ముఖ్యమంత్రి అయ్యాక బన్సీ హరియాణాను పాతకాలం రాజుల్లా పాలించాడు. తనకు యిష్టం వచ్చినట్లు చేయడమే తప్ప నియమాలను పట్టించుకోలేేదు. నచ్చినవాళ్లను అందలం ఎక్కించడం, లేకపోతే నాశనం చేయడం. నోటికి ఎంత మాట వస్తే ఆ మాట అనేయడం. తన కంటె సీనియరు నాయకులను ఒకరి మీద మరొకరిని ఉసికొల్పుతూ పబ్బం గడుపుకోవడం. ఇక ప్రజలను మెప్పించడానికి సాధారణంగా నియంతలందరూ చేసేదే చేశాడు. బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతోంది అని చూపించడానికి విశాలమైన, పొడవైన రోడ్లు, ఫ్లయి ఓవర్లు, భవంతులు, పారిశ్రామిక వేత్తలకు రాయితీలిచ్చి, కార్మిక చట్టాలను కాలరాచి, నిబంధనలు వల్లించే అధికారుల నోళ్లు మూయించి, బెదిరించి, భూములు కట్టబెట్టి పరిశ్రమలు తెప్పించి, తెచ్చినవాటికి పదింతలు పబ్లిసిటీ చేయించుకున్నాడు. ఆ క్రమంలో యిళ్లు కూల్చినా, పొలాలు కాజేసినా మధ్యతరగతి ప్రజలు అభివృద్ధి కావాలంటే ఆ మాత్రం త్యాగాలు తప్పవు అనుకునేట్లా చేశాడు. అతని అసలు ఉద్దేశాలు బయటపడేసరికి ఆలస్యమై పోయింది. ఎదిరించిన మీడియాను కిరాతకంగా వేటాడాడు. పోలీసులను చేతిలో పెట్టుకుని నచ్చనివాళ్లపై దొంగ కేసులు పెట్టించడం, వ్యతిరేకవార్తలు రాసిన పత్రికల బిల్డింగులు కూల్పించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. చౌధురీ ధరమ్ సింగ్ పానిపట్‌లో సీనియర్ లాయరు. ఆయన ఒక బహిరంగ సభలో బన్సీ పాలనను విమర్శించాడు. అంతే మర్నాటి కల్లా పానిపట్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి గుడ్డలిప్పించి, మొహానికి తారు పూసి, బూట్లతో తంతూ ఊళ్లో వీధులన్నీ తిప్పారు. దీనిపై ఆయన ముఖ్యమంత్రి స్థానంలో వున్న బన్సీకే ఫిర్యాదు చేస్తే బన్సీ చిరునవ్వు నవ్వి అలా చేసిన పోలీసు అధికారులకు ప్రమోషన్లు యిచ్చాడు. తర్వాతి రోజుల్లో అవినీతికి మారుపేరుగా, ఫిరాయింపుదారులకు ప్రాతఃస్మరణీయుడిగా పేరొందిన భజన్ లాల్ అతనికి కుడిభుజంగా వుండేవాడు. కొంతమంది ఐయేయస్ అధికారులు అండదండగా నిలబడ్డారు.
మరి యిలాటివాణ్ని ఇందిర ఎందుకు సహించింది అనే ప్రశ్న వస్తుంది. అవతలివాడు ఎంత నీచుడైనా తనకు పనికి వస్తే చాలు అనే సిద్ధాంతం ఆమెది. సంజయ్‌ను నమ్ముకుంటే బంగారు భవిష్యత్తు అని ఎల్ ఎన్ మిశ్రా తర్వాత గ్రహించినవాడు బన్సీయే. 'బేటాజీ' అంటూ సంజయ్‌ను బాగా కాకా పట్టి మంచి చేసుకున్నాడు. సకల సౌకర్యాలు సమకూర్చాడు. బన్సీని కాదంటే సంజయ్‌కు కోపం వస్తుందని ఇందిరకు భయం. పైగా సంజయ్, ఇందిరలతో తను చేసిన సంభాషణలను రికార్డు చేయించి, ఆ టేపులు బన్సీ తన దగ్గర పెట్టుకున్నాడని అంటారు. వాటిని బయటపెడతాడన్న భయం కూడా ఇందిరకు వుండవచ్చు. ఈ భయంతో పాటు లోకమంతా సంజయ్‌ను పనికిమాలినవాడిగా తీసి పారేస్తూ వుంటే బన్సీ ఒక్కడే అతన్ని ఎంట్రప్రెనార్‌గా గుర్తించి ప్రోత్సహిస్తున్నాడన్న కృతజ్ఞత కూడా వుండవచ్చు.
బన్సీ మారుతి విషయంలో చేసిన దేమిటో తెలుసుకుంటే అతని వ్యవహార శైలి ఎలా వుండేదో అర్థమవుతుంది. 1968 జులై నాటికి ప్రయివేటు సెక్టార్‌లో కారు తయారు చేయించాలని ఇందిర ప్రభుత్వం నిర్ణయించింది. రోల్స్ రాయిస్‌లో ఏడాది పాటు ట్రెయినింగ్ తీసుకుని, ఇంకో మూడో వంతు మిగిలి వుండగా వెనక్కి వచ్చేసిన సంజయ్ గాంధీ రూ.6 వేలలో చేస్తానని ప్రతిపాదన పంపాడు. (మారుతి కథ తర్వాతి భాగాల్లో విపులంగా వస్తుంది) 1970 కల్లా ఏడాదికి 50 వేల కార్లు తయారు చేయడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ప్రభుత్వం యిచ్చేసింది. 1970-71 ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ప్రకారం ఆ ఏడాది సంజయ్ ఆదాయం 722 రూ.లు. అలాటివాడు కార్ల ఫ్యాక్టరీ ఎలా పెట్టగలడు అని పార్లమెంటులో అడిగారు. ఇందిర పట్టించుకోలేదు. మారుతి లిమిటెడ్ అని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని రూ. 2.50 కోట్ల ఆథరైజ్‌డ్ కాపిటల్‌తో 1971 మధ్యలో ప్రారంభించారు. సంజయ్ దానికి ఎండీ. జీతం రూ.4000, దీనితో బాటు పెర్క్‌స్ కూడా వున్నాయి. తక్కిన డైరక్టర్లు రౌనక్ సింగ్, విఆర్ మోహన్, విద్యాభూషణ్. చైర్మన్ ఆటోమొబైల్ ప్రోడక్ట్‌స్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎంఎ చిదంబరం. వీళ్లందరి పైనా ఇన్‌కమ్ టాక్స్ ఎగవేత కేసులున్నాయి. (ఆ విషయం పార్లమెంటులో ఆర్ ఎన్ మీర్ధా అనే హోం శాఖ సహాయమంత్రి ఒప్పుకున్నాడు) వాళ్లందరూ బాగానే పెట్టుబడి పెట్టినా ఎండీ సంజయ్‌గారి వాటా మాత్రం కేవలం వంద రూపాయలు. 10 రూపాయల షేర్లు 10 ఎలాట్ చేశారు. ఆర్‌ఓసి (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్) రూల్సు ప్రకారం డైరక్టరు కావాలంటే హీనపక్షం 25 వాటాలుండాలి. ఆ రూలు మా కంపెనీకి వర్తించదు అని మారుతి ఒక ప్రత్యేక తీర్మానం చేసుకుంది.
ఇలాటి కంపెనీకి భూమి సమకూర్చడానికి బన్సీ ముందుకు వచ్చాడు – అదీ కంపెనీ ఏర్పడ్డానికి ముందే 1971 మార్చిలోనే! సంజయ్ తల్లి యింట్లో వుంటున్నాడు కాబట్టి అక్కణ్నుంచి కేవలం 7 కి.మీ. దూరంలో ఢిల్లీ-గుడ్‌గావ్ హైవే మీద 405 ఎకరాలు స్వాధీనం చేసుకుని దాన్లోంచి 297 ఎకరాలు ఆఫర్ చేశాడు. అది ఖాళీ స్థలంగా వుంటే చిక్కు లేకపోవును. కానీ అక్కడ పచ్చటి పొలాలున్నాయి. ప్రతి 25 ఎకరాలకు ఒక ట్యూబ్ వెల్ వుంది. పశుసంపద వుంది. అక్కడ మార్కెట్ రేటు ఎకరం రూ.40 వేలుంటే పొలాల మీద పంటతో, ట్యూబ్ వెల్స్‌తో, పొలాల్లో వున్న యిళ్లతో సహా సంజయ్‌కు రూ.11,776 రేటున యిస్తామన్నాడు. అలా వసూలు చేసిన రూ. 36 లక్షల డబ్బును దానిపై ఆధారపడి వున్న 1500 మంది రైతులకు యిస్తామన్నారు. వాళ్లను ఖాళీ చేయించడం ఎలా? వాళ్లు ఖాళీ చేయమంటూ సంఘంగా ఏర్పడి కోర్టుకి వెళ్లారు. కోర్టులో మర్నాడు విచారణ జరుగుతుందనగా భూస్వాధీన ఆదేశాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుంది. రైతులు హమ్మయ్య గెలిచాం అనుకున్నారు. మొదటి ఆర్డర్ విరమించుకున్న మర్నాడే యింకో ఆర్డరు తయారు జారీ చేసి కావాలని మూడు నెలల దాకా దాన్ని పబ్లిష్ చేయలేదు. భూసేకరణపై అభ్యంతరాలున్న రైతులందరూ కోర్టుకి వచ్చి చెప్పుకోవాలి. అది కూడా ఒకే రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపున చెప్పుకోవాలి. లేకపోతే స్వాధీనం చేసేసుకుంటాం అని ప్రకటించారు. దాంతో ఊళ్లో రైతులంతా కంగారు పడి అవేళ కోర్టుకి పరిగెట్టారు. ఊళ్లో మొగాళ్లంతా అటు వెళ్లగా చూసి పోలీసులు ఆ భూముల్ని స్వాధీనం చేసేసుకున్నారు. ముసలివాళ్లు కొందరు అభ్యంతర పెట్టబోతే 'దీన్ని మిలటరీ కోసం తీసుకుంటున్నాం. జాతీయ ప్రయోజనాలకు మీరు అడ్డురాకూడదు' అని సుద్దులు చెప్పారు. ఇలా మోసపూరితంగా భూమిని తీసేసుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు పరిహారం తీసుకున్నారు. ఆ రూ. 36 లక్షలు కూడా మారుతి అప్పుడు అది కూడా యివ్వలేదు. హరియాణా ప్రభుత్వమే చెల్లిస్తే నాలుగేళ్ల తర్వాత అది వాళ్లకు చెల్లించింది.
భూమి తీసుకోవడానికి మిలటరీ ప్రయోజనాలని చెప్పారు కానీ జరిగింది పూర్తిగా వ్యతిరేకం. ఈ స్థలానికి దగ్గర్లో ఎయిర్‌ఫోర్స్ ఎమ్యూనిషన్ డంప్, ఎయిర్‌ఫీల్డు వున్నాయి కాబట్టి భద్రతా కారణాల వలన అక్కడ ఏ నిర్మాణమూ అంగీకరించమని మిలటరీ వాళ్లు చెప్పారు. ఫ్యాక్టరీ కడితే విమానాలకు ప్రమాదం. ఎమ్యూనిషన్ డంప్ కారణంగా ఫ్యాక్టరీకి ప్రమాదం. అందువలన కమాండింగ్ ఆఫీసరు, హరియాణా ప్రభుత్వానికి తన అభ్యంతరాలను తెలియపరిచాడు. అయితే అప్పుడు డిఫెన్సు ప్రొడక్షన్‌కు మంత్రిగా వున్న విసి (విద్యా చరణ్) శుక్లా మరొక దుర్మార్గుడు. సంజయ్‌కు భక్తుడిగా మారి ఎమర్జన్సీ కాలంలో అకృత్యాలకు పాల్పడినవాడు. మిలటరీ డంప్‌ను అక్కణ్నుంచి తరలించేయమని కమాండింగ్ ఆఫీసరును ఒత్తిడి చేశాడు. తక్కిన అభ్యంతరాలను కొట్టి పారేశాడు. అలా మారుతి ఫ్యాక్టరీ హరియాణాలో నెలకొల్పడానికి బన్సీ అన్ని రకాల అడ్డుదార్లు తొక్కాడు. ఫ్యాక్టరీ పెట్టిన ఏడాది కల్లా సంజయ్ 75 మంది డీలర్లను నియమించి ఆర్నెల్లలో కార్ల డెలివరీ చేస్తానన్నాడు. డిపాజిట్లగా రూ.1 -3 లక్షలు వసూలు చేశాడు. అలా రూ.2.18 కోట్లు సంపాదించాడు. 1972 నవంబరులో 1973 ఏప్రిల్ కల్లా కారు తయారవుతుంది కానీ 6 వేలకు కాదు రూ.11, 300కు అన్నాడు. ఏం చెప్పినా చివరకు కారు తయారవలేదు. ఫ్యాక్టరీ మూత పడుతుందేమో ననుకుంటే మళ్లీ బన్సీ ఆపద్రరక్షకుడిలా అవతరించి హరియాణాలోని బస్సు బాడీలన్నీ అక్కడే తయారుచేయించండి అని హరియాణా ట్రాన్స్‌పోర్టుకు ఆదేశాలిచ్చాడు. చెప్పాలంటే బన్సీ సంజయ్ పాలిట అలాదీన్ అద్భుతదీపంలోని భూతం. ఏ పని కావాలన్నా, ఏ కష్టం వచ్చినా ఒకసారి పిలిస్తే చాలు ప్రత్యక్షమై ఏ దారిలోనైనా సరే పని చేసి చూపిస్తాడు. అలహాబాదు తీర్పు తర్వాత కష్టం వచ్చినపుడు కూడా సంజయ్ అతన్నే తలచుకున్నాడు. (సశేషం) (ఫోటో – బన్సీ లాల్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)