ప్రియాంకా చోప్రా ఇకపై ప్రియాంకా మేరీ కోమ్ అయిపోయిందనుకోవాలి. అవును మరి, తాను చేస్తున్న సినిమా కోసం తనను తాను మార్చేసుకోవడం అంటే చిన్న విషయమేమీ కాదు. ఈ విషయంలో ప్రియాంకా చోప్రాని ఎవరైనా అభినందించి తీరాల్సిందే. అందాల భామలు తమ ఫిజిక్‌ని ఎడా పెడా మార్చేసుకోవడం రిస్క్‌తో కూడుకున్న విషయమే.
జీరోసైజ్ ఫిజిక్ ద్వారా అవకాశాలు రాబట్టుకోవాలనుకోవడం గొప్ప విషయమేమీ కాదు. కాస్త బొద్దుగా బరువెక్కిన అందాలతో తెరపై అందాల విందు చేయడమూ చెప్పుకోదగ్గ విషయం కాదు. చేస్తున్న పాత్ర కోసం కష్టనష్టాలకోర్చి, శరీరాన్ని ఆ పాత్రకు అనుగుణంగా మలచుకోవడమంటే ఖచ్చితంగా గొప్ప విషయమే. ఆ ఘనతను ప్రియాంకా చోప్రా సొంతం చేసుకుంది ‘మేరీకోమ్’ సినిమా కోసం.
బాక్సర్ మేరీకోమ్ జీవిత గాధను తెరపై చూపించే ప్రయత్నంలో భాగంగా ‘మేరీకోమ్’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా మేరీకోమ్‌లా కన్పించబోతోంది. అచ్చంగా మేరీకోమ్.. అన్నట్టుగానే ప్రియాంకా చోప్రా కన్పిస్తోంది. భుజ కండరాలు, కాలి పిక్కల కండరాలు.. ఒకటేమిటి.. పొట్ట కండరాలు సైతం కన్పించేలా ప్రియాంకా చోప్రా కష్టపడి కసరత్తులు చేసింది. ఆ విషయం ఫస్ట్ పోస్టర్‌లోనే బయటపడిరది.
‘ఇదేదో సినిమా కోసమే చేస్తున్నది కాదు.. ఆమె ఎంత కష్టపడిరదో తెలుసుకోవడానికీ, ఆ కష్టాన్ని సినిమా చూసే ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికే.. నా ప్రయత్నం సఫలమయి.. సినిమా విజయవంతమైతే నటిగా గర్వించడం సంగతి పక్కన పెట్టి, మేరీకోమ్‌కి గొప్ప గౌరవాన్ని ఇచ్చినట్లుగా భావిస్తాను..’ అంటోంది ప్రియాంకా చోప్రా. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.