చాలా కాలం కిందట ఓ ఊళ్లో నవ్వని మనిషి ఒకడు వుండేవాడట. వాడిని నవ్వించడం ఎవరి తరమూ కాకపోయింది. అప్పుడు ఈ విషయం రాజుగారికి తెలిసి, వాడిని నవ్వించినవాడికి అర్థరాజ్యం ఇచ్చేస్తానని ప్రకటింపచేసాడు. ఎందరు వచ్చారు? ఎవరైనా నవ్వించగలిగారా లేదా అన్నది కాదు ఇక్కడ విషయం,..నవ్వించడం అంత కష్టమా అన్నదే.
ఎంత కష్టం అన్నది తెలియాలంటే, వర్తమాన తెలుగుసినిమా దర్శక రచయితలను అడగాలి. ఎందుకంటే ప్రస్తుతం వారి ముందున్న సవాలు అదే కాబట్టి. ప్రేక్షకుడిని నవ్వించగలిగిన వాడికి జేజేలు..నవ్వించలేకపోయినవాడికి నగుబాటు,. ప్రస్తుతం ఇదీ టాలీవుడ్ పరిస్థితి.
టాలీవుడ్ తొలినాళ్ల నుంచి హాస్యానికి పెద్ద పీట వుంటూనే వచ్చింది. హాస్యనటులు హీరోలతో సమానమైన ప్రేక్షకాభిమానాన్ని పొందుతూనే వున్నారు. కానీ ఇప్పుడు, ఈ జెనరేషన్ లో,. హాస్యం అన్నదే పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయింది.
జనం ఇప్పుడు కాస్త హాయిగా నవ్వుకోవాలని చూస్తున్నారు. చిన్న జోక్ వినిపిస్తే చాలు పగల బడి నవ్వాలనుకుంటున్నారు. చిన్న కామెడీ సీన్ కనిపిస్తే కళ్లు అప్పగించేస్తున్నారు. మనిషి మనుగడ అంత చికాకుల మయం అయిపోయింది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర పోయేవరకు టెన్షన్లు చుట్టు ముడుతున్నాయి. ఈ టెన్షన్లను మరిచిపోయి, హాయిగా నవ్వుకునే సాధనంగా సినిమా మాత్రమే కళ్ల ముందు మిగిలింది. ఇది సినిమాకే కాదు టీవీకి కూడా పాకుతోంది. అమృతం సీరియల్ ఎందుకంత హిట్టయింది? గంగతో రాంబాబు ఎందుకు పాపులర్ అవుతోంది. జబర్ధస్త్‌కు అంత పేరు ఎందుకు వచ్చింది? న్యూస్ చానెళ్లు కూడా వీలయినన్ని కామెడీ షోలు, స్కిట్‌లు ఎందుకు ప్రసారం చేస్తున్నాయి,.. ఇలా రాసుకుంటూ పోతే సవాలక్ష ఉదాహరణలు.
సరే, మళ్లీ సినిమా దగ్గరకు వచ్చేద్దాం. రాజేంద్ర ప్రసాద్ కాలానికి వచ్చేసరికి ఆయన సోలో కామెడీ హీరో. నాగార్జున హలో బ్రదర్ చేసినా, వెంకటేష్ మల్లీశ్వరి చేసినా అది అప్పడప్పుడు ఆట విడుపు తప్ప రెగ్యులర్ కాదు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. తెరపై ఏం జరుగుతోందన్నది కాదు, ఏ మేరకు నవ్వు పుట్టించగలరన్నదే పరమావథిగా మారిపోయింది. అదిగో అప్పుడు అందరు హీరోలకూ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్లే కావాల్సి వస్తోంది. దానిని శ్రీను వైట్ల ఫార్ములా అన్నా, మరోటి అన్నా, విషయం అదే.
మహేష్ దూకుడు, పవన్ గబ్బర్ సింగ్, ఎన్టీఆర్ అదుర్స్, రాజమౌళి మర్యాదరామన్న, ఇలా ఒకరిదేమిటి అందరిదీ అదే దారి. అక్కడి నుంచి మొదలయ్యాయి దర్శకుల సమస్యలు. చిత్రంగా వెళ్లాల్సిన దారి తెలిసిపోయింది. విజయానికి దగ్గరదారి అవగతమైపోయింది. కానీ అక్కడే సమస్య వచ్చిపడింది. ప్రేక్షకులు దేనికి నవ్వుతారో, దేన్ని నవ్వులపాలు చేస్తారో మాత్రం అర్థం కావడం లేదు. వారికి నచ్చితే చాలు బ్లాక్ బస్టర్. క్రిటిక్ లు ఏమనుకుంటేనే, సమీక్షలు ఎలా వుంటేనేం. వారికి మాత్రం నచ్చితే కాసుల వర్షమే.
గబ్బర్ సింగ్‌లో రౌడీల అంత్యాక్షరి చూసి, పెదవి విరిచిన వారి సంఖ్య తక్కువేమీ కాదు. కానీ, అదే సీన్ ఆ సినిమా విజయానికి ఆయువు పట్టయిపోయింది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సీరియస్ క్యారెక్టర్ వదిలేసి, దూకుడు లాంటి రియాల్టీ షో చేయడమా..కానీ సూపర్ డూపర్ హిట్. అదే మరి ఆయనతో నిజంగా సీరియస్ సినిమా వన్ తీస్తే, జనం అటు చూడడం మానేసారు. పవన్ రాజకీయాలు చర్చిస్తే, కెమేరామెన్ నచ్చనే లేదు. అదే గబ్బర్ సింగ్, అత్తారింటికిదారేది అంటూ ఆద్యంత వినోదం పంచితే, జనాలే జనాలు.
రేసుగుర్రం. ఇటీవల కాలంలో సరైన హిట్ లేని బన్నీకి పెద్ద హిట్. సీరియస్ యాక్షన్ డైరక్టర్ సురేందర్ రెడ్డి, తన వ్యవహారాలు పక్కన పెట్టి, ఆల్ రౌండ్ కామెడీ మూవీగా తీర్చిదిద్దాడు. జనానికి నచ్చేసింది. మన దగ్గర కన్నా ఓవర్ సీస్‌లో మరీ విరగబడి చూసేస్తున్నారు. అంటే మనకన్నా టెన్షన్‌లు విదేశాల్లో వున్న మనవారికి ఎక్కువైపోయాయని అనుకోవాలి.
సుడిగాడు..వంద సినిమాల నుంచి సీన్లు తీసుకుని, పేరడీ చేయించి, వదిలిన కామెడీ బాణం. జనం విరగబడి చూసారు. హృదయకాలేయం. ఎవరో హీరో..ఎలా వున్నాడో.. అసలు ఆ కథమిటో.. ఆ నటన ఏమిటో? అయినా ఇవ్వాళ పెద్ద హిట్. ఓవర్ నైట్ స్టార్ యాక్టర్ అయిపోయాడు సంపూర్ణేష్ బాబు.
సరే జనం టెన్షన్‌తో కామెడీ సినిమాల కోసం కళ్లలో వత్తులు వేసుకుని చూస్తుంటే, డైరక్టర్‌లు మాత్రం అదే కామెడీ పండించడం కోసం తల్లకిందలు తపస్సు చేస్తున్నారు. కథ కధనాలు ఇప్పుడు నామ మాత్రమైపోయాయి. ఎన్ని సీన్లు పండించగలిగాము..ఎన్ని సార్లు నవ్వించగలిగాము అన్నదే ముఖ్యం. దీనికోసమే దర్శకులు, రచయితలు కిందా మీదా అవుతున్నారు. నవ్విస్తే చాలు ఇంకేమీ అక్కరలేదు అన్నది ప్రేక్షకులు ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నారంటే, సుడిగాడు, హృదయకాలేయం సినిమా హిట్‌లే అందుకు సాక్ష్యం.
కాన్నీ అన్ని సినిమాలు టార్గెట్ చేరుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఇక్కడ రెండు కీలక విషయాలున్నాయి. ఒకటి ట్రాక్ పండడం రెండవది బడ్జెట్. హీరోను బట్టి బడ్జెట్ జాగ్రత్తపడితే కామెడీ సినిమా కాసులు కురిపించినట్లే. అదే చిన్నహీరోతో పెద్ద హిట్ కొట్టినా, బడ్జెట్ దాటిపోతే సుఖం లేదు. హృదయకాలేయం బడ్జెట్ ఎంత? మహా అయితే పెద్ద సినిమా పబ్లిసిటీ ఖర్చంత. ప్రేమ కథా చిత్రమ్ ఖర్చెంత? వసూళ్లెంత? అందువల్ల దర్శకులు ఇటు కామెడీ పండించడాన్ని, అటు ఖర్చును కూడా సీరియస్‌గా తీసుకోవాల్సి వస్తోంది.
పోనీ ఖర్చును అదుపు చేయడం కాస్త కష్టం కాకపోయినా, కామెడీ పండించడం మాత్రం అంత సులువుగా కనిపించడం లేదు. అలా అని కొన్ని సినిమాలు చూస్తే కష్టంగానూ అనిపించడం లేదు. అయితే ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో అన్నదే సమస్యగా మారింది. పెద్ద దర్శకులు సైతం ఇప్పుడు ఇదే పరిస్థితిని పదే పదే ఆలోచించాల్సి వస్తోంది. మొదట్లో కామెడీ సినిమా తీసినా, తరువాత థ్రిల్లర్‌ల వెంట బడిన దర్శకుడు రవిబాబు మళ్లీ తన కామెడీ ట్రాక్ పైకి వచ్చేసారు. కామెడీ పాత్రలు చేసినంతకాలం జనం గుండెల్లో వుండిపోయిన సునీల్ హీరోగా మారాక, ఆ ఛార్మ్ కోల్పోయాడు.
కామెడీని పండించగలిగితేనే హీరో అనిపించుకునే పరిస్థితి. మళ్లీ అలా అని అది క్లిక్ కాకుంటే జీరోనే. వెంకటేష్ మసాలా అంటూ తన స్టయల్ కామెడీ చూపిద్దామనుకున్నాడు. జనం చూడలేదు. అల్లరి నరేష్ అన్ని సినిమాలు సుడిగాడు అవుతున్నాయా అంటే లేనే లేదు. ఇదే సమస్యగా మారింది. ఇప్పుడు తెలుగు దర్శకులు, కామెడీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైన్‌మెంట్ కథలు వెదుకుతున్నారు. రచయితలు అవే వండి వార్చడానికి చూస్తున్నారు. పాళ్లు కుదిరితే హిట్..లేకుంటే ఫట్.
-చాణక్య