బాబూ…కాస్త ఓవర్ అవుతున్నట్లు లేదూ?

సముద్రుడు జనాన్ని చూస్తే రెచ్చిపోతాడంట. చంద్రబాబు మీడియా ను చూస్తే గంగ ఆనందంతో శివాలు తొక్కేస్తారు. ఒక సమయంలో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. బహుశా వయస్సు మీద పడుతున్న సమస్య కూడా తోడవుతోందేమో?…

సముద్రుడు జనాన్ని చూస్తే రెచ్చిపోతాడంట. చంద్రబాబు మీడియా ను చూస్తే గంగ ఆనందంతో శివాలు తొక్కేస్తారు. ఒక సమయంలో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. బహుశా వయస్సు మీద పడుతున్న సమస్య కూడా తోడవుతోందేమో? ఒక గంట టాక్ టైమ్ లక్షలాది మొబైళ్లకు పోతే, ఎంత నష్టం వస్తుంది? ప్రయివేటు ఆపరేటర్లు ఇలాంటి దాన్ని వదులుకుంటారా? అయినా కూడా వారు సేవలను పునరుద్దరించలేకపోవడం అంటే అది నిర్లక్ష్యమా? కుదరలేక అనుకోవాలా? వివిధ రాష్ట్రాలను సంప్రదించి, జనాలను రప్పించి, సమస్త శక్తులు కేటాయించితేనే ఇంత వరకు కబుర్లే తప్ప విద్యుత్ రాలేదు. ఇది తప్పిదం కాదు. కుదరని వ్యవహారం. ఏళ్ల తరబడి పట్టిన నిర్మాణాలను రోజుల్లో పునరుద్దరించడం సాధ్యం కాని పని. 

మరి అలాంటిది ప్రయివేటు సంస్థలు మాత్రం తమ తమ నెట్ వర్క్న ను ఒకటి రెండు రోజుల్లో ఎలా పునరుద్దరించుకో గలుగుతాయి? ఒక సెల్ ఫోన్ టవర్ ఇన్ స్టాల్ చేయాలంటే, ఎంత సామగ్రి, మాన్ పవర్ అందుబాటులో వున్నా కూడా కనీసం వారం నుంచి మూడు వారాలు పడుతుంది. అలాంటిది ఇన్ని టవర్లు పడిపోయాయి. వాటికి కావాల్సిన మెటీరియల్ రప్పించాలి. రవాణా సదుపాయాలు లేవు. ఫోన్లు లేవు. సమచారం అందాలి. రావాలి. ఈ విషయం తెలిసా? లేక తెలియకా? బాబు టెలికాం ఆపరేటర్లపై చిందులు తొక్కడం?ప్రభుత్వంతో అవసరాలు వుంటాయి కాబట్టి ఆపరేటర్లు ఏమీ మాట్లాడలేకపోవచ్చు. అంతమాత్రం చేత బాబు గొప్పోడు అయిపోరు.

పోలీసులను పంపిస్తా..అంటే ఏమనుకోవాలి? బాబు పోలీసులను పంపిస్తామంటున్నారు దొంగలా? ఖూనీ కోరులా? ప్రజల కోసం, ప్రజలకు సదుపాయాలు పునరుద్దరణ కోసం బాబు ఇలా మాట్లాడి వుంటారని ఆయన అభిమానులు వాదించవచ్చు. అది నిజమే కావచ్చు. కానీ ఆగ్రహం వ్యక్తం చేసే విధానాలు అంటూ కొన్ని వుంటాయి. వాటి పరిథిని దాటితే అది అతి అవుతుంది. ఇక్కడ బాబు ఓ సంగతి మరిచిపోతున్నారు. పని చేయాల్సిన వాళ్లు కూడా మనుషులే. వాళ్లు కూడా సదుపాయాల లేమిలోనే పని చేయాలన్న సంగతి మరిచిపోతున్నారు. వాళ్లకూ ఇంటికి వెళ్తే కరెంటు వుండదు. పాలు నీళ్లు లేవు,.తిరగడానికి పెట్రొలు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నార్మల్ జనాలకు ఎన్ని ఇంటి సమస్యలు వుంటాయి. వాటిని తట్టుకుంటూ సిన్సియర్ గా పనిచేయడానికే మెచ్చుకొవాలి. కానీ అలాంటి వాళ్లని,. ఇలా చేస్తా,,.అలా చేస్తా..అనడం ఎంత వరకు సబబు?

కెమేరాలు తిప్పండి

కర్రపెత్తనం చేసేవాడినే కెమేరాలు చూపించి, సూపర్..అంటే మరి ఇంకే మనుకోవాలి? బాబు చేస్తున్నది..దానికి మీడియా సంబర పడి భుజాన ఎక్కించుకుంటున్నది ఇదే. బాబు చెబుతున్నదానికి, విశాలో పరిస్థితికి అస్సలు పొంతన లేదు. రుణమాఫీ వ్యవహారం లాగే మాట్లాడుతున్నారు బాబు ఇఫ్పుడు. రుణమాఫీ చేసాం చేసాం అన్నట్లుగానే, కరెంటు ఇచ్చేసాం..పాలు ఇచ్చేసాం..నీళ్లు ఇచ్చేసాం అని ఛెబుతున్నారు. నిజానికి మీడియా తమ కెమేరాలను బాబు మీద నుంచి కాలనీల్లోకి వీధుల్లోకి తిప్పండి. శివాజీపాలెం, మద్దిలపాలెం, పెదవాల్తేరు, చినవాల్తేరు, మహరాణిపేట, ఇలా ఏ ప్రాంతంలోని వీధుల్లోకైనా కెమేరాలు తిప్పి, అక్కడ జనాల అభిప్రాయాలు, బాబు చెబుతున్న మాటలు పక్క పక్కన విజువల్ చేస్తే అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి. 

పెద్ద పేపర్-చిన్న పేపర్

పత్రికలు మరో మాయాజాలం చేస్తున్నాయి. మెయిన్ పేజీలు ఇతరప్రాంతాలకు కూడా వెళ్తాయి. అందులో బాబు చేస్తున్న హడావుడి అంతా వుంటుంది. చిన్న ఎడిషన్ స్థానికంగా వుంటుంది. అందులో కడగంట్లు, కష్టాలు వుంటాయి. ఈ వార్తలు మాత్రం మిగిలిన జిల్లాల వారికి, ప్రాంతాల వారికి తెలియవు. బాబు విశాఖలో అద్భుతాలు సృష్టిస్తున్నారనే అనుకుంటారు.

మిగిలిన ప్రాంతాల సంగతేంటి?

ముఖ్యమంత్రి విశాఖపై దృష్టి పెట్టారు. మీడియా కూడా విశాఖ వైపు చూస్తోంది. దాంతో యావత్తు బలగాలను విశాఖపై మోహరించారు. ఎక్కడెక్కడి జనాలను విశాఖ తరలించారు. దీంతో మిగిలిన ప్రాంతాలు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాయి. విద్యుత్ సంబంధించినంత వరకు పల్లెప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా వుంది. దాదాపు అన్ని పల్లెల్లకు మళ్లీ కొత్తగా లైన్లు ఎత్తాల్సిన పరిస్థితి. విశాఖ పనులు పూర్తి చేసే సరికే ఎక్కడలేని సామగ్రి అయిపోతుంది. మళ్లీ సామగ్రి రావాలి. వైర్లు, స్తంభాలు, ట్రాన్స్ ఫారమ్ లు సమకూరాలి..అప్పుడు పల్లెలకు వెలుగు వస్తుంది. 

ఇంత పని పెట్టుకుని, ఎందుకీ ఊదరగొట్టుడు? ఎవరు అడిగారు గంటగంటకూ అప్ డేట్ లు..ఇంత చేసాం..అంత చేసాం..అని ? మీరు చేస్తే చాలు ప్రజలే చెప్పుకుంటారు. చాలా చకచకా చేసారు అని. లేదూ మీరు చెప్పుకున్నా, ఆ రేంజ్ లో పనులు జరగకుంటే మిగిలిన ప్రాంతాల వారిని భ్రమలో వుంచగలరు కానీ, స్థానికులను కాదు. అందువల్ల ఇంత హడావుడి అవసరమా? ఆలోచించండి బాబూ?

చాణక్య

[email protected]