నో ప్లాన్‌….. దటీజ్‌ పవన్‌

యూ ట్యూబ్‌లో పాపులర్‌ అయిన వీడియోల్లో హర్ష వైవా ఒకటి.. Advertisement అందులో ఓ డైలాగ్‌ వుంది.. ‘ఏయ్‌ మిస్టర్‌..నువ్వేం మాట్లాడుతున్నావో, నీకు అర్థం అవుతోందా?’ ‘పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం విన్నపుడల్లా ఎందుకో ఈ…

యూ ట్యూబ్‌లో పాపులర్‌ అయిన వీడియోల్లో హర్ష వైవా ఒకటి..

అందులో ఓ డైలాగ్‌ వుంది..

‘ఏయ్‌ మిస్టర్‌..నువ్వేం మాట్లాడుతున్నావో, నీకు అర్థం అవుతోందా?’

‘పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం విన్నపుడల్లా ఎందుకో ఈ డైలాగే గుర్తుకువస్తుంది.

రాజకీయ నాయకుడు అన్నాక, ఓ సిద్ధాంతం. దానికి కట్టుబడడం లాంటి వ్యవహారాలుంటాయి. ఇక్కడ ఒకలా..అక్కడ ఒకలా.. పూటకు ఒకలా.. మరునాటికి మరోలా అన్న వైనం లోపలైతే వుండొచ్చు కానీ బయటకు రాకూడదు. 

చిత్రమేమిటంటే, పవన్‌ కళ్యాణ్‌ తనకు తోచింది తాను మాట్లాడు కుంటూ వెళ్లిపోతారు. డైరక్టర్‌ సినిమా స్పాట్‌, లోకేషన్‌, నటీనటుల లభ్యత అన్న దాని ప్రకారం ఓ వరస వాడి లేకుండా తీసుకుపోతే, ఎడిటింగ్‌ సూట్‌లో దాన్ని కలిపేసుకుంటారు. పవన్‌ స్పీచ్‌ అచ్చం అలాగే వుంటుంది. అయితే అది ఎడిట్‌ చేసి, కలపడానికి కుదరదు. లైవ్‌ కాబట్టి. 

పవన్‌కు ఏం మాట్లాడుతున్నారో అర్థంకాదన్న దాని సంగతి ముందు చూద్దాం. ఎందుకంటే ఇక్కడ చర్చించాల్సిన సంగతి మరోటుంది.

అసలు ఏం జరుగుతోందో, పవన్‌కు తెలుసా అన్నది ఆ రెండో సంగతి.

మొదటి సంగతికి వస్తే..

మొదటి ప్రసంగంలో ఆయన భలే చిత్రంగా మాట్లాడారు. కెసి ఆర్‌ అంటే నాకుగౌరవం అంటూ ఆయనపై ఓ చురక. హను మంతరావు అంటే ఇష్టం అంటూ ఆయనపై విమర్శ,. ఇలా పొగడ్తు న్నాడా..తిడుతున్నాడా టైపులో మాట్లాడు కొచ్చారు. సరే కొత్త కదా, ఏదో పాయింట్లు కాగితంపై రాసుకొచ్చి, వాటిని తన స్టయిల్‌లో ఫైన్‌ ట్యూన్‌ చేసి వినిపించారులే అనుకున్నారు జనం. 

రెండోసమావేశం దగ్గరకు వచ్చేసరికి ఆ భ్రమలు కాదు, మతులే పోయాయి. రాజకీయ పార్టీయే, కానీ పోటీ చేయం. తాము పోటీ చేసి వేరేవాళ్లకి ఉపయోగపడడం ఇష్టంలేకనే పోటీ చేయడం లేదు. 

ఇదేం లాజిక్‌ తోడుతూ, పెళ్లి కూతురు…ఎక్కడ చచ్చిందన్నట్లు?  ఎవరైనా ఎందుకు పోటీ చేస్తారు. గెలవడానికి. ఒక్క ఓటు వచ్చే అభ్యర్థి అయినా అదే ఆశాభావంతో వుంటారు. కానీ పవన్‌ ముందుగానే తాను పోటీ చేస్తే, మరెవరో లబ్ధిపొంది లాభం పడతారని అంచనా వేయడం ఏమిటి? 

మరి అటువంటపుడు, దారంతా చీకటి, గుండెల నిండా ధైర్యం లాంటి కవితలు వల్లెవేయడంఎందుకు? అతి స్వల్ప కాలంలో ఎన్ని కలుఎదుర్కొవడానికి సిద్ధపడుతున్నామని ప్రకటించడం ఎందుకు? 

సరే ఆ సంగతి పక్కన పెడదాం. మల్కాజ్‌ గిరిలో భాజపా కాదు, తేదేపా కాదు, లోక్‌ సత్తాకు మద్దతు ఇస్తానని, జెపి అంటే తనకు ఇష్టమని అందుకే అసలు అక్కడి నుంచి పోటీ చేద్దామనుకుని విరమించుకున్నానని పవన్‌ చెప్పారు. 

కేవలం తాను ఎలాగైనా లోక్‌ సభలో అడుగుపెట్టాలని, ఆప్‌, భాజపా, తేదేపాలతో పొత్తు కోసం వెంపర్లాడి, భంగపడి, ఆఖరికి తనంతట తానే నామినేషన్‌ వేసుకున్నారు జెపి. అంత అధికార లాలస వున్నవాడు పవన్‌కు ఎలా నచ్చారు? పైగా ఇటీవల ఓ ఛానెల్‌ జరిపిన స్టింగ్‌ ఆపరేషన్‌ వల్ల జీపీ పార్టీకున్న నైతికత ప్రశ్నార్థకమైంది. అది పవన్‌కు తెలియదనుకోవాలా? లేక పివిపి మాదిరిగానే పవన్‌ ఉద్దేశపూర్వంగా విస్మరించారనుకోవాలా?

ఇక అవినీతిని వ్యతిరేకిస్తున్నాని చెప్పుకునే పవన్‌ కర్ణాటకకు భాజపా తరపున ప్రచారానికి వెళ్లాడు. అసలు గనుల కుంభకోణం వేళ్లు వున్నదే అక్కడే కదా. సాక్షాత్తూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సైతం పదవి వదులుకోవాల్సి వచ్చింది ఈ అవినీతి కారణంగానే కదా?  మరి ఆయన మళ్లీ భాజపా గుమ్మంలోకే వచ్చారు. పైగా మోడీ యడ్యూరప్ప, శ్రీరాములు తదితరులను పార్టీలోకి తీసుకురావడం భాజపాలోని ఓ వర్గానికే ఆస్సలు నప్పలేదు. మరి అలాంటపుడు అక్కడ భాజపాకు పవన్‌ ఎలా మద్దతు ఇస్తారు. 

సరే మోడీ గురించి మాట్లాడుతూ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురాలేదు. అందుకే తనకు నచ్చారు అంటారు. మరి చంద్రబాబు కూడా నచ్చారు అన్నారు గతంలో,. అదెలా? ఆయన వారసుడిని అప్పుడే రెడీ చేసుకున్నారు కదా?  తమ్ముడికి గతంలోనే సీటు ఇచ్చారు కదా? 

పవన్‌ టార్గెట్‌ ఏమిటి 2019 నాటికి జనసేనను ఎన్నికల దిశగా నడిపించడం. అటువంటప్పుడు ఇప్పుడు ఎలా వ్యవహరించాలి?  వీలయినంత స్వతంత్రంగా. కానీ పవన్‌ ప్రారంభంలోనే తెలుగుదేశానికి మద్దతుగా నిలబడ్డాడు. మరి 2019లో ఎన్నికలను ఎలా ఫేస్‌ చేయాలనుకుంటున్నారు? తెలుగుదేశాన్ని ఢీకొడుతూనా, కలిసి కట్టుగానా? 

ఆ సంగతి అలావుంచితే, ఇప్పుడు టీడీపీ లేదా వైసీపీ పవర్‌లోకి వస్తాయి. చంద్రబాబే అధికారంలోకి వస్తారనుకుందాం? మరి పవన్‌ను 2019లో పోటీకి నిలుస్తారనుకుంటే, ఊరుకుంటాడా? తన సర్వశక్తులు వినియోగించి పవన్‌ పవర్‌ తగ్గించడానికి ప్రయ త్నించరా? అంతతేలిగ్గా 2019లో పవన్‌కుపవర్‌ అప్పగించేస్తారా? 2019 నాటికి పవన్‌ పోటీకి వస్తాడని తెలిసిన బాబు కానీ, జగన్‌ కానీ తమ ప్రయత్నాలు తాము చేసి, పవన్‌  గాలి తీసేయడానికి యత్నించరా? 

అదీ గాక ఇప్పుడున్న చరిష్మా మరో అయిదేళ్ల తరువాత కూడా అలాగే వుంటుందని పవన్‌ ఎలా అనుకుంటున్నారు? అంతకన్నా ఇప్పుడు దీపం వున్నపుడు పోటీ పడడం మంచిది కదా?  ఇప్పుడు బాబు నిజాయతీ పరుడు అని చెప్పి, బాబు పవర్‌ లోకి వచ్చాక, 2019లో జనానికి ఏమని చెబుతారు. బాబును కాక, తనకు అధికారం ఇమ్మని ఎలా అడగగలరు?

ఈ విషయాలేమైనా పవన్‌ అస్సలు ఆలోచించినట్లు లేదు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో, అప్పటికి మాటలాడువాడు ధన్యుడు సుమతీ అన్నట్లు, ఏదో ఒకటి మాటాడేయడం తప్ప, పూర్వాపరాలు ఆలోచించి మాట్లాడడం పవన్‌కు అలవాటు వున్నట్లు లేదు. 

నిజంగా 2019 తన టార్గెట్‌ అనుకున్నపుడు పవన్‌ ఇప్పుడు అసలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. ప్రజలను చైతన్యపరిచే దిశగా కార్యక్రమాలు చేపట్టాలి. ఆపై అయిదేళ్ల పాటు ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. అప్పుడు ఏ పార్టీ అధికారంలో వున్నా పవన్‌ ఢీ కొట్టగలరు. ఇప్పుటి స్టయిల్‌లో, ఇప్పటి పరిస్థితుల్లో పవన్‌ 2019 కాదు, 2015 నాటికే రాజకీయ తెరపై వుంటారంటే అనుమానమే.

అభిమానులు తలోదారి

సినిమా అభిమానం వున్నవారికి రాజకీయ అభిమానం వుండకూడదని లేదు. అదే విధంగా రెండూ ఒక చోటే పాదుకోవాలనీ లేదు. ఎన్టీఆర్‌ అభిమానుల్లో కాంగ్రెస్‌ వారుండొచ్చు పవన్‌ అభిమానుల్లో ఏ పార్టీకి చెందని వారూవుండొచ్చు. కానీ ఇక్కడ ఓ సమస్య వుంది. పవన్‌ అభిమానులు చాలా మంది కుర్రకారు. వారిలో ఎక్కువ మంది చిరంజీవి అభిమానులు. ఇప్పటికీ పవన్‌తో పాటు చిరంజీవినీ అభిమానిస్తున్నవారు. వారు ఇప్పుడు రెండుగా విడిపోయారంటే ఆశ్చర్యంలేదు. చిరంజీవి, పవన్‌ ఇద్దరి లో ఎవరు ఎక్కువ ఇష్టం అన్న ప్రాతిపదికగా వుంటుంది ఇది. 

అదే విధంగా పవన్‌ ఇప్పుడు పార్టీ పెట్టాడని జగన్‌ వైపు వున్న అతగాడి అభిమానులు పాంట్లు పైకి లాక్కుంటూ వెళ్లిపోతారనీ అనలేం..వెళ్లరనీ అనలేం. రెండింటికీ అవకాశం వుంది. కోస్తా జిల్లాల్లోని గ్రామాల్లో కాపులు అధిక సంఖ్యలో వుండడం సహజం. అక్కడ ఈ లెక్కన పవన్‌ చెప్పిన వారికి తప్ప మరేవరికీ ఓట్లు రాకూడదు. కానీ అలా జరగదు (చిరంజీవి విషయంలో ఇదే జరిగింది) అంటే అభిమానులు పార్టీల పరంగా చీలిపోయినట్లేగా?  అలా చీలిపోయడం అనివార్యమైనపుడు, అభిమానులకు తమకంటూ ఓ అభిప్రాయం బలంగా వున్నట్లేగా. అలా అభిప్రాయం వున్నపుడు పవన్‌ ఎంత ప్రచారం చేసి ఏం లాభం? తన అభిమానుల్లో చీలక తానే తెచ్చుకోవడం తప్ప. అదే పవన్‌ ఈ రాజకీయ రొచ్చులోకి రాకుంటే, పవన్‌ అభిమానులంతా, అభిమానం విషయంలో ఒకే తాటిపై వుండేవారు. 

బ్లాక్‌ మెయిల్‌ కాక మరేమిటి?

మొదటి సమావేశం

అన్నింటికీ తెగించి, ప్రాణాలు పణంగా పెట్టి, రెండు నెలల స్వల్ప వ్యవధిలో ఎన్నికల బరిలోకి దిగుతున్నాం.

రెండో సమావేశం

వ్యవధి సరిపోదు. పైగా కొంతమంది రాజకీయ అవకాశ వాదులకు ఓట్లు చీల్చి సాయం చేసినట్లు అవుతుంది. 

నిజాయతీ గల అభ్యర్థులు దొరకడంలేదు. దొరికితే పోటీ చేస్తాం. 90 మంది దొరికారు. అన్ని ఓట్లు చీలతాయని పోటీ చేయడం లేదు.

మూడో మాట (ఈనాడుతో)

సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోండి. పరోక్షంగా బాబును ఎన్నుకోండి

నాలుగోమాట

పివిపి క్లీన్‌ చిట్‌ వున్న వ్యక్తి. అయినా.. (అంటే క్లీన్‌ చిట్‌ లేకపోయినా) జైలు కెళ్లి వస్తున్న వారు పోటీ చేస్తుంటే, అతనెందుకు చేయకూడదు.

తాజా మాట

ఏడు ఎంపీలకు పవన్‌ కాండిడేట్లు పోటీ చేస్తారు?

మరి అసెంబ్లీ ఏం పాపం చేసుకున్నట్లో?  సరే ఆ సంగతి అలా వుంచితే, పోటీ చేయనన్న నిర్ణయానికి ఎందుకు తిలోదకాలు ఇస్తున్నట్లు? పివిపికి తేదేపా టికెట్‌ ఇచ్చి వుంటే, 
ఇలా చేసేవారా?

రేపటి మాట?

పవన్‌కు తెలిస్తేగా.. మనకు తెలియడానికి.

-చాణక్య

[email protected]