ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య వేదిక నిర్వహించబోవు “నెల నెలా తెలుగు వెన్నెల” సప్తమ వార్షికోత్సవం లొ పాల్గొనేందుకు డాలస్ విచ్చేసిన సాహితీ దిగ్గజాల గౌరవార్ధం సంస్థ పుర్వాధ్యక్షుడు శ్రీ తోటకూర ప్రసాద్ శుక్రవారం రాత్రి ఒక ప్రత్యేక విందు ఏర్పాటు చేసారు. ఆహ్వానితులలో డాలస్ సాహిత్య ప్రియులు, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు, తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు ఉన్నరు. నిండు పున్నమి వెన్నెలలో, ఆరుబయట ఆహ్లాదకరమైన వాతావరణంలో సాంప్రదాయ పంక్తిభోజనం అనంతరం సాహితీ గోష్టి అందరినీ ఆకట్టుకొంది.
శ్రీ తోటకూర ప్రసాద్ స్వాగత వచనాలు పలుకుతూ భారతదేశం నుంచి విచ్చేసిన సాహితీ మూర్తులను గౌరవించటం మన కనీస ధర్మం మరియు వారితో ఇలా సమయం గడిపే సదవకాశం దక్కడం మన అందరి అదృష్టం అన్నారు. చల్లని మజ్జిగ తో స్వాగతం పలికి చక్కని సహపంక్తి భోజనానికి అందరినీ ఆహ్వానించారు.
అడ్డుపెట్టిన అరచేయి నిండుగా నెయ్యి వడ్డించిన చల్లని తల్లులు, నలభీములు కాకున్నా ఉత్సాహం గా వడ్డించిన ఘనులు, పోటా పోటీగా చెణుకులు చతుర్ల మధ్య విందు సరదాగా సాగింది. తోటకూర వారి ఆతిథ్యానికి వారు బల్ల నిండుగా వేసిన
విస్తరి ఇంకో రెండింతలు ఉన్నా చాలేది కాదు అంటే అతిశయోక్తి కాదు. ఉప్పుతో సహ నవకాయ పిండివంటలతో, భుక్తాయాసం తీరను తాంబూలంతో వడ్డించారు. బూందీ లడ్డూ తో మొదలైన వడ్డన కార్యక్రమం, కాలిఫ్లవర్ మంచూరియ, పునుగులు – పచ్చడి, వెజిటబుల్ బిరియాని – పెరుగు పచ్చడి, ముద్దపప్పుకు తోడు పులుసు కూర, నవకాయయగూరల కుర్మా, బంగాళా దుంప వేపుదు, కాకరగాయ వేపుదు, మామిడికాయ పప్పు, మజ్జిగ పులుసు, పోటా పోటీగా బీరకాయ – దోసకాయ – కేరెట్ – ఆవకాయ పచ్చడులు, అప్పడం, సాంబారుకు ముందు నేనున్నా అంటూ మీగడతో ఉలవచారు ఇలా
హోరా హోరీగా సాగిన వడ్డన చివరికి పైనాపిల్ కేసరి తో ఆగుతుండగా, నేనున్నా అంటూ కిళ్ళీ రాకతో ముగిసింది.
భోజనానంతరం ముఖ్య అతిథులు ఆహ్వానితులను ఉద్దేశ్యిన్చి మాట్లాడారు. శ్రీ వెన్నెలకంటి సినిమాలో చమత్కార సన్నివేశాలు మరియు అనువాద చిత్రాల గురించి ప్రస్తావించారు. సినీ రచయితలకు తమ సొంత భావాలను ప్రదర్శిన్చే
స్వేచ్చలేదనీ, దర్శక నిర్మాతల కోరిక మేర రాయవలసిందే కనుక మేము సినిమాకి వ్రాసేవి అన్నీ మా ఏకీభవించిన అభిప్రాయాలు కావు అని వివరించారు.
శ్రీ రసరాజు 'ఒక్క గజల్ రాయాలని ఎంత చచ్చి బ్రతికానో .. ఎన్ని ఎన్ని భావాలను ఏరి తెచ్చి ఉతికానొ ' అని గజల్ మీద తనకు ఉన్న మక్కువను తెలియచేసారు. భార్య మీద రాసిన ఓ పాటను సరదాగ అందరికీ వినిపించి తిట్లడండకం మరునాడు సభకు వచ్చి వినమని చెప్పి నవ్వించి అందరినీ ఆకట్టుకొన్నారు.
శ్రీ మీగడ రామలింగ స్వామి హృద్యంగా వెన్నెల మీద తమ మధుర స్వరం లో ఒక పద్యం వినిపించి, భుక్తాయసం తో నిద్రకు సిద్దం అవుతున్నవారిని మేలుకొలిపారు.
శ్రీమతి బలభద్రపాత్రుని రమణి మాట్లాదుతూ, ఇంతమంది సాహితీ మిత్రుల మధ్య, తోటి సాహితీవేత్తలతో విందు పసందుగా ఉంది అన్నరు. టివి సీరియళ్ళలో పాత్రలు ఎందుకు ఆవిధంగానే రాయవలసి వస్తోందో వివరించారు.
శ్రీ జోన్నవిత్తుల వివిధ సాహితీ ప్రక్రియల పై సరసం గా, చమత్కారం గా, గంభీరం గా తనదైన శైలిలో ప్రసంగించి శ్రోతలను ఆకట్టుకున్నారు. ఇలా నిండు పున్నమిలో ఆరుబయట పంక్తి భోజనం తినే అవకాశం భారతదేషంలోనే కరువవుతున్న
ఈరోజుల్లో, ఇలాంటి విందు చక్కగా ఏర్పాటుచేసిన శ్రీ తోటకూర ప్రసాద్ గారిని అభినందించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీ విజయమోహన్ కాకర్ల మాట్లాడుతూ “28 సంవత్సరాల సంస్థ చరిత్రలో సాహిత్యానికి ఎప్పుడూ పెద్ద పీట వేస్తుందని” మరియు శనివారం జరగబోవు సంగీత సాహిత్య నృత్య సమ్మేళనానికి అందరినీ ఆహ్వానించారు.
శ్రీ ప్రసాద్ తోటకూర తమ కుటుంబ సభ్యులను పరిచయం చేస్తూ, వినీలాకాశంలో జాబిల్లి వెన్నెల కురిపించువేళ, చల్లగాలి మల్లెల సువాసనలు మోసుకొస్తున్నవేళ సాహితీ దిగ్గజాలతో సహపంక్తిభోజనం మరువలేని మరపురాని జ్ఞాపకం గా డల్లాస్ సాహితీ ప్రియులకి అందించి, విచ్చేసిన అందరికీ, మీడీయా కవరేజ్ ఇచ్చిన శ్రీ పున్నం సతీష్ – 6టివి కి, ఈ విందును చిత్రాలలో బంధించిన శ్రీ జొన్నలగడ్డ సుబ్బు గారికి ధన్యవాదములు తెలియచేస్తూ కార్యక్రమానికి స్వస్తి పలికారు.