బాబుకు కలిసి వచ్చిన విభజన

కలిసొచ్చేకాలం వస్తే నడిచి వచ్చే బిడ్డ పుడతాడంటే ఏమిటో అనుకున్నాం. విభజన లాంటి విపత్కర పరిస్థితిని సీమాంధ్ర ఎలా తట్టుకుంటుందో, సీమాంధ్ర పార్టీలు ఎలా తట్టుకుంటాయో, జనం ముందుకు ఏ ముఖం పెట్టుకుని రాజకీయ…

కలిసొచ్చేకాలం వస్తే నడిచి వచ్చే బిడ్డ పుడతాడంటే ఏమిటో అనుకున్నాం. విభజన లాంటి విపత్కర పరిస్థితిని సీమాంధ్ర ఎలా తట్టుకుంటుందో, సీమాంధ్ర పార్టీలు ఎలా తట్టుకుంటాయో, జనం ముందుకు ఏ ముఖం పెట్టుకుని రాజకీయ నాయకులు వెళతారో, అందునా రెండు కళ్ల సిద్ధాంతంతో, అసెంబ్లీలో పెదవి విప్పకుండా, ఇరువైపుల వారిని ఉసిగోలిపి, నానా గత్తరా చేయిచిన చంద్రబాబు ఏమైపోతారో అని భయం వేసింది. ఇప్పుడు అనిపిస్తోంది. విభజన లేకపోయి వుంటే, పాపం చంద్రబాబు ఏమైపోయి వుండేవారో, పాపం, ఇన్ని ఖాళీలను ఎలా భర్తీ చేసేవారో, పార్టీలో అసలు ఇన్ని ఖాళీలు వున్నాయని తెలియనే తెలియదు. కర్నూలు లాంటి కీలక జిల్లాలో అస్సలు కెఇ సోదరులు మినహా అందరినీ పక్క పార్టీ నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వుందనే తెలియదు. 

ఈ చంద్రబాబు వున్నారేం….అంటే కోపం వస్తుంది కానీ, చేసే పనులన్నీ ఇలాగే వుంటాయి. పాపం అప్పటికీ సుధీష్ రాంభొట్ల లాంటి వెర్రిబాపనోడు చెప్పనే చెప్పాడు. బాబూ..నీ కోటరీని నమ్ముకుని, పార్టీని మొత్తాన్ని కాంగ్రెస్ జనాలతో నింపేస్తున్నావ్..పదేళ్ల పాటు పార్టీ, ప్రతిపక్షంలో వున్నపుడు ఒక్కండును..నీ మొర ఆలకించలేదు..దగ్గరకు రాలేదు. ఇప్పుడు కాస్త 'పచ్చ'(నోట్ల)ధనం కనిపించేసరికి, లగెత్తుకు వస్తున్నారు. మీరేమో, వచ్చిన వాడిని వచ్చినట్లు లోపలకు లాగేసి, పచ్చకండువా కప్పేసి, పక్కన నిల్చుని ఫోటో దిగిపోతున్నారు. కానీ ఇప్పటికే లోపల వున్నా మాకు ఈ కొత్త జనాల తకిడికి ఊపిరి ఆడడం లేదూ అని. పోనీ ఆయనంటే  వెర్రిబాపనోడు..మరి మన కోడేల చౌదరిగారేం అన్నారు?  తెలుగుదేశాన్ని తెలుగు కాంగ్రెస్ లా చేస్తున్నారు..ఇదేం బాలేదు అనే కదా? పాపం ఆయన బాధ ఆయనది. హాయిగా నందమూరి బసవరామ తారకం ఆసుపత్రి వ్యవహారాలు చూసుకుంటూ కడుపులో చల్ల కదలకుండా వుండేవోరు. అలాంటిది వియ్యంకుడు వచ్చాక, బాబు, ఈయన్ని కాస్తా తప్పించి, బాలయ్యబాబుకు ఆసుపత్రి అప్పగించేసారు. మరోపక్క జిల్లాలో తనకు పడని వారందరినీ లాక్కు వస్తున్నారు. ఇక రాంభూపాల చౌదరి అయితే పాపం కన్నీరే పెట్టుకున్నాడు. పసుపు రంగు పార్టీలో మువ్వన్నెలు ముద్దుగా కలిపోతుంటే, పార్టీ మొత్తం కాంగ్రెస్ వాళ్లతో కిటకిటలాడుతుంటే, ఈ చౌదరిగారికి కన్నీరాగలేదు. కానీ ఏం చేయగలరు. బాబును, బాబు చుట్టూ వుండే కోటరీ 'సృజన'ను కాదను ఆయన చేధించలేరు కదా?

జగన్ ఎప్పుడు పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తాడో తెలియదు కానీ, చంద్రబాబు మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ ను తన పార్టీలో కలిపేసుకుంటున్నాడు. పైగా జగన్ దగ్గర ఖాళీలు లేకపోవడం పనికివచ్చింది. పైగా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం ఇంకా బాగా పనికివచ్చింది. అదే కనుక విభజన చేయకపోతే, కాంగ్రెస్ జనాలంతా, అధికారం ఎక్కడ చేజారిపోతుందో, అయిదేళ్ల పాటు ఎక్కడ ఇంట్లో కూర్చోవాల్సి వస్తుందో అని భయపడి వుండేవారు కాదు. తమ స్వంత పార్టీ టికెట్ పై హాయిగా పోటీ చేసేవారు. కానీ ఎప్పుడైతే పార్టీ విభజనకు సై అంతో, జనం ముందుకు అదే పార్టీ తరపున వెళ్లడానకి ముఖం చెల్లలేదు. పోనీ సమైక్యం అన్న జగన్ దగ్గరకు వెళ్ధామా అంటే అక్కడపుడే హౌస్ ఫుల్ బోర్డు పెట్టేసారు. దాంతో ఇక బాబు రూటు పట్టక తప్పలేదు. ఇదంతా తన బలమే అని సంబరపడిపోతున్నారు చంద్రబాబు. తన పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోందని, అందుకే ఇంతమంది వచ్చి చేరిపోతున్నారని అనుకుంటున్నారు. కానీ ఇక్కడో సమస్య వుందని మర్చిపోతున్నారు. ఇలా చేరుతున్నావారంతా గడచిన అయిదు, పదేళ్లుగా అధికారం అనుభవించినవారే. సహజంగా ఏ పార్టీ అయినా అయదు, పదేళ్లు అధికారంలో వుంటే వచ్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది వుంటే అది వీరందరి మీదా ప్రభావం చూపిస్తుంది. 

ఉదాహరణకు ఏరాసు, లేదా గంటా, లేదా టిజి వెంకటేష్ ఏ టికెట్ పై పోటీ చేసినా మళ్లీ నియోజకవర్గం అయితే అదే కదా?  అప్పుడు ఓటర్లు ఏమిటనుకుంటారు. రెండు సార్లు ఈడిని గెలిపించాం..ఈ సారి మారుద్దాం అనుకోరా? లేదా పార్టీ మారిపోయాడు కదా, మళ్లీ ఫ్రెష్ గా చాన్సిద్దాం అనుకుంటారా? అయితే ఈళ్లూ తెలివి తక్కువ వాళ్లు కాదు. అందుకే గంటా, జెసి, టిజి వగైరా లంతా ఒకటికి రెండు సీట్లు అడుగుతున్నారు. లేదా ఎమ్మెల్యే ఎంపీని, ఎంపీ ఎమ్మెల్యేను అడుగుతున్నారు. అలా జనం ఫ్రెష్ గా ఫీలవుతారని,. రెండో సీటుకు తమ వారసుల్ని రెడీ చేసేస్తున్నారు. అయినా జనం ఊరుకుంటారు..వెర్రోళ్లు అనుకుంటే మన తప్పే. వాళ్ల లెక్కలు వాళ్లకుంటాయి. వాళ్ల తీర్పులు వాళ్లిస్తారు. అదోచ్చేవరకు మన సంబరం మనం పడొచ్చు.తప్పులేదు.

చాణక్య

[email protected]