కెసిఆర్ గుండెల్లో బాబు పడేసిన రాయి

చంద్రబాబు మహా మేధావి. అందులో ఇసుమంత సందేహం లేదు. కేసిఆర్ పక్కోడు ఏ వరం కోరుకుంటే, దానికి డబుల్ తనకు కావాలనే మునిలాంటి వాడు. అందుకనే ఢిల్లీ వెళ్లి, తనకు ఫలానా కావాలని అడగకుండా,…

చంద్రబాబు మహా మేధావి. అందులో ఇసుమంత సందేహం లేదు. కేసిఆర్ పక్కోడు ఏ వరం కోరుకుంటే, దానికి డబుల్ తనకు కావాలనే మునిలాంటి వాడు. అందుకనే ఢిల్లీ వెళ్లి, తనకు ఫలానా కావాలని అడగకుండా, ఆంధ్రకు ఏది ఇస్తే అది తనకు ఇవ్వాలని అడిగాడు. అతగాడికి తెలుసు, చంద్రబాబు నెయ్యానో, వియ్యానో, కయ్యానో కేంద్రం నుంచి కావాల్సింది పట్టుగెళ్ల గల సమర్థుడని. అందుకే ఈ ఎత్తువేసి మురిసిపోయాడు కేసిఆర్. 

కానీ అంతలోనే చంద్రబాబు తన కొంప మీదకు తెస్తాడనుకోలేదు. గుట్టుచప్పడు కాకుండా, తన అనుకూల మీడియాకు కూడా ఏ మాత్రం ఉప్పు అందకుండా బాబు చేసిన ఈ పని ఇప్పుడు సరాసరి వెళ్లి కేసిఆర్ గుండెల్లో పడింది. అదే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మరో రెండేళ్లు పెంచడం. నిజానికి బాబు తీసుకున్న ఈ నిర్ణయం బహుళార్థ సాధక ప్రాజెక్టు వంటిది. పదేళ్లు తనను అధికారానికి దూరంగా వుంచి, ఈ సారి నెత్తిన పెట్టుకున్న ఉద్యోగులు చేసిన మేలు మరిచిపోలేనని ఈ విధంగా చెప్పాడు. 

అది ఒక వ్యవహారం. ఈ ఏడాది, రెండేళ్లలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ కావాల్సి వుంది. వారికి భారీ ఎత్తున ప్రభుత్వం పేమెంట్ సెటిల్ మెంట్ లు చేయాల్సి వుంది. అసలే విభజన పుణ్యమా అని ఆర్థికంగా నిలదొక్కుకొవాల్సిన పరిస్థితుల్లో ఇది చాలా కష్టమైన వ్యవహారం. నిజానికి ఈ సమస్య దాదాపు ఏడాదిగా నలుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఒక దశలో ఈ సమస్య చర్చకు వచ్చింది. అదీ కాక, ఇప్పటికిప్పుడు నియామకాలు ఎలాగూ సాధ్యం కాదు., పైకా కాంట్రాక్టు పద్దతిలొనైనా సిబ్బందిని తీసుకోవాలి. ఓ ఏడాది అయితే తప్ప కొత్త నియామకాలకు ఓ వ్యవస్థ అంటూ ఏర్పడదు. అందువల్ల ఇలా వయోపరిమితి పెంచడం అన్నది చాలా ప్రయోజనకరంగా వుంటుంది. పైగా ఉద్యొగులకు ఇది చిన్నా చితకా ఉపకారం కాదు. 

సరే అంతా బాగుంది మరి ఇంతకీ ఈ సీన్ లోకి కేసిఆర్ ఎక్కడ వచ్చాడు అన్నది. భౌగొళికంగా విడిపోయినా, తెలంగాణ, సీమాంధ్ర జనాలు వేరు వేరేం కాదు. ఆశలు, ఆకాంక్షలు అన్నీ ఒక్కటే. అసలే ఉద్యోగులు అండగా అధికారంలోకి వచ్చారు కెసిఆర్. ఇప్పుడు ఇదే వరం అక్కడ కూడా ఆయన ఇచ్చి తీరాలి. సీమాంధ్రకు ఇచ్చింది ప్రతీదీ తనకు కావాలని అడగడం కాదు..అక్కడ ఇచ్చినవి ఇక్కడా ఇవ్వాలి మరి. కానీ అక్కడే వుంది తకరారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులది ఎంత కీలక పాత్రనో, యువతరానికి, ముఖ్యంగా వర్సిటీ కుర్రాళ్లది అంతే పాత్ర. 

పైగా తెలంగాణ ఏర్పాటైతే, ఇంటికొకరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేస్తాయని జనానికి సినిమా చూపించారు. ఇప్పుడు కెసిఆర్ కానీ పొరపాటున ఉద్యోగుల పదవీ విరమణ గడువు పెంచారో, తెలంగాణ వర్సిటీల్లో అగ్గి రాజేసినట్లే. అలా అని పెంచకుంటే, ఉద్యోగుల్లో అసంతృప్తి. మరి సీమాంధ్ర యువతలో అసంతృప్తి రాదా అని అనొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలపై తెలంగాణ యవతలో వున్నంత ఆశ సీమాంధ్ర యువతలో లేదు. అలాగే ఉద్యమంలో వారి పాత్ర కూడా అంతే. అందువల్ల కెసిఆర్ కు మా చెడ్డ చిక్కు వచ్చి పడింది ఇప్పుడు. 

బాబు అంతే..గురిచూసి కొడితే..గునపం దిగిపోతుంది..

చాణక్య

[email protected]