యుద్ధం: చైనాతో పోల్చితే మనమేంటి.?

చైనాతో ఇప్పటికిప్పుడు యుద్ధమొస్తే పరిస్థితేంటి.? ఈ ప్రశ్న ఇప్పుడు కొత్తగా చర్చనీయాంశమవుతోంది. నిజమే, చైనాతో భారత్‌కి ఎప్పటినుంచో సరిహద్దు వివాదాలున్నా, గడచిన నాలుగున్నర దశాబ్దాలుగా పరిస్థితి కొంత ప్రశాంతంగానే వుందనుకోవచ్చు. కానీ, ఇప్పుడు పరిస్థితులు…

చైనాతో ఇప్పటికిప్పుడు యుద్ధమొస్తే పరిస్థితేంటి.? ఈ ప్రశ్న ఇప్పుడు కొత్తగా చర్చనీయాంశమవుతోంది. నిజమే, చైనాతో భారత్‌కి ఎప్పటినుంచో సరిహద్దు వివాదాలున్నా, గడచిన నాలుగున్నర దశాబ్దాలుగా పరిస్థితి కొంత ప్రశాంతంగానే వుందనుకోవచ్చు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చైనా, కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్‌తో యుద్ధానికి 'సై' అంటోంది.

భవిష్యత్తుని ముందే ఊహించి అన్నారో, అనుకోకుండా ఆ మాట వచ్చిందోగానీ, ప్రధాని నరేంద్రమోడీ 'చైనాతో సరిహద్దు వివాదాలున్నా నాలుగున్నర దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్యా ఒక్క తూటా కూడా పేలలేదు..' అని విదేశీ వేదికలపై వ్యాఖ్యానించారు మొన్నీమధ్యనే. మోడీ వ్యాఖ్యల్ని చైనా ఆహ్వానించింది కూడా. 'భారత్‌తో మేం ఎప్పటికీ వివాదాలు కోరుకోం..' అని చైనా ప్రకటించింది.

కానీ, ఏమయ్యిందో.. '1962 నాటి యుద్ధ పరిస్థితుల్ని భారత్‌ మర్చిపోకూడదు..' అని చైనా ఇచ్చిన అల్టిమేటంతో భారత్‌ ఉలిక్కిపడింది. ఇరు దేశాలూ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించే పనిలో బిజీగా వున్నాయి. ప్రధానంగా సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో చైనా – భారత బలగాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతానికైతే ఇరు దేశాల మధ్య ఇంతవరకూ వివాదం కాల్పులదాకా వెళ్ళలేదు.

కానీ, ఆ పరిస్థితులు రావన్న గ్యారంటీ లేదు. చైనా సైనికులు, భారత బలగాలపై భౌతిక దాడులకు దిగడం తీవ్ర దుమారానికి కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లోనే ఆయుధ సంపత్తి విషయంలో చైనాతో పోల్చితే మనమెక్కడున్నాం.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. 1962 నాటి పరిస్థితుల్ని చైనా ఉదహరిస్తోందిగానీ, ఆ యుద్ధమే ఆయుధ సంపత్తి పరంగా భారత్‌ కనీ వినీ ఎరుగని వేగంతో దూసుకెళ్ళేలా చేసిందన్నది నిర్వివాదాంశం.

చైనాతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకునే క్రమంలో భారత్‌ కూడా బాగానే 'అభివృద్ధి' చెందింది. రెండు దేశాలకు అణ్వస్త్రాల్ని సంధించే సామర్థ్యం వుంటే ఒకటి చిన్న దేశం, ఇంకోటి పెద్ద దేశం అనుకోవడానికి వీల్లేదు. రెండూ పెద్దవే. ఆ విషయం చైనాకీ బాగా తెలుసు. 

భారత్‌తో పోల్చితే పాకిస్తాన్‌ ఆయుధ సంపత్తి చాలా చాలా తక్కువ. అమెరికాతో పోల్చితే ఉత్తరకొరియా పరిస్థితీ అంతే. కానీ, పాకిస్తాన్‌ తనకున్న అణుసామర్థ్యంతో భారత్‌ని భయపెట్టాలని చూస్తోంది. ఉత్తర కొరియా అమెరికాకి వార్నింగ్‌ ఇవ్వడం తెల్సిన విషయమే కదా.! ఆ లెక్కన, చైనా – భారత్‌ని తక్కువగా అంచనా వేస్తున్నట్లు మాట్లాగలదేమోగానీ, భారత్‌పై యుద్ధానికి సాహసించకపోవచ్చు.

రెండు దేశాల అమ్ములపొదిలోనూ అత్యాధునిక యుద్ధ విమానాలు, అణ్వ్రస్త సామర్థ్యమున్న క్షిపణులు, అణు జలాంతర్గాములు, యుద్ధ విమాన వాహక నౌకలూ.. వంటివన్నీ వున్నాయి. సమ ఉజ్జీ కాకపోయినా, చైనా అత్యుత్సాహం చూపిస్తే, బుద్ధి చెప్పగల సత్తా అయితే భారతదేశానికి వుంది. అది చైనాకీ బాగా తెలుసు.

కానీ, చైనాని నమ్మడానికి వీల్లేదు. ఆర్థికాభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతోన్న భారత్‌, సాంకేతిక రంగంలోనూ అత్యున్నత శిఖరాల్ని అందుకుంటోంది. ఈ నేపథ్యంలో, భారత్‌ని మానసికంగా దెబ్బతీయడానికి చైనా అత్యుత్సాహం చూపుతోందన్నది సుస్పష్టం. యుద్ధం జరగకపోవచ్చుగాక.. కానీ, పాకిస్తాన్‌ తరహాలో చైనా కూడా పక్కలో బల్లెంలా తయారైతే పరిస్థితులు భారతదేశానికి ఇబ్బందికరమే.