కేంద్రంపై తెరాస స్ట్రాటజీ ఏమిటో?

మోడీకి మేము మిత్రపక్షమూ కాదు, శతృపక్షమూ కాదు..తటస్థం అని ప్రకటించారు ఎంపీ కవిత. ఓ ఎంపీగా కన్నా, తెరాస అధినేత కెసిఆర్ కుమార్తెగానే చూడాలి ఆమె మాటలను. అప్పుడే మరింత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. చిరకాలంగా…

మోడీకి మేము మిత్రపక్షమూ కాదు, శతృపక్షమూ కాదు..తటస్థం అని ప్రకటించారు ఎంపీ కవిత. ఓ ఎంపీగా కన్నా, తెరాస అధినేత కెసిఆర్ కుమార్తెగానే చూడాలి ఆమె మాటలను. అప్పుడే మరింత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. చిరకాలంగా మోడీ విషయంలో కాస్త తగ్గే వ్యవహరిస్తూ వస్తోంది తెరాస. ఆ మేరకే ఆచి తూచి మాట్లాడుతూ వస్తున్నారు ఆ పార్టీ నాయకులు. అయతే కేంద్రంతో, ముఖ్యంగా మోడీ లేదా భాజపాతో సఖ్యత కోసమే ప్రయత్నిస్తూ వస్తున్నారు కేసిఆర్. అందులో భాగంగానే భాజపా ప్రముఖులకు సన్మానాలు, వెంకయ్య నాయుడితో దోస్తీ, ఇలాంటివి కొనసాగాయి. ఆ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో చేరాలని తెరాస తహతహలాడుతోందని తరుచు వ్యాఖ్యలు వినిపించాయి. కూతురు కవిత కు పదవి కోసమే కేసిఆర్ ఈ దిశగా పావులు కదుపుతున్నారని కూడా వినిపించాయి. అక్కడికి కామా పడింది. 

ఇప్పుడు కవిత మాటలతో మళ్లీ ముందుకు కదిలింది వ్యవహారం. అయితే ఈసారి ముందుకు కాదు వెనక్కు. కానీ మాటల వెనుక మర్మం చూస్తుంటే ముందుకు వెళ్లడం కోసం వెనక్కు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని, పుష్కరాలకు ఆంధ్రకే ఎక్కువ నిధులు ఇచ్చారని కవిత ఆరోపించారు. మోడీప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని వాపోయారు. మరి ఇది ఉన్నట్లుండి సంభవించిన పరిణామం కాదు. పైగా రోడ్లకు సంబంధించి కేంద్రం తెలంగాణకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. చాలా సంస్థలు హైదరాబాద్ కు ఇప్పటికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కేంద్రం తలుచుకుంటే ఇదంతా ఉల్టా అవుతుంది. మరి ఎందుకు కవిత ఇలా మాట్లాడుతున్నట్లు?
నోటుకు ఓటు కేసులో కేంద్రం చంద్రబాబుకు దన్నుగా నిలిచిందా? హైకోర్టు విభజించకపోవడం తెరాసకు బాధగా వుందా? కానీ వీటన్నింటికన్నా, మిత్రపక్షంగా స్వీకరించకపోవడమే అసలు సమస్యగా కనిపిస్తోంది. రాబోయే పార్లమెంట్ సమావేశాలు భాజపాకు చాలా క్రూషియల్. అప్పుడు రాహుల్ గాంధీ చెప్పనే చెప్పారు..తమ ప్రతాపం చూపిస్తామని. ఓ పక్క 'ముగురమ్మల' అవినీతి వ్యవహారాలు, మరోపక్క భూ సేకరణ బిల్లు ఇలాంటి వ్యవహారాలున్నాయి. ఇప్పుడు తెరాస తటస్థం అంటే, భాజపా, రారమ్మని చేతులు చాపుతుందని కవితమ్మ ఈ ఎత్తుగడ వేసారని అనుకోవాలా? ఎందుకంటే లొల్లి చేయడంలో తెలంగాణ ఎంపీలు గట్టివారు. ఆ ముక్క పవన్ బాబు కూడా చెప్పారు. ఇప్పుడు హైకోర్టు విభజన వంకతో లొల్లి చేస్తే, మళ్లీ అదో తలకాయనొప్పి. అందుకని, అయితే తెలంగాణకు కావాల్సింది ఇస్తామనడం లేదా, తెరాసను కేంద్రంలోకి అంటే ఎన్డీఎలోకి తీసుకోవడం జరుగుతుందని, ఈ ఎత్తుగడ వేసారా అన్నది అనుమానం. 

కానీ మోడీ, అమిత్ షా..ఇద్దరూ, కవితమ్మ, కెసిఆర్ ల కన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. వీళ్ల పప్పులు, వాళ్ల కుక్కర్లో ఉడకమన్నా ఉడకవు. అందువల్ల కవితమ్మ మరీ ఎక్కువ ఆవేశపడిపోయి స్టేట్మెంట్ లు ఇవ్వకుండా వుండడమే మంచింది.