‘దాడీ’ ఇదో ఎన్నో’స్సారీ’?

మాస్టారికి సహనం కాస్త ఎక్కువ వుండాలి.అల్లరి విద్యార్ధులుంటారు మరి. కానీ పాపం మన దాడి వీరభద్రరావు మాస్జారికి కాస్త అది తక్కువ. క్షణిణాకావేశం ఎక్కువట. ఆ ముక్క ఆయనే ఒప్పుకుంటారు. క్షణికావేశంలో వైకాపాలో చేరానని…

మాస్టారికి సహనం కాస్త ఎక్కువ వుండాలి.అల్లరి విద్యార్ధులుంటారు మరి. కానీ పాపం మన దాడి వీరభద్రరావు మాస్జారికి కాస్త అది తక్కువ. క్షణిణాకావేశం ఎక్కువట. ఆ ముక్క ఆయనే ఒప్పుకుంటారు. క్షణికావేశంలో వైకాపాలో చేరానని ఆయనే నిన్న స్వయంగా చెప్పకున్నారు. కానీ సహజంగా నాటక రచయిత, ఆచి తూచి మాట్లాడగల మేథావి, పైగా మాస్టారు..మరి అలాంటి పొట్టి మనిషికి క్షణికావేశం ఎక్కువంటే ఎలా నమ్మడం? కానీ మాస్టారి ట్రాక్ రికార్డు మాత్రం ఓ సంగతి స్పష్టం చేస్తుంది..ఆయన అధికారం లేకుండా క్షణం కూడా వుండలేరని. పెరుగుదల అన్నది ఆయనకు సదా వాంఛనీయమని.

దాడి వారు సాదా సీదా లెక్చరరు. ఎన్టీఆర్ దయతో ఎమ్మెల్యే అయ్యారు. ఆపై చిన్నది..అంటే చిన్నది ఓ కాన్వెంట్ పెట్టుకున్నారు. అలా అలా ఓ మంత్రి పదవి సంపాదించారు. ఆపై అది బాబు పోటు పొడిచినపుడు..ఎన్టీఆర్ ను సేద తీరస్తూ వుండిపోయారు. జంప్ చేయడంలో క్షణం ఆలస్యం చేసారు ఆ రోజు. తరువాత వన్ ఫైన్ మార్నింగ్ బాబు చెంత చేరారు. దాడివారు ఎంత తెలివైన వారంటే, బాబు అధికారం లోని తొమ్మిదేళ్లు కూడా ఆయన పెరుగుదల ఆగలేదు. పైగా తనకు పక్కలో బల్లెంలా వున్న గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యంలోకి, అక్కడి నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో తెలుగుదేశంలో తిరుగులేకుండాపోయింది. పైగా ఆయన అయ్యన్న గ్రూపు కావడంతొ, అంతా ఒకటయ్యారు. 

కాన్వెంట్ నుంచి, జూనియర్ కాలేజీ, అక్కడి నుంచి డిగ్రీ కాలేజీ, ఎమ్ సి ఎ కాలేజీకి ఎదిగి, వైఎస్ హయాంలో ఇంజినీరింగ్ కాలేజీకి చేరింది. ఇక ఆర్థికంగా ఏ మేరకు ఎదిగారన్నది అనకాపల్లిలో ఎవర్ని అడిగినా చెబుతారు. ఫైనాన్స్ వ్యాపారాలు, సెటిల్ మెంట్ ల నుంచి బెంగుళూరులో హొటల్ నిర్మాణం వరకు వెళ్లారని జనంలో టాక్.  బాబు ఈయన వాగ్దాటికి మెచ్చి ఎంత చేయాలో అంతా చేసారు. ఎమ్మెల్సీ ఇచ్చి, మండలిలో నాయకుడి హోదా ఇచ్చారు. ఇదిలా వుంటే తెరవెనుకు ఇద్దరు వారసులు రాజకీయంగా, వ్యాపారంగా ఎదుకుతుంటే, మళ్లీ క్షణికావేశం తప్పలేదు. తెనకు ఎమ్మెల్సీ, కొడుక్కు ఎమ్మెల్యే అన్న పథక రచన చేసారు. కానీ బాబు ఆబ్లిగేషన్లు బాబువి. యనమల తో అవసరాలు అటువంటివి. అందుకే దాడిని ఎమ్మెల్యేకు వెళ్లమని, యనమలకు అవకాశం ఇచ్చారు. దాంతో దాడికి ఎక్కడలేని క్షణికావేశం వచ్చి, వైకాపాలో చేరిపోయారు. 

చిత్రమేమిటంటే, అంతకు ముందు నుంచే ఆయన కుమారుడు రత్నాకర్ విశాఖలోని ఓ నియోజకవర్గం ఎంపిక చేసేసుకుని వైకాపా తరపున తన పనులు తాను మొదలెట్టేసారు. తన చిరకాల ప్రత్యర్థి కొణతాలను తోసిరాజని, ఇంత చేసినా, కొడుక్కు విజయం సాధించి పెట్టలేకపోయారు. దాంతో మళ్లీ క్షణికావేశం తప్పలేదు. అధికారం అందునా అయిదేళ్లు లేకుండా వుండాలంటే, ఎలా?  అందునా తనకు అంతగా ఏమిటి? బొత్తిగా సరిపడని గంటా శ్రీనివాసరావుకు విద్యాశాఖ అంది వచ్చింది. ఈయనగారికేమో అన్నీ విద్యా సంస్థలే.  మరి కనీసం పార్టీలో ఎదగలేకపోయినా, అక్కడ వున్నా చాలు. అయిదేళ్లు ప్రశాంతంగా తమ వ్యాపారాలు తాము చేసుకుంటూ గడిపేయచ్చు. బాబు దయతలిస్తే, అప్పుడు చూసుకోవచ్చు. అందుకే మరోసారి సారీ చెప్పి, పార్టీ గడప తొక్కేందుకు డిసైడ్ అయిపోయారు. 

ముందస్తుగా తనను వైకాపా నేత అనవద్దంటూ వారం పది రోజుల క్రితం మీడియాకు అపీల్ చేసారు. అప్పుడే అర్ధమైపోయింది. మాస్టారు బుక్ మారుస్తున్నారని. ఇప్పుడు జగన్ ను ఎంత తిడితే అంత బలంగా పైకి లేవచ్చని, ఆ ఊపులో తెలుగుదేశం గుమ్మం ముందు వాలిపోవచ్చని రెడీ అయిపోయి, తన ఉపన్యాస చాతుర్యం అంతా చూపించారు. ఏ పార్టీలో చేరాలన్నదాంట్లో తొందర లేదని, కాలమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. కాలం అంటే ఎవరు చంద్రబాబేనా? సుజనానా? ఎందుకంటే బాబుకు ఎంట్రీ పాస్ ఇవ్వాల్సింది వారే కదా? ఒకరు పార్టీ అధ్యక్షుడు మరొకరు..జిల్లా వ్యవహారాలు చూసేవారు. అన్నట్లు నిన్నకాక మొన మంత్రి పదవి రాలేదని అలిగి, రాజీనామా చేసిన బండారు సత్యనారాయణ కూడా అయ్యన్న పాత్రుడి గ్రూపే. అంటే అయ్యన్న గ్రూపులోంచి ఓ పిచుక జారితే..మరో పిచిక చేరడానికి రెడీ అయింది. మొత్తానికి దాడి జీవితంలో ఎన్ని సార్లు సారీ చెప్పాల్సి వుంటుందో?

చాణక్య​

[email protected]