చంద్రబాబును జనం ఊరికినే గెలిపించలేదు. జగన్ లాంటి వాడు ఇంత హొరాహోరీ పోరు సలిపినా, రెండు శాతం ఓట్లతో నైనా బాబును గెలిపించింది ఎందుకు ? పరిస్థితులను తన చేతిలోకి తీసుకునే సామర్ద్యం వుందనే. మొన్న, నిన్న పరిస్థితులను చూడండి..ఎంత రుబాబు చేసారు. యుపిఎ సారథ్యంలోని ప్రభుత్వం ఆంధ్రపదేశ్ నాయకులను, జనాలను వారి అభిమతాలను పురుగులుచూసినట్లు విదిలించేసింది. కమిటీలా, అధికారులా, పరిశీలకులా..ఎవడు పడితేవాడు వచ్చేయడమే. ఏం జరుగుతోందో ఎవరికి తెలియదు. ఎవడి చిత్తానికి వాడు మాట్లాడేయడమే. దిగ్విజయ్ సింగ్ లాంటి అణాకాణీ గాళ్లు కూడా ఇక్కడకు వచ్చి మహా మహా మహరాజుల్లా ఫోజు కొట్టడమే.
దీనికి మూల్యం ఇప్పుడు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థులు చెల్లించారు. కమిటీ వస్తుందా..రాష్ట్రం అంతా తిరిగేస్తుందా..ఏమీ చెపక్కుండా వెళ్లిపోతుందా..మరో కమిటీ వస్తుందా..తమ నివేదిక ఏమిటో చెప్పదా..మంత్రుల కమిటీ అంటారా..ఓ మంత్రి రానే రాడా..వెళ్లిన వాళ్లని వాళ్ల ఇష్టానికి మాట్లాడనిస్తారా..ఆఖరికి నివేదిక ముందే సిద్ధం చేసి, విభజన అడ్డుగోలుగా కానిస్తారా..ఒక్కడు..ఒక్కడంటే ఒక్కడు మొనగాడు కాంగ్రెస్ పార్టీలో కనిపించగలిగాడా..తల ఎత్తుకు నిలదీయగలిగాడా..చివరిదాకా చెత్త సాకులు చెప్పుకుంటూ కాలం గడిపేసినవాళ్లే అంతా. పదవీ వైభోగాలు వెలగబెట్టిన వాళ్లే అంతా. అది చిరంజీవి కావచ్చు. పురంధ్రీశ్వరి కావచ్చు. చిరంజీవి కి ఇంకా పదవీకాలం వుంది కాబట్టి పార్టీని పట్టుకు వేలాడారు. పురంధ్రీశ్వరి అన్నీ చాకచక్యంగా వదిలేసి గోడ గెంతేసారు. సీమా ప్రజలు తెలివితక్కువ వాళ్లు కాదుగా..ఇంట్లో కూర్చోబెట్టారు. ఉత్తరాంధ్ర జనాలై వుంటే గంటాను నెత్తిన పెట్టుకున్నట్లే పెట్టుకునే వారేమో. అదంతా వేరే సంగతి.
ఇంతకీ ఇప్పటి పరిస్థితి చూడండి. చంద్రబాబు ఒక్క మాట అన్నారు. కమిటీ ఎవరు, అధికారులు ఎవరు నిర్ణయించడానికి అని. అదీ మనం..అలా నిలదీయగలగాలి. ఇప్పుడు ఏమంటున్నారు. రాజధాని అంటే రాష్ట్రం మధ్యలో వుండాలి అన్నారు. అలా స్పష్టత వుండాలి. తన క్యాంప్ ఆఫీసు గుంటూరు లో వుంటుందని ఫీలర్ వదిలారు. కొద్ది రోజుల క్రితం సీమ ఉద్యమ నేత వెంకటేష్ మళ్లీ గర్జించారు. కర్నూలు రాజధాని కాకుంటే ఉద్యమిస్తాం అని. ఏదీ ఇప్పుడు అనమనండి. బాబు ముందు నోరెత్తమనండి..గుంటూరు-బెజవాడ-తెనాలి ప్రాంతంలో రాజధాని అన్నది దాదాపు కన్ ఫర్మ్ అయిపోయింది. కానీ వెంకటేష్ మాట్లాడగలరా? దటీజ్ బాబు.
అధికారం మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకోగల సత్తా వుంది. సోనియా కూడా అదే చేసింది కదా అనొచ్చు. కానీ ఎంత చెడ్డా చంద్రబాబు మన తెలుగువాడు. మన రాష్ట్రం..మన ప్రజ..మన అధికారం అని తెరాస అన్నట్లే మనమూ అనుకుంటే, మన రాజధాని..మన నిర్ణయం..మన అభివృద్ధి అని మనమూ అనుకోవాలి. తప్పదు. అందుకే ఇలాంటివి చాకచక్యంగా తన చేతిలోకి తీసుకోగలడు కనుకే చంద్రబాబును జనం గెలిపించారు. అంతకు మించి మరేమీ కాదు. ఏం చేస్తున్నాడో మనకు తెలిసే లోగా తను చేయాలనుకున్న విధంగా చేసుకుపోగలడు. నొప్పిలేకుండా ఆపరేషన్ చేయగలడు. చేసి జనాల్ని, సరిగ్గానే చేసానని ముమ్మాటికీ ఒప్పించగల సాధనసంపత్తి వెనుక వున్నవాడు.
మోడీ దగ్గర సైలెంట్ గా పదవులు రాబడుతున్నాడు. దాంతో నిధులురాబడతాడు. ఇప్పుడు చూడండి బాబురావడంతోనే రాజధానికి విరాళాలు ప్రారంభమయ్యాయి. ఆయన సామాజిక వర్గానికి చెందిన బలమైన వారు ముందుకు వస్తున్నారు. అప్పుడే యాభై లక్షల విరాళం వచ్చింది. ఇప్పుడు రాజధానిలో వున్న ఆ సామాజిక వర్గం వారు బాబుకు మద్దతుగా తమ తమ కార్యాలయాలు సీమాంద్రకు మార్చే పనిలో పడ్డారు. బాబు అభివృద్ధి చేసాడని అనిపించాలి. ఇక చూడండి ఈ విరాళాలు వెల్లువెత్తుతాయి. మరో పక్క విదేశాల్లో వున్న బాబు అనుకూల జనం కూడా సీమాంధ్రకు వచ్చి పరిశ్రమలు పెట్టాలని రెడీ అవుతున్నారు. ఇలా ఇన్ని చేతులు సాయం చేస్తాయి బాబుకు. అది ఆయన అదృష్టం.
ఎవరు చేయనీండి..ఎందుకు చేయనీండి..ఎలా చేయనీండి. ఆంధ్రులకు కావాల్సింది ఆంధ్రా అభివృద్దే కదా..హైదరాబాధ్ లాంటి మహా నగరం మనకూ రావడమే కదా..ఇవన్నీ బాబుకు మాత్రం కలిసి వచ్చే అంశాలు. బాబు కోసం తమకు కాస్త ఇబ్బంది అయినా చేసే బడా బాబులు వున్నారు. జగన్ వస్తే వారు తిరిగి వెనక్కు వెళ్తారు కానీ చేయరు. అది తప్పా ఒప్పా అన్నది తరువాత. ముందు ప్రగతి సాధ్యం కాదు కదా..అందుకే జనం బాబును గెలిపించారని అనుకోవాలి.
చాణక్య