తల్లడిల్లుతున్న తెలుగునేల

తెలుగు నేల తల్లడిల్లుతోంది. ఓసారి తెలంగాణ, ఇంకోసారి ఆంధ్రప్రదేశ్‌.. ప్రమాదాల్ని పంచుకుంటున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా ‘వేరుపడి’ రెండు నెలలు కూడా కాలేదు.. వంద మందికి పైగా అమాయకులు బలైపోయారు. పెద్ద ప్రమాదాల…

తెలుగు నేల తల్లడిల్లుతోంది. ఓసారి తెలంగాణ, ఇంకోసారి ఆంధ్రప్రదేశ్‌.. ప్రమాదాల్ని పంచుకుంటున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా ‘వేరుపడి’ రెండు నెలలు కూడా కాలేదు.. వంద మందికి పైగా అమాయకులు బలైపోయారు. పెద్ద ప్రమాదాల కోటానే ఇది. నిత్యం రోడ్డు ప్రమాదాల్లోనూ, ఇతరత్రా ప్రమాదాల్లో చనిపోయినవారిని లెక్కేస్తే వెయ్యి దాటిపోతుంది ఆ లెక్క.

బియాస్‌ నదిలో తెలుగు విద్యార్థులు మృత్యువాత పడ్డ ఘటన నుంచి వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటూనే వున్నాయి.. తెలుగువారిని ఆ ప్రమాదాలు బలితీసుకుంటూనే వున్నాయి. హైద్రాబాద్‌కి చెందిన తెలుగు విద్యార్థులు బియాస్‌ నదిలో గల్లంతయ్యారన్న వార్త మొత్తం తెలుగు నేలనే తల్లడిల్లేలా చేసింది. ఆ ఘటనలో 25 మంది మృత్యువాతపడ్డారు. ఆ తర్వాత మరో దుర్ఘటన తెలుగునేలను కుదిపేసింది. ఈసారి తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలింది. ఇక్కడా 30 మంది వరకూ మృత్యువాతపడ్డారు.

నిర్మాణంలో వున్న భవంతి కూలిన ఘటన తమిళనాడులోని చెన్నయ్‌లో చోటుచేసుకుంటే, అక్కడా తెలుగు నేలకు చెందినవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 40 మందివరకూ ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, తెలంగాణలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన 25 మంది చిన్నారుల ప్రాణాల్ని బలితీసుకుంది. నేరం ఎవరు చేశారు.? శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు.? అనే ఆవేదన సగటు తెలుగు ప్రజల్లో వ్యక్తమవుతోంది.

తెలుగు రాష్ట్రం విడిపోయాక జరుగుతోన్న వరుస దుర్ఘటనలతో ఇరు ప్రాంతాల్లోనూ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలుగుతున్నాయి.. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని. కొందరైతే ఇది విభజన వైపరీత్యం కాదు కదా.? అని బెంబేలెత్తుతున్నారు. ‘అలా ఆలోచించడం సబబు కాదు..’ అన్పిస్తున్నా, ఒకదాని వెనుక ఒకటి, ఒకదాన్ని మించిన తీవ్రతతో ఇంకొకటి.. తెలుగు ప్రజల్ని కబళించేస్తోంటే ఏమో.. అది కూడా ఓ కారణమేమో.. అనే భావనా కలుగుతోంది చాలామందిలో.

ఆ విషయం అలా వుంచితే, గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలుడులో అధికారుల నిర్లక్ష్యం.. బియాస్‌ నది ప్రమాదంలో కళాశాల యాజమాన్యంతోపాటు, డ్యామ్‌ అధికారుల నిర్లక్ష్యం, తాజా రైలు ప్రమాదంలోనూ అధికారులు – స్కూలు బస్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం.. చెన్నయ్‌ భవంతి కూలిన ఘటనలోనూ కాంట్రాక్టర్ల కక్కుర్తి – అధికారుల నిర్లక్ష్యం.. ఎవరి నిర్లక్ష్యమెలా వున్నా.. అమాయకులే సమిధలైపోతున్నారు.