యమశాసనమా మజాకా? దాన్ని ధిక్కరిస్తారా? మీకు ప్రకటనలు కట్..అంటున్నారట..యమలీల యూనిట్. ఆ మధ్య సినిమాలపై సమీక్షలు వేస్తుంటే, టాలీవుడ్ కు నష్టమని చెప్పి, సాక్షిలో వాటిని ఆపేయించారు. దాంతో ఇప్పుడు సాక్షి దినపత్రిక, వెబ్ సైట్లలో సమీక్షలు ఆగిపోయాయి. ఇప్పుడు చానెళ్ల వైపు మళ్లింది దృష్టి, చానెళ్లు అన్నింటిలో రెండు చానెళ్లు మాత్రమే సినిమా సమీక్షల కార్యక్రమం ప్రసారం చేస్తున్నాయి.
టీవీ 5, టీవీ 10. యమలీల సినిమాకు ఇటు వెబ్ సైట్లకు, చానెళ్లకు భయంకరంగా ప్రకటనలు ఇచ్చారు. కానీ సమీక్షలు దాదాపు అన్నింటిలో నెగిటివ్ గానే వచ్చాయి. వెబ్ సైట్ల సంగతి పక్కన పెడితే, వెంటనే ఆ రెండు చానెళ్లకు తమ సినిమా ప్రకటనలు ఆపేయమని యూనిట్ కోరినట్లు తెలుస్తోంది. సినిమా విడుదల రోజు సాయంత్రమే ఈ ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. అయితే దీనిపై చర్చలు సాగుతున్నట్లు వినికిడి.
ఇదిలా వుంటే ఈ సమీక్షల వల్ల సినిమాలకు తీరని నష్టం జరుగుతోందని, అందువల్ల వెబ్ సైట్ల ప్రతినిధులను సినిమా కార్యక్రమాలకు పిలవ కూడదని, అలాగే టాలీవుడ్ తరపున ఓ వెబ్ సైట్ పెట్టి, అందులోనే ఫొటోలు, విశేషాలు వుంచి, అవసరమైతే అక్కడి నుంచి డౌన్ లోడ్ తీసుకునేలా విధానం రూపొందించాలని భావిస్తున్నారట.
అంతా బాగానే వుంది. ఈ సమీక్షలు, ఈ వ్యవహారాలు తీసేస్తే సినిమాను ఎన్ని రోజులు బతికించగలరు? గతంలో ఈ వెబ్ సైట్లు, చానెళ్లు, దినపత్రికల సమీక్షలు లేని రోజుల్లో సినిమాల్లో ఘోరమైన ఫ్లాప్ లు లేవా? నీరాజనం సినిమా పాటలు అద్భుతం. జనాలు రెండేళ్ల పాటు ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసారు. సినిమా వచ్చింది. మార్నింగ్ షో వేసారు. మాట్నీకి డబ్బాలు సర్దేశారు. ఎవరు సమీక్ష రాసారు? ఎవరు చానెల్ లో ప్రసారం చేసారు?
ఎన్టీఆర్ ఏకవీర..ఓ అధ్భుతమైన అంచనాలతో విడుదలైంది. విశ్వనాధ వారి ప్రముఖ నవల. మహదేవన్ అద్భుతమైన పాటలు. వారం ఆడడం ఆ రోజుల్లో కష్టమయింది. అప్పట్లో సినిమా పడితే నెల రోజులు కనీసం ఆడే పరిస్థితి వుండేది. అక్బర్ సలీం అనార్కలి. సి. రామచంద్ర, మహ్మద్ రఫీ అద్భుతమైన పాటలు, ఎన్టీఆర్-బాలయ్య కాంబినేషన్..రెండు రోజుల్లో ఫట్..ఎవరు సమీక్షలు రాసారని? ఎవరు సమీక్షల ప్రసారం చేసారని?
మరి ఏ సమాచార వ్యవస్థ లేని రోజుల్లోనే సినిమాలను ప్రేక్షకులు అంత త్వరగా ఎలా తిప్పి కొట్టగలిగారు? వారికి నచ్చిన వాటిని ఎలా నెత్తినపెట్టుకున్నారు? వేటగాడు, అడవిరాముడు, డ్రైవర్ రాముడు, ఎవరు చెపితే చూసారు?
అంతెందుకు ఆ మధ్య ఓ సినిమా వచ్చింది. దానికి దాదాపు అన్ని వెబ్ సైట్ల నుంచి మాంచి రేటింగ్ లు వచ్చేసాయి. కానీ సినిమా ఆడడం అంతంతమాత్రం అయింది.మరి దానికి ఎవరు బాధ్యులు? జనాలకు వాస్తవం తెలుసు. నచ్చే సినిమాను నెత్తిన పెట్టుకుంటారు..నచ్చని వాటిని వదిలేస్తారు..దానికి ఒకరి రికమెండేషన్ వారికి అక్కరలేదు. పొరపాటున వెబ్ సైట్ కానీ, చానెల్ కానీ తప్పుడు సమీక్షలు ఇస్తే, ముందు వాటిని పక్కకు పెట్టే తెలివి జనాలకు ఎప్పుడో అబ్బింది. చానెళ్లకు కానీ, వెబ్ సైట్ లకు కానీ క్రెడిబులిటీ సమస్య వుంటుంది. అందువల్ల వారు ప్రకటనల కన్నా రీడబులిటీకే ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంటుంది.
అసలు సినిమా ప్రకటనలు పొందే వెబ్ సైట్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కానీ తెలుగు వెబ్ సైట్ల సంఖ్యవేలల్లో వుంది. మరి కేవలం కొన్నింటికి ప్రకటనలు ఆపడం ద్వారా లేదా, ప్రతినిధులను పిలవక పోవడం ద్వారా, ఈ వేలాది వెబ్ సైట్లను ఎలా కంట్రోలు చేయగలరు? అలా ఎలా ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు..డైరక్టర్ ఎవరో తెలియదు..హీరో మాత్రం గతంలో ఓ సినిమా చేసాడు..వాళ్లు ఏ వెబ్ సైట్ కు ప్రకటనలు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఫరవాలేదనే టాక్ ఎలా వచ్చింది?
బాపు లాంటి దిగ్దర్శకుడు తన రాధాగోపాలం సినిమా ఫ్లాపయితే టేకిటీజీగా తీసకుని, తన సినిమా మీద తానే కార్టూన్లు వేసుకున్నాడు. ఇంటి పెరట్లోనే పాటలు చిత్రీకరించిన భారీ గో..ప్ప చిత్రణ అని కార్టూన్ వేసుకున్నాడాయన. సరే వెబ్ సైట్లో, చానెళ్లో తప్పు ప్రసారం చేసాయి..రాసాయి అనుకుందాం..అలా తప్పు రాస్తే, తరువాత హిట్ అయిపోయిన సినిమాల శాతం ఎంత వుంటుంది? ఒక్కశాతానికి మించదు. అక్కడ కూడా సమీక్షలు వాణిజ్య పరమైన విజయమా? అపజయమా అన్నదాన్ని బట్టి కాకుండా, మంచి సినిమానా కాదా అన్నదాన్ని బట్టి సాగి వుంటాయి తప్ప వేరు కాదు.
ఒకప్పుడు ఎంత హిట్ అయినా ఓవర్ సీస్ ఆదాయం వుండేది కాదు. కానీ రాను రాను ఒకపక్క మనవాళ్ల సంఖ్య అక్కడ పెరగడం, వాళ్లకి కావాల్సిన సినిమా సమాచారం వెబ్ సైట్లు నిత్యం అందివ్వడం, సినిమా షెడ్యూళ్ల వంటి సమాచారం అందించడం ద్వారా ఇవ్వాళ ఓవర్ సీస్ ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. కేవలం వెబ్ రిపోర్టర్లను ప్రత్యేకంగా పిలిచి మరీ ఇంటర్వూలు, మీటింగ్ లు పెడతున్నది ఎందుకు? వాటి ప్రభావం వుంది కనుకనే.
సరే, వెబ్ సైట్లనో, చానెళ్లనో నియంత్రించే ఫ్రయత్నం చేస్తారు. ఓకె. మరి రాను రాను పాపులర్ అవుతున్న ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ ల పరిస్థితి ఏమిటి? కాస్త విశ్లేషించగల కామన్ ప్రేక్షకుడు ఈ మాధ్యమాల ద్వారా తన అభిప్రాయం వెల్లడించడాన్ని నియంత్రించగలరా? అది ఏ విధంగా వైర్డ్ గా పాకిపోతుందో తెలుసుకదా? మోడీ విజయం వెనుక, బాబు విజయం వెనుకు ఈ సామాజిక మాధ్యమాలు వున్నాయన్న సంగతి తెలిసిందే కదా. మరి ఇంకా బ్లాగ్ ల సంగతేమిటి? వాటిని ఎవరు ఆపగలరు?
టాలీవుడ్ క్లిష్ట పరిస్థితుల్లో వుంది. వెబ్ సైట్లు, చానెళ్ల వల్ల కాదు..సరైన సినిమాలు రాకపోవడం వల్ల. అది గమనించి, ఆ దిశగా ఆలోచనలు చేస్తే, ఇంతకన్నా మంచి ఫలితాలు వుంటాయి. అంతే కానీ భావ ప్రకటనాస్వేచ్ఛను, కలాలను కట్టడి చేసి కాదు.