ఎన్ని కథలు విన్నా, ఎన్ని పురాణాల పుటలు చదివినా, ఎన్ని ఇతిహాసాల పొరలు తిప్పినా.. ‘రాజు’ అయిన ప్రతి ఒక్కడూ- తన ఘనతనే రాయించుకుంటూ వచ్చాడు. విలన్లుగా లెక్క తేలిన వాళ్లందరూ ఓడిపోయిన వాళ్లే! కానీ వర్తమాన ఆంధ్రదేశంలో రివర్సులో జరుగుతోంది. ఓడినవాళ్లే, గెలిచిన వాళ్ల చరిత్రను తమ పచ్చ దృక్కోణంలోంచి, పచ్చ చలువద్దాల్లోంచి.. లేకిగా రాయిస్తున్నారు. నిందలను వెల్లువగా కురిపిస్తున్నారు!
అక్షరాలు, అభిప్రాయాలు- ప్రజల మెదళ్లలో నాటబడే విత్తనాలై.. మాటలు- మాయపొరలను కమ్మేసే మంత్రాలై.. చెలరేగుతున్న ప్రపంచమే మీడియా! పత్రికల్లో, టీవీ ఛానెళ్లలో ఇవాళ వచ్చే కథనమే రేపటికి చరిత్ర! ఎల్లుండికి పురాణం!!
జగనన్నా.. ఇవాళ్టి జనం కోరుకుంటే నువ్వు గద్దెమీదికి వచ్చావు. మరి రేపటి తరం నీ చరిత్రను ఎలా తెలుసుకోబోతోంది? అక్షరాలను, మాటలను అస్త్రాలుగా సంధానిస్తూ, వ్యాపారాలుగా సంభావిస్తూ చెలరేగుతున్న నవతరం రైటర్లలో, జర్నలిస్టులలో.. నిన్ను రాముడిగా స్తుతించే వారెందరు? నిన్ను రావణుడిగా నిందించే వారెందరు? ఇది కలికాలం.. నీ చేతలు, చేయూతలు జనం మదిలో మరుగున పడిపోవచ్చు. ఆ మాటలే శిలాక్షరాలై మిగిలిపోవచ్చు! ప్రతికూలతలను నీ చుట్టూ మోహరించవచ్చు!!
వాళ్లందరూ రావణుడంటే, కాదు, రాముడని నీ గురించి చెప్పేదెవ్వరు? అక్షరాన్ని గుప్పిట పట్టుకుని, మాటలను పుక్కిట పట్టుకుని చెలరేగుతున్న దళపతులలో, దళారీలలో.. తరచి తరచి, నీ కోసం తపిస్తున్నది ఎందరో, చూసుకో ? వెరచి వగచి ఉపయోగమూ ఉండదు.. తొందరగా మేలుకో?
సీఎం జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రంలోని ప్రజలందరూ నావాళ్లే అంటాడు. ఆడపడచులందరికీ నేను అన్నదమ్ముడినవుతా అంటాడు. వారి పిల్లలందరికీ తాను మేనమామను అవుతానంటాడు. అవ్వాతాతలకి తాను మనవడి నంటాడు. అందరినీ తన వారే అనుకుంటాడు. కానీ, ఆయనను ‘తమవాడు’ అనుకుంటున్నది ఎందరు?
సంక్షేమ పథకాల లబ్ధిని పొందుతున్న వారూ, ప్రతినెలా ఇంటికే డబ్బు వస్తుండగా అభిమానిస్తున్న వారూ కోట్లలో ఉంటారు కదా అని అనవచ్చు. వీరందరినీ పక్కన పెడదాం! ఆయననుంచి పొందుతున్నది ఏమీ లేకుండా.. కేవలం ఆయన కోసం పనిచేస్తున్నవారు ఎందరు? ఏమీ ఆశించకుండా ఆయనను అభిమానిస్తున్నది ఎందరు? ఈ ప్రశ్నకు కూడా లక్షల్లో ఉంటారు కదా అని అనవచ్చు. పార్టీకి ఉండే సామాన్యమైన కార్యకర్త నుంచి.. అత్యున్నత స్థాయిలో నిత్యం జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా మెలగుతూ ఉండే కీలకమైన నాయకుల వరకు, నిర్ణయాత్మకంగా ఉండే సలహాదారుల వరకు ఆయనను ‘సొంతం’ చేసుకుంటున్న వారు ఎందరు?
వర్తమాన ప్రపంచంలో సోషల్ మీడియా ఎంత కీలకం అయినప్పటికీ.. దాని విశ్వసనీయత తక్కువే. సోషల్ మీడియా పాత్ర ఎంతగా పెరుగుతున్నప్పటికీ.. ప్రధాన స్రవంతి మీడియా ప్రజల ఆలోచనలను, నిర్ణయాలను ప్రభావితం చేయడం తక్కువేమీ కాదు. అలాంటి మీడియాలో జగన్ కు ఉన్న మద్దతు ఎంత? పచ్చ మీడియా అనే ఒక్క పదంతో.. జరిగే విష ప్రచారాల్ని ఎంతకాలం ఎదుర్కొంటారు? ఎంత దూరం?
‘నన్ను ప్రజలు నమ్ముతున్నారు.. ఇక ఏ ఒక్కరి విష ప్రచారమూ నన్నేం చేయదు. నాకేం కాదు’ అనేది జగన్ ధీమా! కానీ ‘పదుగురాడు మాట పాడియై ధరజెల్లు..’ అనే ప్రాథమికమైన లోకరీతిని ఆయన విస్మరించడం మంచిది కాదు. కీలకమైన రంగాల్లో, విభాగాల్లో సొంత దళాలను తయారు చేసుకోలేకపోవడం, తను తయారు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే బేషరతుగా తనకోసం ప్రాణాలిచ్చేలా ప్రేమించే వారిపట్ల కనీసం కృతజ్ఞతాదరాలను చూపించకపోవడం.. జగన్ వైఫల్యాలు! ఈ పరిస్థితులపై విశ్లేషణాత్మక కథనం..
మీడియాలో ఒక్కటైనా.. స్నేహహస్తం లేదేం!
‘కత్తి కంటె కలం గొప్పది’ అని తెల్లదొర లార్డ్ లైటన్ అన్నాడు! నిజానికి ఆ మాటను తొలుత ఎవడు అన్నాడో కూడా తెలియనంతగా మన వాడుకలోకి చొరబడి వచ్చేసింది! నిజమే కత్తికంటె కలం చాలా గొప్పది. రచయితలకంటె పాత్రికేయుల కలం ఇంకా పెద్ కత్తి. అందుకే ఇప్పుడు తెలుగు పత్రికలు, మీడియా మొత్తం కలిపి.. తమ అత్యంత పదునైన కత్తులను ఝుళిపించి.. జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని, ప్రతిష్ఠను, వ్యక్తిగత ఉన్నతిని అన్నింటినీ మూకుమ్మడిగా హతం చేయడానికి విచ్చలవిడిగా కదం తొక్కుతున్నాయి.
మీడియా కత్తులన్నీ కూడా జగన్ మానహనానికి తెగబడుతున్నాయి. జనంలోకి వెళ్లగలిగే మీడియా, జనం ఆలోచనల్లోకి విషబీజాలను నాటుతూ ఉండగా ప్రభుత్వం ఏం చేస్తోంది. జగన్ దళం ఏం చేస్తోంది? అసలు మీడియా వర్గాల్లో జగన్ కి ‘సొంత’ అంటూ ఏమైనా ఉన్నదా? జగన్ పార్టీకి ప్రభుత్వానికి ఏకపక్ష ప్రచార పత్రంలాగా వ్యవహరించే పత్రికకి తటస్థప్రజావనిలో విశ్వసనీయత ఎంత? జగన్ ను భజన చేయాలని కాదు. ఆయన చర్యల్లో రంధ్రాన్వేషణ చేయకుండా.. మంచిని మంచిగా, చెడును చెడుగా చెప్పగల వారు ఎందరున్నారు?
తెలుగు పత్రికల విషయానికి వస్తే పచ్చపత్రికలుగా ముద్రపడిన రెండు పత్రికలూ నిత్యం జగన్ పై విషం చిమ్ముతుంటాయి. వివేకా హత్యోదంతంపై జరుగుతున్న విచారణకు సంబంధించిన వాంగ్మూల వార్తలనే గమనిస్తే.. ఎంత వ్యూహాత్మకంగా ఒక పద్ధతి ప్రకారం.. విషప్రచారం సాగిస్తూ వచ్చి.. చివరికరి అందరి అనుమానాలను జగన్ వైపు మళ్లించారో ప్రపంచం చూసింది! ఈ ప్రచారాలను అడ్డగోలుగా, అర్థరహితంగా ఖండించే సాక్షి కథనాలు తప్ప.. ఇతర మీడియాలో.. జగన్ విశ్వసనీయతను కాపాడుతున్న వారు ఎవరున్నారు? టీవీ ఛానెళ్లలో సైతం జగన్ మీద విషం చిమ్మే ఛానెళ్లు చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటాయి.
ఆయన కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్న సొంత చానెల్ సంగతి సరే.. ఇతర చానెళ్లలో ఆయన మీద సానుభూతి చూపిస్తున్న వారెవ్వరు? జగన్ అనుకూల మీడియాగా ముద్ర వేయించుకుని లబ్ధి పొందుతున్న వారైనా నిజాలు చెబుతున్నారా? ఆబ్లిగేషన్ ఉన్నప్పుడు మాత్రం ఒకటి రెండు మంచి మాటలు చెప్పి మొహం చాటేస్తున్నారు.
ఇలాంటి కాంట్రాక్టు మీడియాలను కాదు. తనను సొంతంగా భావించి తనకోసం పనిచేసే మీడియాను జగన్ ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నారు? నిజం చెప్పాలంటే.. ఆ విషయం మీద ఆయనకు దృష్టి లేదు. అలా లేకపోవడం వలన నష్టం తప్పదనే సంగతి ఆయన పట్టించుకోరు! ఇతరులు ఆయనకు తెలియజెప్పరు!! ఆయన చుట్టూ ఉండే కోటరీ ఆయనకు వాస్తవాలను తెలియజెప్పకపోవడం, ప్రాక్టికల్ గా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లకపోవడం హేయం!
ప్రింట్, టీవీ మీడియాల సంగతి సరే.. వెబ్ ప్రపంచంలో మాత్రం ఏమవుతోంది. జగన్ అనుకూల కథనాలను అందించే వెబ్ సైట్స్, యూట్యూబ్ చానెల్స్ కొన్ని ఉన్నాయి. వీసమెత్తు ఆయన లోపాలను తెలియజెప్పకుండా అచ్చంగా భజన చేస్తూ ఆయనను ప్రసన్నం చేసుకుని లబ్ధి పొందడానికి చూసే.. వెబ్‌సైట్ల సంగతి పక్కన పెడితే.. ప్రజల్లో అంతో ఇంత ఆదరణతో, విశ్వసనీయతతో పనిచేస్తున్న సైట్ లు ఎన్ని? వెబ్ సైట్ల ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉన్నదంటే.. వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పనిచేయడానికి ఒక సైట్ పుట్టేలోగా.. తెలుగుదేశం దళాలు.. పది వెబ్ సైట్స్ పుట్టించి మరింత ముమ్మరంగా ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నాయి. జగన్ కు సొంత దళం అంటూ ఎక్కడ తయారవుతోంది? ఎక్కడ పనిచేస్తోంది?
చుట్టూతా ఆషాఢభూతి నేతలే..
పచ్చమీడియా నిత్యం జగన్మోహన్ రెడ్డి మీద పెట్రేగిపోతూ ఉంటుంది. కానీ.. జగన్ కు అత్యంత సన్నిహితులు, లేదా ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులుగా గుర్తింపు ఉండే కొందరు నాయకులు ఉంటారు. వారి మీద పల్లెత్తు మాట రాదు. వారి వైఫల్యాల ప్రస్తావన ఉండదు. వారి మీద నిందలు కనిపించవు. వారి వ్యవహారమే లేకుండా.. దండయాత్ర మొత్తం జగన్ మీద మాత్రమే జరుగుతూ ఉంటుంది.
గతంలో చంద్రబాబునాయుడు ఒక కుట్రపూరితమైన టెక్నిక్ వాడుతూ ఉండేవారు. చంద్రబాబు నిత్యశంకితుడు. పిరికివాడు. తన బలహీనత గురించి పూర్తి అవగాహనతో భయంభయంగా బతికే వ్యక్తి. అందుకే వ్యూహాలకు కుట్రలకు ప్రాధాన్యం ఇస్తుంటాడు. ఆయన అధికారంలో ఉండగా.. ఒక టెక్నిక్ ఉండేది. తనకు ఇష్టంలేని, తన మాట వినని, తనకు ప్రమాదకరంగా మారుతారని అనిపించే మంత్రులు, ఇతర నాయకులపై తన అనుకూల పచ్చ పత్రికల్లో పరిశోధనాత్మక కథనాలు రాయించే వాడు. ఆ పత్రికలు ఆయా మంత్రుల శాఖల గురించి ఇన్వెస్టిగేటివ్ స్టోరీలు ఇచ్చి.. తాము ఆబ్జెక్టివ్ జర్నలిజం చేస్తున్నామనే బిల్డప్ తో బతికేవి. ప్రభుత్వాన్ని వదిలిపెట్టడం లేదనే చెప్పుకునేవి. కానీ.. ఆ కథనాలన్నీ చంద్రబాబు ప్లాంట్ చేసే స్టోరీలు. చంద్రబాబును మాత్రం పల్లెత్తు మాట అనేవి కాదు. ఆయన అనుచరుల లోపాలన్నీ బాగా చెప్పేవి.
ఇప్పుడు జగన్ సర్కారు విషయంలో రివర్సులో జరుగుతోంది. జగన్ కు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారనేంత పెద్ద మాట అనవలసిన అవసరం లేదుగానీ.. జగన్ ను నిత్యం తిట్టిపోస్తూ ఉండే పచ్చ పత్రికలకు నెలవారీ కోట్లలో మామూళ్లు రహస్యంగా చెల్లిస్తూ, తమ పేరు బయటకు రాకుండా.. తమ మీద ఆరోపణలు నిందలు రాకుండా జాగ్రత్త పడుతున్న ఆషాఢభూతి నాయకులు, ధూర్తులు కొందరు ఉన్నారు. వారి గురించైనా జగన్ కు అవగాహన ఉన్నదా? అనేది కూడా సందేహమే. జగన్ మీద ఏమైనా రాసుకోండి గానీ.. మా జోలికి రావొద్దు అనే తరహాలో పచ్చ మీడియాతో వీరి బేరసారాలు చీదర పుట్టిస్తుంటాయి. జగన్ తన వెనుక జరిగే ఈ బాగోతాల్ని ఎప్పటికి తెలుసుకుంటారు?
ఎన్నారై- సోషల్ యోధులపై చిన్న చూపు!
జగన్ ను అభిమానిస్తూ సోషల్ మీడియాలో ఆయనకోసం పనిచేసేవాళ్లు.. ఆయన మీద ఈగ వాలనివ్వకుండా పోరాడేవాళ్లు చాలా మందే ఉంటారు. ఉద్యోగాల మాదిరిగా జీతాలు తీసుకుని చెప్పింది పోస్టులు పెడుతూ చెలరేగేవాళ్లు కొందరుంటారు. కానీ.. ‘జగనన్న మనవాడు’ అనే ప్రేమతో.. ఆర్తితో ఆయనకోసం పోస్టులు పెట్టేవారు మరికొందరు ఉంటారు! ఈ రెండో రకానికి చెందిన వారిలో ఎన్నారైలుగా ఉంటూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు, జగన్ కోసం పరితపించేవాళ్లు వందలు వేలల్లోనే ఉన్నారు. వీరి ప్రేమను, వీరి సేవలను జగన్మోహన్ రెడ్డి కనీసం గుర్తించే స్థితిలో ఉన్నారా?
ఇప్పుడంటే పార్టీ ప్రభుత్వంలో ఉంది. అధికారం చెలాయిస్తోంది. కానీ మూడేళ్ల కిందటి వరకు పరిస్థితి ఏమిటి? వైసీపీ జీతాలు తీసుకుంటూ పనిచేసేవాళ్లు కూడా.. దాక్కుని తిరిగే వాతావరణం ఉండేది. సోషల్ మీడియా పోస్టులు పెట్టే అనేక మందిని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అరెస్టు చేసి వేధించింది. అయితే అదే సమయంలో ఎన్నారైల్లోని తన అభిమానులు, సోషల్ మీడియా యోధులు జగన్ కు అండగా నిలబడ్డారు.
సోషల్ మీడియా పోస్టులపై చర్య తీసుకోవడానికి ఇక్కడ చంద్రబాబు సర్కారు తెచ్చిన చట్టాలు విదేశాలనుంచి పోస్టులు పెట్టే వారిని ఏమీ చేయలేని వాతావరణం ఉండడంతో వారు చెలరేగిపోయారు. జగన్మోహన్ రెడ్డికి ఎంతో దన్నుగా నిలిచారు. తమ వేల లక్షల గంటల తమ పని సమయాన్ని జగనన్న కోసం వెచ్చించారు. జగన్ అనుకూల భావాలను, ఆయన పట్ల అభిమానాన్నియావత్తు తెలుగు ప్రజలు అందరిలోనూ నాటడానికి వారంతా కృషి చేశారు. అలాంటి ఎందరో చేసిన కష్టం ఫలితంగానే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే ఈ ఎన్నారై సోషల్ యోధులెవ్వరూ కూడా తాము అభిమానించే వైఎస్ జగన్మోహన్ రెడ్డినుంచి ప్రతిఫలాన్ని ఆశిస్తున్న వారు కాదు. లబ్ధి కోరుకుంటున్న వారు కాదు. అయితే గియితే ఆర్థికంగా కూడా పార్టీకి దన్నుగా నిలవగల స్థితిలో ఉన్నవారే తప్ప.. పార్టీనుంచి ప్రభుత్వం నుంచి ఎంగిలిమెతుకులు ఏరుకోవాలనుకునేవారు కాదు! అయితే వారు ఆశించేదంతా.. జగనన్న నుంచి కించిత్ గుర్తింపు. ఒక చిన్న పలకరింపు. ఒక ప్రేమాస్పదమైన చిరునవ్వు! అలాంటివి కూడా వారికి ఇవ్వడంలో జగన్ విఫలమయ్యారు. వారి అభిమానాన్ని అవమానిస్తూ వచ్చారంటే.. వారిలోనూ ఒక వైరాగ్యభావనను పెంచారంటే అతిశయోక్తి కాదు.
ఎన్నికలకు పూర్వం.. పచ్చమాఫియాను ఎదుర్కొని జగన్ కోసం సోషల్ మీడియాలో చెలరేగి పనిచేసిన ఓ ఎన్నారై.. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను..’ అనే క్షణాలను చూసి మురిసిపోయాడు. తమ కృషి ఫలించిందని సంబరపడ్డాడు. ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టాడు. ‘‘2009 నుండీ ఎండనక వాననక కుటుంబాలను, కేరీర్లను, భవిష్యత్తును పక్కనబెట్టి జగన్ గారి కోసం, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి తెలుగుదేశం పార్టీని, పచ్చ మాఫియాను ఎదిరించి పోరాడి ఆరాటపడి “వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను” అనే మాట విన్నాం.
సంబరపడ్డాం. దీనికి ప్రతిఫలంగా పదవులు కావాలనో ఉద్యోగాలు కావాలనో కాంట్రాక్టులు కావాలనో అడగడం లేదు. ముఖ్యమంత్రిగా మా జగనన్న ఒక్క ఆదివారం ఇడుపులపాయలో మాతో గడపాలని కోరాడు. పొద్దుటి నుండి సాయంత్రం వరకు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. మూడు పూటలు చిరునవ్వుతో అందరితో ఆహ్లాదంగా గడిపితే చాలని విన్నవించుకున్నాడు’’ ఆ కోరిక తీరలేదు. జగన్ ఆప్తుల దృష్టికి తీసుకెళ్లినా వారూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి వచ్చిందని ఆ ఎన్నారై నిర్వేదంలోకి వెళ్లిపోయాడు.
అలాంటి వాళ్లు, జగన్ ను నిజంగా ప్రేమించేవాళ్లు, జగన్ తమ దళపతి అని భావించే సొంతమనుషులు ఏం ఆశిస్తారు. వాళ్లు అడిగేది ఒక్క ఛాన్స్ కాదు మహా అయితే ఒక్క షేక్ హ్యాండ్. అభిమానులను దూరం చేసుకోవడం ఆస్తులు పోగొట్టుకోవడం కంటే ఎక్కువ నష్టం!! ఈ వాస్తవాన్ని జగన్ తెలుసుకునేది ఎప్పుడు? తదనుగుణంగా తన తీరు మార్చుకునేది ఎప్పుడు?
.. ఎల్. విజయలక్ష్మి