మోహన : మోహన్‌ కందా డౌన్‌డౌన్‌ – ఇంటా, బయటా…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా  Advertisement మోహన్‌ కందా డౌన్‌డౌన్‌ – ఇంటా, బయటా… అప్పట్లో నేను రాష్ట్ర కోఆపరేషన్‌ రిజిస్ట్రార్‌గా, కోఆపరేటివ్‌ సొసయిటీస్‌కి రిజిస్ట్రార్‌గా చేస్తున్నాను. పని ఒత్తిళ్లు ఎంత…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా 

మోహన్‌ కందా డౌన్‌డౌన్‌ – ఇంటా, బయటా…

అప్పట్లో నేను రాష్ట్ర కోఆపరేషన్‌ రిజిస్ట్రార్‌గా, కోఆపరేటివ్‌ సొసయిటీస్‌కి రిజిస్ట్రార్‌గా చేస్తున్నాను. పని ఒత్తిళ్లు ఎంత వున్నా కుటుంబాన్ని తీసుకుని టూర్లు వెళ్లడం అలవాటు. నేనూ, మా ఆవిడ, నలుగురు పిల్లలు (ఇద్దరు మా వాళ్లు, యింకో యిద్దరు మా మరదలు (తనూ మా మేనమామ కూతురే) పిల్లలు – వెళ్లాం. పశ్చిమగోదావరికి వెళ్లి అక్కణ్నుంచి గోదావరి మీదుగా తూర్పుగోదావరికి వెళ్లాలని ప్లాను. హుషారుగానే బయలుదేరాం.

వెళ్లిన చోటల్లా జండాలు, బ్యానర్లూ, నినాదాలూ..! సెలవుల్లో కూడా యింతటి ఘనస్వాగతం ఏమిటని తెల్లబోవద్దు. అవి 'డౌన్‌ డౌన్‌' నినాదాలు. కోఆపరేటివ్‌ స్టాఫ్‌ యూనియన్స్‌ వారు సమ్మె చేస్తున్నారు. సొసైయిటీల రీఆర్గనైజేషన్‌ (పునర్వ్యవస్థీకరణ) అప్పుడే జరిగింది. వాళ్లందరూ కడుపు మండి వున్నారు. నేను కుటుంబంతో ఎక్కడికి వెళితే అక్కడకు వచ్చి కారు ఆపేసి, 'మోహన్‌ కందా డౌన్‌డౌన్‌' నినాదాలు దట్టించారు.

ఇలాటి విషయాల్లో మా ఆవిడ నిర్లిప్తంగా వుంటుంది. జై ఆంధ్రా ఉద్యమంలో వూరంతా అల్లకల్లోలమై పోయి, కొంపలంటుకుపోతున్నపుడు కూడా 'నేను యింటికి ఎలాగోలాగ వస్తానులే' అని నిబ్బరంగా వుండేది. పోనుపోను ధైర్యం యింకా ముదిరింది. కానీ పిల్లలకు యిదంతా కొత్తగా వుంది. నేను చిన్నప్పుడు సినిమాల్లో వేషాలు వేసి 'స్టార్‌డమ్‌' తెచ్చుకున్నానని అంత స్పష్టంగా తెలియకపోయినా 'నాన్న అంటే ఏదో ఏదో హీరో లాటి వాడు. ఎక్కడికి వెళ్లినా అందరూ దణ్ణాలు పెడతారు' అని పిల్లలకు ఒక ఫీలింగ్‌. మా మరదలు పిల్లలకు కూడా డిటోడిటో. అలాటిది కారు ఆపేయడాలు, 'డౌన్‌డౌన్‌' అనడాలతో మొదట్లో కంగారుపడ్డారు, భయపడ్డారు. ఆ భయంలోంచి సరదా పుట్టింది. ఎవరైనా జండాలతో దగ్గరకు వస్తూండగా వీళ్లే మొదలుపెట్టేవారు 'మోహన్‌ కందా డౌన్‌డౌన్‌' అని. 

టూరు అయిపోయి యింటికి తిరిగివచ్చినా వాళ్లకు అదొక ఆట అయిపోయింది. ఇంట్లో వాళ్లలో వాళ్లు ఆడుకునేటప్పుడు కూడా 'మోహన్‌ కందా డౌన్‌డౌన్‌' అని అరుచుకుంటూ ఆడుకునేవారు. 

xxxxxx

పిల్లల ఆట సంగతి ఎలా వున్నా వాళ్లకు కడుపుమంట ఎందుకు కలిగిందో చెప్పాలంటే సహకార వ్యవస్థ గురించి, దానిలో మేం చేసిన మార్పుల గురించి వివరంగా చెప్పాలి. 

ఎన్‌.టి.రామారావుగారు ముఖ్యమంత్రి కాగానే నన్ను ఆయన ఆఫీసులో జాయింటు సెక్రటరీగా వేసుకున్నారు. అక్కడ ఏడాదిన్నర పనిచేశాక ప్రమోషన్‌ మీద 1984 జులైలో నన్ను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో-ఆపరేటివ్‌ సోసైటీస్‌గా వేశారు. నిజం చెప్పాలంటే నాకు మొదటినుంచి కో-అపరేటివ్స్‌ అంటే ఒక విధమైన చిన్నచూపు. ఒకప్పుడు ఉన్నతలక్ష్యంతో పెట్టిన ఆ సంస్థలు క్రమేపీ అవినీతికి, అసమర్థతకు, పెత్తందారీ పోకడలకు ఆలవాలమై పోయాయి అని. ఆ సొసైటీల వలన ఖర్చులు పెరుగుతాయి తప్ప తగ్గవు అని, వాటిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలూ అవీ జరగవు, స్థానిక రాజకీయాలకు లొంగిపోతాయి అని.. యిలా కొన్ని అపోహలు. అపోహలనే అనాలి. తొలినాటి ఊహలు అపోహలని గ్రహించడానికి కొన్ని ఏళ్లు పట్టింది. దానికి విధి నాకు పూర్తి అవకాశం కల్పించింది. ఆ ఉద్యోగంలో నన్ను వేస్తారని ఎప్పుడూ అనుకోకపోయినా – నా పూర్తి కెరియర్‌లో ఎప్పుడూ లేనట్టుగా సుమారు నాలుగు సంవత్సరాలు అదే ఉద్యోగంలో ఉండిపోయాను. ఇంత దీర్ఘకాలపు పోస్టింగు దాని తర్వాతా లేదు. దాని ముందరా లేదు. 

దాని కారణంగా కోఆపరేషన్‌ అనేది నా కెరియర్‌కు ఒక పునాదిలా అయిపోయింది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా సహకార సంస్థల గురించి చాలా తెలిసినవాళ్లలో ఒకడినని నా గురించి అనుకుంటూ వుంటారు. తెలియక ఛస్తుందా? అక్కడ నాలుగు సంవత్సరాలు చేశానా, తర్వాత అదే విభాగాన్ని పర్యవేక్షించే సెక్రటేరియట్‌లో అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌లో రెండు వేర్వేరు విడతలుగా రెండు సంవత్సరాలు.. ఢిల్లీలో మళ్లీ అదే అగ్రికల్చర్‌ మినిస్ట్రీలో మళ్ళీ కో-అపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఉద్యోగం.. దానితో కూడా కలిపి సుమారు ఐదుసంవత్సరాలు! చివరకు నాకు 55 వ ఏట పి.హెచ్‌డి. రావటం కూడా – దానికి సంబంధించిన సబ్జెక్ట్‌ – అగ్రికల్చర్‌ క్రెడిట్‌ మీదే!  

కోఆపరేషన్‌ వ్యవస్థ ఎన్నో నదులు కలుపుకునే పెద్ద సముద్రం లాటిది. రైతులకు ఋణాలు, మార్కెటింగ్‌, హౌసింగ్‌, పాలు, నూలు, చక్కెర, గ్రామవిద్యుదీకరణ, బలహీనవర్గాలు – యిలా అనేక రకాల అంశాలతో వ్యవహరించే సహకారసంస్థలు మన రాష్ట్రంలో వున్నాయి. గ్రామ స్థాయిలో స్వల్పకాలిక ఋణాలు యిచ్చే ప్రైమరీ అగ్రికల్చరల్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ అనే సహకారసంస్థ వుంటుంది. అది రైతుకు ప్రతీ సీజన్‌లో పంట పండించడంకోసం – విత్తనాలు, ఎరువులు, మందులు – కొనుక్కోవడం కోసం అప్పు యిస్తుంది. పంట రాగానే వచ్చిన ఆదాయంనుంచి ఆ అప్పు తిరిగి కట్టేయాలి. రైతు ఒక అయిల్‌ ఇంజన్‌ లేదా ట్రాక్టర్‌ లేకపోతే వేరే పనిముట్లు కొనుక్కోవడం కోసం తీసుకునే ఋణాన్ని మధ్యకాలిక ఋణం అంటారు. దీర్ఘకాలిక ఋణాలంటే  భూమికి మనం చేసే శాశ్వతమైన మార్పులు – అంటే జలవనరులు సమకూర్చుకోవడం, ఉప్పగా అయిపోయిన భూమిని మంచిగా మార్చుకోవడం (లాండ్‌ రిక్లమేషన్‌) కోసం యిచ్చేవి. ఇవి తాలూకా, జిల్లా స్థాయిలో వుంటాయి. బ్యాంక్‌ అంటారు. ఈ ప్రైమరీ సొసైటీస్‌ అన్నీ కలిస్తే తయారయ్యేది – డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌. ఈ జిల్లా బ్యాంక్స్‌ అన్నీ కలిస్తే తయారయ్యేది రాష్ట్రస్థాయిలో వుండే – స్టేట్‌ కో-అపరేటివ్‌ బ్యాంక్‌ ! 

అదే విధంగా మార్కెటింగ్‌. తన ఉత్పాదనను సరైన ధరకు అమ్ముకుంటేనే రైతు మనుగడ సాగించగలడు. ధర వచ్చేవరకు సరుకును దాచి వుంచుకునే స్టోరేజి సౌకర్యం కలిగిన మార్కెట్‌ యార్డులు వుండాలి. ధాన్యాన్ని బియ్యంగా మార్చుకుని స్టోరు చేసుకోవడంతో బాటు వేలం పాడుకుని మంచి ధర దక్కించుకునే విధంగా మార్కెట్‌ యార్డ్‌లు రూపొందించారు. తాలూకా స్థాయి సొసైటీలు మార్కెట్‌ యార్డులలో రైతు మార్కెట్‌ చేసుకోవడానికి సహాయపడతాయి. అవన్నీ కలిపి తయారైన రాష్ట్రస్థాయి ఫెడరేషన్‌ – మార్క్‌ఫెడ్‌. 

రైతుకి దీర్ఘకాలిక ఋణం కావలసి వచ్చినా, మార్కెటింగ్‌ కావలసి వచ్చినా తాలూకా కేంద్రానికి, జిల్లా కేంద్రానికి తిరగవలసి వస్తూ వుండేది. అలా కాకుండా ప్రైమరీ సొసైటీలోనే స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ఋణాలు, మార్కెటింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి సింగిల్‌ విండో (ఏకగవాక్ష అన్నారు తెలుగులో) ఏర్పాటు చేయాలని ఎన్‌టి రామారావుగారి ఆశయం. అంటే రైతు యింటి గుమ్మం దగ్గరే అతనికి కావలసినవన్నీ లభించాలన్నమాట. దానికోసం బృహత్పథకం రూపొందించమని మమ్మల్ని అడిగారు. నేను అప్పుడు ఆయన ఆఫీసులోనే స్పెషల్‌ సెక్రటరీగా వుండేవాణ్ని.  స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరక్టరుగా వున్న రాఘవేంద్రరావుగారు, రిజిస్ట్రార్‌గా వున్న ఎస్‌.కె.అరోడాగారు, మార్కెఫెడ్‌ చైర్మన్‌గా వున్న కమలనాథన్‌గారు మేం నలుగురం కలిసి ఒక ప్రణాళిక తయారుచేశాం. దాన్ని సవ్యంగా అమలు చేయడానికే రామారావుగారు నన్ను అక్కడకి పోస్టింగ్‌ వేశారని నాకు తర్వాత అర్థమైంది. 

xxxxxx

రాష్ట్రంలో ఆ రోజుల్లో 13,700 ప్రాథమిక సంస్థలువుండేవి. వాటిని కుదించే పని పెట్టుకున్నాం. కొన్ని మరీ పెద్దవై పోయి పని చేసేవి కావు, కొన్ని మరీ చిన్నవై పోయి పని చేసేవి కావు. పెద్దవాటిల్లో పని ఎక్కువై పోయి అసమర్థత, చిన్నవాటికి తమ కాళ్లమీద తాము నిలబడలేని అసమర్థత. ఒక్కొక్క సొసైటీ ఆర్థికపరంగా నిలబడాలంటే యిచ్చిన అప్పులు, వాటి మీద వచ్చే వడ్డీ, యిచ్చినవాటిల్లో బకాయిలు, యివన్నీ చూసుకోవడానికి వాళ్లు నియమించుకున్న పెయిడ్‌ సెక్రటరీ జీతభత్యాలు యివన్నీ పోను కాస్త ఆదాయం మిగిలేట్టు తూకంగా వుండాలి. ఆ విధమైన ఆర్థికపరిపుష్టి వుండాలంటే కొన్నిటిని కలపాలి, కొన్నిటిని విడగొట్టాలి.  ఈ పనిలో నాకు బాగా సహకరించినది ఎస్‌.వి.ప్రసాద్‌. ఆంధ్ర క్యాడర్లో ఔట్‌స్టాండింగ్‌ ఆఫీసర్‌ అని పేరు. ముఖ్యమంత్రుల వద్ద పని చేశారు. పది, పదకొండేళ్లు ముఖ్యమంత్రి ఆఫీసులో పనిచేశారు. చీఫ్‌ సెక్రటరీగా చేసి రిటైరయ్యారు. ఆ కసరత్తు చేసి 13700 సంస్థలను 6700 స్వయంసమృద్ధి గల సొసైటీలుగా పునర్వ్యవస్థీకరించాం. ఇలా ఆర్థికపరంగా విశ్లేషించి రీ ఆర్గనైజ్‌ చేసే పని దేశంలో యితర రాష్ట్రాలలో కూడా చేశారు. అయితే మన రాష్ట్రంలో మేము కొత్త కోణంలో యీ సొసైటీల సామర్థ్యాన్ని నిర్వచించాం.

సొసైటీ యిచ్చిన అప్పులమీద ఆధారపడే దానిని అంచనా కట్టలేం. అసలు ఎదగడానికి దానికున్న అవకాశాలు ఏమిటి? అది ఆపరేట్‌ చేసే ప్రాంతంలో జలవనరులు వున్నాయా, వుంటే వాటి సైజు ఎంత, ఏదైనా రైసు మిల్లుకానీ, దాల్‌ మిల్లు కానీ వుందా, మార్కెట్‌ యార్డు వుందా, దానికి రోడ్డు వుందా, వుంటే ఎటువంటి స్థితిలో వుంది.. యివన్నీ వివరాలు సేకరించి వాటిని బట్టి వెయిటేజి యిచ్చుకుంటూ మార్కులు వేశాం. నూటికి యిన్ని మార్కులు అని తేల్చాం. తర్వాత  ఆపరేట్‌ చేసే ప్రాంత విస్తీర్ణం అనే మరో పారామీటర్‌ చేర్చాం. మెహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, శ్రీకాకుళం వంటి జిల్లాలలో ఎంతో ఏరియా ఆఫ్‌ ఆపరేషన్‌ వుంటే తప్ప అది నిలదొక్కుకోగల ఆదాయం రాదు. పశ్చిమగోదావరో, నిజామాబాదో అయితే చిన్న ఊళ్లో వున్న సోసైటికైనా అదాయం బాగా వచ్చే అవకాశం వుంటుంది.  నూటికి ఈ ప్రాంతంలో అయితే పాస్‌ మార్కులు నలభై, అక్కడైతే యాభై, మరో చోటయితే డెబ్భయ్‌. ఇలాటివన్నీ కంప్యూటరైజ్‌ చేసి అప్పుడు రీ ఆర్గనైజ్‌ చేశాం. ఇది చాలా పెద్ద పని. ఈ పని యిలా చేయాలనుకోవడానికి నలుగురితో ఓ కమిటీ వేశారు. దానిలో నాబార్డ్‌ (నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రూరల్‌ డెవలఫ్‌మెంట్‌), రిజర్వుబాంక్‌ అఫ్‌‌ ఇండియా, కేంద్రప్రభుత్వం ప్రతినిథులతో బాటు నేను కూడా వున్నాను. మేము పైలట్‌ స్టడీగా మూడు జిల్లాలలో ఒక్కొక్క సొసయిటీని తీసుకుని, ఎలా రీ ఆర్గనైజ్‌ చేస్తే బాగుంటుంది అన్నది స్టడీ చేసి అప్పుడు దాన్ని విస్తరించుకుంటూ పోయాం.

జిల్లా సహకార బ్యాంకులను కూడా పునర్వ్యవస్థీకరించవలసి వచ్చింది. జిల్లా అని పేరే కానీ కొన్ని జిల్లాలలో ఒకటి కంటె ఎక్కువ వుండేవి. కొన్ని జిల్లాలలో ఒకటి కూడా వుండేది కాదు. ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రామచంద్రపురంలలో నాలుగు వుండేవి. నల్గొండ, కృష్ణాలో రెండేసి వుండేవి. ఇలా కాకుండా జిల్లాకి ఒకటి ఖచ్చితంగా వుండేట్లా చేశాం. ఉన్న బ్యాంకులను బాగు చేయాలంటే మనం ప్రభుత్వం తరఫున వాటికి ఎలాటి సహాయం చేయాలి అన్నది కూడా స్టడీ చేశాం. సహాయం అంటే ధనసహాయం ఒక్కటీ కాదు. అసలు వాళ్ల చేత ఏ పనులు చేయించాలి, ఏవి చేయించకూడదు అని కూడా చూశాం. ఎందుకంటే పాలకుల చేతిలో సహకారసంస్థలు కీలుబొమ్మలై పోయాయి. ఎవరూ చేయని పనిని వాటికి అప్పగించడం, ఆ పనికి యివ్వాల్సిన డబ్బు యివ్వకపోవడం, ఆ పని చేసినందుకు ఎంత యివ్వాలో, ఆ మార్జిన్‌ ఎంతో కరక్టుగా ఫిక్స్‌ చేయకపోవడం.. వీటివలన బ్యాంకుల ఆర్థికపుష్టిని దెబ్బ తీశారు. ఇదేమిటని సహకార సంస్థలు ప్రతిఘటించేవి కావు. ఎందుకంటే పాలకుల మనుష్యులే అక్కడ వుండి అన్నిటికీ తలాడించేవారు. 

వీటన్నిటిని సమన్వయం చేసుకుంటూ మాస్టర్‌ ప్లాన్‌ అని తయారుచేసి వాటికి సింగిల్‌ విండో అని పేరు పెట్టి అమలు చేశాం. అది చివరకు అనుకున్నంత, ఆశించినంత బాగా పని చేసి వుండకపోవచ్చు. దానికి ఏవేవో కారణాలు వుండవచ్చు. కానీ యిలా చేసి చూపించడం దేశంలోనే ప్రప్రథమం. దానికి అందరూ హర్షం ప్రకటించారు. కేంద్రం నుండి కూడా మన్ననలు పొందాం. అయితే కోఆపరేటివ్‌ సిబ్బంది మాత్రం హర్షించలేదు. ఎందువలన?

xxxxxx

అప్పట్లో దేశంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే 'హాఫ్‌ ఎ మిలియన్‌ జాబ్స్‌' (5 లక్షల ఉద్యోగాలు) అనే పథకం వుండేది. ఈ సహకారసంఘాలను వ్యవస్థీకరించేటప్పుడు కొన్నిటికి పెయిడ్‌ సెక్రటరీలను పోషించగల స్థోమత వుంది కదా, నిరుద్యోగులకు ఆ ఉద్యోగం యిస్తే మంచిదికదా అనుకుని సుమారు ఏడు వేల మందికి ఆ ఉద్యోగాలు యిప్పించాను. ఆ ఉద్యోగాలలో ఎదుగు, బొదుగూ వుండదు కాబట్టి ఆ ఉద్యోగికి తృప్తి వుండదని అప్పుడే వూహించి వుండాల్సింది. కొన్నాళ్లకు వాళ్లు యూనియన్‌లుగా ఏర్పడి మాకు క్యాడర్‌ ఏర్పాటు చేయలాని, ప్రమోషన్లు కావాలని ఆందోళన చేశారు. సహకార సంస్థల్లో ఒక్కొక్కదాని స్థాయి ఒక్కోలా వుంటుంది. వేటికవే. ఒకదాని పెయిడ్‌ సెక్రటరీకి, మరోదాని పెయిడ్‌ సెక్రటరీకి సంబంధమే లేదు. కానీ వారి డిమాండ్‌ మన్నించి వారికై కేడర్లు తయారుచేశారు. ప్రభుత్వోద్యోగుల్లా పోస్టింగులు, ప్రమోషన్లు, బదిలీలు అంటూ జిల్లావారీగా క్యాడర్‌ తయారుచేశారు. క్యాడర్‌ తయారుచేయగానే సరిపోయిందా, వాళ్లందరికీ సమానంగా జీతాలు యివ్వడం ఎలా? ఒక సొసైటీ సరిగ్గా పని చేసి జీతాలు యివ్వగలదు, మరొకటి సరిగ్గా పనిచేయక జీతాలు యివ్వలేదు. అందుకని  జిల్లా స్థాయిలో అన్ని సొసైటీలనుండి డబ్బులు వసూలు చేసి కేడర్‌ ఫండ్‌ అని ఏర్పాటు చేసి దానిలోంచి జీతాలు యిచ్చారు. ఒక్కో జిల్లాలో క్యాడర్‌ ఫండ్‌కు డబ్బులు చాలకపోతే ప్రభుత్వం నుండి డబ్బులు యివ్వవలసి వచ్చింది. దాంతో రామారావుగారికి చిర్రెత్తుకొచ్చి 'డీక్యాడరైజేషన్‌' అని పెట్టి మొత్తం క్యాడర్‌ పద్ధతే ఎత్తి పారేశారు. క్యాడర్‌ ఫండ్స్‌ తీసేశారు. 

ఏ ముఖ్యమంత్రీ యింత ధైర్యంగా పనులు చేయరు. ఇలాటి పనులు చేస్తే ఎమ్మెల్యేలు నాకు సపోర్టు చేయడం మానేస్తారేమోనన్న భయం వాళ్లకు. రామారావుగారి విషయంలో ఆయన కారణంగానే అందరూ గెలిచారు కాబట్టి ఎమ్మెల్యేల చింత లేదాయనకు. ప్రజల గురించే ఆయన తపన! మునసబు కరణాల వలన ప్రజలకు హాని కలుగుతోందనుకున్నారు. తీసివేశారు. ఎవరేమన్నా చలించలేదు. ఇప్పుడు యీ డీక్యాడరైజేషనూ అంతే. దీని తర్వాత ఏ సొసైటీకి ఆ పెయిడ్‌ సెక్రటరీయే వుంటాడు. అతను బాగా పనిచేసి సొసైటీ ఆదాయం పెంచితేనే జీతం వస్తుంది. నీ సొసైటీ బాగుపడితే నువ్వు బాగుపడతావు. దాని ఆదాయం ఒక స్థాయికి మించి పెరిగితే నీకు ప్రోత్సాహకం (యిన్సెన్టివ్‌) యిస్తాం అని చెప్పారు. సొసైటీలు తమకు చిత్తం వచ్చినట్టు జీతాలు యిచ్చేయకుండా దాని ఆదాయం బట్టి సెక్రటరీకి ఇంత యివ్వవచ్చు అని పరిమితి పెట్టాం. ఈ డీక్యాడరైజ్‌ చేసేముందు యీ ఉద్యోగులను అడిగాం – 'నువ్వు ఏ సొసైటీకి వెళదామనుకుంటున్నావు? మూడు ఛాయిస్‌లు ఇయ్యి, సాధ్యమైనంతవరకు నువ్వు అడిగినచోట పోస్ట్‌ చేస్తాం' అని.

xxxxxx

నేను కుటుంబంతో టూరుకి వెళ్లినప్పుడే డీ క్యాడరైజేషన్‌ జరిగింది. అప్పుడు యీ పెయిడ్‌ సెక్రటరీలందరూ మంచి కాకమీద వున్నారు. నిక్షేపంలా  వుండే  వాళ్ల వుద్యోగాలకు ముప్పు వచ్చింది కదా. కష్టపడితేనే జీతం, లేకపోతే లేదు అంటే ఏ ఉద్యోగికి మాత్రం కోపం రాదు?

అందుకే నాకు వ్యతిరేకంగా నినాదాలు. నా అభిప్రాయాలు వాళ్లకు తెలుసు. డీ క్యాడరైజేషన్‌లో నా ప్రమేయం లేదని తెలుసు.

అయినా నేను కమిషనర్‌ను కాబట్టి నాకు వ్యతిరేకంగా నినాదాలు యిచ్చి తీరాల్సిందే. అందుకే యిచ్చారు.

దీన్నే 'ఆక్యుపేషనల్‌ హజార్డ్‌' – వృత్తిరీత్యా కలిగే ప్రమాదం అంటారు.

మీ సూచనలు [email protected]  కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version