బాధ్యతా రాహిత్యం

విజ్ఞాన యాత్రలు కాస్తా విహార యాత్రలుగా మారిపోతున్నాయి. ‘విద్యార్థులు కోరుతున్నారు.. వాటిని కాదనలేకపోతున్నాం..’ అని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నా, విజ్ఞానానికీ, విహారానికీ తేడా లేకుండా చేసేసి.. విషాదంలోకి విద్యార్థుల జీవితాల్ని నెట్టేయడంలో బాధ్యత తల్లిదండ్రులదా?…

విజ్ఞాన యాత్రలు కాస్తా విహార యాత్రలుగా మారిపోతున్నాయి. ‘విద్యార్థులు కోరుతున్నారు.. వాటిని కాదనలేకపోతున్నాం..’ అని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నా, విజ్ఞానానికీ, విహారానికీ తేడా లేకుండా చేసేసి.. విషాదంలోకి విద్యార్థుల జీవితాల్ని నెట్టేయడంలో బాధ్యత తల్లిదండ్రులదా? విద్యా సంస్థల యాజమాన్యాలదా.? లేకపోతే.. నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలు వ్యవహరిస్తున్నా, వాటిపై అదుపు లేని సర్కారుదా అసలు పాపం.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

తిలా పాపం తలా పిడికెడు.. అన్న చందాన విహార / విజ్ఞాన యాత్రలు విషాదాంతమవడంలో అందరికీ భాగస్వామ్యం వుంది. హైద్రాబాద్‌కి చెందిన ఓ ఇంజనీరింగ్‌ కళాశాల, తమ విద్యార్థుల్ని విజ్ఞాన యాత్ర పేరుతో విహారయాత్రకు తీసుకెళ్ళడం, ఆ విహార యాత్ర కాస్తా విషాదయాత్రగా మారిపోవడంతో, విద్యార్థుల తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారు తమవారి ఆచూకీ తెలియక.

తెలంగాణ హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి వున్నపళంగా విషాదం చోటుచేసుకున్న హిమాచల్‌ప్రదేశ్‌కి తరలివెళ్ళారు. కొందరు అధికారులూ ఆయన వెంట వున్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రం తమ బిడ్డల ఆచూకీ దొరకడం గగనమైపోయింది. ‘మమ్మల్ని వున్నపళంగా అక్కడికి తీసుకెళ్ళండి..’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ‘ప్రత్యేక విమానం ఏర్పాటు చేశాం’ అన్న ప్రభుత్వ ప్రకటనలు తప్ప, విద్యార్థుల తల్లిదండ్రులకు సరైన భరోసా లభించడంలేదు.

మరోపక్క, గల్లంతైనవారిలో కొందరి మృతదేహాలు బయటపడ్డంతో విద్యార్థుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ తరహా ఘటనల్లో కళాశాల యాజమాన్యాలపై తొలుత చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వమ్మీదనే వుంది. కానీ, చాలాకాలంగా ఈ తరహా ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్న విమర్శ వుంది.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం విజ్ఞాన / విహారయాత్రల విషయంలో ‘భద్రత’ గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది. విషాదం చోటు చేసుకున్నాక ఆందోళనలు, ఆవేదన తప్పవు. కానీ, ముందే మేలుకుంటే ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోవు.