కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ వ్యవహారం రాను రాను మరింత అభాసు అవుతోంది. ఏకంగా కిరణ్ పోటీ నుంచే తప్పుకోవడం అంటే, విజయం పట్ల ఆయనకున్న ధీమా ఏ మేరకు సడలిపోయిందో వెల్లడవుతోంది. సరియైన టైమ్ లో సరియైన నిర్ణయం అన్నది దేనికైనా అవసరం. రాజకీయ పార్టీలకు కూడా అదే వర్తిస్తుంది. సమైక్య ఉద్యమం కీలకంగా, క్రియాశీలకంగా వున్న సమయంలో కిరణ్ తెరవెనుక ఏం చేసారో తెలియదు కానీ, తెర ముందు మాత్రం అధికారాన్ని అనుభవించడంలోనే మునిగి వున్నారు. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకున్న చందంగా వ్యవహరించారు. చెప్పిన కబుర్లు ఏవీ నిజాలు కాలేదు. అంతా లేస్తే మనిషిని కాను అన్న రీతిలో సాగింది.
ఆయన లేవలేదు. మనిషి గానే మిగిలారు. అంతా వెళ్లిపోయాక సంత అని అన్నీ జరిగిపోయాక, ఆయన రాజీనామాతో అవసరం తీరాక, సమైక్యాంధ్ర అన్నదే లేకుండా పోయాక, జై సమైక్యాంధ్ర అంటూ ఫార్టీ పెట్టారు. పంచపాడవులంటే, మంచంకోళ్లలా…అన్న సామెతలా, కిరణ్ వెనుక నిల్చున వారి సంఖ్య నానాటికీ తీసికట్టు నామం బొట్టు అయిపోయింది. ఇప్పుడు అసలు ఆ పార్టీ ఎంత హడావుడి చేసినా జనంలో స్పందన లేదు. కాంగ్రెస్ టికెట్ ల కోసం కూడా కొట్టుకున్న దాఖలాలు వున్నాయి కానీ, జై సమైక్యాంధ్ర పార్టీకి లేదు. జగన్ ను కిందకు నొక్కడానికి, రెడ్డి ఓట్లను చీల్చడానికి, అధికారంలో వున్నంతకాలం తమ పనులు చేయించుకోవడానికి నెత్తిన పెట్టుకున్న కొందరు ఇప్పుడు తెలుగుదేశాన్ని మోయడంలో బిజీ అయిపోయారు.
నిన్నటి దాకా తనను మోసిన వారు,. ఇప్పుడు టక్కున కాడి వదిలేయడం చూసి, కిరణ్ అవాక్కయ్యారు. రెడ్ల ఓట్లను చీల్చడానికో, జగన్ వైపు జనాలు వెళ్లకుండా కట్టడి చేయడానికో, మరెందుకైనా పనికివస్తాడులే అని ఇన్నాళ్లు భరించారు. అవసరం తీరాక చెప్పులను బయటే వుంచుతారు కానీ, నట్టింట్లో కాదన్న సత్యం కిరణ్ కు ఇప్పుడు తెలిసింది.
నమ్మి పదవి ఇచ్చిన కాంగ్రెస్ దృష్టిలో విశ్వాసం లేని వాడయ్యాడు. రాజీనామా సకాలంలో చేయక సీమాంధ్రుల దృష్టిలో నాటకాలు ఆడిన వాడిగా మిగిలిపోయాడు. ఇంక చివరకు మిగిలింది ఒక్కటే, పార్టీని ఏదో ఒక పార్టీలో కలిపేయడం. బహుశా దానికి ముహుర్తం ఎన్నికల అనంతరం కుదిరి వుంటుంది.
చాణక్య