మోహన మకరందం: ఎన్‌టిఆర్‌- కోడితో పోటీ పడాలి..

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా  Advertisement ఎన్‌టిఆర్‌- కోడితో పోటీ పడాలి.. ఎన్‌.టి. రామారావు గారి దగ్గర పని చేయడం చాలా కష్టం. పాపం ఆయన బ్రహ్మ రాక్షసుడేమీ కాదు…చిక్కల్లా బ్రాహ్మీముహూర్తంలో…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా 

ఎన్‌టిఆర్‌- కోడితో పోటీ పడాలి..

ఎన్‌.టి. రామారావు గారి దగ్గర పని చేయడం చాలా కష్టం. పాపం ఆయన బ్రహ్మ రాక్షసుడేమీ కాదు…చిక్కల్లా బ్రాహ్మీముహూర్తంలో .. అంటే తెల్లవారుఝామున ప్రారంభమయ్యే ఆయన దినచర్యతోనే…

మనం కోడితో పోటీ పడి లేచి రెడీగా వుండాలి.

అప్పటికప్పుడే ఫోను చేసి నిద్ర లేపి మాట్లాడేస్తారు. 'అబ్బే, యిప్పుడు చెప్పినా బుర్ర కెక్కదు. పదిగంటలకు ఆఫీసుకి వచ్చాక చెప్దురుగాని..' అంటే కుదరదు. ఆయన ముఖ్యమంత్రి. నేను ఆయన దగ్గర స్పెషల్‌ సెక్రటరీని.

ఓ రోజు అటువంటి 'అసురవేళ'లో నిద్ర లేపి ''మోహన్‌, ఆ సొసైటీది వాళ్ల కిచ్చేసేయ్‌..'' అని ఒక్క ముక్క చెప్పేసి ఫోను పెట్టేశారు.

నిద్రలో జోగుతూ విన్నాను. నిద్రమత్తు దిగాక ఆలోచిస్తే ఏమీ బోధపడలేదు – 

సవాలక్ష సొసైటీలలో ఏ సొసైటీ గురించి చెప్పారు? ఏది యివ్వాలి? వచ్చిన వాళ్లెవరు? వాళ్లేమడిగారు? ఈయన దేనికి సమ్మతించారు?

ఆయనకే ఫోన్‌ చేసి అడగాలా? అడగగలనా? 

ఏమీ తెలియనట్టు ఊరుకోనా? …గలనా?   

xxxxxxx

ఈనాటి యువతలో – ముఖ్యంగా ఐటీ ఉద్యోగాల్లో వున్న చాలామంది – వేళగాని వేళల్లో పనిచేసే వాళ్లే. మామూలు ప్రజలంతా పగలు పని చేసి రాత్రుళ్లు పడుకుంటే, వీళ్లు రాత్రుళ్లు పనిచేసి పగలు పడుకుంటారు. ఇవి అసురవేళలు అంటారు మన పెద్దలు. ఇంగ్లీషువాడు కూడా వీటిని అన్‌గాడ్లీ అవర్స్‌ అన్నాడు, సైతాను వేళలు అని డైరక్టుగా అనకుండా! అయితే ఉద్యోగం యిచ్చిన అమెరికావాడికి అవి గాడ్లీ అవర్సే, వాళ్లను సేవించే మనవాళ్లకే – రాక్షసఘడియలు. మన పురాణాలు రాసినవాళ్లు డబ్బు మనుష్యుల్ని ఎలా ఆడిస్తుందో చూపడానికి కుబేరుడి వాహనంగా మనిషిని పెట్టారు. డబ్బే మనిషిని ఆడిస్తుంది. అర్ధరాత్రి లేపుతుంది. తెల్లవారుఝామున జోకొడుతుంది. 

ఐటీ వచ్చేముందు ఆడ్‌ వర్కింగ్‌ అవర్స్‌ లేవని కాదు. ఫ్యాక్టరీలలో షిఫ్ట్‌లలో పనిచేసేవారు ఎప్పుడూ వున్నారు. వైట్‌ కాలర్‌ జాబ్‌ ఉద్యోగస్తులు యిలా సాయంత్రం లేచి పనిలోకి వెళ్లడం మాత్రం ఐటీ ఉద్యోగాల్లోనే చూస్తున్నాం. పోనుపోను అమెరికాతో మనకు వ్యాపారబంధాలు పెరుగుతాయంటున్నారు కాబట్టి యిలాటివాళ్లు యితర రంగాల్లో కూడా మొలుచుకొస్తారు. ఒక్క అమెరికా అనే ఏమిటి? యూరోప్‌కూడా మనతో ఆర్థికబంధాలు పెంచుకుందా మనుకుంటోంది. కలిసి పనిచేదామనుకుంటోంది. అమెరికాతో 12 గంటల వ్యత్యాసం అయితే వీళ్లతో ఆరుగంటల వ్యత్యాసమే. ఇటు చైనా, జపానువాళ్లతో కూడా టై-అప్‌లు ఏర్పడి వాళ్లకు సేవలు అందించవలసి వస్తే వాళ్ల కంటె ఆరు గంటలు ముందే తెమిలి కూర్చోవాలి. ఈ లెక్కన పోనుపోను పొద్దుటే పళ్లు తోముకుంటూ కనబడేవారు అరుదై పోతారు. 24 గంటల్లో ఎప్పుడు చూసినా ఎవడో ఒకడు నిద్రకు ఉపక్రమిస్తూ, లేదా నిద్రలేస్తూ ఆవులిస్తూ కనబడతాడు.

కొంతకాలంపాటు అమెరికా వేళలకు అనుగుణంగా పని చేసిన వ్యక్తి హఠాత్తుగా జపాన్‌ వేళలకు పనిచేయాల్సి వచ్చిందనుకోండి. అతని అవస్థ ఎలా వుంటుందో అనుకుంటున్నారా? నన్నడగండి నేను చెప్తాను. నేను ఎన్టీయార్‌ గారి వద్దా పనిచేశాను. చెన్నారెడ్డిగారి వద్దా పనిచేశాను. జనార్దనరెడ్డిగారి దగ్గరా పనిచేశాను.

ఎన్‌టి రామారావుగారు తెల్లవారుఝామునే లేస్తారని అందరికీ తెలుసు. కరక్టుగా చెప్పాలంటే అది తెల్లవారుఝాము కూడా కాదు. అర్ధరాత్రి దాటిన రెండు గంటల్లోనే తెల్లవారుఝాము ఎలా వస్తుంది? 2 గంటలకు లేచి ఆయన కాలకృత్యాలు, యోగాసనాలు, జపాలు అన్నీ ముగించుకుని నాలుగు గంటలనుండి ఆఫీసు పని చూడడానికి రెడీ అయిపోయేవారు. సినిమాల్లో వేషాలు వేసే రోజుల్లో పొద్దున్న ఆరుగంటలకు ఫుల్‌ చికెన్‌ తినేసేవారని చెప్పుకునేవారు. అది తలచుకుంటేనే నాకు భయం వేస్తుంది. ఆయన దగ్గర చేరిన పది రోజుల్లోనే ఓ సారి పొద్దున్న రెండు గంటలకు లేచి, (చిన్నపుడు అమ్మ నరక చతుర్దశి తలంటుకు కూడా అంత పెందరాళే లేపేది కాదు) నాలుగు గంటలకి ఆయనను కలిసి, అయిదు గంటలకు ఆయనతో కలిసి విజయవాడలో భోజనం చేయవలసి వచ్చింది. గుర్తు వచ్చినప్పుడల్లా అదింకా జీర్ణం కాని ఫీలింగు వస్తుంది.

సినిమా ఫీల్డులో అయితే పొద్దుటి షిఫ్టుతోనే పని ప్రారంభం కావడం, సూర్యుడు నడినెత్తికి వచ్చి నటీనటులకు చెమట్లు పట్టించి ఏడ్పిస్తాడేమోనన్న భయం చేత కావచ్చు. కానీ ప్రభుత్వాఫీసులో పది గంటలకు ముందు ఆఫీసుకి రమ్మంటే చెమట్లు పడతాయి. అయినా రామారావుగారు యిక్కడా అదే పద్ధతి అనుసరించారు. పొద్దున్న నాలుగు, నాలుగున్నర మధ్య ఎప్పుడైనా ఆయన నుంచి ఫోన్‌ రావచ్చు. ఆవులిస్తూ సమాధానం చెపితే లాభం లేదు కదా, ఎలర్ట్‌గా వుండాలి. 

ఇటువంటి వింత పనివేళల వ్యక్తి వద్ద ఎలా యిరుక్కున్నావని అడగవద్దు. భారత ఉపాధ్యకక్షుడుగా పనిచేసిన హిదాయతుల్లా గారి వద్ద 1981-83 మధ్య రెండు సంవత్సరాలు సెక్రటరీగా పనిచేశాను. ఇక ఎలాగైనా మన రాష్ట్రానికి వచ్చి కాస్త యాక్టివ్‌గా పని చేయాలని అనిపించింది. అబ్బే వద్దు, కేంద్రప్రభుత్వానికి గాని, విదేశాలకు గాని వెళ్లు అని కీ||శే|| పి ఎల్‌ సంజీవరెడ్డిగారి సలహా. వెనక్కి రా, ఎస్సీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ మేనేజింగ్‌ డైరక్టరుగా వేయిద్దామని కాకి మాధవరావు గారి సలహా. ఇద్దరూ నాకు గురుతుల్యులే ! రాష్ట్రానికి తిరిగి వస్తానని అప్లయి చేసుకుని, సరేననిపించుకునే లోపున ప్రభుత్వం మారిపోయింది. ఎవరూ ఊహించని రీతిలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది.

నేను తిరిగి రాష్ట్రానికి వద్దామనుకుంటున్నానని తెలిసి రామారావు గారు చీఫ్‌ సెక్రటరీ బి యన్‌ రామన్‌ గారితో ''మోహన్‌ నాకు సినిమా ఫీల్డునుంచి తెలుసు, మా ఆఫీసులో వేయండి'' అన్నారు. (నేను ఆ పదవిలో పని చేస్తూండగా ఆయనను చూడడానికి వచ్చిన కొంతమంది ఆశ్చర్యంగా ''ఏమిటీ, ''పెళ్లి చేసి చూడు'' సినిమాలో ఎన్టీయార్‌తో బాటు మీరూ నటించారటగా'' అని అడిగేవారు. ''కాదు, కాదు, నాతో బాటు ఆయనా నటించారు.'' అని సరదాగా జవాబిచ్చేవాణ్ని!) నా గురించి తెలియడంతో బాటు రాష్ట్రానికి రెండేళ్లు దూరంగా వున్నాను కాబట్టీ, సెక్రటేరియట్‌లో అంతకుముందు పనిచేయలేదు కాబట్టీ, ఆయన దృష్టిలో పాత సెటప్‌లో భాగస్వామి కానివాణ్ని అన్న ఆలోచన కూడా వుండి వుండవచ్చు, తెలియదు.

రాష్ట్రానికి వస్తున్నానన్న సరదాయే తప్ప ఈయన పొద్దున్న ఎప్పటినుండి పనికి మొదలెడతారో కనుక్కుని రావాలన్న ఆలోచన రాలేదు. అప్పటికీ, యిప్పటికీ దేశంలో ఏ ముఖ్యమంత్రీ యిటువంటి వేళల్లో పనిచేయించలేదు.. చేయించబోరు. అందువలన పనివేళల గురించి కనుక్కుని బదిలీ చేయించుకోవాలన్న ఊహ పోలేదు. అయితే యిందులో కొంత మంచి లేకపోలేదు. పొద్దునపొద్దున్నే మేలుకొలుపులు జరిగినా, సాయంత్రం ఏడు దాటాక ఆయన నుంచి ఫోను రాదు. మహా అయితే ఎనిమిది. ఆ తర్వాత రెస్టే!

నెల్లూరు వాస్తవ్యులైన నేదురుమల్లి జనార్దన రెడ్డిగారు ముఖ్యమంత్రిగా వుండగా ఆయన వద్ద ఎక్స్‌ అఫిషియో సెక్రటరీ టు చీఫ్‌ మినిస్టర్‌గా చేశాను (1990-92). ఆయన సినిమారంగం నుంచి రాలేదు. అప్పటికే థాబ్దాలుగా రాజకీయాల్లో వున్నారు. పలుమార్లు మంత్రిగా పని చేసివున్నారు.  చెన్నారెడ్డిగారు దిగిపోయి యీయన రావడంతో రాజకీయపరమైన ఒత్తిళ్లు కూడా చాలా వుండేవి. (ఈయన రెండేళ్లు వున్నాక మళ్లీ రాజకీయపరమైన అలజడి వచ్చి కోట్ల విజయభాస్కరరెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యారు) అందువలన పరిపాలనాసంబంధంగానే కాక, రాజకీయ అవసరాల చేత కూడా చాలామంది వస్తూ పోతూ వుండేవారు.

జనార్దనరెడ్డిగారి అలవాట్లు వేరు. మధ్యాహ్నం రెండు గంటలకు భోజనానికి వెళ్లేవారు. రెండు నుంచి అయిదుదాకా భోజనం, కొంచెం రెస్ట్‌.  మనకు కావాలన్నా దొరికేవారు కారు. ఇక సాయంత్రం అయిదింటికి మొదలుపెట్టి దర్బారు సాగేది. రాత్రి పది, పదిన్నర దాకా ఆయన దగ్గరికి మనుషులు వస్తుంటారు. వాళ్లతో ఆయన మాట్లాడుతుండటం, నిర్ణయాలు తీసుకోవడం జరిగేది. ఆ తర్వాత ఇంకో గంట, గంటన్నర పాటు ఫైళ్లు చూడడం. ఆయన స్టయిల్‌కు, ఎన్టీయార్‌ స్టయిల్‌కు పోలికే లేదు. ఆయన ఆఫీసులో ఫైల్స్‌ చూసేవాణ్ని కాదు కనుక ఎక్కువ సేపు వుండేవాడిని కాదు. నేను యింటికి వచ్చేసేవాణ్ని.

ఇక చెన్నారెడ్డిగారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చెన్నారెడ్డిగారు తెలంగాణా జమీందారీ కుటుంబానికి చెందినవారు. చాలా సమర్థులైన ముఖ్యమంత్రి. ఆయన యిష్టాయిష్టాలు తీవ్రమైనవి. అలవాట్ల విషయానికి వస్తే పొద్దున్నే లేవడం ఆయనకు అలవాటు లేదు. పదిన్నర పదకొండు గంటలకు బ్రేక్‌ ఫాస్ట్‌ చేసేవారు. అప్పటినుండి ఆయన రోజు ప్రారంభమై తేదీ మారేవరకూ సాగేది. జనార్దన రెడ్డిగారు రాత్రి పన్నెండు గంటలదాకా ఫైళ్లు చూసినా అధికారులను పిలిచి మీటింగులు పెట్టేవారు కారు. చెన్నారెడ్డిగారి పద్ధతే వేరు. రాత్రి పన్నెండున్నర, ఒంటిగంట, ఒక్కోప్పుడు రెండు తర్వాత కూడా అధికారులను పిలిచి మీటింగులు పెట్టి డిస్కస్‌ చేసి డెసిషన్స్‌ తీసుకోవడం  ఆయన అలవాటు.

పొద్దుటినుండి పనిచేసి వున్న అధికారులు ఆ టైములో ఉత్సాహంగా వుంటారని, బుర్రకు పదునుపెట్టి చక్కటి సలహాలు యివ్వగలరనీ వూహించగలమా? నిద్రకళ్లతో ఆయన చెప్పినదానికి వినీవినకుండా ఊ కొట్టే ప్రమాదం వుంది కదా! అంతకంటె ఆ మీటింగుకి రాకుండా వుండడం మేలు అనిపిస్తోందా? ఇక్కడ వై వి రెడ్డిగారి  గురించి చెప్పుకోవాలి.

రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నరుగా పనిచేసి రిటైరైన వై. వేణుగోపాలరెడ్డి గారంటే నాకు చాలా గౌరవాభిమానాలు. ముక్కుసూటిగా మాట్లాడడంలో ఆయన దిట్ట. 1974 ప్రాంతాల్లో నేను అప్పుడు నేను డిఫ్యూటి కమీషనర్‌ ఆఫ్‌ కమర్షియల్‌ ట్యాక్‌ అండర్‌-ట్రెయినీని. (ఆ ఒక్క వుద్యోగానికి మాకు ట్రెయినింగ్‌ ఇస్తారు మా సర్వీసులో. ఇంక మిగతావన్నిటికి ఉద్యోగంలోకి వెళ్లాక నేర్చుకోవడమే) 

ఆ ట్రెయినింగ్‌కై హైద్రాబాద్‌లో వుండగా బోర్డ్‌ ఆఫ్‌ రెవిన్యూ ఆధ్వర్యంలో కలక్టర్స్‌ కాన్ఫరెన్సు జరిగింది. నేనేమీ కలక్టరును కాను, నాకు ఏం సంబంధమూ లేదు. కానీ ట్రెయినింగ్‌లో వున్నవాడంటే ఎప్పుడూ లోకువేగా !  నాకేదో మిసిలీనియస్‌ డ్యూటీ అప్పజెప్పారు. ఏర్పాట్లూ అవీ చూస్తున్నాను. వై వి రెడ్డిగారు అప్పుడు నల్గొండ జిల్లా కలక్టరుగా వుండేవారు. అప్పట్లో ఆయన కాలు విరిగింది. ప్లాస్టర్‌లో వుంది. మధ్యాహ్నభోజనం వేళ అందరూ వెళ్లి కూల్‌ డ్రింక్స్‌, లంచ్‌ తీసుకుంటున్నారు. పాపం యీయన కాలు విరిగి కుర్చీలోనే కూర్చున్నారు.

ఆయనంటే నాకు గౌరవం, కాలు విరిగినందుకు ప్రస్తుతం జాలి. అందువలన నా పని కాకపోయినా వెళ్లి మర్యాదగా ''ఏమైనా కూల్‌ డ్రింక్స్‌ తీసుకుంటారా, తెమ్మంటారా?'' అని అడిగాను. 

ఆయన సిగ్గుతో మెలికలు తిరిగిపోయి ''అబ్బే మీకెందుకండీ ఆ శ్రమ'' అనో, ''థ్యాంక్స్‌.. యిఫ్‌ యూ డోంట్‌ మైండ్‌..'' అనో ఏమీ అనలేదు. ''తెచ్చే నాకొ..కు వుంటే పుచ్చుకుంటా'' అన్నారు! అదీ ఆయన స్టయిల్‌! అదేమిటంటే 'మా రాయలసీమ పద్ధతి అంతేనయ్యా' అంటూ దబాయిస్తారు.

చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రిగా వుండగా ఆయన హైదరాబాదు జిల్లా కలక్టర్‌. ఓ రోజు రాత్రి (అదే అర్ధరాత్రి) చెన్నారెడ్డిగారు ఆయనకు ఫోన్‌ చేసి ''ఐ వాంట్‌ యూ టు కమ్‌ ఇమ్మీడియేట్లీ. ఓ విషయం డిస్కస్‌ చేయాలి.'' అన్నారు. వై వి రెడ్డిగారు తొణక్కుండా చెప్పారు – ''నేను మా ఫ్రెండ్స్‌తో కూచుని ఓ చిన్న డ్రింక్‌ తీసుకుంటున్నాను సర్‌. ఇప్పుడొస్తే బాగుండదేమో! రేపు పొద్దున్న వస్తాను. కాదూ కూడదు అర్జంటు విషయం అంటారా, ఇప్పుడే ఫోన్‌లో చెప్పేయండి. ఏం చేయగలమో చూద్దాం'' అన్నారు. చెన్నారెడ్డిగారికి అలాటి జవాబు ఎప్పుడూ వచ్చి వుండదు. చాలామంది అటువంటి పరిస్థితుల్లో వుండవచ్చు కానీ ఆ విధంగా చెప్పడం మాత్రం వేణుగోపాలరెడ్డిగారికే చెల్లింది. 

అన్‌గాడ్లీ అవర్స్‌లో పనిచేసే వాళ్ల ఆరోగ్యం చెడిపోవడం గురించి, నిర్ణయాలు తీసుకోవడంలో సామర్థ్యం తగ్గిపోవడం గురించి ఆలోచించేవాళ్లు వాళ్ల కుటుంబ సభ్యుల అవస్థ గురించి కూడా ఆలోచించాలి. రిపేరు చేయడానికి  మిట్టమధ్యాహ్నం వచ్చిన ఎలక్ట్రీషియన్‌ లేదా ప్లంబరు ఆ సమయంలో యింటాయన మంచంమీద అడ్డంపడి గాఢనిద్ర పోతూ వుంటే యింటావిడ కేసి ప్రశ్నార్థకంగా చూస్తాడు. ఆవిడ సంజాయిషీగా చూసి ''నైట్‌ డ్యూటీ'' అని చెప్పి, వాడు వెళ్లాక నుదురు కొట్టుకుంటుంది – పగటిపూట లోకమంతా యాక్టివ్‌గా వున్నపుడు వాళ్లాయన నిద్రమత్తులో వుంటాడని. అందుకని పనులన్నీ ఆవిడే చూసుకోవాలి.

వేర్వేరు ముఖ్యమంత్రులతో వేర్వేరు పనివేళల్లో నేను పనిచేస్తూ వుంటే మరి మా ఆవిడ సంగతేమిటని మీరు అడగవచ్చు. తనకి అన్ని రకాల అనుభవాలూ జరిగాయి. ఎన్‌.టి.రామారావుగారి పుణ్యమాని ప్రొద్దున్నే అయిదింటికి కొన్ని వందల టెలిఫోన్‌ కాల్స్‌ తీసుకుని వుంటుంది. రాత్రి ఒంటిగంటకి ఎన్నో డజన్ల కాల్స్‌ తీసుకునివుంటుంది  – జనార్దనరెడ్డి గారివల్ల. రెండు సమయాల్లోనూ నేను పడుకొని వుంటాను. ఎందుకంటే అది నాకు ఎటూ కాని టైము! వాళ్లలో ఒకరు (రామారావుగారు) ఫోన్‌చేస్తే ''ఏమ్మా, లేచాడా మోహన్‌?'' అని అడిగేవారు. మరో ఆయన (జనార్దనరెడ్డిగారు) ''ఏంటీ మనవాడు పడుకున్నాడా, మేల్కొని వున్నాడా?'' అని అడిగేవారు. తను యిప్పటికీ చెప్పి (దెప్పి.. అనడం కరక్టు) నవ్వుతూ వుంటుంది. ''ఒకాయన ఫోన్‌ చేసేటప్పటికి పడుకుని వుండేవాడివి, ఇంకోళ్లు ఫోన్‌ చేస్తే లేచివుండేవాడివి కావు. మధ్యలో నా నిద్ర పాడయ్యేది..'' అని!

xxxxxx

మొదట్లో చెప్పిన సంఘటన విషయానికి వస్తే – ఆ సొసైటీ ఏదో కనిపెట్టలేక, అప్పుడు సిఎం ఆఫీసులో మిత్రుడు హేమచంద్ర ప్రసాద్‌కి (రామారావుగారికి ప్రయివేట్‌ సెక్రటరీ) ఫోన్‌ చేసి ''బాబూ, సరిగ్గా కాస్సేపు క్రితం ఆయనను కలిసిందెవరో గుర్తు పెట్టుకో. నేను ఆఫీసుకి వచ్చిన తర్వాత చెప్పు'' అని చెప్పాను.

ఆఫీసుకి వెళ్లాక ఆ వెళ్లినతన్ని పట్టుకుని, పిలిపించి ''నువ్వేం అడిగావ్‌? ఆయన ఏం చేస్తానన్నారు?'' అని కనుక్కుని… 

'ఓహో, ఇతను యిలా అడిగాడు కాబట్టి ఆయన యిలా చేస్తానని అని వుంటారు'' అనుకుని…

రెండు ప్లస్‌ రెండు నాలుగన్నట్టు లెక్క వేసి సంగతి తెలుసుకుని దాని ప్రకారం అమలు చేశాను.

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version