లోహియా)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)