ఢిల్లీ నిర్భయ కేసులోని దోషులు మరణశిక్షను తప్పించుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈమధ్యనే వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోగా రాష్ట్రపతి తిరస్కరించారు. మరో దోషి అక్షయ్ సింగ్ ఠాకూర్ తన ఉరిశిక్షపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు. శిక్షను తప్పించుకునే అవకాశం లేకపోయినా యావజ్జీవ శిక్షగా మారుతుందేమోననే ఆశతో దోషులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక పక్క దోషులు తమ ప్రయత్నాలు చేసుకుంటూ ఉండగానే, మరోపక్క తీహార్ జైలు అధికారులు దోషులకు మరణశిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తలారీ కోసం గాలిస్తున్నారు. పార్లమెంటు మీద దాడి కేసులో దోషిగా తేలిన కశ్మీరీ ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరితీతే ఈ జైల్లో చివరిది. గతంలో తీహార్ జైల్లో ఒక తలారీ ఉండేవాడు. అతను చనిపోయాక అధికారిక తలారీ లేడు.
ఈ జైల్లో పనిచేసిన చివరి తలారీ మమ్ము జల్లద్. మమ్ము కుటుంబంలో తరతరాలుగా కొందరు తలారులుగా పనిచేశారు. మమ్ము జల్లద్ 2011లో చనిపోయాడు. అతను బతికి ఉన్నప్పుడు ఉగ్రవాదులు అఫ్జల్ గురును, అజ్మల్ కసబ్‌ను ఉరితీయాలని కోరుకున్నాడు. వారిద్దరినీ ఉరి తీసి శత్రు దేశానికి (పాకిస్తాన్) సందేశం పంపుతానని జైలు అధికారులతో అనేవాడు.
జల్లద్ చనిపోయేనాటికి అప్పటివరకు దేశంలో ఉన్న ఏకైక తలారీ అతనే. మమ్ము జల్లద్ తాత రామ్‌రఖ్ బ్రిటిషు పాలనలో తలారీగా పనిచేశాడు. అతను ఆనాడు స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ కోసం ఉరికంబం తయారుచేశాడు. దీంతో ఆ కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది.
భగత్‌సింగ్‌ను తన తాత ఉరితీసినందుకు తాను ఇప్పటికీ సిగ్గు పడుతున్నానని జల్లద్ అనేవాడు. అఫ్జల్ గురును, కసబ్‌ను ఉరితీసే అవకాశం వస్తే అది తనకు గౌరవంగా భావిస్తానని చెప్పేవాడు. మమ్ము జల్లద్ తండ్రి కల్లు కూడా తలారీగా పనిచేశాడు.మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకులు కేహార్ సింగ్‌ను, సత్వంత్ సింగ్‌ను ఆయన ఉరితీశాడు.
సంజయ్ చోప్రా, గీతా చోప్రాను హత్య చేసిన బిల్లా, రంగాను 1981లో కల్లు, ముమ్ము కలిసి ఉరితీశారు. ఇక కల్లు కుటుంబంలో పవన్ అనే వ్యక్తి సర్టిఫైడ్ తలారీగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జైల్లో ఉన్నాడు. అతనికి నెలకు మూడు వేల రూపాయల జీతం ఇస్తున్నారు. నిర్భయ దోషుల ఉరి గురించి అతనికి ఇప్పటివరకు అధికారులు అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. నిర్భయ దోషులను ఉరితీసే పని అతనికే అప్పగిస్తారని అనుకుంటున్నారు. కొన్ని కారణాల వల్ల అధికారులు తలారీ పేరు ముందుగా ప్రకటించరు.