బాబూ..ఈ ప్రశ్నలకు బదులేది?

గజపతి నగరంలో బాబు భాజపా పై సంచలన వ్యాఖ్యలు చేసారు. గజపతినగరం పోరాడి లాక్కున్నామన్నారు. భలే చిత్రంగా వుందీ మాట. Advertisement అసలు ఎవరు భాజపాతో పొత్తు కోసం వెంపర్లాడింది.? రాజ్ నాధ్ సింగ్…

గజపతి నగరంలో బాబు భాజపా పై సంచలన వ్యాఖ్యలు చేసారు. గజపతినగరం పోరాడి లాక్కున్నామన్నారు. భలే చిత్రంగా వుందీ మాట.

అసలు ఎవరు భాజపాతో పొత్తు కోసం వెంపర్లాడింది.?

రాజ్ నాధ్ సింగ్ హైదరాబాద్ వచ్చి, బాబును ప్రాధేయపడ్డాడా? లేక బాబు అక్కడికి పదే పదే వెళ్లి పొత్తును సాకారం చేసుకున్నాడా?

కిషన్ రెడ్డి వైకాపా కోసం పొత్తును పొసగనివ్వడం లేదని ఫిర్యాదు చేసే స్థాయికి ఎవరు ధిగజారారు? 

అటు భాజపా శ్రేణులు, ఇటు తేదేపా నాయకులు వద్దన్నా 'దేశం' కోసం పొత్తు అంటూ నచ్చ చెప్పింది ఎవరు? 

పంచపాండవుల సామెతలా, భాజపా సీట్లను అలా అలా తగ్గించుకుంటూ వచ్చింది ఎవరు?

పొత్తు అన్నాక, ఎవరి సీట్లు వారికి వుంటాయి. వారికి నచ్చినట్లు చేసుకుంటారు. అసలు ఓడిపోతారు అని బాబు బాధ పడడానికి భాజపాకు సీమాంధ్ర ఇచ్చిన సీట్లు ఎన్ని? 

బాబు అభ్యర్థులు బలహీనులు అని భాజపా అంటే మార్చేందుకు ఆయన సిద్ధమా? 

పురంధ్రీశ్వరికి ఇక్కడెక్కడా సీటు ఖాళీ లేకుండా చేసినా, రాజంపేటకు తీసుకెళ్లినందుకే బాబుకు ఆగ్రహమా?

భాజపాలో చేరిన కెవిపి వియ్యంకుడికి ఆ పార్టీ టికెట్ ఇవ్వకుంటే బాబుకు ఎందుకు బాధ? అక్కడ గంగరాజు ఏమన్నా చిన్న కాండిడేటా?

ఎప్పుడో వచ్చే ఎమ్ ఎల్ సి సీట్లను ఎర చూపి, ఇచ్చిన స్థానాల్లో రెండు వెనక్కు తీసుకున్నది ఎవరు?

పొత్తు ధర్మం అన్నపుడు, కష్టమైనా నష్టమైనా భరించాలి కానీ, ఇలా ఒక్క రోజు మాత్రం నామినేషన్ కు సమయం వుండగా మాట మార్చడం అంటే ఏమని పేరు పెట్టాలి? 

తెలంగాణలో ఇదే పని భాజపా చేస్తే, తేదేపాకు ఇప్పటికిప్పుడు అభ్యర్థులను నిలబెట్టగలదా?

బలమైన అభ్యర్థులు లేరు అని రంకెలు వేస్తున్న బాబు కృష్ణ, గుంటూరు, ప్రకాశంలో టికెట్లు ఇచ్చిన వారిలో తొంభై శాతం మంది కాంగ్రెస్ నుంచి వచ్చినవారే కదా? 

వారే రాకుంటే, మరి మీకు కూడా బలమైన అభ్యర్థులు లేనట్లేనా? మాగుంట వచ్చేవరకు అక్కడ కేండిడేట్ లేరు. రాయపాటి సంగతి ఏమిటి? 

మీ పరిస్థితి ఇలా వుంటే, మీరు భాజపాను ఎత్తి చూపడం ఏమిటి? 

అన్నింటికన్నా పెద్ద జోక్..

మోడీని ప్రధాని చేయడానికే పొత్తు అనడం. చంద్రబాబు పొత్తు పెట్టుకోకుంటే మోడీ ప్రధాని కాలేరా? పోత్తు లేకుండా మోడీకి మద్దతు ఇవ్వలేరా? మీరు ఇవ్వకుంటే ఇవ్వడానికి టీఆర్ఎస్, వైకాపా సిద్ధంగా వున్న సంగతి అందరికీ తెలిసిందే కదా?

బిజెపి తో పొత్తు తరువాత మైనారిటీ ఓట్లు తెదేపా నుంచి మళ్లిపోయే ప్రమాదం వుందని, బాబు స్వంత సర్వేలు తేల్చడంతోనే ఈ విధంగా మాట మారుస్తున్నారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అదెంతవరకు నిజం?

సీమాంధ్రలో పోత్తు వదిలేసుకుంటే తెలంగాణ మాటేమిటి? అక్కడ పనికి వచ్చింది? ఇక్కడెందుకు పనికిరాదు?

వీక్ కేండిడేట్ లను ఏదో వత్తిడితో నిలిపారని అంటున్న బాబు, ఆ వత్తిడి వెంకయ్యపైనా, హరిబాబు పైనా అన్నది చెప్పాలి కదా?

అన్నింటికి మించి, మోడీ సన్నిహితులైన ఆదానీ సంస్థ ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం జగన్ ను కలిసారని తెలిసాకే ఈ విధమైన పొత్తు వైఫల్యపు ఆలోచన చేస్తున్నారన్నది వాస్తవమా ? కాదా? 

బదులు చెప్పేదెవరు?

చాణక్య

[email protected]