అలాటి అవస్థ పడ్డా, రచయితను ఆల్‌టుగెదర్ ఎవాయిడ్ చేయలేరు కదా, ఇప్పుడు ''ఆత్మబలం''కు మళ్లీ ఆత్రేయతో వేగడం జరుగుతోంది. ఆ పాటికి రాజేంద్రప్రసాద్‌కు కాస్త ధైర్యం వచ్చిందిలాగుంది. మూడోరోజు సాయంత్రం 'ఇవాళ లాస్ట్. పాట రాయలేకపోతే మద్రాసు తిరిగి వెళ్లిపోదాం.' అన్నారు ఆత్రేయతో. ఆత్రేయ కాస్త కంగారు పడ్డారు. డెక్సిడ్రిన్ అనే మాత్రలు వేసుకుని కూచున్నారు. వాటివల్ల నిద్ర రాకుండా వుంటుంది. రాత్రంతా మేలుకున్నా పల్లవి పల్లవించలేదు. ఏం చేయాలి?
ఆత్రేయ మర్నాడు తెల్లారుఝామున డ్రైవరును లేపి కారు తీసుకుని కబ్బన్ పార్కుకి వెళ్లారు. అక్కడ మార్నింగ్‌వాక్‌కి కొందరు వచ్చివున్నారు. ఈయన పార్కు బెంచీ మీద కూలబడి పాడ్‌కి కాగితాలు పెట్టుకుని, పెన్ను చేతబట్టి కూచున్నాడు. ఇంతలో హఠాత్తుగా వర్షం ప్రారంభమైంది. మార్నింగ్‌వాక్ జనాభా వర్షాన్ని తిట్టుకుంటూ చెట్లకిందకు వెళుతున్నారు.
వాళ్లలో ఓ యువజంట గుబురుగా పెరిగిన పొదలోకి వెళ్లిపోయారు. వర్షం పెద్దదైంది. ఆ జంట గుసగుసలు పెరిగాయి. కేరింతలు కొడుతున్నారు. మైమరచిపోతున్నారు. ఆ దృశ్యం చూసిన ఆత్రేయలో స్పందన కలిగింది. తక్షణం రాసేశారు –
'చిటపట చినుకులు పడుతూ వుంటే.. చెలికాడే సరసన వుంటే…'
పాట, పిక్చరైజేషన్ సూపర్ హిట్. చెప్పానుగా జగపతి సినిమా హిట్ సాంగ్స్‌తో సినిమాలు తయారుచేస్తే ఆ సినిమాలకు మకుటంగా ఈ పాట పేరే పెట్టుకున్నారు. తర్వాత రాజేంద్రప్రసాద్ 'ఎంగళ్ తంగ రాజా' అనే పేరుతో శివాజీ గణేశన్‌తో సినిమా తీశారు. తెలుగులో 'మానవుడు-దానవుడు' లేదూ, దాని తమిళ వెర్షన్ అన్నమాట. ఆ సినిమాలో ఈ ట్యూన్ ఉపయోగించుకున్నారు. 'ఇరవుక్కుం పగలుక్కుం' అని పల్లవి.
తెలుగు సినిమాని ఇతర భాషల్లో తీయడమే కాదు, ఇతర భాషల సినిమాలను ఈయన తెలుగులో మళ్లీ తీసిన సందర్భాలున్నాయి. 'ఆరాధన', 'ఆత్మబలం'కు బెంగాలీ సినిమాల ఒరిజినల్స్ వున్నాయని చెప్పాను కదా. 'వెళ్లయి రోజా' అనే తమిళ సినిమాను 'ఎస్పీ భయంకర్' అనే పేరుతో తీశారు. ''సుమతి ఎన్ సుందరి'' అనే సినిమాను తెలుగులో ''బంగారుబాబు'' పేరుతో తీశారు. నిజానికి ఆ తమిళ సినిమాకు మూలం ''నాయికా సంగ్బాద్'' అనే బెంగాలీ సినిమా. ''ఇదీ అసలు కథ'' కార్యక్రమంలో ఆ బెంగాలీ సినిమాను, తెలుగు సినిమాను పోల్చి చూపిస్తే రాజేంద్రప్రసాద్ ఆశ్చర్యపడ్డారు. బెంగాలీ ఒరిజినల్ వుందనే తెలియదు. తమిళ సినిమా హక్కులే తీసుకుని మార్చాను. దాని డైరక్టర్ సివి రాజేంద్రన్ (రచయిత, దర్శకనిర్మాత, బెజవాడ గోపాలరెడ్డిగారి అల్లుడు, మౌలికంగా తెలుగువాడు అయిన సివి శ్రీధర్ తమ్ముడు) నేను చేసిన మార్పులు చూసి నా దాని కంటె బాగుంది అని మెచ్చుకున్నాడు'' అని చెప్పారు.
ఆయన తీసిన 'అడవిలో అభిమన్యుడు' సినిమాకు ఆధారం ఓ మలయాళ సినిమా. 'అక్కా-తంగై' అనే తమిళ సినిమాను 'అక్కా-చెల్లెలు' అనే పేరుతో తీశారు. దానికి అసలు మూలం హిందీ సినిమా ''కానూన్''. ఆ సినిమా పేరు చెప్పగానే 'పాండవులు పాండవులు తుమ్మెదా' అనే పాట గుర్తుకు వస్తుంది. దాని గురించి ఓ ముచ్చట ఉంది –
'అక్కా చెల్లెలు' సినిమాకు డైరక్టరు అక్కినేని సంజీవి గారు. వి.మధుసూదనరావుగారు బిజీగా వుండటంతో జగపతి సినిమాలకు ఎడిటర్‌గా వున్న సంజీవిగారే ఈ సినిమాను రీమేక్ చేశారు. నాగేశ్వరరావు, షావుకారు జానకి ఓ జంట. కృష్ణ, విజయనిర్మల మరో జంట. తమిళంలో లేని ఓ పాటను షావుకారు జానకికి పెట్టడం జరిగింది. అదే 'పాండవులు పాండవులు తుమ్మెదా'!
జానకి గారికి ఆ పాట నచ్చలేదు. 'సందర్భశుద్ధి లేదు, పైగా అలా గెంతుతూ పాడితే నా ఇమేజి దెబ్బతింటుంది' అన్నారావిడ. ఎంత చెప్పినా వినలేదు. చివరికి 'సరే మీ యిష్టం' అని రాజేంద్రప్రసాద్ వదిలేశారు. తర్వాత జానకి గారే 'పోన్లెండి, మిమ్మల్ని బాధపెట్టడం ఎందుకు?' అంటూ నటించారు. 40 యేళ్లయినా ఇప్పటికీ ఆ పాట హిట్. జానకిగారి అభినయం కూడా సూపర్ హిట్.
అలాగే ''ఆస్తిపరులు'' సినిమాలో నాగేశ్వరరావుగారు మారువేషంలో వచ్చి 'సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకమ్మూ రామచంద్రా' అనే పాట పాడతారు. ముందు నాగేశ్వరరావుగారు ఒప్పుకోలేదు. పాట వల్ల పాత్ర ఔచిత్యం దెబ్బతింటుందని వాదించారు. కానీ అందరూ నచ్చచెప్పడంతో నటించారు. పాట అందరికీ నచ్చింది.
''దసరా బుల్లోడు'' విషయానికి వస్తే 'పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా' సూపర్ డూపర్ హిట్. నాగేశ్వరరావుగారికి కొత్త ఇమేజి తెచ్చిపెట్టిన సినిమా అది. ఆయన పక్కన వాణిశ్రీ అదరగొట్టేసింది. నిజానికి ఆ పాత్ర జయలలిత వేయవలసివుంది. ఆవిడకు ఎంజీఆర్ సినిమాతో క్లాష్ రావడంతో ఈ సినిమా వేయలేకపోయారు. ఆవిడ స్థానంలో ఆఖరి నిమిషంలో వాణిశ్రీ వచ్చారు. కలకాలం గుర్తుండిపోయేలా నటించారు.
రాజేంద్రప్రసాద్‌గారికి హిందీరంగంతో ఉన్న కనక్షన్ గురించి చెప్పుకుంటే –
ఈయన తీసిన ''అదృష్టవంతులు''ను రవీ నగాయిచ్ 'కిస్మత్'గా తీసి పేరు, డబ్బు సంపాదించుకున్నారు.
శశికపూర్ నటించిన 'ఆ గలే లగ్ జా'ను ఈయన తెలుగులో 'మంచి మనుషులు'గా తీశారు.
సంజీవ్‌కుమార్ 'అన్‌హోనీ'ని తెలుగులో శోభన్‌బాబుతో 'పిచ్చిమారాజు'గా తీశారు.
అశోక్‌కుమార్, ప్రాణ్‌లు నటించిన 'విక్టోరియా 203' సినిమాను ఎస్వీరంగారావు, నాగభూషణంలతో 'అందరూ దొంగలే' పేరుతో తీశారు.
తనే హిందీలో తీసిన 'ఖత్రోంకి ఖిలాడి' సినిమాను జగపతిబాబుతో 'సింహస్వప్నం' పేరుతో తీశారు.
జంధ్యాలగారి 'నాలుగు స్తంభాలాట' ను హిందీలో ఈయన 'బేకరార' పేరుతో పద్మిని కొల్హాపూరి, సంజయ్ దత్‌తో తీశారు. సక్సెస్ కాలేదు.
''దసరా బుల్లోడు''ను హిందీలో రాజేశ్ ఖన్నాతో తియ్యబోయి ఇబ్బంది పడ్డారు. ఆ కథ ఇంట్రస్టింగుగా వుంటుంది. రాజేశ్ ఖన్నా అప్పటికే 'ఆరాధనా', 'హాథీ మేరే సాథీ' సినిమాలతో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఏడున్నర లక్షలు పారితోషికం తీసుకుంటున్నారు. ఈయన దసరాబుల్లోడుకు బుక్ చేయడానికి వెళితే 12 లక్షలు అడిగాడు.
పైగా తన సెక్రటరీ గుర్నామ్‌సింగ్‌కు 50 వేలు అదనంగా యివ్వాలన్నాడు. అన్నిటికీ ఈయన సరేనంటూనే ఓ కండిషన్ పెట్టారు. 'ప్రారంభించాక ఆర్నెల్లలో పూర్తి చేయాలి. డేట్స్ రెండునెలల్లో యివ్వాలి' అని కండీషన్. రాజేశ్ ఖన్నా సరేనన్నాడు.
''దసరాబుల్లోడు'' సినిమా రాజేశ్ ఖన్నాతో హిందీలో రాబోతుందని వినగానే నార్త్ ఇండియాలోని డిస్ట్రిబ్యూటర్స్ క్యూలు కట్టి అడ్వాన్సులు యిచ్చేశారు. సినిమాకు ఇంత హైప్ రావడంతో రాజేశ్ ఖన్నాకు భయం వేసింది. 'సినిమా అటోయిటో అయితే నీ కెరియర్ ఫినిష్.' అని అతని సన్నిహితులు భయపెట్టారు. దాంతో రాజేశ్ ఖన్నా ఆలోచనలో పడ్డాడు. సినిమా వద్దనలేడు, చేయలేడు.
ఇక రాజేంద్రప్రసాద్‌ని తిప్పడం మొదలెట్టాడు. బొంబాయి వెళితే 'ఎందుకండీ, మద్రాసు వస్తున్నానుగా' అనేవాడు. మద్రాసులో పొద్దున్న వెళితే 'సాయంత్రం రండి సరదాగా కూచుందాం' అనేవాడు. అసలు విషయం తప్ప తక్కినవన్నీ మాట్లాడేవాడు.
ఇలాగ 15 రోజులు గడిచాయి. ఆఖరిరోజు 'ఎయిర్‌పోర్టుకు రండి, అక్కడ మాట్లాడదాం' అన్నాడు. అక్కడ విమానం ఎక్కబోతూ ఓ కవరు చేతిలో పెట్టాడు. చూస్తే రాజేశ్ ఖన్నా డేట్స్ షెడ్యూల్ అన్నమాట. ఈయన రెండు నెలలు వరసగా అడిగితే ఆయన నెలకు ఒకటి, రెండు రోజుల చొప్పున ఓ సంవత్సరంలో 26 రోజులు యిచ్చాడు. ఈ లెక్కన రెండు సంవత్సరాలు పడుతుందన్నమాట. రెండు నెలల్లో పూర్తి చేస్తానని మాట యిచ్చి రెండు సంవత్సరాలకు ప్లాను చేసినందుకు ఈయనకు కోపం వచ్చింది.
శుబ్భరంగా తిట్టిపోస్తూ ఓ పెద్ద వుత్తరం రాశారు. రాజేశ్ ఖన్నా కంగు తిన్నాడు. ఈయన శాంతింపజేద్దామని చూశాడు. కానీ 'ఇలాటి చీట్‌లతో నేను పనిచేయను' అని రాజేంద్రప్రసాద్ భీష్మించడంతో తీసుకున్న అడ్వాన్సు తిరిగి యిచ్చేశాడు. రాజేశ్ ఖన్నా ఎడ్వాన్సు తిరిగియిచ్చేశాడు కానీ అన్నగారి పాత్రకు బుక్ చేసిన ఓంప్రకాశ్ తను తీసుకున్న 3 లక్షలు తిరిగి యివ్వలేదు. ఆ విధంగా ''దసరా బుల్లోడు'' హిందీ వెర్షన్ తీయకుండానే 10 లక్షలు నష్టపోయారు రాజేంద్రప్రసాద్.
రాజేంద్రప్రసాద్‌గారి సినీజీవితంలో హిట్స్ వున్నట్టే, ఫ్లాప్‌లూ వున్నాయి. తన స్వంత బ్యానర్‌లో కొడుకు జగపతిబాబుకి మంచి హిట్ సినిమా యివ్వలేకపోయానన్న బాధ ఆయనకు మిగిలిపోయింది.
నాగేశ్వరరావుగారితో తీసిన 'ఎస్పీ భయంకర్', నాగార్జునతో తీసిన 'కెప్టెన్ నాగార్జున' రెండూ ఫెయిలయ్యాయి. తన దర్శకత్వంలో 22 సినిమాలు తీసిన ఆయన ఈ రెండూ వరుసగా ఫెయిలవడంతో ఆత్మశోధనలో పడిపోయి దర్శకత్వానికి గుడ్‌బై చెప్పేశారు. తర్వాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సుబ్బారావుగారితో కలిసి తను హిందీలో తీసి హిట్ చేసిన 'ఖత్రోంకీ ఖిలాడీ'ని జగపతిబాబుతో తెలుగులో తీయబోయారు. దర్శకత్వం వి.మధుసూదనరావుకి అప్పగించారు. హిందీలో ఇద్దరు హీరోలు ఉంటే జగపతిబాబుతో తెలుగులో ద్విపాత్రాభినయం చేయించారు, జగపతిబాబు బాగా హైలైట్ అవుతాడు కదా అనుకున్నారు.
సినిమా ఫ్లాప్ అయింది. ఖర్చు 66 లక్షలు. అంతా మార్వాడీల వద్ద అప్పు తెచ్చినదే! వడ్డీలతో సహా అప్పు తీర్చడానికి ఆస్తులన్నీ అమ్ముకోవలసి వచ్చింది. అయినా ఆత్మస్థయిర్యాన్ని కోల్పోక 'అడవిలో అభిమన్యుడు' సినిమా తీసేరు. 20 లక్షల నష్టం వచ్చినా జగపతిబాబు నటనకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఆయన నటుడిగా స్థిరపడ్డాడు. ఈ థలో రాజేంద్రప్రసాద్‌గారు హైదరాబాదుకు మకాం మార్చారు. ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కల్చరల్ సెంటర్ ప్రారంభించారు.
మళ్లీ సినిమా నిర్మాణంలోకి దిగారు. నాగార్జునతో 'కిల్లర్' అనే సినిమా తీశారు. బాగానే ఆడింది. తర్వాత బాలకృష్ణ, రవీనాటాండన్‌లతో 'బంగారు బుల్లోడు' సినిమా తీశారు. అది హిట్ అయింది. అప్పుడు జగపతిబాబు హీరోగా 'భలే బుల్లోడు', 'పెళ్లిపీటలు' తీశారు. కానీ అవి ఆశించినంత విజయాన్ని సాధించలేదు. ఇక సినిమా నిర్మాణం మానుకున్నారు. సినిమానిర్మాతగా రాజేంద్రప్రసాద్ చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు నిచ్చింది. ఫిల్మ్‌నగర్ గుడికి ఆయన చేసిన ఎవరూ మరువలేరు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2015)