లలిత్ మోదీ గురించి వచ్చి పడుతున్న బోల్డంత సమాచారం చూస్తే గతంలో రాసిన ఒక ఆర్టికల్‌తో సరిపుచ్చడం న్యాయం కాదనిపించి, యిది రాస్తున్నాను. అతనికి సామర్థ్యమూ వుంది, తెగింపూ వుంది, అక్రమాలు చేయడానికి జంకని లక్షణమూ వుంది. రాజకీయ నాయకులతో అతను నెరపిన స్నేహబాంధవ్యాలు, అతని దూరదృష్టి, దుస్సాహసాలు, వ్యక్తిగత జీవితం అన్నీ రసవత్తరమే.
లలిత్ మోదీది పారిశ్రామిక వేత్తల కుటుంబం. అతని తాత రాయ్ బహదూర్ గుజర్ మల్ మోదీ, మోదీ నగర్ పేర ఒక పారిశ్రామిక నగరమే నిర్మించారు. తండ్రి కృష్ణకుమార్ మోదీకి (కెకె మోదీ అంటారు) గాడ్‌ఫ్రే ఫిలిప్స్ కంపెనీ వుంది. ఇది రెడ్ అండ్ వైట్ సిగరెట్లు ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలోని పొగాకు కంపెనీల్లో ద్వితీయ స్థానంలో వుంది. కెకె యిద్దరు కొడుకుల్లో లలిత్ పెద్దవాడు. నైనిటాల్‌లోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో చదివేటప్పుడు తరచు క్లాసులు ఎగ్గొట్టేవాడట. చివరకు చెప్పా పెట్టకుండా సినిమాకు చెక్కేసినందుకు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పుడు 1983లో అంటే అతనికి 20 ఏళ్లుండగా అమెరికాకు పంపారు. న్యూ యార్క్‌లోని పేస్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండేళ్లు చదివి ఉత్తర కరోలినాలోని డ్యూక్ యూనివర్శిటీలో బిజినెస్ ఎడ్మినిస్ట్రేషన్ కోర్సులో చేరాడు. ఏ కోర్సూ పూర్తి చేయలేదు కానీ కొకైన్ కొనబోతూ గొడవల్లో యిరుక్కున్నాడు. దానికి ప్రేరేపించిన కుర్రాణ్ని కొట్టి కిడ్నాప్ చేయడం పోలీసుల దృష్టికి వెళ్లింది. కోర్టులో కేసయింది. నేరాలు ఒప్పుకోవడంతో 1985 ఫిబ్రవరిలో రెండేళ్ల జైలు శిక్ష పడింది. తండ్రి రాజీవ్ గాంధీ ద్వారా పైరవీ చేశాడు. ఆయన
కి ఆత్మీయులైన అమెరికన్ వ్యాపారులు మధ్యవర్తిత్వం చేశారు. అంతా కలిసి లలిత్‌కు అనారోగ్యమని, స్వదేశానికి పంపేయాలని కోర్టును అడిగారు. ఇండియాలో 200 గంటల సమాజసేవ చేయాలన్న షరతుపై కోర్టు అతన్ని వదిలింది. మళ్లీ అమెరికాలో అడుగు పెట్టకూడదనే షరతు కూడా పెట్టారట. ఇక్కడ అతను చేసిన సమాజసేవ ఏమిటో తెలియలేదు.
1986లో ఢిల్లీకి తిరిగి వచ్చి ఫ్యామిలీ బిజినెస్‌లో పాలు పంచుకున్నాడు. ఇంటర్నేషనల్ టుబాకో కంపెనీనికి 1987 నుంచి 1991 వరకు ప్రెసిడెంటుగా వున్నాడు. గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌లో కూడా నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరక్టరుగా నియమించారు. అంటే పెద్దగా అధికారాలు ఏమీ వుండవన్నమాట. అతని తల్లి బీనాకు మినాల్ అనే స్నేహితురాలు వుండేది. వ్యాపారరీత్యా నైజీరియాలో స్థిరపడిన పెస్సు అశ్వానీ అనే సింధీ పెద్దమనిషి కూతురు ఆమె సౌదీ ఆరేబియాలో స్థిర పడిన జాక్ సగ్రానీ అనే ప్రొఫెషనల్‌ను పెళ్లాడి కరిమా అనే ఒక ఆడపిల్లను కంది. అయితే గల్ఫ్‌లో జరిగిన ఒక స్కాములో జాక్ యిరుక్కోవడంతో యిద్దరూ విడిపోయారు. ఆమె ఢిల్లీ వచ్చేసింది. లలిత్ తల్లిని కలవడానికి వచ్చేది. తన కంటె తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్ అంటే లలిత్ యిష్టపడ్డాడు. ఇద్దరూ కలిసి తిరిగారు. 1991 అక్టోబరులో ఆమెను పెళ్లి చేసుకుంటామని చెప్పినపుడు తలిదండ్రులకు యిష్టం లేకపోయినా సరే ననాల్సి వచ్చింది. అతనికి ఒక హోదా కల్పించాలని గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌లో 1992లో ఎగ్జిక్యూటివ్ డైరక్టరు చేశారు. వీళ్ల పెళ్లిని ఢిల్లీ సోషల్ సర్కిల్స్ ఆమోదించకపోవడంతో బొంబాయికి మారిపోయారు. వాళ్లకు రుచిర్ అనే కొడుకు, ఆలియా అనే కూతురు కలిగారు.
బొంబాయి వచ్చాక లలిత్ వినోద రంగానికి చెందిన వ్యాపారంలోకి దిగాడు. ఫ్యామిలీ ట్రస్టుకి సంబంధించిన డబ్బు పెట్టుబడిగా పెట్టి మోదీ ఎంటర్‌టైన్‌మెంట్ అని పెట్టి బాంద్రాలో ఖరీదైన ఆఫీసు తెరిచాడు. వాల్ట్ డిస్నీ వాళ్లతో పదేళ్ల కాంట్రాక్టు రాసుకుని 1992లో అలాదీన్ సీరియల్‌ను హిందీ డబ్బింగ్‌తో ఇండియన్ టీవీకి పరిచయం చేశాడు. ఇఎస్‌పిఎన్ టీవీ ఛానెల్‌తో పదేళ్లకు దాదాపు వెయ్యి మిలియన్ల డాలర్లకు కాంట్రాక్టు పెట్టుకుని అది ప్రసారం చేసే కేబుల్ టీవీ ఆపరేటర్ల వద్ద డబ్బు వసూలు చేసి యివ్వడం అతని పని. కానీ అతను వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాడని ఇఎస్‌పిఎన్‌కు అనుమానం వచ్చి కాంట్రాక్టు రెన్యూ చేయలేదు. ఫ్యాషన్ టీవీతో చేసుకున్న ఒప్పందం కూడా బెడిసి కొట్టింది. 2002లో కేరళలో ''సిక్సో'' అనే పేర ఆన్‌లైన్ లాటరీ నడిపాడు. స్పోర్ట్స్ పే ఛానెల్ పెట్టబోయాడు. ఇవన్నీ కొత్తరకమైన వెంచర్సే కానీ అతనికి లాభాలు తెచ్చిపెట్టలేదు.
అమెరికాలో వుండగా స్పోర్ట్‌స్ లీగ్ వాళ్లు డబ్బు గడించే విధానం చూసి ముగ్ధుడైన లలిత్ మన దేశంలో క్రికెట్ అంటే మోజు వుంది కాబట్టి, దానికి టీవీకి ముడిపెడితే బాగుంటుందని తోచి ఒక ఐడియా వేశాడు. అతను, యాడ్ గురు అనదగిన పీయూష్ పాండే కలిసి 1993లో ఇండియన్ క్రికెట్ బోర్డుకు ఒక ప్రతిపాదన చేశారు. పేరున్న క్రికెట్ ఆటగాళ్లకు భారీ పారితోషికాలు యిచ్చి వారితో లీగ్ ఏర్పరచి 50 ఓవర్లతో ఒక రోజు ఆట ఆడించాలి. డబ్బు ఎక్కణ్నుంచి వస్తుంది అంటే దాని ప్రసారపు హక్కులను టీవీలకు అమ్మితే సరి అన్నాడు. కానీ అతనికున్నంత ముందు చూపు లోపించిన బోర్డుకి నమ్మకం చిక్కలేదు. టీవీలు అంత డబ్బెందుకు యిస్తాయి? అన్నారు. క్రికెట్ బోర్డుల్లోకి చొరబడితే తప్ప తన మాట వినరని అతనికి అనిపించింది. 1999లో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు ఎన్నికయ్యాడు. కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ఆమోదించకపోవడం వలన వైదొలగవలసి వచ్చింది. 2004లో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంటు ఐయస్ భింద్రా అతన్ని ఆ అసోసియేషన్‌కు వైస్ ప్రెసిడెంటు చేశాడు. ఆ అనుభవంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సిఏ)పై కన్నేశాడు. అప్పటికి ఏడాది క్రితమే 2003లో వసుంధరా రాజె రాజస్థాన్ ముఖ్యమంత్రి అయింది.
వసుంధరా రాజే స్కూలు ఫ్రెండ్ బీనా కీలాచంద్ ద్వారా అతను ఆవిడ స్నేహం సంపాదించాడు. లలిత్ భార్య, వసుంధర సమవయస్కులు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. 1990లో లలిత్‌ను వెంటబెట్టుకుని వసుంధర చంద్రశేఖర్ ప్రభుత్వంలోని ఒక మంత్రి వద్దకు తీసుకెళ్లి గ్వాలియర్ వద్ద ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతి యిప్పించడానికి ప్రయత్నించింది. అప్పటివరకు 30 ఏళ్లగా కాంగ్రెసు సమర్థకులైన రుంగ్‌టా కుటుంబం ఆర్‌సిని ఏలుతోంది. ఎలాగైనా వాళ్లను తప్పించాలని చూసిన వసుంధరకు లలిత్ ఉపయోగపడ్డాడు. అతని గెలుపు కోసం ఆమె రూల్సు మార్చేసింది. అప్పటి దాకా 33 జిల్లాలతో బాటు 66 మంది అసోసియేట్ సభ్యులకు (వీళ్లంతా రుంగటా మనుషులే) అధ్యక్షుణ్ని ఎన్నుకునే హక్కు వుండేది. కొత్తగా స్పోర్ట్‌స్ చట్టం అని పెట్టి ఆ 66 మంది సభ్యులకు ఓటింగు హక్కు తీసేస్తూ స్పోర్ట్‌స్ చట్టం పాస్ చేయించాడు. ముఖ్యమంత్రి అధికారం, లలిత్ చతురత తోడై ఆర్‌సిఏ లలిత్ వశం అయింది. అతి కష్టం మీద జిల్లాలలో మెజారిటీ సంపాదించి ఒక్క ఓటు తేడాతో కిశోర్ రుంగ్టాను ఓడించి అధ్యక్షుడయ్యాడు. అది 2005. అప్పణ్నుంచి అతను రాజస్థాన్‌కు క్రీడారంగంలో గ్లామర్ తెచ్చి పెట్టాడు. ఆర్‌సిఏ ఆఫీసును జయపూర్‌లోని రాంబాగ్ పేలస్ హోటల్ నుండి నడపసాగాడు. ఒక ప్రయివేటు జెట్‌లో తిరిగేవాడు. జయపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంపై కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టించి, దాన్ని దేశంలోనే ఉత్తమమైన స్టేడియంలలో ఒకటిగా తీర్చిదిద్దాడు. తన నిర్వహణా సామర్థ్యంతో 7 కోట్లతో క్రికెట్ ఎకాడమీ ఏర్పరచాడు. అది రంజీ ట్రోఫీ కూడా గెలిచింది. ఆటలు నిర్వహించి యాడ్స్ ద్వారా, ఉచిత ప్యాసులు రద్దు చేసి టిక్కెట్లు హెచ్చు ధరలకు అమ్మడం ద్వారా ఆదాయం తెచ్చిపెట్టాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)