‘నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ..’ ఇది తెలుగులో చాలా పాపులర్ సాంగ్. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘సింహాద్రి’ సినిమాలోని పాట ఇది. మామూలుగా చిన్న పిల్లలు విజిలేస్తే, లాగి చెంప మీద ఒక్కటిచ్చేస్తాం. విజిల్ వెయ్యడమంటే పోకిరీతనం కింద లెక్క. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కుర్రాడు ఇలాగే ‘పోకిరీ’ ముద్ర తన మీద పడ్తుందేమోననే భయంతో, విజిల్ (‘ఈల) వేయడం అనే అలవాటుని వదులుకోలేక స్కూలుకి డుమ్మా కొట్టేశాడు.
రికార్డుల్లోకి అతని పేరు ఎక్కాలని రాసి పెట్టి వున్నప్పుడు, అదృష్టం ఏదో ఒక రూపంలో కలిసొస్తుంది. అలా ఆ అదృష్టం ఓ స్కూల్ మాస్టారి రూపంలో ఆ కుర్రాడికి దక్కింది. కుర్రాడి పేరు దుర్గా ప్రసాద్. ర్యాలి గ్రామానికి చెందిన కుర్రాడితడు. ‘నీకు ఈల వేయడం ఇష్టం కదా.. దాంట్లో శిక్షణ ఇప్పిస్తా.. స్కూల్‌కి వస్తావా.?’ అని అడిగాడు స్కూలు మాస్టార్. ఇంకేముంది, ఎగిరి గంతేశాడు దుర్గా ప్రసాద్.
ఓ పక్క స్కూలు పాఠాలు చదవడం, ఇంకోపక్క ఈల వేయడం.. దుర్గా ప్రసాద్ ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. అలా అలా ఈ ఈల వ్యవహారం ఊరూ వాడా పాకేసింది. ఇంకేముంది, రికార్డులు రాసేటోళ్ళు దుర్గాప్రసాద్ దగ్గరకొచ్చారు. నాలుగు నిమిషాల్లో సుమారు ఐదొందలసార్లు ఈల వేసి, ‘భళా’ అన్పించాడు. మూడు నాలుగు రికార్డులూ, లిటిల్ స్టార్ అనే బిరుదూ దుర్గా ప్రసాద్‌ని వరించింది. ఇంత ఘనత సాధించిన ఆ బుడ్డోడి వయసు జస్ట్ పదేళ్ళ లోపే. చదువులోనూ రాణిస్తున్నాడు.
అచ్చం సినిమా కథలా వుంది కదా.! కానీ నిజం ఇది. ఈల వేసి రికార్డులు సృష్టించాడంటే ఆ ఘనత కుర్రాడిదనాలా.? దేవుడిలా అతనిలోని టాలెంట్‌ని గుర్తించిన మాస్టారిదనాలా.? చేతికి వున్న వేళ్ళన్నీ ఒకేలా వుండవు. అలాంటప్పుడు సమాజంలో వున్న మనుషులంతా ఒకేలా వుండాలంటే కుదరదు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులూ ఈ కోణంలోనే ఆలోచించాలి. ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ దాగి వుంటుంది. దాన్ని బయటకు తీస్తే, ప్రతి చిన్నారీ అద్భుతాలు సృష్టించేస్థాయికి ఎదుగుతాడు.