(ప్రస్తుత పరిస్థితుల్లో మోడీని మించిన మంచి నాయకుడు మనకు ఇంకే పార్టీలోనూ కని పించడు. కానీ కొన్ని విషయాల్లో మోడీకి కొన్ని చౌకబారు ఆలోచనలు వస్తున్నాయి. బిచ్చ గాళ్ళను ప్రభుత్వ ప్రచారకులుగా తయారు చేయటం అందులో ఒకటి.)
మోడీ ఏ దేశమేగినా ఎందు కాలిడినా మన దేశాన్ని పొగిడి పొగిడి దుమ్ము లేపేస్తున్నాడు కదా.
భాయియో. ప్రపంచంలో ఏదేశానికీ లేని ఎగుమతుల కెపాసిటీ ఒక్క భారత దేశానికే ఉంది. మనం చేయ బోయే ఎగుమతి ఏమిటో తెలుసా?
యూత్ ఫోర్స్.. ప్రపంచం లోని అన్ని దేశాల్లో జనాభా అంతా తొంభై ఏళ్ళ ముసలాళ్ళయి పోయారు. అందుకే వాళ్ళంతా అడుక్కు తింటున్నారు. కానీ మనం కింగ్స్ లాగా బ్రతుకుతున్నాం. ఎందుకని? మన దేశంలో 60 శాతం యూత్ ! ఈ అద్భుతమైన ప్రగతిని మనమెలా సాధించగలిగాము?
మనం ఇంత పెద్ద ఎత్తున ఈ యూత్ ఫోర్స్‌ని ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాం?
మిగతా ఏ దేశంలోనూ బాల్యవివాహాలుండవు.
ఇంకేదేశంలోనూ పిల్లల్ని కని చెత్త కుండీలలో పారెయ్యరు.
ఇంకేదేశంలోనూ హాస్పిటల్స్ నుంచి పిల్లల్ని ఎత్తుకుపోరు.
మన దేశంలోనే పద్దెనిమిది ఏళ్ళ వాడికి పిల్లలు నలుగురుంటారు. పదమూడేళ్ళ అమ్మాయికి చంకన ఒకడు ఒళ్ళో ఇంకోడూ ఉయ్యాలలో ఒకరూ ఉంటారు. (బాలికా వధులాంటి సీరియల్స్ ఇక్కడ తప్ప ఎక్కడా ఎగబడి చూడరు. చిన్న పిల్లల పెళ్ళిళ్ళు గ్లోరిఫై చేసే అలాంటి సీరియల్స్ విదేశాల్లో తీస్తే తీసిన వాడిని జైల్లో పెడతారు.)
అందుకే మనం మొత్తం ప్రపంచానికి మనుషుల్ని ఎగుమతి చేస్తాం.
ఇంకొన్నాళ్ళు ఇలాంటి దిక్కు మాలిన ప్రభుత్వాలే ఉంటే మొత్తం ప్రపంచానికి బాల కార్మికులను కూడా ఎక్స్‌పోర్ట్ చేయగల సత్తా మనకుంది.
పైగా ఇంకో పాతికేళ్ళల్లో మన జనాభా చైనాను మించి పోతుందని సిగ్గు లేకుండా చాటింపు వేస్తున్నారు.
మోడీ ఈమధ్య ఇంకో గొప్ప విషయం కూడా కనిపెట్టారు. అదేంటంటే మనదేశంలో బిచ్చగాళ్ళు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. అందుకే బిచ్చగాళ్ళందరికీ స్టైఫండ్ ఇచ్చి వాళ్ళందరికీ బీజేపీని పొగిడే భక్తి గీతాలు నేర్పించి అప్పుడు దేశం మీద వదుల్తారన్నమాట.
అప్పుడు సీన్ మహా రంజుగా ఉంటుంది.
ప్రేయసీ ప్రియులిద్దరు టాంక్ బండ్ మీద కూర్చుని మాట్లాడు కుంటున్నారనుకోండి
భారతీ.. నేను నిన్ను ప్రేమిస్తున్నా..
ప్రియుడు ఆ మాట అనగానే ఆ బెంచ్ కింద దాక్కున్న బిచ్చగాడు స్ప్రింగ్ లాగ ఎగిరి వాళ్ళ ముందు కొచ్చి డాన్స్ చేస్తూ పాట మొదలు పెడతాడన్నమాట.
భారతీ అయ్ లవ్ యూ.. భారత దేశమా అయ్ లవ్ యూ.. భారత మాతా అయ్ లవ్ యూ.. బీజేపీ పార్టీ ఒక్కటే మీ లాంటి ప్రేమికులకు ప్రేమించుకునే హక్కు ఇస్తున్దిరా.. దగ్గరుండి పెళ్ళిళ్ళు జరిపిస్తుందిరా.. అందుకే.. బీజేపీకే ఓటు వేయరా.. కాంగ్రెస్‌ని చిత్తు చేయరా.
దాంతో ఆ ప్రేమికులిద్దరూ గాబరాగా లేచి పరుగెత్తటం మొదలుపెడతారు. బిచ్చగాడు వాళ్ళ వెనుకే పరుగెడుతూ పాత కంటిన్యూ చేస్తాడు. అలా చేయక పొతే స్టైఫండ్ రాదు.
మీరు ఎయిర్ పోర్ట్ కెళ్ళారనుకోండి. కారు దిగ బోతూంటే సడెన్‌గా పాతిక మంది బిచ్చగాళ్ళు వచ్చి కారు చుట్టూ తిరుగుతూ డాన్స్ చేయటం మొదలు పెడతారు.
మోడీయే దేవుడురా మోడీయే రాముడురా.. ఎటు చూసినా పచ్చదనం.. పవిత్రమైన స్వచ్ఛ భారతం.. అటల్ పెన్షన్ యోజన నీకేరా.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నీదేరా.. అందుకని మోడీయే దేవుడురా మోడీయే రాముడురా.. ఇలా పాట అయిపోగానే మిమ్మల్ని కూడా
బలవంతంగా కార్లోనుంచి లాగేస్తారు. అప్పుడు అందరూ కలసి డాన్స్ చేస్తారన్నమాట. ఈలోగా మీ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. మీరు ఆ బిచ్చగాళ్ళు పాడిన పాటలు పాడుకుంటూ ఇంటికెళ్ళి పోతారన్నమాట.
ఒకరింట్లో అప్పుడే ఆడపిల్ల పుట్టిన్దనుకోండి. వెంటనే బిచ్చగాళ్ళ గ్రూప్ నర్సింగ్ హోమ్ కొచ్చేస్తుంది. తల్లీ పిల్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి డాన్సులు చేస్తారు.
మోడీయే రాముడురా.. మోడీయే దేవుడురా.. సుకన్య సమృద్ధి యోజన మీ పాపకోసమేరా.. ఇది ఆడపిల్లల కోసం మోడీ ఇచ్చిన మహావరం రా.. అందుకే మోడీయే దేవుడురా.. మోడీయే రాముడురా.. బీజేపీ ఒక్కటే మన దేశాన్నిఅగ్ర దేశం గా చేస్తుందిరా.. మిగతా పార్టీలన్నీ సర్వ
నాశనం చేస్తాయిరా.. అందుకని బీజేపీ కే మీ ఓటు. ఇలా బిచ్చ గాళ్ళందరికీ స్కిల్ ఇండియా ప్రోగ్రాం కింద అడుక్కోవడం నేర్పించి అప్పుడు వాళ్ళను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇదీ మేక్ ఇన్ ఇండియా అండ్ ఎక్స్ పోర్ట్ టు ఫారిన్ కంట్రీస్.
xxxxxxxxxxxxxxxxxxx
ఆహా.. ఇండియన్ డెమోక్రసీ!
ఈ మధ్య ఒక విదేశీ పార్లమెంటరీ బృందం భారత దేశంలోని పార్లమెంట్‌ని సందర్శించింది. ఇలా విదేశాల వాళ్ళు వచ్చి మన పార్లమెంట్ గొప్ప తనాన్ని చూసి నేర్చు కోడానికి వస్తున్నారంటే మాకు చాలా గర్వం కలిగింది.
హాయ్.. మా భారత దేశం పార్లమెంట్‌ని చూసి మీరెలా ఫీలయారు?
అద్భతం.. అమోఘం.. ఒక యాక్షన్ మూవీ చూస్తున్నట్లు ఫీలయాం.
యాక్షన్ మూవీయా?అదేంటి?
అవును.. సూపర్ మూవీ.. మిగతా దేశాల్లో పార్లమెంట్‌లు కూడా చూసాం.. చెత్త ఎంటర్తైన్మెంట్, థ్రిల్ కామెడీ, థ్రిల్లింగ్ ఫైట్స్ అన్నీ మీ దేశం పార్లమెంట్‌లో తప్ప ప్రపంచం లో ఎక్కడా ఉండవ్.
అలాగా? ఇంతకూ ఇక్కడ ఏమి నేర్చుకున్నారు?
దేశాన్ని అభివృద్ధి చేసేందుకు డబ్బు లేనప్పుడు పార్లమెంట్ సెషన్స్‌లో టైంపాస్ ఎలా చేయాలో మాకు ఇప్పడే తెలిసింది. అలాగే మనకు నచ్చని పార్టీల వాళ్ళను బండ బూతులు తిట్టవచ్చని కూడా మాకు ఇక్కడే తెలిసింది. మా దేశంలో అనవసరంగా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ
మర్యాదపూర్వకమైన భాషలో మాట్లాడు కుంటాం. అందుకని మా పార్లమెంట్ మాకు చాలా బోరుకొడుతోంది. కొంచెం కూడా థ్రిల్ ఉండటం లేదు.
ఇంకా ఏమేం నేర్చుకున్నారు?
స్పీకర్ మొఖం మీద కాగితాలు పేపర్ బాల్స్ అన్ని విసరి పడేయవచ్చని మాకు ఇక్కడే తెలిసింది.
మీ పార్లమెంట్‌లో అలా విసిరేయరా?
లేదు.. చెత్తను ఇంకా పాత పద్దతిలోనే వేస్ట్ పేపర్ బాస్కెట్స్‌లో వేస్తున్నాం. అలా కాకుండా ఇలా స్పీకర్ మొఖాన్న విసిరేస్తే నిజంగా ఎంత మజా వస్తుందో తెలుసుకున్నాం.
ఇంకేం నేర్చుకున్నారు?
అధికార పక్షం, అపోజిషన్ ఇద్దరూ ఫ్రాడ్ విషయానికి వచ్చేసరికి ఒకరిని మించి ఒకరు ఫ్రాడ్ చేయటం మాకు బాగా నచ్చింది. దానివల్ల ప్రజలకు ఏ పార్టీని ఎన్నుకున్నా ఒకటే అన్న మంచి భావం కలుగుతుంది. అలాగే ఆ మధ్య పార్లమెంట్‌లో బాక్సింగ్ రెజ్లింగ్ దొమ్మీ ల్లాంటి గేమ్స్
కూడా ఆడారనీ, కొంతమంది ఎంపీలను కింద పడేసి వాళ్ళ మీద మిగతా వాళ్ళు ఎక్కి డాన్స్‌లు చేశారనీ కూడా మేము టీవీ చానల్స్‌లో చూసాము. అలాగే పెప్పర్ స్ప్రేలు కొట్టు కోవటం, కత్తులతో అటాక్ చేసుకోవటం చూసి మేము ఎంత థ్రిల్ ఫీలయామంటే లేచి నిలబడి విజిల్స్ వేసాము. నిజంగా ఇండియన్ పార్లమెంట్‌లో ఇంత పెద్ద ఎత్తున స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారని మాకు తెలీదు. అలాగే కొన్ని స్టేట్ అసెంబ్లీ లలో సెక్స్ సీన్స్ కూడా ఉంటాయని మీ వాళ్ళు చెప్పారు. జయలలిత అనే అపోజిషన్ లీడర్‌ని అధికార పార్టీ వాళ్ళు చీర ఊడదీయటానికి ప్రయత్నించారని చెప్పారు. ఇవన్నీ చూసాక మిగతా దేశాలన్నీ ఎంత వెనుకబడి ఉన్నాయో, మేము ఎప్పటి కయినా భారత దేశం స్టాండర్డ్స్‌కి చేరుకో గలమో లేదో అని నిరాశ కలుగుతోంది. అంటూ కన్నీరు పెట్టు కున్నారు వాళ్ళు. మాకు వాళ్ళను చూస్తె జాలి వేసింది. ఎందుకంటే వాళ్ళు తల క్రిందులుగా తపస్సు చేసినా మన స్టాండర్డ్స్‌కి చేరుకోలేరు.
అందుకని వాళ్ళందరికీ మనం మన యూత్‌ని ఎక్స్ పోర్ట్ చేసేస్తాం. అంతే..
యర్రం శెట్టి సాయి