సినీ పరిశ్రమలో అందరితోనూ మంచిగా, అందరికీ కావాల్సిన వ్యక్తిగా కిందిస్థాయి వారికి ఆప్తుడిగా మెలగుతూ వచ్చిన నటుడు శ్రీహరి. ఆయన హఠాన్మరణం చెంది చాలా కాలం అయింది. జూబ్లీహిల్స్‌లో నిత్యం చాలా మంది సినీజనంతో సందడిగా ఉండే ఆయన లంకంత ఇల్లు ఇప్పుడో బోసిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా వస్తున్న వార్తల్ని చూస్తోంటే ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదేమో అనిపిస్తోంది.
ఫాదర్స్‌డే సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీహరి కుమారులు మాట్లాడుతూ… చెప్పిన విషయాలు అలాంటి సందేహాలను కలిగిస్తున్నాయి. తండ్రి బతికి ఉండగా ప్రతి వేసవి సెలవుల్లో విదేశీ టూర్లకు వెళ్లే వాళ్లం అని, ఈసారి తల్లి శాంతి ఆస్ట్రేలియాకు వెళ్దాం అన్నది గానీ.. ఆర్థికంగా భారం ఎక్కువవుతుందని తెలిశాక ఆ ఆలోచన మానుకుని చెన్నై వెళ్లి వచ్చేశామని చెప్పారు.
డబ్బు విషయంలో అమ్మ తరఫు, నాన్న తరఫు బంధువులు అంటూ ఎవ్వరినీ నమ్మవద్దని, జాగ్రత్తగా ఉండాలని నాన్న శ్రీహరి తరచూ హితవు చెప్పేవాళ్లని వారు పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తోంటే.. ఆర్థిక విషయాల్లో శ్రీహరికి ఎవరో అయినవారే.. పెద్ద దెబ్బ కొట్టారని, ప్రస్తుతం ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లున్నదని భావించేలా ఉంది.