అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్ కందా
నేను మద్రాసీనా? హైదరాబాదీనా?
ఢిల్లీలో దాదాపు ఇరవైయేళ్లు వుండి చీఫ్ సెక్రటరీగా 2003లో హైదరాబాదుకి తిరిగి వచ్చిన తర్వాత 2005లో 60 వ యేట రిటైర్ కాబోతూ వుంటే అప్పుడందరూ అడగ నారంభించారు. ''ఎక్కడ సెటిలవుతారు?'' అంటూ ! అప్పుడు నాకు జౌక్ గుర్తుకు వచ్చాడు.
గాలిబ్‌కు సమకాలీనుడైన మొహమ్మద్ ఇబ్రహీం జౌక్ (1789-1854) అనే ఉర్దూ కవి ఢిల్లీ ఆఖరి బాద్‌షాహ్‌ా బహదూర్ షా జఫర్ ఆస్థానంలో వుండేవాడు. ఆయన జఫర్ యువరాజుగా వుండే రోజుల నుండి నెలకు 4 రూ.ల జీతంతో ట్యూటర్‌గా వుండేవాడు. జఫర్ చక్రవర్తి అయ్యాక జీతం 100 రూ.లు చేశాడు. కానీ జఫర్ ప్రాభవం ఢిల్లీ కోట దాటి వుండేది కాదు. అంతా ఇంగ్లీషువారి పాలనే. ఏ క్షణంలో నైనా ఢిల్లీ సింహాసనం వూగవచ్చు అనేట్టు వుండేది. అటువంటి దుర్భరపరిస్థితిలో ఉన్నా కూడా జౌక్‌కు ఢిల్లీ వదలి పెట్టిపోవాలని అనిపించలేదు.
అప్పట్లో హైదరాబాదు సంస్థానాన్ని నాల్గవ అసఫ్‌జాహీ నిజాం నవాబు పాలిస్తూండేవారు. జౌక్ గురించి విని వచ్చి మా ఆస్థానంలో వుండమని కబురు పంపాడు. సమాధానంగా జౌక్ రాసిన ఓ షేర్ (ద్విపద) చాలా ప్రసిద్ధం. ''దక్కన్ పీఠభూమి స్వర్ణభూమి అని అందరూ అంటారు. అయినా ఓ జౌక్, (వేమన పద్యాలలలో లాగానే కవి తనను తాను ఉద్దేశించి కవిత్వం చెప్పుకోవడం ఉర్దూ షాయరీలలో కద్దు) ఢిల్లీ సందులు వదిలి ఎక్కడకు వెళతావోయ్?'' అని దాని అర్థం.
జౌక్‌ను అనుసరిస్తూనే నేను 'కౌన్ జాయే, కందా, హైదరాబాద్‌కీ గలియా ఛోడ్‌కే' అనే మకుటంతో నేను ఉర్దూలో ఓ వ్యాసం రాస్తే ''సియాసత్'' వాళ్లు ప్రచురించారు. జౌక్ ఢిల్లీలోనే పుట్టాడు. దాన్ని వదిలి వెళ్లబుద్ధి కాలేదు అతనికి.
నేను మద్రాసులో పుట్టాను కాబట్టి మద్రాసే స్వర్గంగా భావించి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకోవాలి. వాస్తవం ఏమిటంటే పుట్టడమే కాదు నేను ఎనిమిదేళ్ల వయసు వరకు మద్రాసులోనే వున్నాను. చదువు, ఆటపాటలు, సినిమాలలో వేషాలు అన్నీ అక్కడే. తమిళం ధారాళంగా వచ్చు. తమిళమిత్రులు బోల్డుమంది. అయినా హైదరాబాదే నేను యిష్టపడి స్థిరనివాసం ఏర్పరచుకునే వూరైంది. అది నా జన్మభూమి కాదు కానీ కర్మభూమి అయింది. హైదరాబాదంటే ఎందుకింత మమకారం? మా తాతగారు కోనసీమలో స్థిరపడ్డారు కానీ అక్కడ నేను ఎప్పుడూ వున్నదీ లేదు, మా కక్కడ యిప్పుడు ఆస్తిపాస్తులూ లేవు. నేననుకుంటాను – మన స్కూలింగ్ జరిగినచోటూ, మనం ఉద్యోగంలో ఎదిగినచోటూ… యిలాటివి మన ఫేవరేట్స్ అవుతాయని. నాకు ఈ రెండూ హైదరాబాదులోనే జరిగాయి.
నా వ్యాసం చదివిన మిత్రులందరూ ''ఓహో, రిటైరయ్యాక హైదరాబాదులోనే వుంటారన్నమాట, బాగుందిబాగుంది'' అంటూ సంతోషించారు. హైదరాబాదు నా జన్మభూమి కాకపోయినా, కర్మభూమి కాబట్టి నేను దాన్ని వదలదలచుకోలేదని ఆనందించారు! కానీ వాళ్లూ, నేనూ మర్చిపోయినది – ఉద్యోగికి దూరభూమి లేదని!
xxxxxx
రావణుడు నేలకూలాడు. విభీషణుడు గద్దె నెక్కాడు. సీతారామలక్ష్మణులు అయోధ్యకు బయలుదేరుతున్నారు. ''మా లంక చూశారుగా, ఎటువంటి ఐశ్వర్యంతో, ఎంత సుందరంగా వుందో! మీరు యిక్కడే వుండిపోకూడదా, మిమ్మల్ని నేను నిత్యం సేవించుకుంటాను'' అని బతిమాలాడు కొత్త రాజు విభీషణుడు. లంక వైభవాన్ని కాదనకుండానే రాముడు తన మనసులో మాట లక్ష్మణుడికి చెప్పాడు –
అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే – జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ||
(ఈ లంక ఎంత స్వర్ణయమమన్నా నాకు రుచించటం లేదు లక్ష్మణా, జనని, జన్మభూమి స్వర్గాన్ని అధిగమిస్తాయి).
నిజమే కదా, ఎంత పేదదైనా తల్లి తల్లే, ఎంత బీదదైనా మాతృదేశం మాతృదేశమే. దాన్ని కాస్త కుదించి చూసుకుంటే పుట్టినవూరుపై మమకారం అనవచ్చు.
రాముడిది జన్మభూమి అయోధ్య కావడం వింత. సాధారణంగా పిల్లలు అమ్మమ్మ గారింట్లో పుడతారు కాబట్టి రాముడు కోసలరాజ్యంలో పుట్టాలి. (అమెరికన్ సిటిజన్‌షిప్ గొడవలు వచ్చాక అమ్మమ్మ యిల్లు, మామ్మ యిల్లు జాన్తానై. తమ పిల్లలు పుట్టుపౌరులు కావాలని అమెరికాలోనే ప్రసవం జరిగేట్లా చూస్తున్నారు) కానీ థరథుడు పుత్రకామేష్టియాగం చేసి సంతానం పొందేడు కాబట్టి కాబోలు రాముడు తండ్రి యింట్లోనే పుట్టాడు. మా నాన్నగారు యాగాలూ అవీ చేయకపోయినా (మొక్కులు మాత్రం మొక్కారు – పుట్టిన పిల్లలు బతికి బట్టకట్టాలని ! అప్పుడప్పుడు మా 'వరస' చూసి మా నాన్నగారు మా అమ్మ దగ్గర ఆశ్చర్యపడేవారు – 'వీళ్లకోసమేనా మనం అన్ని మొక్కులు మొక్కినదీ!?' అని) మా అన్నా, అక్కా, నేనూ ఆయన యిల్లున్న మద్రాసులోనే పుట్టాము. లేకపోతే మా అమ్మమ్మగారిల్లయిన కాకినాడలో పుట్టవలసినవాళ్లం లెక్కప్రకారం.
xxxxxxx
ఆంధ్ర ప్రాంతం విడిపోయి, గుంటూరులో హైకోర్టు ఏర్పడడంతో అప్పటిదాకా మద్రాసు హైకోర్టులో లాయరుగా ప్రాక్టీసు చేస్తున్న మా నాన్నగారు గుంటూరుకు కాపురాన్ని మార్చారు. తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడి హైకోర్టు హైదరాబాదుకి మారింది. నాన్నగారు ఆ లోపునే జడ్జి అయి, హైదరాబాదుకి వచ్చారు. అంటే 10 ఏళ్ల వయసులో నేను హైదరాబాదు వచ్చానన్నమాట. సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో ఒక కాలనీలో నాన్నగారికి ఒక యిల్లు ఇచ్చారు. క్రికెట్ ఆడుకునేటంత చోటున్న యిల్లు. ఇంట్లో రేడియో ఉండేదికాదు. ఆ రేడియా గోలంటే మా నాన్నగారికి చాలా చికాకు కూడాను. ప్రతి బుధవారం రాత్రి ఎనిమిదింటికి ఎక్కడ ఏమిచేస్తున్నా సరే వెంటనే వచ్చేసి బినాకా గీత్‌మాలా వినాలన్న తహతహ నాది. అది వినాలంటే రేడియోలేదు గనుక ఎవరి ఇంటికో పరుగెత్తుకెళ్లి అక్కడ తొమ్మిదిదాకా అది విని, అప్పుడు ఇంటికి వచ్చేవాణ్ని. హైకోర్టు జడ్డిగారింట్లో రేడియో కూడా వుండేది కాదంటే నమ్మలేని పరిస్థితి యిప్పుడు ! కొనలేక కాదు. దాని అవసరం ఫీలయ్యేవారు కారు. ఇప్పుడు ఎవర్ని చూసినా అనుక్షణం సెల్‌ఫోన్‌లోనైనా పాటలు వినేస్తున్నారు.
అప్పటిదాకా చదువుకున్నది తెలుగు మీడియంలో. మొదటిసారి 'మెహబూబ్ కాలేజ్ హైస్కూల్' అనే స్కూల్లో పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయినయ్యాను. ఇంగ్లీషులో తబ్బిబ్బు పడితే అదో దారి. వింత ఏమిటంటే ఒక తెలుగు మాష్టారు, ఆయన చెప్పింది నాకు అర్థమవ్వలేదని చెప్పి, నన్ను బెంచిమీద ఎక్కించేశాడు. అది జీవితంలో మొట్టమొదటిసారి. అంతేకాదు, కోపం తట్టుకోలేక తన పోడియం దిగి గబగబా నా దగ్గరికి నడుచుకొని వచ్చేసి ఫట్‌మని ఒక లెంపకాయ కొట్టాడు. కళ్లు తిరిగి పోవడమేకాకుండా నాకు కళ్లవెంబడి నీళ్లు వచ్చేశాయి. అంత అవమానం ఎప్పుడు భరించలేదన్నమాట. సహజంగా మంచివాడే ఆయన. బాగా చెప్పేవాడు కూడా. అవేళ ఏదో జరగాల్సింది అలా జరిగింది. నా ఖర్మ!
మెహబూబ్ కాలేజీ హైస్కూలులో ఏణ్నార్ధం చదివేలోపల మానాన్నగారు యిల్లు కొన్నారు. మా సికింద్రాబాద్ దాటి, హైద్రాబాద్ దాటి, ఊరుబయట దిల్‌సుఖ్‌నగర్ వైపు… గడ్డిఅన్నారం అనే చోట పెద్ద విశాలమైన అరెకరాల తోటతో సహా ఇల్లు కొన్నారు నాన్నగారు. అక్కడికి మారడంతో మన స్కూలూ మారింది. ఆబిడ్స్ వద్ద నున్న ఆల్ సెయింట్స్ హైస్కూలులో చేరాను. గుంటూరులో ఫస్ట్ ఫామ్ (ఆరవ తరగతి) సగం చదివి వదిలేసి వస్తే, సగం ఫస్ట్ ఫామ్, సగం సెకండ్ ఫామ్ మెహబూబ్ కాలేజి హైస్కూల్‌లో చదివితే, మిగిలిన సెకండ్‌ఫామ్ నుండి ఫిఫ్త్ ఫామ్ దాకా అల్ సెయింట్స్ హైస్కూల్లో చదివానన్నమాట. ఉపాధ్యాయుల పుణ్యమాని అక్కడ చదువులో చాలా బాగా రాణించాను. శభాషనిపించుకున్నాను. అల్‌సెయింట్స్ చాలా ప్రఖ్యాతి చెందిన స్కూలు. తర్వాత ఛీప్ సెక్రటరీ చేసిన శ్రావణ్‌కుమార్‌గారు, క్రికెట్ ఆటగాడు ఎమ్.ఎల్.జయసింహా.. ఎంతోమంది చాలా ప్రసిద్ధిచెందిన వ్యక్తులు అక్కడే చదువుకున్నారు.
పదోతరగతిని హైద్రాబాద్‌లో ఎచ్.ఎస్.సి.అనేవారు. ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సెల్సీ (పదకొండవ తరగతి)కి సమానమన్నమాట. దాంట్లో స్టేట్ ఫస్టు (అంటే హైదరాబాద్ స్టేట్ ఏరియాలో) వస్తే గోఖలే స్కాలర్ షిప్ వచ్చేది. అది రావాలని ఒక పట్టుదల. కృషిచేశాను. కానీ తొమ్మిది మార్కుల్లో అది తప్పి పోయింది. దాంతోటి ప్రిన్సిపల్‌కి కోపం వచ్చింది. బ్రదర్ రెక్టర్ అనేవారు అప్పట్లో. బ్రదర్ జాన్ ఆఫ్ సేక్రెడ్ హార్ట్‌్ అని వుండేవాడు. స్కూలు వదిలాక ఆయన నన్ను ఒక ఏడాదిపాటు మళ్లీ స్కూలుకి రానివ్వలేదు. స్కూల్లో ఫస్ట్ వచ్చినట్టు కె.మోహన్ అని ఇప్పటికీ బోర్డుమీద పేరు వుంటుంది. గోఖలే స్కాలర్‌షిప్ వచ్చిన వాళ్లయితే అది స్వర్ణాక్షరాలతో రాస్తారు. అది రాసే ఆవకాశం లేకుండా చేసుకున్నానని ఆయనకి వాత్సల్యం కొద్దీ నాపై కోపమన్నమాట.
xxxxxx
ఎచ్.ఎస్.సి. అయిపోయిన తర్వాత నిజాం కాలేజీలో ప్రీ యూనివర్సిటీ (మూడేళ్ల డిగ్రీ కోర్సుకి ముందు ఏడాది చదవాల్సిన కోర్సు) లో మ్యాథమాటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూపు తీసుకున్నాను. పి.యు.సి.లో కూడా ఫస్ట్‌క్లాస్ వచ్చింది. మరీ గొప్పగా ఏమీచేయలేదు. కాలేజీ రోజుల్లో పాకెట్ మనీగా మూడురూపాయలు ఇచ్చేది మా అమ్మ. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ కానీ నా తిండియావ వలన చాలేది కాదు. నిజాం కాలేజీనుంచి నడుచుకుంటూ వెళ్లి అబిడ్స్‌లోవున్న తాజ్‌మహల్ హోటల్‌లో భోజనం చేసేవాణ్ని. లేకపోతే అక్కడే పక్కనే క్వాలిటీస్ అని రెస్టారెంట్ వుండేది. అక్కడ రోజూ పీస్ పులావ్ (టమాటో సాస్, వెజిటబుల్ సలాడ్, కొత్తిమీర చెట్నిల తో సహా) లాగించేయడం, మళ్లీ కాలేజీకి నడుచుకుని వచ్చేయడం. (ఆ టైమ్ వేస్టు కాకుండా సిగరెట్లు కాల్చడం నేర్పించారు కొందరు గురువులు)
పియుసి పూర్తయేసరికి నాన్నగారు ఢిల్లీలో ప్రాక్టీసు చేద్దామనుకోవడం అక్కడ బియస్సీ ఆనర్స్ చదవడం జరిగాయి. ప్రాక్టికల్స్‌లో యాక్సిడెంటు జరిగి తక్కువ మార్కులు వచ్చాయి. ఆ యూనివర్శిటీ రూల్సు ప్రకారం ఓవరాల్‌గా మార్కుల శాతం ఎంత బాగా వున్నా సెకండ్ క్లాసు మాత్రమే యిచ్చారు. ఒక్కసారిగా దేవుడు గుర్తొచ్చాడు. నాన్నగారు ఢిల్లీ వదిలి హైదరాబాదు వచ్చేస్తూ నన్నూ హైదరాబాదులో ఎమ్మెస్సీ చేయమన్నారు. ఢిల్లీలో చేస్తే మంచిదని హితవు చెప్పారు కొందరు. కానీ నాన్నగారి మాటకు ఎదురుచెప్పే ధైర్యం లేదు. ఎమ్మెస్సీ చేసి ఐయేయస్‌కు తయారవ్వు అని నాన్నగారి ఆదేశం. 'వీడు ఐయేయస్ పాసవలేకపోతే డిప్రెస్ అవుతాడేమోన'ని అన్నయ్య భయం. 'పెద్దబ్బాయిలాగానే వీణ్నీ ఇంజనీరింగ్ చేస్తే మంచిద'ని అమ్మ రహస్యప్రణాళిక. నాకు తెలియకుండా తనే ఏదో ఫార్మ్ నింపేసి, ఆంధ్రా నుంచి నేటివిటీ సర్టిఫికెట్టు తెప్పించేసి, కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో డిగ్రీతర్వాత చేసే మూడేళ్ల ఇంజనీరింగ్ కోర్సుకి అప్లయి చేసేసింది. అడ్మిషన్ వచ్చినట్టు టెలిగ్రాం వచ్చింది. చూపిస్తే నాన్నగారు 'ఎమ్మెస్సీ అనుకున్నాంగా (అనుకున్నది ఆయన!) అది చెయ్యి ముందు' అనేశారు!
xxxxxx
ఇంత గందరగోళం మధ్య ఉస్మానియా యూనివర్శిటీలో నా ఎమ్మెస్సీ ప్రారంభమైంది. నాకు మొదటినుండీ కెమిస్ట్రీ యిష్టం కాబట్టి దానిలో సీటు అడిగాను. అది యాన్సిలరీ, నీ మెయిన్ మేథ్స్ కాబట్టి దానిలోనే యిస్తాం అన్నారు. తప్పనిసరై ఎమ్మెస్సీ మాథ్స్‌లో చేరాను. తమాషా ఏమిటంటే అందులో జాయినయ్యాక, చూస్తుండగా నా పర్సనాలిటీ మారిపోయింది. ఎంతో ఎంతో.. నాకే తెలియనంత బాగా మ్యాథమాటిక్స్‌లో షైన్ అయ్యాను. అందరిచేత శభాష్ అని మెప్పు పొందాను.
ఒక విచిత్రమైన అనుభవం – చిన్నప్పుడు మాకు లెక్కలు చెప్పిన గురువులు నలుగురు ప్రైవేట్‌గా ఎమ్.ఏ.(మ్యాథ్స్) పరీక్షకు కట్టారు. నేనూ, ప్రశాంత్ కుమారని మా స్నేహితుడూ పగలు కాలేజీకి వెళ్లి అన్నీ నేర్చుకోవడం, రాత్రి హనుమంతరావు మేస్టారి యింట్లో, ఆయనకూ, చలపతిరావుగారు, ఆచారిగారూ, నరసింహమూర్తిగారికీ మూడు నాలుగు గంటలపాటు అవన్నీ నేర్పడం. వాళ్లు చదువుకుని చాలా రోజులైంది కాబట్టి మౌలికమైన అనుమానాలు వచ్చేవి. అవి కూడా తీర్చగలగడానికి మేము మరింత కక్షుణ్ణంగా చదవడంతో మాకు సబ్జెక్ట్‌మీద మంచి గ్రిప్ వచ్చింది. ఆ విధంగా మా టీచర్లు ఆ విధంగా మాకు మేలు చేశారు.
చివరకి ఎమ్.ఎస్.సి. యూనివర్సిటిలో ఫస్ట్ రావడమే కాకుండా, అప్పటిదాకా యూనివర్సిటిలో ఎవ్వరికీ రానన్ని మార్కుల పాసయి రికార్డు సృష్టించాను. ఉస్మానియా యూనివర్శిటీ నాకు చదువు, ఆత్మవిశ్వాసాన్నే కాదు, ఎంతోమంది స్నేహితులను కూడా ప్రసాదించింది. వారిలో చాలామందితో నాకు యిప్పటికి కూడా స్నేహం కొనసాగుతోంది. ఇక ఉద్యోగరీత్యా నేను హైదరాబాదులో నేర్చుకున్న జ్ఞానం, సంపాదించుకున్న హితులు, స్నేహితులు ఎందరో ఉన్నారు. అందుకే హైదరాబాదు అంటే నా కంత మక్కువ!
xxxxxx
రిటైరయ్యాక హైదరాబాదులో సెటిలవుదామని అనుకున్నా వెంటనే ఎన్‌డిఎమ్‌ఏ (నేషనల్ డిసాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ)లో సభ్యుడిగా నియామకం జరగడంతో నేను మళ్లీ ఢిల్లీ వెళ్లవలసి వచ్చింది. వెళ్లాను, ఎందుకంటే నేను ప్రధానంగా ఉద్యోగిని. దూరభూమి లేనివాణ్ని.
ఐదేళ్ల తర్వాత ఢిల్లీలో పోస్టింగ్ ముగియగానే వెంటనే 2010 అక్టోబరులో నా ఇష్టభూమి హైదరాబాదుకి వచ్చిపడ్డాను. ఇందాకా అన్నాను కదా, నాకు యిప్పుడు కోనసీమలో యిల్లూ వాకిలీ ఏవీ లేవని. ప్రస్తుతం హైదరాబాదులోనూ ఏవీ లేవు. అయినా యిక్కడే వుంటున్నాను. ఉండబోతున్నాను. ఎందుకంటే యిది నా ధర్మక్షేత్రం, కురుక్షేత్రం.
కొసమెరుపు – దక్షిణాది వాళ్లందరినీ మద్రాసీలనడం ఉత్తరాదిన పరిపాటి. (చెన్నయ్ అని పేరు మార్చినా వాళ్లు యింకా మద్రాసీ అనే అంటున్నారు. కరుణానిధిగారికి ఎవరూ ఫిర్యాదు చేయనట్టుగా వుంది) నన్నలా అన్నప్పుడు నేను ఉడుక్కోకూడదు, నేను మద్రాసులోనే పుట్టాను కాబట్టి…! కానీ ఉడుక్కుంటాను. 'కాల్ మీ హైదరాబాదీ' అంటూంటాను.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version