అమెరికా కామెడీలు: జాలి పడలా? భయ పడాలా?

అమెరికా అనగానే ప్రపంచమంతటికీ ఒక పాజిటివ్ ఫీలింగ్..పెద్ద దేశమని, లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటుందని, సంస్కారవంతులు ఎక్కువని! Advertisement కానీ తాజాగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అవన్నీ కేవలం అపోహలని అర్ధమవుతున్నాయి. మునుపటి…

అమెరికా అనగానే ప్రపంచమంతటికీ ఒక పాజిటివ్ ఫీలింగ్..పెద్ద దేశమని, లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటుందని, సంస్కారవంతులు ఎక్కువని!

కానీ తాజాగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అవన్నీ కేవలం అపోహలని అర్ధమవుతున్నాయి. మునుపటి అమెరికాకి ఇప్పటి అమెరికాకి అసలు పొంతన లేకుండా పోతోంది. 

కారణమేంటంటే…పెరుగుతున్న వలసలు అని కొందరంటారు. కానీ అది పూర్తి నిజం కాదు. 

అసలు అమెరికా అంటేనే వలసదారుల దేశం. ఆ దేశ తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ పూర్వీకులు కూడా బ్రిటన్ నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడినవారే. అసలు నేటివ్ అమెరికన్స్ అనబడే ఆ నేలకి సంబంధించిన ఒరిజినల్ వారసులు ఎవరూ రాజకీయాల్లో బలంగా లేరు. వాళ్లు కేవలం కొన్ని “ఇండియన్ సెటిల్మెంట్స్” (ఇండియన్ అంటే భారతీయులు కాదు..నేటివ్ అమెరికన్స్ ని అలా పిలుస్తారు) లో ఉంటారు. వాళ్లకి ప్రత్యేక రాయితీలు అవీ ఉంటాయి. వాళ్ల సంఖ్య కూడా చాలా తక్కువ. రాజకీయాల్లో కూడా వాళ్ల బలం కనపడదు. ఏలేదంతా వలసదారుల వారసులే. 

కనుక వలసల వల్లే దేశం పాడవుతోందని చెప్పలేం. ఎందుకంటే ఆ దేశం వందలేళ్లుగా ఎదుగుతూ వచ్చింది వలసలవల్లనే. 

కానీ దానికంటూ కొన్ని విధానాలుండేవి. ఇప్పుడవి ఉన్నట్టే ఉన్నా పరిస్థితులు వేరేగా ఉన్నాయి. 

ఉదాహరణకి…మెక్సికో గోడ దూకి ఎవరైనా టెక్సాస్ లోకి ప్రవేశిస్తే టెక్సాస్ ప్రభుత్వం కాల్చినా కాల్చిపారేయొచ్చు. కానీ కాలిఫోర్నియాలోకి దూకితే మాత్రం సేఫ్. 

అదేంటి? అమెరికా అంతా ఒకటేగా అనే ప్రశ్న రావొచ్చు. 

ఒకటే..కానీ ఫెడెరల్ లా వేరు, స్టేట్ లాస్ వేరు. 

మరి ఫెడెరల్ చట్టం అక్రమ వలసుదారులపై టెక్సాస్ పద్ధతిలో కఠిన నిర్ణయం తీసుకోవచ్చుకదా? ఎందుకు తీసుకోదు? 

అదే ప్రశ్న..

దానికి అర్ధం లేని కారణాలు అనేకం చెబుతుంటారు. 

దేశంలో చీప్ లేబర్ గా పనికొచ్చేది మెక్సికన్లే. వాళ్ల అవసరముంది కాబట్టి చూసీ చూడనట్టుగా ఉండాలంతే..అనే వాళ్లు ఉన్నారు. 

అలాంటప్పుడు వాళ్లకి కూడా వీసాలు అవీ ఓపెన్ చేసి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని, డాక్టర్లని స్వాగతిస్తున్నట్టు స్వాగతించవచ్చు కదా అనుకోవచ్చు. “అలా రాచమార్గంలో స్వాగతిస్తే వాళ్లు చీప్ లేబర్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్లు సక్రమంగా సంపాదించాలి, టాక్స్ లు కట్టాలి. కనుక సర్వీసెస్ ఖరీదుగానే ఉంటాయి. పర్పస్ సర్వ్ అవ్వదు. వాళ్లకి అమెరికా సోషల్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఆ లెక్క తడిసి మోపెడవుతుంది. అందుకే ఇలా డంకీ మార్గంలో మెక్సికన్లని రానిస్తున్నారు” అని ఒక అర్గ్యుమెంట్ ఉంది. 

ఇలాంటివి ఎన్ని విన్నా ఏది విన్నా సరైన కారణాల్లా కనపడవు. అసలు కారణం తెలీదు కనుక ఎవరికి తోచినట్టు వాళ్లు చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. 

అనుమానం లేకుండా కనిపించేది మాత్రం ఒక్కటే. “అమెరికా డొల్లతనం”. 

ఇంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని స్వాగతిస్తుంటే వాళ్లు ముందు టెంట్లేసుకుని “దేహీ” అని కూర్చున్నా నెమ్మదిగా ఇల్లు కావాలని డిమాండ్లు చేస్తున్నారు. సిటిజెన్ షిప్పులు కావాలని కూడా గొడవ చేస్తున్నారు. వాళ్లు రాజకీయాంశంగా మారుతున్నారు. రాచమార్గంలో వచ్చినవాడికి గ్రీన్ కార్డ్ రావడానికి పాతికేళ్లు పడితే, ఇలా గోడ దూకి వచ్చినవాళ్లు సరిగ్గా గొడవ చేస్తే ఐదేళ్లల్లో గ్రీన్ కార్డ్ సంపాదించేలా ఉన్నారు. వీళ్లు వెనకబడిన వ్యక్తులు కావడం చేత రోడ్ల మీదా మూత్రవిసర్జనలు చేయడం, అపరిశుభ్రంగా ఉండడం, ఏదైనా ఫ్రీగా దొరుకుతుందేమో చూడడం…ఈ బాపతులో ఉంటున్నారు. 

అమెరికాలోని రోడ్ సైడ్ మొటెల్స్ లోనూ, రెస్ట్ రూముల్లోనూ ఈ మధ్య అపరిశుభ్రం, దుర్వాసన రాజ్యమేలుతున్నాయి. గతంలో ఇంత దారుణంగా ఉండేది కాదు. ఒక్క అక్రమ వలసదారుల్నే అనలేం కానీ, ఓవరాల్ గా కల్చర్ సిస్టం మారింది. 

స్థానికంగా ఉన్న యువతలో కూడా కొందరు సరైన కుటుంబ వ్యవస్థ నుంచి రాకపోవడం వల్ల కొంత, డ్రగ్స్ కొంత, గన్ కల్చర్ కొంత..వీటి కారణంగా అసాంఘిక శక్తుల్లా మారుతున్నారు. అలాగని ఏదో ఎజెండా పెట్టుకుని వీళ్లు క్రిమినల్స్ గా మారరు. జస్ట్ సైకోలుగా మాస్ షూటింగ్ చేయడం, డబ్బు కోసం డ్రగ్స్ మత్తులో ఏ షాపులోకో వెళ్లి ఎవర్నో కాల్చడం లాంటివి చేస్తున్నారు. వీళ్లని అరికట్టడం పోలీసుల వల్ల కూడా కావట్లేదు. 

ఇంతకీ పోలీసుల టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడొకటి చెప్పుకోవాలి. అమెరికా పోలీసులంటే అంత ఎత్తు ఉండి, నానా రకమైన పరికరాలు ఒంటికి తగిలించుకుని, ఫిట్ గా ఉండి, బరువైన పెద్ద గన్స్ పట్టుకుని ఉంటే వాళ్లనేదో మార్వెల్ హీరోల్ని చూసినట్టు చూస్తాం. కానీ వాళ్లని చూసి లోకల్ యువత భయపడడం లేదా? ఈ అనుమానం కూడా వస్తోంది కొన్ని సీన్లు చూస్తే. 

తాజాగా మయామీలో అర్జెంటైనా, కొలంబియాల మధ్య కోపా సాకర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే మొదలవ్వాలసిన దానికంటె రెండు గంటలు ఆలస్యంగా మొదలయ్యింది. దానికి కారణమేంటంటే జనం టికెట్ లేకుండా తండోపతండాలుగా స్టేడియం లోపలికి వచ్చేసారట. వాళ్లని కంట్రోల్ చేయలేక పోలీసులు మూడు చెరువులు నీళ్లు తాగారట. 

ఇండియాలో బీహార్ సైడ్ రైళ్లల్లో రిజర్వేషన్ భోగీల్లోకి కూడా అలగా జనం టికెట్ లేకుండా ఎక్కేస్తారు. దిగమంటే రివర్సులో గొడవ చేస్తారు. ఇంకా ఎదురుతిరిగితే ఏమైనా చేయగలరు వాళ్లు. అక్కడ రైల్వే పోలీసులు కూడా వీళ్ల విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి. సరిగ్గా మయామీ స్టేడియం సంఘటన చూస్తే అదే గుర్తొస్తుంది. ఇదా అమెరికా ఇమేజ్? వీళ్లా అమెరికన్లు? ఇదా అక్కడి డిసిప్లైన్? ..అనే ప్రశ్నలొస్తాయి. 

ఇంతకీ వచ్చే సాకర్ వరల్డ్ కప్ కి అమెరికా హోస్ట్ అట. ఈ సంఘటన జరిగాక అసలు అమెరికాకి అంత సీనుందా అని అడుగుతున్న వాళ్లున్నారు సోషల్ మీడియాలో. 

ఇదిలా ఉంటే మరొక తాజా సంఘటన డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు. ఆ అగంతకుడు గోడెక్కి గన్ పట్టుకుని పొజిషన్ తీసుకోవడాన్ని సుమారు 20-30 మంది మొబైల్ ఫోన్లో షూట్ చేసారు. పోలీసుల్ని, ఏజెంట్లని ఎలెర్ట్ చేసారు కూడా.  అయినప్పటికీ అతనిని వెంటనే అదుపులోకి తీసుకోకపోవడం..కాల్చే వరకు చోద్యం చూడడం హాస్యాస్పదం. 

పైగా ట్రంపుని కాల్చాక అతన్ని కాల్చి చంపేసారు తప్ప పట్టుకుని ఇంటరాగేట్ చేయలేదు. అతనొక్కడేనా? వెనుక ఏదైనా ముఠా ఉందా అనేది తెలుసుకునే మినిమం పని పెట్టుకోలేదు. రెండ్రోజులు ఆగి ఆ సీక్రెట్ ఏజెంట్లు కనుగొన్న పెద్ద రహస్యమేంటంటే ఆ కాల్చిన వాడి పేరు ఫలానా అని! ఇదా వాళ్ల తెలివి, పనితనం? 

ఇదంతా చూస్తుంటే ఇండియాలో ఉన్నవాళ్లకి అమెరికా అంటే ఆసక్తి పోయి జాలి కలుగుతుంది. అక్కడే ఉన్నవాళ్లకి భయం కలుగుతుంది.

ఇండియాలో పొలిటికల్ ర్యాలీలు లక్షలమంది జనం మధ్యలో జరుగుతాయి. ట్రంప్ మీద ఎటాక్ జరిగినప్పుడు అక్కడ మొత్తం ఉన్నది మహా అయితే 1000 మంది. ఆ పరిస్థితుల్లో కూడా షూటింగ్ జరగకుండా ఆపలేకపోయిన వ్యవస్థ అమెరికాది. 

ఈ సంఘటనలే కాదు..కాలిఫోర్నియాలో తాజాగా షాపుల ముందు బోర్డులు కనిపిస్తున్నాయి. 950 డాలర్ల విలువ చేసే వస్తువుల వరకు దొంగతనం చేస్తే కేసులుండవు అని. 

ఇదేం చోద్యమండీ బాబు! దొంగతనమనేది ఎంత సైజుదైనా శిక్షార్హమే అనాలి తప్ప దీంట్లో కూడా స్లాబ్ సిస్టం ఏంటి? 

అదే మరి అమెరికా కామెడీ. 

“వీళ్లేంటో..వీళ్ల విధానాలేంటో..ఎవరికైనా చూపించండ్రా బాబు..” అని రావు రామేష్ స్టైల్లో అనాలనిపిస్తుంది. 

కడుపు చించుకుంటే కాలి మీద పడుతుందని అధ్యక్షుడు జో బైడేన్ మాత్రం “అసలే హీట్ ఎక్కువగా ఉంది ఇంకా హీటెక్కించకండి” అని అమెరికన్ మీడియాకి నర్మగర్భ సందేశమిచ్చాడు. 

అవును మరి…ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే అంత డొల్లతనం బయటపడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నవ్వులపాలవుతోంది. 

హరగోపాల్ సూరపనేని