కెసిఆర్ గెలవలేదు…మీడియా ఓడింది

కెసిఆర్ ఏం చేసాడు..ఎలా చేసాడు..మంచోడా..చెడ్డోడా అన్నది కాదు ఇప్పుడు డిస్కషను. ఆడు మగాడ్రా..ఈ రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్న విజువల్ మీడియాకు ఝలక్ ఇచ్చాడు. 'ఈ కార్యక్రమం సరదాకి మాత్రమే..ఎవర్నీ ఉద్దేశించి కాదు..కించపరచడానికి…

కెసిఆర్ ఏం చేసాడు..ఎలా చేసాడు..మంచోడా..చెడ్డోడా అన్నది కాదు ఇప్పుడు డిస్కషను. ఆడు మగాడ్రా..ఈ రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్న విజువల్ మీడియాకు ఝలక్ ఇచ్చాడు. 'ఈ కార్యక్రమం సరదాకి మాత్రమే..ఎవర్నీ ఉద్దేశించి కాదు..కించపరచడానికి కాదు' అనే టాగ్ లైన్ ముందుగా వేసేసి, దాంతోటే సకల పాపాలూ హరించుకుపోతాయని డిసైడ్ అయిపోయి, తమకు కిట్టని వాళ్లని ఎడాపెడా తిట్లతో, తమ రాతకు వచ్చిన పదాలతో చీల్చి చెండాడేస్తున్నాయి కొన్ని కార్యక్రమాలు. వీటిని చూస్తుంటే మీడియా విలువలు ఎక్కడికి పోతున్నాయో అనిపిస్తోంది. ఈ చానెల్ , ఆ చానెల్ అని కాదు. ఈ విషయంలో ఒక్క ఈటీవీ 2 న్యూస్ చానెల్ మాత్రమే కాస్త పద్దతిగా, విలువలతో వ్యవహరిస్తోంది. ఎంత తనకు పడని వారైనా కూడా కాస్త పద్దతిగా విమర్శిస్తోంది. లేకి కార్యక్రమాలు ఆ చానెల్ లో కనిపించవు. 

కానీ మిగిలిన చానెళ్లు తమ చిత్తానికి క్రియేటివిటీ పేరిట చెలరేగిపోయాయన్నది వాటి కార్యక్రమాలు చూస్తేనే తెలిసిపోతుంది. నాయకుల స్పీచ్ లోని మాటలను ముక్కలు ముక్కలుగా విరిచి, వాటిని వినిపిస్తూ, కౌంటర్లు వేస్తుంది ఓ కార్యక్రమం.. అదే రేపు ఎవరైనా వార్తల కార్యక్రమాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, కౌంటర్లు వేస్తే ఎలా వుంటుంది? టీవీ9 వార్తలు చదువుతున్నది..అన్నదగ్గర కట్ చేసి, ఓ కామెడీ ఏనిమేషన్ క్యారెక్టర్ తో..వార్తలా..నేనింకా..సొల్లు కబుర్లు అనుకున్నాలే.. అని ప్యాచప్ చేస్తే..నా పేరు..ఫలానా అంటే..ఛ..నిజమా..నేను అబద్దాల్రావు అనుకున్నాలే..అని ప్యాచప్ చేస్తే…ఎలా వుంటుంది. 

తప్పు ఎవరు చేసినా అది తప్పే.  తమకేవో ప్రత్యేక హక్కులున్నాయని మీడియా భావించి, చెలరేగిపోయినా తప్పే. ప్రింట్ మీడియాకు ఓ భాష, లిమిట్ అనేది వుంది. కానీ విజువల్ మీడియాకు అది లేకుండా పోయింది. తెలుగు, ఇంగ్లీష్,హిందీ పదాలతో పాటు, సాదా సీదా లో లె లెవెల్ పదాలు కూడా కలిపేసి, తమ చిత్తానికి కార్యక్రమాలు రూపొందింస్తున్నారు. నిజానికి ఇలాంటి చానెళ్లలో తెలంగాణ అనుకూల చానెళ్లు కూడా వున్నాయి. వాటి వ్యవహారాలు ఇంకా దారుణంగా వున్నాయి. కానీ ఇన్నాళ్లు ఎవరు పట్టించుకోలేదంతే. టీవీ  9 బుల్లెట్ న్యూస్ లోనే ఆ మధ్య ఓ కార్యక్రమం వచ్చింది. రుణ మాఫీ చేయలేదని కెసిఆర్ ను ప్రతి ఒక్కరు తిడుతున్నారు..ఇదీ ఏంకర్ చెప్పే ఒక్క లైన్. ఆ వెంటనే..జంధ్యాల లేదా మరొకరో రాసిన సినిమాలోని తిట్ల దండం నేపథ్యంలో వినిపించారు. ఆ తిట్లు..పరమ నీచంగా వున్నాయి. ఆ తిట్లన్నీ జనం తిట్టినట్లా..కెసిఆర్ ను టీవీ 9 తిట్టినట్లా? అది ముమ్మాటికీ తప్పు కాదా? ఆ తిట్ల దండకంలో ముండమోపి..జిరాఫీ, నికృష్ట, చండాల అన్న పదాలన్నీ వున్నాయి. మరి ఇలా ప్రసారం చేయడాన్ని  ఏమనుకోవాలి? టీవీ 9 అనే కాదు. 

దాదాపు అన్ని చానెళ్లలలో ఇలాంటి ఎగతాళి కార్యక్రమాలు అనేకం వున్నాయి. పబ్లిక్ లో నిల్చుంటే ఏమైనా అంటా అని శ్ర్రీశ్రీ అని వుంటే వుండొచ్చు.కానీ మరీ ఇలా బట్టలూడదీసి, బిలో ది బెల్ట్ ఎటాక్ చేసే హక్కు ఏ మీడియాకూ లేదు.  జగన్ కు వ్యతిరేకంగా మిగిలిన చానెళ్లు చేస్తే, బాబు కు వ్యతిరేకంగా సాక్షి కూడా అదే పని చేస్తొంది. సాక్షిలో వివిధ సినిమాల్లోని క్లిప్పింగ్ లు తీసుకుని, వాటికి స్వంత డబ్బింగ్ చేయించి వదిలే కార్యక్రమం వుండేది.ఇప్పుడు వస్తోందో లేదో తెలియదు. అది ఎంత తప్పు? పరోక్షంగా జనాలు ఫలానా నటుడే మాట్లాడుతున్నాడు అని అపోహకు గురికారా? అధికారం లేదు కాబట్టి ఇన్నాళ్లు కేసిఆర్ పై వేసిన చణుకులు అన్నీ నడిచిపోయాయి. ఇప్పుడు అతగాడికి అధికారం వచ్చింది. తొలిసారి మీడియాకు ఝలక్ తగిలింది. టీవీ 9 జనాలు ఉరకలు పరుగులపై క్షమాపణలు చెప్పారు. బాధ్యులను ఉద్యోగంలోంచి తొలగించారని వార్తలు వినవస్తున్నాయి. అదే నిజమైతే, అదీ తప్పే. కార్యక్రమం చేసినవారే బాధ్యులు ఎలా అవుతారు. ఇన్నాళ్లు అదే కార్యక్రమం ఎంతో మందిపై బుల్లెట్లు కురిపించింది. యాజమాన్యం మరింత ప్రోత్సహించింది కాబట్టే, ఆ కార్యక్రమం నడించింది. మరి ఇప్పుడు ఉద్యోగులది తప్పెలా అవుతుంది? ఇప్పుడు కూడా కేసిఆర్ ఆగ్రహించకపోతే, ఆ కార్యక్రమం, ఆ సిబ్బంది సజావుగా వుండే వ్యవహారాలే. 

మీడియా రాజకీయ దయాదాక్షిణ్యాలపై, రాజకీయం మీడియా అండదండలపై ఆధారపడి బతకాల్సిన దౌర్భాగ్యపు రోజులు దాపురించాయి. రాజకీయ నాయకులే వ్యాపారులు. వ్యాపారులవే కేబుల్ నెట్ వర్క్ లు. వాళ్ల కి ఇష్టం లేకుంటే ఆ చానెల్ రాదు. లేదంటే చివరిలో ఎక్కడో వస్తుంది. అందుకే జనం డిష్ టీవీలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది..మీడియా ఆశ్రితపక్షపాతంతో వ్యవహరించడం వల్లనే కదా. తెలుగునాట వున్నన్ని న్యూస్ చానెళ్లు మరెక్కడా లేవని అంటారు. అదేమో తెలియదు కానీ, తెలుగునాట దాదాపు అన్ని న్యూస్ చానెళ్లకు ఏదో ఒక రాజకీయ పార్టీతో లింకే. పోనీ అలా అని న్యూస్ చానెళ్లేవైనా మడికట్టకు వున్నాయా..ఓ చానెల్ రాజశేఖర రెడ్డిని ఆశ్రయించి సెజ్ పొందిందని విమర్శలు వున్నాయి. అదెంతవరకు నిజమో తెలియదు కానీ, ఇలా తెరచాటు వ్యాపారాలు సాగించే వారు అద్దాల మేడల్లో వున్నవాళ్లలా జాగ్రత్తగా వుండాలి. లేకుంటే మేడలు కూలిపోతాయ్.

ఇప్పుడు కెసిఆర్ పవర్ లో వున్నారు..ఏమైనా చేయగలరు కాబట్టి టీవీ 9 క్షమాపణ చెప్పింది. కెసిఆర్, అతగాడి మంత్రులు, తెలుగుదేశం ప్రముఖుల చుట్టూ తిరుగుతోందని వార్తలు కనిపిస్తున్నాయి. అదే అధికారంలో లేకుంటే, గోల పెట్ట ఊరుకోవాల్సిందే కదా. వైఎస్ ఇలాంటివి సహించలేకే..ఆ రెండు పత్రికలు అంటూ ముద్రవేసి, తన స్వంత డబ్బా తెచ్చుకున్నారు. అదీ అంతే..తమకు కిట్టని వాళ్లపై బురద జల్లడమే.

ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడో ఒకప్పుడు టైమ్ వస్తుంది. అప్పుడు మీడియా ఓడుతుంది. ఇప్పుడు జరిగింది అలాంటిదే. ఇది కెసిఆర్ గెలుపు కాదు. మీడియా స్వయంకృతాపరాథం. అందుకే ఈ ఓటమి. తలదించుకోవాల్సిందే.

చాణక్య

[email protected]