ఈసారి పార్లమెంటు సమావేశాల్లో జనతా పరివార్ సభ్యులు కాస్త కోలాహలం చేస్తున్నారు. మూడో ఫ్రంటని, నాలుగో ఫ్రంటని చెప్పుకుంటూ, చివరకు ఏమీ లేకుండా ఎవరిదారి వాళ్లదేగా బతుకుతూ వచ్చిన వీళ్లు యిప్పుడు బిజెపి ధాటికి అడలెత్తి, చేతులు కలుపుతున్నారు. గతంలో జనతా పార్టీలో నాయకులుగా వుండి ఆ పార్టీ విచ్ఛిన్నమైన తర్వాత జనతా దళ్ (సెక్యులర్) అని, జనతా దళ్ (యునైటెడ్) అని, రాష్ట్రీయ జనతా దళ్ అని, (ఇండియన్ నేషనల్) లోక్‌దళ్ అని, (రాష్ట్రీయ) లోక్‌దళ్ అని, సమాజవాదీ పార్టీ అని విడిపోయిన వీళ్లందరూ జనతా పరివార్ పేర మళ్లీ కలుద్దామని చూస్తున్నారు. గతంలో అందరూ కాంగ్రెసును ఎదిరించినట్లు, యిప్పుడు బిజెపిని ఎదిరించాలని ప్లాను. మేరఠ్‌లో ఒక సమావేశంలో దేవెగౌడ, అజిత్ సింగ్, నితీశ్ కుమార్, శరద్ యాదవ్, శివపాల్ సింగ్ యాదవ్ (ములాయం సోదరుడు) వేదిక పంచుకున్నారు. నవంబరు మొదటి వారంలో ఢిల్లీలో మీటింగు జరిగింది. దానిలో లాలూ, దుష్యంత్ చౌటాలా (ఓం ప్రకాశ్ మనుమడు) వచ్చి చేరారు. జనతా దళ్ పేరున్న మరో పార్టీ (బిజూ) జనతా దళ్ దూరంగానే వుంది.
ఈ నాయకులందరూ తమ సీనియర్ల సారథ్యంలో 1977లో జాతీయస్థాయిలో ఇందిరా గాంధీని ఓడించారంటే దానికి కారణం – ఆమె ఎమర్జన్సీ విధించి అత్యాచారాలకు తావివ్వడం. విసిగిపోయిన ప్రజలకు వీళ్లను గెలిపించారు. అదే విధంగా 1989లో రాజీవ్‌ను ఓడించారంటే కారణం – బోఫోర్స్ కుంభకోణంలో అతని ప్రతిష్ట మసకబారడం. ఎన్నో ఆశలతో గెలిపించిన రాజీవ్ అవినీతికి పాల్పడ్డాడని తెలియడంతో హతాశులైన ప్రజలు బోఫోర్స్ నిందితులను 100 రోజుల్లోగా బయటపెడతానని విపి సింగ్ ప్రతిజ్ఞ చేయడంతో నమ్మి, నేషనల్ ఫ్రంట్‌కు పట్టం కట్టారు. తర్వాత నిరాశ చెంది, మళ్లీ కాంగ్రెసునే అధికారంలోకి తీసుకుని వచ్చారు. ఇప్పుడు విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం విషయంలో మోదీ 100 రోజుల ప్రతిజ్ఞ చేసి నిరాశ పరిచారు కాబట్టి ప్రజల అసంతృప్తిని తమ కనుకూలంగా మలచుకుందామని జనతా పరివార్ నాయకులు నడుం బిగించారు.
ఈవారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి
అయితే 1977కి, 2004కి మధ్య కాలప్రవాహంలో చాలా మార్పులే సంభవించాయి. ఈ మధ్యలో యీ జనతా పరివార్ భాగస్వామ్య పార్టీలు తమ తమ రాష్ట్రాలలో అధికారాన్ని చవి చూడడం, అవినీతిలో కూరుకుపోవడం జరిగింది. సిద్ధాంతాల బలిమివలన కాకుండా కొన్ని కులాల ఓట్లపై వీళ్లు తమ రాష్ట్రంలో అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. రాష్ట్రం బయట వీళ్ల ప్రభావం అత్యల్పం. రాష్ట్రంలో సైతం వీళ్ల ఓట్లశాతంలో గణనీయమైన మార్పు వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీని తీసుకుంటే యుపిలో 1999లో దాని ఓట్లశాతం 25.1 వుంటే 2014 పార్లమెంటు ఎన్నికలలో 22.2. బిహార్‌లోకూడా ఆ పార్టీ పోటీ చేస్తే దానికి రాష్ట్రం మొత్తం మీద లక్ష ఓట్లు కూడా రాలేదు. హరియాణాలో 10 వేలు కూడా రాలేదు. కర్ణాటకలో 30 వేలు దాటలేదు. కర్ణాటకలో జెడి (ఎస్)కు అప్పటికి (10.9%), యిప్పటికి (11%) పెద్దగా మార్పు లేదు. పైగా కర్ణాటక మొత్తమంతా వ్యాపించలేదు కూడా. దక్షిణ కర్ణాటకలోనే దానికి పట్టు మిగిలింది. హరియాణాలోని ఐఎన్‌ఎల్‌డి అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడుసార్లు ఓడిపోయింది. అయినా 24.1% ఓట్లు తెచ్చుకుంది.
జెడి(యు)కు బిహార్‌లో 1999లో 26.4% ఓట్లు వస్తే (అప్పుడు బిజెపితో పొత్తు పెట్టుకుంది) 2014లో 15.8% వచ్చాయి. ఆర్‌జెడికి అదే బిహార్‌లో అప్పుడు 33.9% యిప్పుడు 20.1%. బిహార్‌లో యీ రెండు పార్టీలు చేతులు కలిపితే గెలుస్తాయి. ఎందుకంటే యిద్దరి ఓటు బ్యాంకు ఒకటే. ఇప్పుడు వీళ్లందరూ కలిసి యీ రోజు తృణమూల్‌కు అండగా నిలిచి, విస్తరిద్దామని చూస్తున్నారు. రేపు జయలలిత కోర్టు కేసుల విషయంలో ఎడిఎంకెకో, శారదా చిట్స్ విషయంలో నవీన్ పట్నాయక్‌కో మద్దతు యిస్తారు. ఎవరికి వారు విడిగా వుంటే మోదీ అందర్నీ కబళించేయగలడన్న భయంతో వారూ కలిసి రావచ్చు. ప్రధాని అభ్యర్థి ఎవరు అనే సమస్య వచ్చేదాకా యీ ఐక్యత కొనసాగవచ్చు. ఐదేళ్ల దాకా ఆ సమస్య రాదు కాబట్టి కొంతకాలం నెట్టుకుని వచ్చేయవచ్చు.
-ఎమ్బీయస్ ప్రసాద్