వికటిస్తున్న సంక్షేమం

చంద్రబాబు ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఆంధ్రులకు చూడముచ్చటగా, మిగిలిని రాష్ట్రాల సిఎమ్ లు ఈ జనాన్ని, వైభవాన్ని చూసి ఈర్ష్య పడే లెవెల్ లో నిర్వహించడంలో ఇటు ప్రభుత్వ అధికారులతో  పాటు,…

చంద్రబాబు ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఆంధ్రులకు చూడముచ్చటగా, మిగిలిని రాష్ట్రాల సిఎమ్ లు ఈ జనాన్ని, వైభవాన్ని చూసి ఈర్ష్య పడే లెవెల్ లో నిర్వహించడంలో ఇటు ప్రభుత్వ అధికారులతో  పాటు, తెలుగుదేశం శ్రేణులు  అద్భుతంగా కృషిచేసాయి.  అయిదు తొలి సంతకాలతో బాబు ఓట్లేసిన జనాల్ని సంతోషపెట్టే ప్రయత్నం చేసారు. ఒకటి నీవిచ్చి, రెండు నే కోరితి, ముచ్చటగ మూడవ వరం అన్నట్లుగా, రైతులు, మహిళలు, పల్లె ప్రజలు, ఇలా మూడు వర్గాలు మూడు వరాలు ఇవ్వాలని ముందుగా అనుకున్నారు. కానీ అంకె అంత మంచిగా వుండదనుకున్నారేమో నాలుగు కాదు, ఏకంగా అయిదు ఫైళ్లపై సంతకాలు చేసారు. అయితే సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా సంతకం పెడితే అలా పనులు జరుగుతాయని సామాన్య జనం ఆశతో వుంటారు. కానీ వివిధ పరిస్థితులు, పరిమితుల రీత్యా ఇప్పుడు ఆ విధమైన పరిస్థితి కనిపించడం లేదు. అందునా ఆ అయిదింటిలో కీలకమైన మూడింటిపై. 

తాత్కాలిక ప్రయోజనాలు

అసలు ఈ అమలు వ్యవహారం సంగతి అలా వుంచితే, సంక్షేమం పేరిట ప్రజాధనం కేవలం తాత్కాలిక ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడుతూ, సవ్య ఆలోచనా దిశగా ప్రజల్ని నడిపించడం లేదు అన్నది వాస్తవం. కానీ ఎన్టీఆర్ దగ్గర నుంచి వైఎస్ మీదుగా చంద్రబాబు వరకు అందరూ అదే మార్గం పట్టక తప్పడం లేదు.రాజకీయనాయకులు హామీలు ఇచ్చేటపుడు పర్యవసానాలు, పూర్వాపరాలు ఆలోచించరు. నాడు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చినపుడు వైఎస్ అయినా, నేడు రుణాల మాఫీ ఇచ్చినపుడు చంద్రబాబు అయినా. అంతకు ముందు కిలోరెండు రూపాయిల బియ్యం ప్రవేశ పెట్టినపుడు ఎన్టీఆర్ అయినా కూడా. దానా దీనా ఏ సంక్షేమ పథకం కూడా దళారులు బాగుపడడానికే పనికివస్తోంది చాలా వరకు. ఫీజుల చెల్లింపు అని వైఎస్ పథకం పెడితే, దాని ఆలంబనగానే ఇంజినీరింగ్ కాలేజీలు తామర తంపరగా పుట్టుకొచ్చాయి. వీటిలో రాజకీయ నాయకులవే ఎక్కవ. దాదాపు ప్రతి ఎమ్మెల్యేకు ఓ కాలేజీ అన్నట్లు తయారైంది పరిస్థితి. అదేవిధంగా స్కాలర్ షిప్ ల విషయంలో ఎన్నో అవకతవకలు.  అయినా ఏవీ ఆగడంలేదు. ఇప్పుడు ఫీజుల చెల్లింపు వ్యవహారం అరకొరగా నడుస్తోంది. 

సబ్బిడీ బియ్యం సమస్యలు

ఎన్టీఆర్ కిలోరెండు రూపాయిల బియ్యం ప్రవేశ పెట్టినపుడు ఇదే సమస్య. కిలో నాలుగు రూపాయిలు వున్నపుడు ఇచ్చిన పథకం అది. ఇప్పడు నలభై నుంచి యాభై రూపాయిలు వున్నపుడు కూడా అదే రెండు రూపాయిల పథకం. అంటే ఓ పథకం ప్రవేశ పెట్టిన తరువాత దాన్ని మార్చడానికి కానీ, తప్పించడానికి కానీ నేతలు ఎంత భయపడతారనడానికి ఉదాహరణ. దీన్నే మన పెద్దలు మప్పడం సులువు, తిప్పడం కష్టం అన్నారు. దీంతో నేతలకు మిగిలింది ఒకటే దారి ఆ పథకాన్ని మొక్కుబడిగా నిర్వహించడం. దీంతో నిధులు ఖర్చయిపోతుంటాయి. కానీ ప్రజలు చేరేది స్వల్పంగా వుంటుంది. కిలోరెండు రూపాయిల బియ్యం పథకం ప్రవేశ పెట్టిన కొత్తలో ఎలా వుండేది..ఇప్పుడెలా వుంటొంది. రేషన్ కార్డులు తాకట్టు పెట్టుకుని, ఆ బియ్యాన్ని అమ్ముకునే డీలర్ల వ్యవహారం ఎన్నో సార్లు వెలుగులోకి వచ్చింది. రేషన్ బియ్యాన్ని అక్కడే అమ్మేసి, తాము మాత్రం వున్నంతలో కాస్త మంచి బియ్యం కొనుక్కునే జనాలున్నారు. ఇక బోగస్ రేషన్ కార్డుల వ్యవహారం తెలిసిందే. 

వైఎస్ ఉచిత విద్యుత్ పథకం వ్యవహారమే చూడండి. దాని ఫలితంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ భ్రష్టుపట్టిందని విమర్శలున్నాయి. ఇలా ప్రతి సంక్షేమ పథకం ఒకదశకు చేరుకున్న తరువాత వాటికి నీరసం వస్తుంది. అధికారంలో వున్నావారికి బరువు అనిపిస్తుంది. దాంతో దాన్ని వదిలించుకోలేక, దింపుకోలేక అరకొరగా కొనసాగిస్తుంటారు. ఆ విధంగా ఒక్కో పథకం నీరసించిపోతుంటాయి. ఇలా పథకాలు వికటించడం వల్ల రెండు సమస్యలు ఉత్పన్నమవుతాయి సహజంగా. 

ఖర్చుదారి ఖర్చుదే

ఒకటి ఆశించిన ఫలితం నెరవేరకపోవడం. ప్రభుత్వం చేసే ఖర్చు అలాగే వుంటోంది, బడ్జెట్ బడ్జెట్ కు తడిపిమోపెడవుతోంది. కానీ పథకం ఇచ్చే ఫలితం అంతంతమాత్రంగా వుంటోంది. కొన్ని పథకాలైతే వికటిస్తున్నాయి కూడా. లెవీకి బియ్యం తీసుకోవడం కోసం మిల్లర్లకు అనేక వరాలు ఇవ్వడానికి దారి తీస్తోంది. అదే సమయంలో ఈ వ్యవహారాన్ని సాకుగా తీసుకుని, రాజకీయ నాయకుల అవతారం ఎత్తిన వ్యాపారుల వత్తిడి, మిల్లర్ర నుంచి అందే మూమూళ్లు కలిసి, ప్రభుత్వం వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే చేస్తున్నాయి. దీంతో ఒక స్థిర నిర్ణయం తీసుకోకుండా, ఎప్పుడు జ్వరం వస్తే అప్పుడు మాత్ర వేసుకున్న చందంగా నడుస్తోంది. ఓ సరైన ట్రీట్ మెంట్ అన్నది లేదు. రైతుల దగ్గర మిల్లర్లు ధాన్యం కొనేసేదాకా ఊరుకుంటారు. సరైన సమయం చూసి, రైతుల దగ్గర ధాన్యం మురిగిపోతున్నాయి., ఎగుమతి అంక్షలు ఎత్తివేయాలని రైతుల ముసుగులో మిల్లర్లు నకిలీ ఉద్యమాలకు తెరతీస్తారు. దాంతో మిల్లర్లతో సాదా పార్టీ పరమార్థాలు అందుకునే వివిధ రాజకీయ పక్షాలు స్టేట్ మెంట్ లు ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఇదంతా ఓ కథ, స్క్రీన్ ప్లే ప్రకారం జరుగుతుంది. అప్పటికే ప్రభుత్వం పెద్దలకు అందే ప్రయోజనాలపై అవగాహన కుదిరిపోతుంది. దాంతో బియ్యం ఎగుమతులకు అంక్షలు లేచిపోతాయి. 

ఇదంతా రైతుల ప్రయోజనం కోసం అనే సాకున జరుగుతుంది. కానీ అప్పటికే రైతుల దగ్గర నుంచి ధాన్యం ముందుగానే మిల్లర్లకు చేరిపోయిన సంగతి ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తారు.  నిజానికి ఇదే నిర్ణయం కనుక, పంట వస్తున్న కొత్తలోనే తీసుకుంటే, ధరలు పెరగడం అన్నది రైతులకు ప్రయోజనం కలిగిస్తుంది. కానీ అలా చేయరు. మిల్లర్ల దగ్గరకు పంటలో అధికశాతం చేరిన తరువాతే ఈ స్క్రీన్ ప్లే అమలు ప్రారంభమవుతుంది. దాంతో లాభాలు మిల్లర్లకు, దాంట్లో వాటా రాజకీయ పార్టీలకు అందుతాయి. మిగిలిన పార్టీలకు భిన్నం అని చెప్పుకునే లోక్ సత్తా కూడా ఈ విధమైన వ్యవహారంలో పాలు పంచుకోవడం శోచనీయం. గతంలో రెండెడ్ల బండి ఎక్కి మరీ జయప్రకాష్ నారాయణ్ హంగామా చేసారు. 

ఉచిత విద్యుత్ అని ప్రకటించే ముందే, ఎకరా లేదూ..రెండు ఎకరాలు అని ఓ కటాఫ్ మార్క్ చెప్పరు. తరువాత చెబితే, ప్రతిపక్షాలు యాగీ చేస్తాయి. రుణమాఫీ కూడా అలాంటిదే. ముందుగానే ఇంతలోపు, ఈ తరహా రుణాలు అని చెప్పరు. చెబితే జనం ఓట్లేస్తారో లేదో అన్న భయం. కనీసం కంపెనీలు తమ ఉత్పాదన పేరు కింది. కనీ కనిపించకుండా చుక్క పెట్టి, కండిషన్స్ అప్లై అనే అయినా అంటాయి. కానీ పార్టీలు ముందుగా ఆ మాత్రం కూడా అనవు. 

ఇప్పుడు చంద్రబాబు, కెసిఆర్ తలపెట్టిన ముఖ్యమైన రుణ మాఫీ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆంధ్రలో దీనికి అన్నింటికన్నా వున్న పధాన అడ్డంకి నగదు ఏర్పాటు. రైతులు, మహిళల వివిధ పద్దుల రుణాలు 80 వేల కోట్ల వరకు వున్నాయి. దీన్ని కాస్త అటు ఇటు తిప్పి,, తక్కువశాతం మందికి ఇబ్బంది, ఎక్కువమందికి ప్రయోజనం కల్పించేలా మార్చాలంటే కాస్త గట్టి కసరత్తు అవసరం. ఇవన్నీ హామీ ఇచ్చేముందే చూసుకోవాలి. ఇప్పుడు ఆర్ బి ఐ నిబంధనలు, విధి విదానాలు గుర్తుకువస్తాయి. అదేమని ప్రశ్నిస్తే, అడ్డగోలుగా మీకు అనుభవం లేదు..ప్రశ్నించే అర్హత లేదు అని నిలదీస్తారు చంద్రబాబులా. లేదా ఇదంతా సీమాంధ్రుల కుట్ర అంటారు తెలంగాణ వాదుల్లా. నిజంగా నిబంద్ధత వుంటే, ఇదిగో సొమ్ము, అదిగో మాఫి అంటే ఎవరు వద్దంటారు. రైతుల తరపున ప్రభుత్వం మేం చెల్లించేస్తున్నాం. ఎంత మొత్తం కావాలో చెప్పండి అని అంటే బ్యాంకులు వద్దంటాయా? ఆర్ బి ఐ వద్దంటుందా? కానీ సమస్య అది కాదు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అవి లేకుండా పనులు కావాలి. కావాలంటే బాండ్లు ఇస్తాం..హామీలు ఇస్తాం . ఇలాంటివి తలపెట్టినపుడే నిబంధనలు అడ్డం వస్తాయి. 

ఇక ఇదే పథకం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ లు కూడ చూడండి. ఇక రుణాలు ఇవ్వడం రాను రాను తగ్గిపోతుంది. బ్యాంకులు ఆచి తూచి రుణాలివ్వడం ప్రారంభిస్తాయి. వత్తిడి వుంటే ఓ మాదిరిగా, లేకుంటే మరో మాదరిగా ప్రవర్తిస్తాయి. నిరర్థక రుణాలు పెంచుకోవమని ఏ బ్యాంకుకూ ఆర్ బి ఐ ఆదేశాలివ్వదు. అలాగే డిఫాల్టరుకు రుణాలివ్వమని కూడా. ఎన్నికలు ఏడాది, రెండేళ్లలో వున్నాయనగా ఇక రుణాలు తీర్చడం అన్నది ఎగ్గొట్టడం అలావాటు అయిపోతుంది. పార్టీలు చచ్చినట్లు హామీలు తలకెత్తుకోవాలి. 

బెల్ట్ పాపం ప్రభుత్వాలది కాదా?

ఇక ఇప్పుడు బాబు ఇచ్చిన మరో వరం బెల్ట్ దుకాణాల ఎత్తివేత. చూస్తూ వుండండి ఇది ఎలా వికటిస్తుందో. అసలు బెల్ట్ ధుకాణాలు ఎలా వచ్చాయి. ప్రభుత్వాల సంపాదనా దాహం వల్ల మద్యం వ్యాపారుల నడుమ పోటీ వచ్చింది. పోటీ వల్ల వ్యాపారుల పెట్టుబడి పెరిగింది. అదే సమయంలొ లక్ష్యాలు అన్నది వారికి కలిసివచ్చింది. అమ్మకాలు పెంచుకోవడానికి బెల్ట్ దుకాణాలు పుట్టుకువచ్చాయి. బెల్టు దుకాణాల వృద్దికి ప్రయివేటు రౌడీ పార్టీలు కూడా పుట్టుకువచ్చింది, వాటికి ఎక్సయిజు అండ వున్నది వాస్తవం కాదా? ఎక్సయిజు జీపులో ఒక్క కానిస్టేబుల్, పది మంది ప్రయివేటు సిబ్బంది ఊళ్లపై పడి లోకల్ సారా విక్రేతలపై దాడులు జరిపింది వాస్తవం కాదా. ఇలా పెంచిన బెల్టు షాపుల రద్దకు ప్రత్యేక టాస్క్ ఫోర్సు కావాలా? అసలు ముందు టార్గెట్ లు తీసేసి, ఫీజులు తగ్గించేస్తే, సగం బెల్టులు తెగిపోతాయి. దుకాణం పరిథిలో ఒక్క బెల్టు షాపు వున్నా , ఆ దుకాణంపైనే భారం వేసి, లైసెన్స్ కట్ చేస్తామంటే, ఇప్పుడు అదే రౌడీ ముఠాలు బెల్టు దుకాణాల రద్దుకు పనిచేస్తాయి. 

ఇక చిన్న దుకాణాలు

బహుశా ఇప్పుడు ప్రభుత్వం ఇంకో రకంగా ఆలోచిస్తూ వుండి వుండొచ్చు. ఇప్పటికే దాదాపు ప్రతి రెండు మేజర్ పంచాయితీలకు కలిపి ఓ మద్యం దుకాణం వచ్చేసినట్లే. ఇక ప్రతి మేజర్ పంచాయితీకి ఒకటి వస్తే, ఇక బెల్టు దుకాణం ఎందుకు, అధికార దుకాణాలే వస్తాయి. ప్రభుత్వానికి నేరుగా ఆదాయం సమకూరుతుంది. నిజంగా చిత్తశుద్ధి వుంటే చేయాల్సింది రాను రాను మద్యం దుకాణాల సంఖ్య, మద్యం విక్రయాన్ని తగ్గించడం. ఆ దిశగా జనాన్ని చైతన్య వంతం చేయడం కానీ అలా చేయడం మానేసి, ఇలాంటి చిట్కావైద్యాలన్నీ చేస్తారు. 

రాజకీయ తీర్మానం అవసరం

అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాటపైకి వచ్చి, ఇలాంటి సంక్షేమ పథకాల విషయంలో ఓ అవగాహనకు రావాలి. ఒకరు ఇవ్వడం వేరొకరు వద్దనడం కాదు. లేదా కేంద్రం ఓ స్వంతంత్ర బాడీని ఏర్పాటు చేయాలి. ఏ రాష్ట్రమైనా సంక్షేమ వరాలు ప్రకటించే ముందు ఆ బాడీకి రిఫర్ చేయాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి, అక్కడి ప్రజల అవసరాలు అన్నీ పరిశీలించి, ఆ హామీకి ఓకె అనడం లేదా, వద్దనే అధికారం ఆ బాడీకి వుండాలి. లేకుంటే ప్రజలకు ఇళ్లు, ఫ్రిజ్ లు, టీవీలు, ల్యాప్ టాప్ లు, వాళ్లు తీసుకునే రుణాల మాఫీలు, అన్నీ ప్రభుత్వాలే సమకూర్చాలి. దానికోసం అర్హులు కాని మిగిలిన ప్రజల ముక్కుపిండి, పాన్ కార్డుల సాక్షిగా ఇతోధికంగా సవాలక్ష రకాల పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేయాలి. ఎవరో తీసుకున్న రుణాలు మిగిలిన వారు చెల్లించినట్లన్నమాట. ఇదే ప్రజాస్యామ్యం అంటే మరి. వీడి విద్యా రుణం,. ఇంటి రుణం వీడే చెల్లించాలి. వాడి పంట రుణానికి పన్నురూపంగా వీడే బాధ్యుడవ్యాలి.

చాణక్య

[email protected]