శృంగారం మనిషి అవసరాల్లో ఒకటి. సహజమైనది. మరి ఇలాంటి శృంగారం గురించి మాట్లాడటాన్ని నిరసించే దేశాల్లో భారతదేశం ముందు వరసలో ఉంటుంది. శృంగారం గురించి మాట్లాడటం బాగా ఇబ్బందికరమైన అంశం. పెళ్లి తర్వాత శృంగారం గురించి ప్రత్యేక ఏర్పాట్లను సైతం చేసే సంస్కృతిలో సెక్స్ గురించి తెలుసుకోవాలనుకోవడం, తెలుసుకోవడం కూడా పాప సమానం!
అయితే గత కొన్ని దశాబ్దాల్లో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. సెక్సువల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి అన్నట్టుగా ప్రభుత్వాలు కూడా స్పందిస్తున్నాయి. లైంగికం అనే మాటను హైస్కూల్ చదువుల్లో చేర్చారు. భారతదేశంలో శృంగారం గురించి అవగాహనను కానీ, ఆలోచనను కూడా కలిగించే వాటిల్లో సినిమాలే ఇప్పటికీ ముందు వరసలో ఉంటాయి!
90స్ కిడ్స్ తో నూటికి 99 మందీ శృంగారం గురించి సినిమాల నుంచినే గైడెన్స్ పొంది ఉంటారు! సినిమాల్లో శృంగారం గురించి బోలెడన్ని సంభాషణలను పెడుతూ వచ్చారు రచయితలు, దర్శకులు. అలాంటి మాటల నుంచి శృంగారం గురించి అర్థం చేసుకున్న వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. నూటికి 90 సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లను పెట్టడం, అలాంటి సన్నివేశాలను రసవత్తరంగా చిత్రీకరించడం .. ఇవే భారతీయులకు సెక్సువల్ గైడ్లు అంటే ఆశ్చర్య పోతారేమో!
ఇక చదవడం ద్వారా సెక్స్ వల్ యాక్టివిటీస్ గురించి తెలుసుకున్న వాళ్లూ ఉంటారు. 70ల నుంచి వార పత్రికలు, మాస పత్రికలు సెక్స్ ను దట్టించడం మొదలుపెట్టాయి. సెక్సీ కథలు, సెక్స్ కౌన్సిలింగ్ లు పత్రికల్లో ప్రచురించడం ఒక దశలో పతాక స్థాయికి వెళ్లింది. ఇదంతా ఆ పత్రికల వ్యాపార మార్గమే అయినా… సెక్స్ గురించి అపోహలను అలాంటి పత్రికలు కొంత వరకూ తొలగించాయి! సెక్స్ ప్రస్తావనను ఆ పత్రికలు కమర్షియల్ కోణంలోనే చేసినా ఎంతో కొంత అవగాహనను పెంపొందించాయి. అయితే పత్రికల్లో, టీవీల్లో ఇలాంటి కౌన్సిలింగ్ ను వ్యతిరేకించే వారకూ బోలెడంతమంది ఉంటారు. సెక్స్ సమస్యే ఉన్నా.. సందేహాన్ని తీర్చుకోవాలనుకునే వారు తీర్చుకోవడానికి బోలెడన్ని మార్గాలుంటాయని, అంతే కానీ అలా పత్రికల్లో అచ్చేయడం ఏమిటంటూ విరుచుకుపడే వాళ్లూ ఉంటారు!
అయితే ఆరోగ్యకరమైన శృంగారం, ఆరోగ్యవంతమైన శృంగార సంబంధాల గురించి యుక్త వయసులోనే తెలుసుకోవడం తప్పనిసరి. శృంగారం గురించి విశదీకరించడం అంటే.. బూతు కాదు. అన్ని విషయాల గురించి పిల్లలకు బుద్ధులు నేర్పినట్టే, ఎలాంటి తప్పులు చేయకూడదో వివరించి చెప్పినట్టే శృంగారం, దానిలోని నైతికత గురించి కూడా సరైన వయసులోనే నేర్పడం సరైన పద్ధతి.
ఎవరూ ఇలాంటి విషయాలను సూటిగా చెప్పకపోవచ్చు. అయితే ప్రస్తుతం సమాజంలో రకరకాల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. టీవీలు, ఫోన్ల ద్వారా ఆ విషయాలు ప్రతి ఇంటిలోకీ చొరబడుతూ ఉన్నాయి. ఇలాంటి వాటిని ఉదాహరిస్తూ.. ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురయే అవకాశం ఉంటుందో విశదీకరించడం మాత్రం సరైన పద్ధతి. సహజీవనాలు, ప్రీ మ్యారిటల్ సెక్స్ పెద్ద తప్పేం కాని పరిస్థితులు వచ్చేశాయి. వీటిని ఎవ్వరూ తప్పించలేరు! ఇది సామాజికమైన మార్పు.
ప్రేమ అనుకోవడమో, క్షణికావేశాలో, అమాయకత్వమో.. ఇలాంటి పరిస్థితులను కల్పిస్తున్నాయి. వీటి నుంచి ఎవరికి వారు తమ పిల్లలను పక్కకు లాక్కెళ్లలేరు! సామాజిక పరిస్థితులు అలా లేవిప్పుడు. ఒకవైపు వచ్చిన మార్పులను ఒప్పుకుంటూనే.. మరోవైపు ప్రమాదాలను కొని తెచ్చుకోకూడదనే విషయాన్ని మాత్రం అర్థవంతంగా, అర్థమయ్యేలా చెప్పడం సరైన పద్ధతి. దీనికి అనువైన వాతావరణం ప్రతి ఇంట్లోనూ ఏర్పడాలి. టీనేజర్లు పత్రికలో ఏ సెక్స్ కథనో, సెక్స్ కాలమో చదివితే తప్పు చేసేస్తున్నట్టూ కాదు. వారిలో వయసుకు తగ్గ మార్పును ఒప్పుకోవడం, అదే సమయంలో మంచి చెడుల విచక్షణను నేర్పడమే సిసలైన శిక్షణ.