తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే కెసియార్ చేసిన ప్రకటనలోని హుందాతనం ఎన్నికలవేళ వచ్చేసరికి మాయమై పోయింది. జాతీయ స్థాయిలో వ్యవహరించబోయే స్టేట్స్‌మన్‌లా కాకుండా ఉపప్రాంతీయ పార్టీ స్థాయి నాయకుడిలా మాట్లాడుతున్నారు. విభజన బిల్లులో అంగీకరించిన అన్ని విషయాలను తిరగతోడుతూ వాటికి అంగీకరించినందుకు కాంగ్రెసును తిట్టిపోస్తున్నారు. దీనికంతా కారణం సీమాంధ్రుల కుట్రే అంటూ వారినీ తిడుతున్నారు. ఎన్నికల సమయంలో సాధారణంగా ఆవేశకావేషాలు హద్దు మీరతాయి. కార్యకర్తలను హుషారు చేయడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి అసాధ్యమైన హామీలు, ప్రతికకక్షులపై తీవ్రమైన ఆరోపణలు చేయడం కద్దు. ఆ తర్వాత అవన్నీ మర్చిపోయి మామూలుగా వుంటూంటారు కూడా. కెసియార్ కూడా అలాగే వుంటారని అనుకుని ఊరడిల్లవచ్చా?
నెగ్గినా, ఓడినా యీ ధోరణి మారదు
ఈ ఎన్నికలలో తెరాస చాలా రిస్కు తీసుకుని పోటీ చేస్తోంది. 2004, 2009లలో పొత్తులు పెట్టుకుని పోటీ చేసింది. ఉపయెన్నికలలో సొంతంగా పోటీ చేసినపుడు కొన్నిసార్లు ఘోరంగా దెబ్బ తింది. మరి కొన్ని సార్లు ఘనవిజయం సాధించింది. 2009 డిసెంబరు ప్రకటన తర్వాతే తెరాస బాగా ఎదిగిందని చెప్పాలి. ఈ ఎన్నికలలో కాంగ్రెసు, బిజెపిలతో పొత్తు పెట్టుకుని వుంటే విజయం సాధించినా ఆ పొత్తుకు పోతుందేమోనన్న భయమో ఏమో కానీ, తెరాస తన సత్తా ఎంతో పరీక్షించుకుంటోందనే చెప్పాలి. ఓటర్లకు తెరాసపై మోజు వుందన్న అభిప్రాయంతోనే యితర పార్టీ నాయకులు వచ్చి తెరాసలో చేరుతున్నారు. కార్పోరేట్ దిగ్గజాలు కూడా. ఇప్పుడు ఛాన్సు వదులుకుంటే మరెప్పుడూ తన శక్తి చూపించే అవకాశం రాదన్న ఉద్దేశంతో తెరాస ఒంటరిగా పోటీ చేస్తోంది. ఆ క్రమంలో కాంగ్రెసు, బిజెపిలతో తలపడుతోంది. ఫలితాలు ఎలా వస్తాయో యిప్పుడే చెప్పలేం కానీ కెసియార్ ప్రజలను కోరుతున్నట్లు 100 ఎసెంబ్లీ సీట్లయితే రావని కచ్చితంగా చెప్పవచ్చు. అనేక చోట్ల తెరాసకు పార్టీ కార్యకర్తలు లేరు. వ్యవస్థ లేదు. కొన్ని జిల్లాలలో తెరాసకు మొదటినుండీ పట్టు లేదు. పట్టున్న వరంగల్, కరీంనగర్ జిల్లాలలో యితర పార్టీ నాయకులు కూడా తెలంగాణ కోసం ఉధృతంగా పని చేసినవారే కాబట్టి వారికీ ఓట్లు పడి పోటీ తీవ్రంగా వుంటుంది. ఫిరాయింపులు ప్రోత్సహించిన చోట, తొలినుండీ వున్న కార్యకర్తలు అలిగి తిరుగుబాటు చేయవచ్చు. ఈ లెక్కన చూస్తే తెరాస గెలుచుకునే సీట్ల సంఖ్య 50 కు దరిదాపుల్లో వుంటుందనుకోవచ్చు. ఊపు వస్తే 10-15 కలుస్తాయి. లేకుంటే అన్ని తగ్గుతాయి. ఏది ఏమైనా తెరాస అధికారం అంచుల్లో వుంటుంది కానీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది అని యీ థలో చెప్పలేం.
తెరాస అధికారంలోకి వస్తే – యిప్పుడు ఎడాపెడా చేస్తున్న వాగ్దానాలు తీర్చలేదని మెడమీద తలకాయ వున్నవాడెవడైనా చెప్పవచ్చు. యీ మాట అన్ని పార్టీలకూ వర్తిస్తుంది. ఎవరూ హామీలు నెరవేర్చరు. దానికి వారు చెప్పే కారణాలు – పూర్వపు ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది, కేంద్రం సహకరించలేదు, ప్రభుత్వయంత్రాంగం సహకరించటం లేదు, ప్రతిపక్షాలు ప్రతీదాన్నీ రాజకీయం చేస్తున్నాయి, ఆర్థికసంక్షోభానికి కారణం కేంద్రవిధానాలు, అమెరికా విధానాలు, ప్రపంచబ్యాంకు విధానాలు… యిలా వుంటాయి. తెరాస కూడా యివన్నీ చెపుతూనే యింకా కొన్ని చేరుస్తుంది – తెలంగాణ ఎదగకుండా, దానికి నిధులు రాకుండా సీమాంధ్రులు అడ్డుపడుతున్నారు, వాళ్ల పల్లకి మోసే యింటిదొంగలు కూడా వారితో చేరుతున్నారు, ఆంధ్రరాష్ట్రం ఏర్పడినా వెళ్లిపోకుండా యిక్కడే వుండిపోయిన ప్రభుత్వోద్యోగులు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పథకాలు సామాన్యులకు అందకుండా చేరుస్తున్నారు, మా పార్టీ పాలనా సామర్థ్యానికి చెడ్డపేరు తెచ్చేందుకు అహరహం శ్రమిస్తున్నారు… ఇలా ప్రతీదానికీ ఆంధ్రులను నిందించడం పరిపాటి అవుతుంది. తెరాస అధికారంలోకి రాకుండా ప్రతిపక్షంలో వుంటే – అప్పుడు కూడా నిందలేస్తుంది. ప్రభుత్వంలో వున్న పార్టీకి ఆంధ్రలో శాఖ వుంది కాబట్టి, వాళ్లకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని, వాళ్లకు అమ్ముడుపోయారనీ, తామే అధికారంలో వుండి వుంటే అలా జరిగివుండేది కాదనీ, మళ్లీ ఉద్యమం చేసి ఆంధ్ర తొత్తులను తరిమేదాకా నిద్రపోమనీ… యిలా!
ప్రజలను రెచ్చగొట్టడం సులభం
ప్రజల్లో సాధారణంగా అసంతృప్తి వుంటుంది. దానికి ఎవరో ఒకరిని దోషులుగా నిలబెట్టి, వారినుండి మిమ్మల్ని రక్షించడానికే అవతరించానని చెప్పడం చాలా అనువైన పని. తెరాస చేస్తూ వచ్చినది అదే. విభజన జరిగినప్పుడు యిరుపక్షాలకు ఎంతో కొంత యివ్వక తప్పని పరిస్థితి వుంటుందని అందరికీ తెలుసు. హైదరాబాదును, దాని ఆదాయాన్ని సాంతం తెలంగాణకు కట్టపెట్టినపుడు సీమాంధ్రకు కూడా ఏవో కొన్ని రాయితీలు యివ్వకతప్పదు కదా. ఎప్పుడో శాంక్షన్ అయిన పోలవరం ప్రాజెక్టును యిప్పుడు మెహర్బానీగా యిచ్చినట్టుగా చూపించారు. ప్రత్యేక రాష్ట్ర హోదా అన్నారు, అదీ తక్కిన రాష్ట్రాలు ఒప్పుకుంటేనే సాధ్యమవుతుంది. పన్ను రాయితీలు, వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తింపు వగైరాలు వచ్చే కేంద్రప్రభుత్వం కటాక్షవీక్షణాలపై ఆధారపడి వున్నాయి. పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్సు విడుదల చేయబోయి ఆపేశారు. ఇవన్నీ కాగితాలపై యిచ్చిన ఉత్తుత్తి హామీలే. కానీ వీటినే కెసియార్ చూపించి 'ఆంధ్రకు అన్నీ దోచిపెడుతూంటే టి-కాంగ్రెసు నాయకులు గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్నారు, బిజెపి వారు వంతపాడారు' అని ప్రచారం చేస్తున్నారు. పోలవరం కట్టనీయం అని టి-కాంగ్రెసు నాయకులు ప్రకటిస్తేనే వాళ్లు అచ్చమైన తెలంగాణ బిడ్డలట, కాకపోతే కారట. ఆ రాయితీలు, ప్రత్యేక హోదాలు తెలంగాణకు యివ్వకపోవడం అన్యాయం అని హుంకరిస్తున్నారు. తెలంగాణకు హైదరాబాదు పూర్తిగా యిస్తారని ఎవరూ అనుకోలేదు. ఆదాయంలో సీమాంధ్రకు వాటా యిస్తారనే అనుకున్నారు. అది కూడా ఎగ్గొట్టినా కెసియార్‌కు చాలలేదు. ఇంకా ఏదో చేయలేదని సాధిస్తున్నారు.
ఆయన ప్రధాన టార్గెట్ ఉద్యోగులు. వాళ్లకు ఆప్షన్లు ఎలా యిస్తారు? వాళ్లు వెళ్లకపోతే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? అని తెలంగాణ యువత ఉపాధి అవకాశాలు చెడిపోవడానికి ప్రభుత్వోద్యోగుల ఆప్షన్లే కారణం అని చిత్రీకరిస్తున్నారు. ఆప్షన్ల విషయంలో రాజ్యాంగం కొన్ని పద్ధతులు నిర్దేశించి వుంటుంది. గతంలో రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఎలా చేశారో చూసి, అలాగే యిక్కడా చేస్తారు. చేయాలి. లేకపోతే బాధితులు కోర్టులకు ఎక్కి మొత్తం ప్రక్రియపై స్టేలు తెచ్చుకుంటారు. కెసియార్ చెప్పారు కదాని ఆప్షన్లు మానడమో, పొన్నాల చెప్పారు కదాని యివ్వడమో చేయరు. ఆప్షన్లు వుండవని చెప్పకపోతే పొన్నాల తెలంగాణ ద్రోహి అని కెసియార్ తీర్మానించారు. హీరోషిమా, నాగసాకిల కంటె తెలంగాణలో ఎక్కువ విధ్వంసం జరిగిందట, దానికి కారణం వలస పాలకులట. కెసియార్ చాలా ఏళ్లు రూలింగు పార్టీలో వున్నారు. మరి ఆయనకు ఆ విధ్వంసంలో బాధ్యత లేదా? అన్నీ ఆంధ్రుల నెత్తిన రుద్ది ఉద్యమం నడిపారు. అనుకున్నది సాధించారు. ఇక రాష్ట్రం వచ్చాక కూడా ఎన్నికలలో లబ్ధికోసం అదే పాట పాడితే ఎలా? కానీ పాడతారు. ఈయనే కాదు, ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కక బయటకు వచ్చిన ప్రతి అసమ్మతి నాయకుడూ యిదే రాగం ఎత్తుకుంటారు. తక్కినవాళ్లు ఆంధ్రులకు అమ్ముడుపోయారని, అది చూడలేకే బయటకు వచ్చాననీ చెప్పుకుంటారు. గతంలో విజయశాంతి చెప్పుకోలేదా? తను తెలంగాణ బిడ్డ అనే కారణం చేత ఆంధ్ర సినిమా నటులు, నిర్మాతలు అవకాశాలు యివ్వలేదట, ఆ ఆధిక్యం భరించలేకే బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ పెట్టిందట. ఆమె అంతటి స్టార్ కావడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. రాజకీయ అవసరం ఏమైనా అనిపిస్తుంది.
ఈ రగడలు యిప్పట్లో చల్లారవు
కెసియార్ చెప్పినమాటల్లో ఒక వాస్తవం వుంది – ఆంధ్రులతో పంచాయితీ ముగిసిపోలేదు అని. ఉమ్మడి రాజధాని వున్నంతకాలమే కాదు, తర్వాత కూడా నదీజలాల వద్ద, నీటి ప్రాజెక్టుల పంపిణీ వద్ద, విద్యుత్ పంపకాల వద్ద, ఆస్తి అప్పుల వివాదాల వద్ద.. యిలా ఎన్నో ఏళ్లపాటు యిచ్చిపుచ్చుకోవడాలు జరుగుతూనే వుంటాయి. కొన్నిటిలో ఒకరిది పై చేయి అవుతుంది, మరి కొన్ని వాటిల్లో యింకోరిది అవుతుంది. ఈ రోజు సోనియా తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించి సీమాంధ్రకు సున్న చుట్టినట్లు, రేపో, మర్నాడో కేంద్రంలో వచ్చే ప్రభుత్వం సీమాంధ్రను చంకకు ఎత్తుకుని, తెలంగాణను నిర్లక్ష్యం చేయవచ్చు. అంతా ఆనాటి రాజకీయ అవసరాలపై ఆధారపడుతుంది. తాము కోరుకున్న విధంగా జరగనప్పుడల్లా అధికారంలో వున్నవారు అమ్ముడుపోయారని అంటూ వుంటే యీ రగడ ఎప్పటికీ చల్లారదు. ఢిల్లీలో వున్న ఎపి భవన్‌పై కెసియార్‌కు అంత మమకారం దేనికో తెలియదు. దానిలో ఆంధ్రకు వాటా యివ్వకూడదట, అచ్చం తెలంగాణకే కావాలట. హైదరాబాదు వంటి మహారాజధాని దక్కినందుకు ఆయనకు తృప్తి లేదు. విద్యుత్ సౌధ తెలంగాణకు పూర్తిగా యిచ్చేసి ఆంధ్ర విద్యుత్ బోర్డుకు గచ్చిబౌలిలో భవనం చూస్తున్నారని వార్తలు వచ్చాయి. నగరం నడిబొడ్డులో వున్న విద్యుత్ సౌధ నుండి మమ్మల్ని వూరవతలికి పొమ్మంటే ఎలా అని ఆంధ్ర ఉద్యోగనాయకులు గోల చేస్తూంటే, పాత భవనాలు మా మొహాన కొట్టి, కొత్తవి వాళ్లకిస్తారా అని తెలంగాణ ఉద్యోగనాయకులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా ప్రతీదాన్నీ వివాదంలోకి దించితే పంపకాలకై వచ్చిన కేంద్ర ఉన్నతోద్యోగులు జుట్టు పీక్కోవాలి.
ఉమ్మడి రాజధాని పదేళ్లెందుకు? అని యింకో పేచీ. అసలు ఉమ్మడి రాజధాని వలన ఆంధ్ర రాష్ట్రానికి లాభం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆంధ్ర ఉద్యోగులు, నాయకులు మాటిమాటికీ హైదరాబాదు వచ్చి యిక్కడి వ్యాపారసంస్థలు దెబ్బ తినకుండా చూడడం తప్ప దాని వలన ఆ రాష్ట్రానికి ఒనగూడే ప్రయోజనం ఏముంది? హైదరాబాదులోని వాళ్ల ఆఫీసులకు అద్దె కట్టుకోవాలి. అక్కడే అయితే తక్కువలో వస్తాయి. ఆ అద్దె తెలంగాణ రాష్ట్రానికే ఆదాయంగా వస్తుంది. అలాగే వారు పెట్టే ఖర్చంతా తెలంగాణ అభివృద్ధికే దోహదపడుతుంది. హైదరాబాదు ఆదాయంలో సీమాంధ్రకు వాటా వుంటే అదో దారి. అది లేనప్పుడు వాళ్లు యిక్కడకు వచ్చి తెలంగాణకు మేలు చేయడం దేనికి? పైగా అలా రావడం వలన యిక్కడకు వచ్చి యింకా దోపిడీ కొనసాగిస్తున్నారన్న మాట పడడం తప్ప! వాళ్లు యిలా వస్తూపోతూ వుంటే – 'మెడ పట్టుకుని గెంటినా యింకా సిగ్గు లేకుండా వస్తున్నారు' అని ప్రచారం చేయడం తథ్యం. ఇలాటి వాదనలే మహారాష్ట్రలో శివసేన చేసింది. శివసేన ఆవిర్భావానికి పూర్వం బొంబాయి, మహారాష్ట్ర అన్ని జాతుల వారికీ ఆశ్రయం యిచ్చింది. గుజరాతీలు, సింధీలు, పార్శీలు, పంజాబీలు, దాక్షిణాత్యులు.. అందరూ బొంబాయి ఆర్థికాభివృద్ధికి తోడ్పడి దాన్ని ఫైనాన్షియల్ కాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దారు. శివసేన వచ్చాక రూపం మారింది. బొంబాయి మహారాష్ట్రులదే అన్న నినాదం బయలుదేరింది.
శివసేన – గుజరాతీలు
మహారాష్ట్ర నుండి గుజరాత్ విడివడింది. అయినా గుజరాతీలకు వ్యతిరేకంగా బొంబాయిలో ఉద్యమాలు జరగలేదు. ఎందువలన? గుజరాతీలు అక్కడ పెట్టుబడులు పెట్టారు, చిన్న వ్యాపారాల నుండి పెద్ద వ్యాపారాల దాకా చేస్తూ మహారాష్ట్రులకు కూడా ఉద్యోగాలు యిచ్చారు. ఉద్యోగాల విషయంలో మరాఠీ వారితో పోటీ పడలేదు. గుజరాతీలకు చదువు పట్ల, ఉద్యోగాల పట్ల పెద్దగా శ్రద్ధ లేదు. వారు ప్రధానంగా వ్యాపారస్తులు. అందువలన మరాఠీలు, శివసైనికులు వారిని ఏమీ అనరు. వారినే కాదు, ఏ పెట్టుబడిదారుణ్నీ వాళ్లు ఏమీ అనరు. అంతేకాదు, వారి మద్దతుతో కార్మిక నాయకులను హింసించారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిలో తమిళులన్నా, కన్నడిగులన్నా వారికి కోపం వుండేది. ఎందుకంటే వారు వైట్ కాలర్ ఉద్యోగులుగా వచ్చి తమ అవకాశాలు చెడగొడుతున్నారని! అందువలన తమిళ కాలనీలపై, ఉడుపి హోటళ్లపై దాడులు చేస్తూ సాధారణ మరాఠీలను ఆకట్టుకున్నారు. ఇటీవలి కాలంలో బ్లూ కాలర్ ఉద్యోగాలలో ఉత్తరభారతం నుండి జనాలు వచ్చి పొట్ట పోసుకుంటున్నారని వారిపై దాడులు చేస్తున్నారు. తెలంగాణకు వచ్చేసరికి పరిస్థితి ఏమిటంటే – ఇక్కడ ఆంధ్రులు పెట్టుబడిదారులు కావడంతో బాటు ఉద్యోగార్థులు కూడా. రిస్కు తీసుకుని పెట్టుబడి పెట్టి తమకు ఉద్యోగాలు యిస్తే తెలంగాణ వారికి అభ్యంతరాలు వుండవు కానీ, తమతో పాటు ఉద్యోగాలకు పోటీ పడితే చికాకే.
నిరుద్యోగులను, చిరుద్యోగులను ఆకట్టుకోవడానికి తెరాస శివసేన బాట పట్టే అవకాశాలు చాలా వున్నాయి. ప్రతి పార్టీలో మితవాదులు, అతివాదులు వుంటారు. దూకుడుగా మొదలైన నాయకత్వం కొంతకాలానికి నిదానిస్తుంది. అప్పుడు యువతరంలోని అతివాదులు విడిగా వచ్చేసి వృద్ధనాయకులపై తిరుగుబాటు చేసి యువతను ఆకట్టుకుని యింకా ఎక్కువ పరుషపదజాలాన్ని ఉపయోగిస్తారు. బాల థాకరే కొడుకు ఉద్ధవ్ థాకరే కంటె సోదరుని కుమారుడు రాజ్ థాకరే ఎక్కువ పాప్యులారిటీ తెచ్చుకుంటున్న విషయం గమనిస్తున్నాం. ఇక్కడ కెసియార్, కెటియార్, హరీష్‌రావుల విషయంలో ఆ కథ పునరావృతం కావచ్చు. అదే జరిగితే నష్టపోయేది తెలంగాణ సమాజమే. అర్హత మాట ఎత్తకుండా భూమిపుత్రుల వాదంతో ఉద్యోగాలు కావాలనే వాదన అన్ని చోట్లా ప్రబలింది. అది అక్కడితో ఆగదు. కులం ప్రాతిపదికపై యివ్వాలంటారు. కులం తర్వాత ఉపకులం ప్రస్తావన కూడా వస్తుంది. ఆంధ్రులకు వ్యతిరేకంగా పోరాడడానికి తెలంగాణ వారంతా కలిసి వచ్చారు. ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి విభేదాలన్నీ ఉబికి వస్తున్నాయి. ఎవరికి వారే యమునాతీరే చందంగా మారి దొరల పాలన, గడీల పాలన అంటూ నిందించుకుంటున్నారు. చీలిపోతున్నారు. యువతలో నాణ్యత పెంచి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి బదులు యిలాటి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి యిక్కడి పారిశ్రామిక వేత్తలపై నిషేధాలు విధించడం మొదలుపెడితే యిక్కడ పెట్టుబడులు పెట్టడానికి వారు జంకుతారు. అంతిమంగా అది రాష్ట్రవికాసానికి అవరోధంగా మారుతుంది. తెలంగాణ ప్రజల హితాన్ని కోరేట్లయితే కెసియార్ బాల్ థాకరే మార్గాన్ని విడిచి స్టేట్స్‌మన్‌గా వ్యవహరించాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2014)