చిరకాల స్వప్నం సాకారమవుతున్న రోజు

తెలంగాణ చరిత్రలో ఎన్నో పోరాటాలు.. బహుశా ఈ పోరాటాలకు ఇక శుభం పడినట్లే అనుకోవాలి. స్వాతంత్ర్యపోరాటం చూసారు. నిజాం పాలనలో నిలిచారు. దొరల గడీల ముందు అవస్థలు పడ్డారు. . రజాకార్లను ఎదిరించి నిలిచారు.…

తెలంగాణ చరిత్రలో ఎన్నో పోరాటాలు.. బహుశా ఈ పోరాటాలకు ఇక శుభం పడినట్లే అనుకోవాలి. స్వాతంత్ర్యపోరాటం చూసారు. నిజాం పాలనలో నిలిచారు. దొరల గడీల ముందు అవస్థలు పడ్డారు. . రజాకార్లను ఎదిరించి నిలిచారు. ఆఖరికి సమైక్య ఆంద్ర ప్రదేశ్ లో మమేకమయ్యారు. అయినా ఎక్కడో చిన్న అసంతృప్తి. ఇది తమ పాలన కాదేమో..ఇది తాము కోరుకున్నది కాదేమో అన్న చిన్న మీమాంస. ప్రజలు విశ్వసించారో, నాయకులు ఎగసందోసారో..మొత్తానికి ఆ అసంతృప్తి..నానాటికి అంతై..అంతంతై..తెలంగాణ గడ్డపై నిలువెత్తున పెరిగింది. నిలువెత్తున పెరిగిన అసంతృప్తి, రణధ్యజంగా మారింది. ఆపై విజయకేతనమెత్తిన అమరవీర ధ్వజమై భాసిల్లింది. అవును ఇప్పుడు తెలంగాణ..పూర్తి స్వాతంత్ర్య తెలంగాణ. గడ్డ వారిది..ప్రభుత్వం వారిది..మిగిలిన వారికి ఎలా వున్నా, సాధించినవారి సంబరం అంబరాన్నంటడం సహజమే. 

ఇప్పుడు స్వంతంత్ర్య భారతావనిలో తెలంగాణ మరో కొత్త రాష్ట్రంగా నేటి నుంచి పాలన సాగించబోతోంది. మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారులు, భవనాలు, అన్నీ అన్నీ సిద్ధమయ్యాయి. సంబురాలు మిన్నంటుతున్నాయి. చిరకాలం పాటు ఉద్యమించిన ప్రజల ఉత్సాహానికి అంతకుమించి ఏం కావాలి? 

ఉద్యమం నిన్న..ఉత్సాహం నేడు..మరి రేపు..? ఈ ఖాళీలో రాయాల్సింది సమైక్యత. అంటే మళ్లీ రెండు రాష్ట్రాలు కలవాలన్నది కాదు. విరిగిపోయిన మనసులు కలవాలన్నది. నాయకుల పుణ్యం కావచ్చు, కొందరి నోటి దురుసుతనం కావచ్చు, ఉద్యమ నేపథ్యం లేదా ఉద్యమ తీవ్రత కావచ్చు..వాడిన మాటలు చాలా మంది మనసుల్ని, ఇటు అటు కూడా గాయపరిచాయి. చిరకాలంగా ఒకే చోట హాయిగా కలిసి వుంటున్న తెలుగువారిని రెండుగా చీల్చాయి. ఇప్పుడు గాయపడిన ఈ మనసులు సేదతీరాలి. మళ్లీ మనం.మనం ఒకటే అన్న భావన ఏర్పాడాలి. అందుకు ఇరువైపుల నాయకులు కృషి చేయాలి. ఇకనైనా రాజకీయాలు పక్కనపెట్టాలి. 2019 అధికారం లాక్కుంటాం లాంటి అక్కర్లేని ప్రకటనలు ప్రస్తుతానికి పక్కన పెట్టాలి. ఏదో జరిగిపోయింది, ఇక్కడ మనం పరాయివాళ్ల అన్న భావన ఈ ప్రాంతంలో స్థిరపడిన వారి మనసుల్లోంచి తుడిపేసే బాధ్యత తెలంగాణ వారిదే. ఇది ఒకప్పుడు మాదే..మేము పెంచి పోషించిందనదే, వాళ్లు లాక్కున్నారు అన్న భావన వీరిలో పోవాలి. ఆస్తిపంపకాలు అన్నాక ఇలాగే వుంటుంది. ఎవరికి దక్కేవి వారికి దక్కుతాయి. ఈ తరహా పాజిటివ్ థింకింగ్ అభివృద్ధి చేసుకోవాలి. లేదంటే ఇక తరచు మియాపూర్ ఎన్టీఆర్ విగ్రహం లాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి.

అభివృద్దితోనే అసలు ఫలితం

హైదరాబాద్,వరంగల్,నిజమాబాద్,కరీంనగర్ లాంటి పట్టణాల చూసి తెలంగాణ మొత్తం ప్రగతి పథలో వుందనుకుంటే పొరపాటే. ఆ సంగతి నేతలకు తెలుసు. అందుకే ఉద్యమించగలిగారు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఏర్పడే తొలి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కన్న అభివృద్ధిపైనే దృష్టి సారించాల్సి వుంది. సంక్షేమాలు రాజకీయాలకు, ఓట్లకు అవసరమే కానీ, అభివృద్ది అంతకన్నా అవసరం. అదీ వెనుకబడ్డ అదిలాబాద్ లాంటి జిల్లాలకు. ఇప్పుడు పరిశ్రమలు కొత్తగా రప్పించడం అన్నది సవాలు. హైదరాబాద్ తో పాటు సీమాంధ్ర ప్రాంతాలు కూడా కొత్త పరిశ్రమలకు పోటీలో నిల్చుంటాయి. హైదరాబాద్ కు ఇప్పటికే వున్న సదుపాయాల రీత్యా, ముందు స్థానంలో వుండొచ్చు. కానీ తెలంగాణకు కావాల్సింది ఇది కాదు, పారిశ్రామిక వికేంద్రీకరణ. ఉత్తర తెలంగాణ జిల్లాలకు కూడా పారిశ్రామిక వెలుగులు సోకాలి. కానీ సహజంగా పారిశ్రామిక వేత్తదలు అటు వెళ్లడానికి మొగ్గు చూపరు. తెలంగాణ పారిశ్రామిక వేత్తలు కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాలనే ఎంచుకుంటారు. ఇందుకు తరుణోపాయం ఒక్కటే, ప్రభుత్వం స్వయంగా పరిశ్రమలు స్థాపించడం. కానీ ఈ తరహా విధానానికి మన ప్రభుత్వాలు ఏనాడో స్వస్తి చెప్పాయి. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు రాయతీలు, స్థలాలు, విద్యుత వంటి అనేకానేక తాయిలాలు ప్రకటించాలి. అప్పుడే అభివృద్ధి ఫలాలు అన్ని వైపులకు అందుతాయి. అంతే కానీ హైదరాబాద్ ను పెంచుకుంటూ పోతే కాదు. 

నిజానికి హైదరాబాద్ ను పెంచడానికి ప్రభుత్వం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఎదిగిన మొక్క అలా ఎదుగుతూనేవుంటుంది. కొత్తగా నాటే మొక్కపైనే శ్రద్ధ అవసరం. కానీ టీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా వుంటుందన్నది తెలియడం లేదు. ముందుగా అయితే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేటభారతం అంత సంక్షేమ కార్యక్రమాలు వల్లించారు. ఇళ్లు, ఫించన్ల వగైరా. వీటివల్ల అభివృద్ది అంతంతమాత్రం. అంతకన్నా ప్రతి ఇంటికి ఉద్యోగం అన్న హామీని నిలబెట్టుకుంటే, ప్రజలు తమ స్వంతకాళ్లపై నిల్చుంటారు. ఎవరి ఇల్లు వారే సాధించుకుంటారు. అలా ఇంటికో ఉద్యోగం కావాలంటే, ముందే చెప్పుకున్న పారిశ్రామిక వికేంద్రీకరణ అవసరం.

కేంద్రంతో కయ్యం అవసరమా?

ఎంత ఫెడరల్ వ్యవస్థలో వున్నా, మన దేశంలో కేంద్రానిది పైచేయి అన్నది వాస్తవం. కేంద్ర సహాయం మంచిగానూ సంపాదించుకోవచ్చు, పోరాడి తెచ్చుకోవచ్చు. కానీ పదే పదే పోరు బాట అంటే జనం విసుగెత్తిపోతారు. అందువల్ల సామరస్యమే మేలు. ముఫైకి పైగా ఎంపీ స్థానాలు గెల్చుకున్న అన్నాడిఎంకె కూడా భాజపా ప్రభుత్వంతో సామరస్య ధోరణి కనబరుస్తోంది. కేవలం అయిదేళ్లు కేంద్రం నుంచి రావాల్సినవి రాబట్టుకోవడానికి తప్ప మరెందుకు కాదు. కెసిఆర్ ప్రభుత్వం కూడా ఇది ఆలోచించాలి. అందునా కొత్త రాష్ట్రం అన్నపుడు కేంద్రం కరుణాకటాక్షాలు చాలా అవసరం. పైగా ఇప్పటికీ వెనుకబాటు తనం పోకుంటే ప్రజలు పక్కదారి పట్టే ప్రమాదం వుంది. తెలంగాణ గడ్డపై చైతన్యం ఎక్కువ. ఆ చైత్యన్యానికి వున్న అనేకానేక రూపాల్లో నక్సలిజం కూడా ఒకటి. ఇప్పుడు ప్రభుత్వం కనుకు సరియైన దారిలో వెళ్లకుంటే నక్సలిజం మళ్లీ ఊపిరిపోసుకునే ప్రమాదం వుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో పలు నివేదికలు స్పష్టం చేసాయి. విభజన ఇష్టం లేక అలా సాకులు చెప్పాయి అనుకున్నా, జాగ్రత్త అయితే అవసరం. 

మొండితనం పనికిరాదు

కెసిఆర్ బలమూ, బలహీనతా రెండూ మొండితనమే. ఆ మొండితనంతోనే ఆయన తెలంగాణ సాధించారు. ఆ మొండితనమే ఇప్పటికీ ఇంకా చూపిస్తున్నారు. ప్రధానిని మర్యాదకైనా తెలంగాణ తొలి ప్రభుత్వ పదవీ స్వీకారానికి పిలవలేదని, ఆఖరికి జేఎసి నేత కోదండరామ్ రెడ్డిని కూడా పిలవలేదని వార్తలు వినవస్తున్నాయి. ఈ తరహా ఒంటెత్తు వైఖరి ఎంత మాత్రం మంచిది కాదు. కెసిఆర్ తన ఒక్కడి వల్ల తెలంగాణ కల సాకారం కాలేదని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచింది. అధికారం తనదే కానీ,  తెలంగాణ అందరిదీ అన్న భావన ఆయన పెంచుకోవాలి. అప్పుడే సమస్యలు లేని పాలన సాధ్యమవుతుంది. లేకుంటే అక్కరలేని తలకాయనొప్పులు పుట్టుకువచ్చి, పాలనకు గండి పడుతుంది. ఇక అభివృద్ధి మాట దేవుడెరుగు, ఈ సమస్యలతోనే తెలంగాణ సతమతమయ్యే ప్రమాదం వుంది. ఏదైనా తెలంగాణ ప్రజలు మరింక ఉద్యమించాల్సిన అవసరం లేని రోజులు గడపాలని ఆకాంక్షిద్దాం.

చాణక్య

[email protected]