రమ్యకృష్ణ అంటే మంచి ప్రతిభావంతురాలైన నటిగా మనందరికీ తెలుసు. పెర్ఫార్మెన్స్ పరంగా కొన్ని చిత్రాల్లో ప్రత్యేకించి.. ఆమెకు ప్రత్యామ్నాయం లేదనిపించేలా నటన సాగుతుంటుంది. హీరోయిన్ వేషాలు తగ్గిపోయిన తర్వాత.. రమ్యకృష్ణ అత్త పాత్రలతో, ఐటం సాంగులతో టాలీవుడ్ కెరీర్ను స్థిరంగా కొనసాగించే ప్రయత్నం చేసింది. ఆ బేరాలు ఎంతోకాలం రాలేదు. చివరికి తనలో ప్రతిభ ఎంత ఉన్నా.. చిన్న తెర దిక్కయ్యింది. అక్కడ మాత్రం తిరుగులేని నాయికల్లో ఒకరుగా ప్రస్థానం సాగిస్తోంది. తెలుగు- తమిళ సీరియళ్లలో చేసే వెసులుబాటు కూడా ఉన్న నాయికగా అందులో ఆమె ప్రస్థానం దివ్యంగానే ఉన్నట్లు ఆమె అవకాశాలే చెబుతున్నాయి.
అయితే తాజాగా మద్రాసులో టీవీ అవకాశాలు మాత్రమే కాదు.. ఆమె డబ్బు ఖర్చు పెట్టబోయినా సరే లాభాలు ఆమె ఇంటి తలుపు తడుతున్నాయి. ఆరకంగా కూడా ఆమె సంపాదించేస్తోంది.
విషయం ఏంటంటే.. హీరోయిన్ రమ్యకృష్ణ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నది. అక్కడ తన బంగళా కోసం కొన్నేళ్ల కిందట దాదాపు నాలుగున్నర లక్షలకు పైగా వెచ్చించి.. ఓ జెనరేటర్ను కొనుగోలు చేసింది. కొన్నాక కొన్నాళ్ల తర్వాత అది కాస్తా పనిచేయకుండా మొరాయించింది. కంపెనీ వాళ్లకు ఫోనుచేసి ఫిర్యాదుచేస్తే పట్టించుకోలేదు. అయితే రమ్యకృష్ణ ఊరుకోలేదు. మనం చేసేదేముందిలే అనుకుని.. ప్రెవేటుగా దాన్ని బాగు చేయించుకుని సరిపెట్టుకోలేదు. ఆ జెనరేటర్ కంపెనీ వారి మీద వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టింది. వినియోగదారుల కేసుల విషయంలో మాత్రం మన దేశంలో న్యాయస్థానాలు సత్వరం సముచిత తీర్పులు వెలువరించేస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అదే క్రమంలో కోర్టు వారు జెనరేటర్ కంపెనీకి అయిదు లక్షల రూపాయల జరిమానా వడ్డించి.. రమ్యకృష్ణకు అర్జంటుగా చెల్లించాల్సిందిగా ఆదేశించారు. రమ్యకృష్ణకు మోసానికి ప్రతిగా కేసు గెలిచిన ఆనందం మాత్రమే కాదు. డబ్బుకు డబ్బు కూడా లాభమే దక్కిందని అనుకంటున్నారు జనం.