తెలుగువారి దయార్ద్ర హృదయం

ఒకసారి ఎవరైనా మోసపోయే అవకాశం వుంది. రెండో సారి కూడా పోనీ అనుకోవచ్చు. ముచ్చటగా మూడోసారి కూడా మోసపోవడం అంటే.? తెలుగువాళ్లు వట్టి వెధవాయిలోయ్ అన్నాడు వెనకటికి ఓ పెద్దాయిన. తిరుపతి ఉప ఎన్నిక…

ఒకసారి ఎవరైనా మోసపోయే అవకాశం వుంది. రెండో సారి కూడా పోనీ అనుకోవచ్చు. ముచ్చటగా మూడోసారి కూడా మోసపోవడం అంటే.? తెలుగువాళ్లు వట్టి వెధవాయిలోయ్ అన్నాడు వెనకటికి ఓ పెద్దాయిన. తిరుపతి ఉప ఎన్నిక విషయం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది.

ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ తెలుగు రాష్ట్రాన్ని రెండుగా చీల్చడానికి తీర్మానం చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కాదా?

పార్లమెంట్ తలుపులు మూసి విభజన తీర్మానం పాస్ చేయించినపుడు కాంగ్రెస్ కు అండగా నిలిచింది ఎవరు? భారతీయ జనతాపార్టీ కాదా?

కానీ ప్రత్యేక హోదా అనే పాయింట్ ను బయటకు తీసి, వెంకయ్య నాయడు లాంటి పెద్లలను హీరోలను చేసి, భాజపాను నిర్దోషిగా, కాంగ్రెస్ ను దోషిగా చేసింది ఎవరు? మన తెలుగు జనాలేగా?

సరే, హోదాను అటకెక్కించి, ప్యాకేజీ అన్నది ఎవరు? భాజపానే గా.

అమరావతికి మట్టి, నీళ్లు మాత్రమే అందించింది ఎవరు? భాజపా నేతనే కదా?

సరే ఇవన్నీ అలా వుంచితే స్టీల్ ప్లాంట్ ను విక్రయానికి పెట్టింది ఎవరు?

విశాఖ రైల్వే డివిజన్ ను నామమాత్రంగా ప్రకటించి, ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోనిది ఎవరు?

కానీ తెలుగు వాడు మాత్రం ఇవన్నీ చాలా అంటే చాలా కన్వీనియెంట్ గా మరిచిపోయాడు. తెలుగు వాడు-తెలుగువాడు నువ్వుంటే నువ్వని తిట్టుకుంటూ రాజకీయాలు చేసుకుంటున్నారు. ఈ సందట్లో సడేమియా మాదిరిగా భాజపా ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అంటోంది. ఇంతకన్న హాస్యాస్పదం లేదా విచారకరం మరోటి వుందా?

నిజానికి పైన పేర్కొన్న తప్పులు అన్నీ చేసిన తరువాత భాజపాకు తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేసేంత సీన్ వుంటుందా? జనాలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం వుందా?

కానీ ఘనత వహించిన తెలుగు నాయకులు చంధ్రబాబు- జగన్ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు దుమ్మత్తి పోసుకుంటున్నారు. బరిలో భాజపా వుంది అన్న సంగతే మరిచారు. ఇద్దరు నాయకులు కూడా పొరపాటున కూడా భాజపా మాట మాట్లాడడం లేదు.తిరుపతి ఎన్నికలో స్టీల్ ప్లాంట్ సంగతి ప్రస్తావించడం లేదు. కానీ అలా అని భాజపా మాత్రం సైలంట్ గా వుందా? తెలుగుదేశం-వైకాపా రెండింటినీ టార్గెట్ చేస్తోంది. భాజపాతో చేతులు కలిపిన జనసేనాధిపతి మాత్రం ఇంకా చిత్రంగా ప్రవర్తిస్తున్నారు. రెండు పార్టీలు ఎదురుగా వుంటే ఒకే పార్టీని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
 
పోటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ వుంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ సంతోషపడుతున్నారు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షం ఎదురుగా వుంది. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రం అక్కడే వుంది కానీ ప్రతిపక్షాన్నే టార్గెట్ చేస్తోంది వైకాపా. ఈ రెండింటి వ్యవహారాల నడుమ తన తప్పులు దాచేసి, పోటీపడిపోతోంది భాజపా. జనాలు కూడా అన్నీ మరచిపోయి ముక్కోణపు పోటీని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇలాంటి సీన్ చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది. తెలుగు వాళ్లను చూసి భాజపా కేంద్ర నాయకత్వం వెర్రోళ్లని అనుకోదా? వీళ్లను ఎన్నిసార్లు మోసం చేసినా, వీళ్లలో వీళ్లు కొట్టుకుంటూనే వుంటారు తప్ప, మన జోలికి మాత్రం రారు అని హ్యాపీగా పీలవుతూ వుంటుంది. జగన్ కు అంటే కేసుల భయం. అందుకని తమ జోలికి రారు. బాబుగారు ఒంటరిగా అధికారం సాధించలేరు. అందుకని భాజపా అండ కావాలి. అందువల్ల తమని ఎమీ అనరు. ఇదే భాజపాకు ఆనందకరమైన విషయం. తెలుగు వారి పట్ల ఉదాసీన వైఖరి కొనసాగించడానికి కారణం.

కానీ చిత్రంగా జనాలకు ఏమొచ్చె? మీడియా దాచేస్తే భాజపా తప్పులు దాగిపోతాయా? మీడియా గుర్తు చేస్తే తప్ప భాజపా తప్పులు గుర్తుకు రావా? ఉల్లి రేటు పావలా పెరిగినా, పెట్రోలు అర్థరూపాయి పెరిగినా భూతద్దంలో చూసిన,చూపించిన వారంతా ఇప్పుడు రేట్లు భయంకరంగా పెరిగినా పట్టించుకోవడం లేదేలనో? తెలుగువాడికి పౌరుషం ఎక్కువ అన్నది ఎవ్వరో? మరి?

విభజనకు బీజం వేసింది. సాయం చేసింది. హోదా అని మాయ చేసింది. అధికారంలోకి వచ్చాక ఆంధ్రకు అన్యాయం చేసింది, చేస్తున్నది అయిన భాజపాకు తిరుపతి బరిలో కనీసం ఓట్లు అడిగే అవకాశం ఇచ్చారు అంటే తెలుగువాడు ఎంత గొప్పవాడు అనుకోవాలి? ఇదంతా మోడీ ప్రభుత్వం పట్ల భయం అనుకోవాలేమో? లేదా పార్టీలకు వున్న భయం, ఆ పార్టీలతో మీడియాకు వున్న అవసరం కారణంగా ఎక్కడి విషయాలు అక్కడ గప్ చుప్ అవుతున్నాయేమో?

ఎవరు గెలిస్తే ఏమిటి?

తిరుపతి బరిలో ముక్కోణపు పోటీ జరుగుతోంది. ఈ పోటీలో భాజపా గెలుస్తుందా?  అవకాశాలు చాలా తక్కువ. గెలిచినా గెలవకున్నా లెక్కకు తీసుకోగలిగిన ఓట్ల సాధిస్తే భలేగా వుంటుంది. తెలుగువారి షార్ట్ టెర్మ్ మెమరీ లాస్ మీద అపారనమ్మకం వచ్చేస్తుంది. ఓడితే మాత్రం భాజపా మరోసారి నాయకత్వాన్ని మారుస్తుంది. అంతకన్నా జరిగేది ఏమీ వుండదు.

తెలుగుదేశం పార్టీ గెలిస్తే వ్వవహారం ఓ రేంజ్ లో వుంటుంది. అర్జెంట్ గా వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దిగిపోమని, దమ్ముంటే ఎన్నికలు ఫేస్ చేయమనే సవాళ్లు పెరుగుతాయి. పార్టీకి కాస్త నైతిక బలం వస్తుంది. లోకల్ ఎన్నికల్లో జరిగిన పరాభవం నుంచి తేరుకున్నట్లు అవుతుంది. కానీ ఓడిపోతే మాత్రం పార్టీలో అపస్వరాలు మరింత గట్టిగా వినిపించడం ప్రారంభమవుతుంది. నాయకత్వ మార్పిడి అన్న డిమాండ్ మరింతగా వినిపించినా ఆశ్చర్యం అవసరం లేదు.

వైకాపా గెలిస్తే మాత్రం వ్యవహారం చాలా విచిత్రంగా వుంటుంది. జగన్ తీసుకునే నిర్ణయాలు ఇంకా చిత్రాతి చిత్రాలుగా వుంటాయి. మరో రెండు మూడేళ్లపాటు ఎదురు మాట్లాడే సీన్ పార్టీలో వుండదు. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ మరింత ఏకపక్షంగా వుంటాయి. ఓడితే మాత్రం కచ్చితంగా అలార్మింగ్ టైమ్ అనుకోవాల్సిందే.జగన్ ఏకపక్ష వ్యవహారాలను పక్కన పెట్టి, పార్టీ నాయకులను కలుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే.

చాణక్య