బాహుబలి అందరి ఊహలకు మించి వుంటుంది

అమెరికా నుంచి అనకాపల్లి, అమలాపురం వరకు అంతటా బాహుబలి ఫీవర్ భయంకరంగా అలుముకుంది. సినిమాకు సంబంధించి ఎవరి వారు కీలకమే అయినా, హీరో అంటే హీరోనే. ప్రభాస్ మరింత బిజీగా వున్నాడు. ఒక్క పక్క…

అమెరికా నుంచి అనకాపల్లి, అమలాపురం వరకు అంతటా బాహుబలి ఫీవర్ భయంకరంగా అలుముకుంది. సినిమాకు సంబంధించి ఎవరి వారు కీలకమే అయినా, హీరో అంటే హీరోనే. ప్రభాస్ మరింత బిజీగా వున్నాడు. ఒక్క పక్క సినిమావ్యవహారాలు, మరోపక్క ప్రమోషన్..బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎడాపెడా ఇంటర్వూలు ఇస్తున్నాడు. ఒక్కప్పుడు ప్రభాస్ అంటే మహా రిజర్వుడ్..కానీ ఇప్పుడు తెగ కబుర్లు చెబుతున్నాడు. ఆ కబుర్ల వెనక ఓ అద్భుతమైన సినిమా చేసానన్న ఆనందం వుంది. చరిత్రకు నిలిచే ఓ వెంచర్ లో పాలు పంచుకున్నానన్న తృప్తి వుంది. మరోపక్క జనం సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ వుంది. ఇంకోపక్క రాజమౌళిపై అపారనమ్మకం వుంది. వీటిన్నింటి నడుమ ప్రభాస్ తో 'గ్రేట్ ఆంధ్ర' ఇంటర్వూ.

ఇంతవరకు బాహుబలికి సంబంధించి చెప్పగలిగీ చెప్పని కబుర్లు ఏమన్నా మిగిలాయా?

అస్సలు లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ మీడియా వరకు అంతా పిండేసారు. నేను అనుకుంటున్నాను.ప్రతి ఇంటర్వూకీ ఏదైనా కొత్తగా చెప్పాలని. కానీ ఏమీ మిగల్చ లేదు. మిగలలేదు. ఒకటి మాత్రం వాస్తవం..బాహుబలి అందరి ఊహలకు మించి వుంటుంది.

తొలిసారి బాలీవుడ్ మీడియాను ఫేస్ చేసారు. ఎలావుంది అనుభవం?

ఏముంది? ఇక్కడ తెలిసిన ఫేస్ లు, అక్కడ కొత్త ఫేస్ లు. కానీ సీరియస్ గా చెబుతున్నా. బాలీవుడ్ మీడియా మీట్ కు ముందు చాలా టెన్షన్ పడ్డా. నలభై యాభై మందిని ఒక్కసారి చూసి, ఫేస్ చేయాలనే సరికి కాస్త టెన్షన్. కానీ మాట్లాడడం మొదలు పెట్టాక అంతా పోయింది.

ప్రభాస్ అంటే మహా రిజర్వుడు ఒకప్పుడు..మరి ఇప్పుడు..పూర్తిగా మారినట్లున్నారు..?

నిజం చెప్పనా..ఇప్పుడూ రిజర్వుడే..కానీ ఇక్కడ చాయిస్ లేదు. బాహుబలి కోసం మారాల్సి వచ్చింది.

మోర్ దాన్ లైఫ్ కాన్వాస్..భారీ సెట్టింగ్ లు..సిజి వర్క్..వీటి నేపథ్యలో పలు పాత్రలు, వాటి ఎమోషన్లు. ప్రేక్షకులకు ఆ నేపథ్యంలో ఇవి కూడా స్వీకరించే అవకాశం వుంటుందా?

ఈ సందేహం మాకూ వచ్చింది. కానీ ఇక్కడ రాజమౌళి వున్నాడు. ఆయన ఆలోచన వేరు. మీరన్నట్లు మోర్ దాన్ లైఫ్ కాన్వాస్ నేపథ్యం ఎంత భారీగా వుంటుందో..పాత్రలు కూడా అంతే స్థాయిలో వుంటాయి. ఇది అది అని కాదు. అన్ని రకాలు కనిపిస్తాయి సినిమాలో. ఏ పాత్రను తక్కువ చేయడానికి లేదు. అసలు అందుకోసమే, రెండు భాగాలు చేయాల్సి వచ్చింది. వుమెన్ పవర్ వుంది. ప్రేమ వుంది..ఎమోషన్ వుంది. పోరాటాలు వున్నాయి. ముగ్గురు మహిళలు..రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా..వీరి పాత్రలు ఇంతా అంతా అని కాదు. అంత గోప్పగా వుంటాయి. వాటి స్థాయి చాలా పెద్దగా వుంటుంది. రోహిణి గారి పాత్ర కూడా. ట్రయిలర్ లో తమన్నాను చూసి, ఏదో పాటలు, డ్యాన్స్ లు అనుకుంటే సరిపోదు..ఆమె పాత్రలో అన్నిషేడ్ లు వున్నాయి. ఇక రమ్యకృష్ణ, అనుష్క పాత్రలు కూడా అందే. సత్యరాజ్, నాజర్. ఇలా ప్రతి ఒక్కరి పాత్ర దేని ప్రాధాన్యత దానిదే. 

బాహుబలి..శివుడు ఇద్దరూ రెండు భాగాల్లోనూ కనిపిస్తారా?

అవును..ఇద్దరూ బాహుబలే..అమరేంద్ర బాహుబలి..మహేంద్ర బాహుబలి. రెండు భాగాల్లోనూ రెండు పాత్రలు వుంటాయి.

ప్రేక్షకుడికి సినిమా అన్నా కథ అన్నా ఓ క్లయిమాక్స్ ఎక్స్ పీరియన్స్ కావాలి. అలాగే సినిమా నుంచి సంతృప్తిగా బయటకు రావాలి. సందేహాలతో కాదు. మరి తొలిసగాన్ని ఎలా ముగిస్తున్నారు.?

అర్థాంతంరంగా మాత్రం ముగియదు. తొలిసగం ఓ ట్విస్ట్ తో ఆగుతుంది. ఆ ట్విస్ట్ ఇప్పుడు రివీల్ చేయలేం. ప్రేక్షకుడికి తప్పకుండా క్లయిమాక్స్ ఎక్స్ పీరియన్స్ వుంటుంది. ఆపై ద్వితీయ భాగంపై ఆసక్తీ కలుగుతుంది. అంతే కానీ కథ ను సగంలో ఆపి మరోభాగం చూడమని చెప్పినట్లుగా అయితే వుండదు. 

తొలిభాగంలో ఎన్ని వార్ సీన్లు?

యాక్షన్ సినిమా అడుగడుగునా వుంటుంది. గెంతడమో, దూకడమో, కోట్టడమో..ఇలా ఏదో ఒక యాక్షన్…అయితే వార్ సీన్ ఒకటే.

బాహుబలి..పీరియడ్ డ్రామాగా మార్చిన మామూలు కమర్షియల్ కథేనా? అంతకు మించి ఏమయినా వుందా?

ఇది కమర్షియల్ కథ, ఓ ఫార్ములా ప్రకారం చెప్పిన కథ అయితే కాదు. ఇక పూర్తిగా డిఫరెంట్.

మీరు బరువు హెచ్చు తగ్గులు, ప్రయోగాలు ఆపేసారా?

ఆ..ఇప్పుడు అన్నీ శుభ్రంగా లాగించేస్తున్నా..వెయిట్ కూడా మళ్లీ పెరిగానని అనుమానం. 

మీరు మీ తరువాతి తరాలతో కూడా ఈ సినిమాలో నేను చేసాను..అని చెప్పుకునే రేంజ్ లో వుంటుంది బాహుబలి అని భావిస్తున్నారా?

అవును. కొన్నాళ్ల తరువాత ఈ సినిమాలో నేను చేసాను అని చప్పుకోవాడానికి బాహుబలి చాలా అవకాశం ఇస్తుంది. ఇలాంటి సినిమాలు ఎప్పుడూ రావు. పీరియడ్ సినిమాలో నటించాలని నటులు అందరికీ వుంటుంది కానీ ఇలాంటి సినిమా దొరకడం చాలా అరుదు. ఈ క్రెడిట్ అంతా రాజమౌళిదే.

ఛత్రపతి రాజమౌళికి, బాహుబలి రాజమౌళికి మార్పు కనిపించిందా? 

మార్పు అంటే ఆయన ఎదగడమే మార్పు. సినిమా సినిమాకు ఆయన ఆలోచనా స్థాయి ఇంకా ఇంకా పెరుగుతూనే వుంటుంది. మగధీర సిజి వర్క్..ఈగ పనితనం..ఇప్పుడు బాహుబలి..లెవెల్ మారుతూనే వుంటుంది.

ఓ డైరక్టర్ ను, సినిమాను నమ్మి మూడేళ్ల సమయం కేటాయిండం రిస్క్ అనిపించలేదా?

ఇలాంటి సినిమాలు అందరూ నిర్మించలేదు. అందరూ రూపొందించలేరు. నిర్మాతలది అందరికన్నా పెద్ద రిస్క్. బోలెడు డబ్బు తెచ్చిపెట్టారు. రాజమౌళి తన మేధస్సు అంతా దీనిపై పెట్టారు. మరి నేనేం చేయగలను..కేవలం మూడేళ్ల సమయం కేటాయించడం మినహా. అందుకే అదే చేసాను. 

ఒకటే సినిమా, అదే తరహా చిత్రీకరణ..హోమ్ సిక్ అని కానీ బోర్ అని కానీ, ఫ్రెండ్స్ ను మిస్ అయ్యానని కానీ అనిపించలేదా ఎప్పుడూ..?

నా ఫ్రెండ్స్ ముగ్గురి నుంచి ఆరుగురు. ఎప్పుడూ నాతోనే వుంటారు. అమ్మని చూడాలనిపించినపుడల్లా..రాత్రి ఇంటికి వచ్చి, చూసేసి, మళ్లీ తెల్లవారి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లిపోయేవాడిని. అందువల్ల పెద్దగా ఇబ్బందేంలేదు.

ఈ సినిమా బిజినెస్ లో కూడా పాలు పంచుకున్నట్లున్నారు.?

బిజినెస్ లో ఏం కాదు. నాతో వుండి, సినిమా వ్యవహారం చూసి, నా ఫ్రెండ్స్ యువి క్రియేషన్స్ కొన్ని ప్రాంతాలకు హక్కులు తీసుకున్నారు. వారికి నమ్మకం కుదిరింది. అంతే.

ఆభరాణాలు..ఆయుధాలు..ఆ బరువు..?

ఒకప్పటి స్టార్స్ తో పోల్చుకుంటే మేము భరించింది చాలా తక్కువ. అప్పుడ పూర్తిగా మెటల్ లతో భారీగా చేసేవారు. ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. వేరే మెటీరియల్స్ వచ్చాయి. అయినా కూడా కష్టమే. కానీ మా కష్టం చాలా తక్కువ. ఒక్కప్పటి తరం వారు మాతో పోల్చుకుంటే పదివేల రెట్లు ఎక్కువ కష్టం  పడి వుంటారు.

మాయాబజార్ లా టాలీవుడ్ చరిత్రలో మిగులుతుందా బాహుబలి కూడా.?

అంత పెద్దపోలిక వద్దు. అది క్లాసిక్. జనాలు బాహుబలిని ఎలా స్వీకరిస్తారో చూడాలి కదా.

మీ మాటల్లో జనం స్వీకరిస్తారో అన్నది పదే పదే వినిపిస్తోంది. ఎక్కడన్నా ఒక్కశాతం అనుమానం మిగిలివుందా మీకు?

అస్సలు లేదు. మేం ఓ అద్భుతమైన ప్రొడక్ట్ తయారుచేసాం. అందులో సందేహం లేదు. కానీ, నేను నా సినిమాలపై స్టేట్ మెంట్ లు ఇవ్వను. ఇలా అలా..అంటూ జనం చూసి వాళ్లు చెప్పాలి. నేను బాగున్నాయి అనుకున్నవి విఫలమైనవి వున్నాయి, హిట్ అయినవి  వున్నాయి. అందువల్ల అంతిమ తీర్పు ప్రేక్షకులదే.

సెకండ్ పార్ట్ కు ముందు ఓ మామూలు సినిమా చేసే అవకాశం వుందా.?

లేదు. సెప్టెంబర్ నుంచి రెండొ భాగం ప్రారంభమవుతుంది. అందువల్ల దాని తరువాతే మరే సినిమా అయినా.

మూడేళ్ల తరువాత గ్యాప్ దొరికింది. హాలిడేకి ఎక్కడికన్నా పారిపోవాలని లేదా?

అసలు ఇప్పుడే వెళ్లిపోవాలని వుంది. కానీ ఈ పనులు వుండిపోయాయి. నా సినిమా విడుదల సమయంలో ఎక్కడికో వెళ్లి, ప్రశాంతంగా వుండాలనుకుంటాను..టెన్షన్ లేకుండా,.

ఓకె..సర్.విష్ యు ఆల్ ది బెస్ట్.

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి