సంక్రాంతి అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఫేమస్.. తెలంగాణలో పతంగుల పండగ.. చిత్తూరు జిల్లాలో మాత్రం సంక్రాంతి మర్నాడు వచ్చే కనుమ పండగనాడు నిర్వహించే జల్లికట్టుదే సందడంతా.
చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జల్లికట్టు కోసం ఈసారి కూడా గ్రామస్తులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా చందాలు వేసుకుని మరీ జల్లికట్టు కోసం భారీ ఏర్పాట్లు చేయడంతో ఈసారి జల్లికట్టు మరింత ఉత్సాహంగా జరుగుతోంది. ఆవులు, కోడెదూడల్ని గ్రామాల్లో పరిగెత్తిస్తూ, వాటి వెంట కుర్రకారు ఇంకా ఉత్సాహంగా పరిగెడుతూ జల్లికట్టుని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
ప్రతియేటా జల్లికట్టుపై విమర్శలెలా వున్నా, గతంలోకన్నా ప్రతిష్టాత్మకంగా ప్రతియేడాదీ జల్లికట్టుని నిర్వహఙంచడంలో రంగంపేట గ్రామస్తులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. జల్లికట్టులో కొందరు గాయపడ్తున్నా, తిరిగి వారే పైకి లేచి మరీ ఉత్సాహంగా జల్లికట్టులో పాల్గొంటుండడం గమనార్హం.
ఆవులు, కోడెలతోపాటు, పదుల సంఖ్యలో కుర్రకారు స్వయంగా పోటీల్లో పాల్గొంటోంటే, వేల సంఖ్యలో ఈ జల్లికట్టుని తిలకించేందుకు ఇరుగు పొరుగు గ్రామాల్లోంచే కాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ జిల్లాల నుంచీ ఔత్సాహికులు రంగంపేట చేరుకున్నారు. కాస్సేపట్లో జల్లికట్టు ఉత్సవం ముగియనుంది.