మరో ఫిల్మ్ సిటీ అవసరమా?

హైదరాబాద్ తెలుగు సినిమా పరిశ్రమకు కేంద్రం.  చెన్నారెడ్డి దగ్గర నుంచి వైఎస్ వరకు ఎందరో ఇచ్చిన వరాలు, అవకాశాలు కలిసి వచ్చి, ఈరోజు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కాదు, ఏకంగా భారత చలన…

హైదరాబాద్ తెలుగు సినిమా పరిశ్రమకు కేంద్రం.  చెన్నారెడ్డి దగ్గర నుంచి వైఎస్ వరకు ఎందరో ఇచ్చిన వరాలు, అవకాశాలు కలిసి వచ్చి, ఈరోజు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కాదు, ఏకంగా భారత చలన చిత్ర పరిశ్రమలోని అనేక భాషా చిత్రాలు హైదరాబాద్ లో రూపొందుతున్నాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే మరో ఫిల్మ్ సిటీని చిత్రనగరి పేరిట నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం రాచకొండ గుట్టల ప్రాంతాన్ని ఎంచుకుంది.

ఇక్కడ చాలా ప్రశ్నలు వున్నాయి.

  • ఇప్పుడు హైదరాబాద్ కు మరో ఫిల్మ్ సిటీ అవసరం ఏ మేరకు?
  • ఓ ఫిల్మ్ సిటీని ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించగలదా?
  • ఫిల్మ్ సిటీ లేదా స్టూడియో అన్నది ఏ మేరకులాభదాయకం?
  • ఈ ఫిల్మ్ నగరిలో ఆశ్రితులకు మరికొందరికి స్థలాలు కట్టబెట్టడం మినహా ఏమైనా ప్రయోజనం వుంటుందా?
  • హైదరాబాద్ కు సుదూరంగా చిత్రనగరి నిర్మించడం వల్ల పరిశ్రమకు వెసులుబాటుగా వుంటుందా?

వీటన్నింటికీ వరుసగా సమాధానాలు వెతికితే…

హైదరాబాద్ లో ఇప్పటికే రామకృష్ణ, అన్నపూర్ణ, పద్మాలయా, సారథి, రామానాయుడు స్టూడియోలు, రామోజీ ఫిల్మ్ సిటీ వున్నాయి. స్టూడియో నిర్వహణ అన్నది చిన్న విషయం కాదు. దాదాపు అన్ని స్టూడియోలు నష్టాలను ఎదుర్కున్నవే. అన్నపూర్ణ కట్టిన కొత్తలో ఎఎన్నార్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రేమాభిషేకం హిట్ అయిన సందర్భంలో మాట్లాడుతూ, ఏఎన్నార్, ఆ సినిమా హిట్ కాకుంటే స్టూడియో అమ్మేయాల్సి వచ్చేదని అన్నారు.  నాగార్జున హయాం వచ్చాక, టీవీ కార్యక్రమాలకు స్టూడియోల అవసరం పెరిగాక అన్నపూర్ణ సమస్యల నుంచి గట్టెక్కింది. 

హీరో కృష్ణ పద్మాలయా స్టూడియో ఏనాడో అలా పడి వుంది. ఎన్టీఆర్ తన స్టూడియోను వేరే చోటికి మార్చారు. అక్కడ టీవీ సీరియళ్లు తప్ప,సినిమాలు షూట్ చేసింది తక్కువ. ఇక సారథి స్టూడియో కూడా ఎక్కువగా టీవీకే ఉపయోగపడుతోంది. రామానాయుడు స్టూడియో కొంతవరకు ఫరవాలేదు. ఎక్కువగా సినిమాలకు ఉపయోగపడుతున్నది రామోజీ ఫిల్మ్ సిటీనే. అందునా ప్రయివసీ కోరుకునే పెద్ద హీరోలు, డైరక్టర్లు ఆర్ఎఫ్ సి ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్, తమిళ భారీ సినిమాలకు అది బాగా పనికివస్తోంది. అయితే దాని నిర్వహణకు అది ఏ మాత్రం సరిపోదు కనుకనే దాన్ని ఇటు పర్యాటక కేంద్రంగా, అటు సమావేశాల నిర్వహణకు, ఇలా బహుళ ప్రయోజనకరంగా మార్చి, కిందా మీదా పడుతున్నారు.

మరి ఇలాంటి నేపథ్యంలో ఇంకో స్టూడియో లేదా ఫిల్మ్ సిటీ అవసరమా? పైగా స్టూడియోలు, ఫిల్మ్ సిటీలు ప్రయివేటు వారే లాభదాయకంగా చేసుకోలేకపోతున్నారు. ఇక ప్రభుత్వం వల్ల ఏమవుతుంది. లేదూ ప్రయివేటుకు నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు అప్పగించి, అందుకు ప్రభుత్వం ఇంత అని ప్రతిఫలం తీసుకుంటుంది అనుకుందాం. అప్పుడు నిర్వహణ సమస్య ఉత్పన్నం కాదు. కానీ అసలు ఆ మేరకు ఇక్కడ సినిమా వ్యాపారం వుందా అన్నది చూడాలి.

స్టూడియోలో సినిమా అన్నది కేవలం చాలా తక్కువశాతానికి పరిమితమవుతోంది. కంప్యూటర్ గ్రాఫిక్ లు వంటి హంగులు వచ్చేసాక రాను రాను సెట్ ల నిర్మాణం ఇంకా తగ్గిపోతుంది. పార్క్ లు, ఇతరత్రా షూటింగ్ స్పాట్ లు కల్పించడం వరకు ఓకె. కానీ ఓ వంద సినిమాలు అయ్యాయంటే అవి బోర్ కొట్టేస్తాయి. రామోజీ ఫిలి సిటీలో జరిగింది అదే. జనం గుర్తుపట్టస్తారు. అందుకే మన వాళ్లు తరచు విదేశాల్లో సినిమాలు నిర్మిస్తున్నారు.                  
       
ఇక రికార్డింగ్ థియేటర్లు బోలెడు వున్నాయి. ఇతరత్రా సాంకేతిక విభాగాలు రాను రాను కుచించుకుపోతున్నాయి. ఔట్ సోర్సింగ్, కంప్యూటర్ల వాడకం కారణంగా పెద్ద పెద్ద స్థలాల అవసరం తగ్గిపోతోంది. ప్రతి సినిమా కార్యాలయంలోనూ ఎడిట్ సూట్ లు ప్రత్యక్షమవుతున్నాయి. అదీ కాక  రాజధానికి దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఫిల్మ్ సిటీ నిర్మించడం వల్ల పెద్దగా వెసులుబాటు కూడా వుండదు.

ఇంతవరకు సినిమా రంగానికి ప్రభుత్వం చౌకగా అందించిన స్థలాలు అన్నీ ఎక్కువగా సీమాంధ్రులు తీసుకున్నారు కాబట్టి, ఇప్పుడు తెరాస ఆశ్రితులు లేదా తెలంగాణ సినిమా జనాలకు న్యాయం చేయడానికి తప్పితే, ఈ ప్రాజెక్టు మరే విధంగానూ పనికివస్తుందని అనిపించడం లేదు.

ఫంక్షన్ హాళ్లు కావాలి

ప్రస్తుతం హైదరాబాద్ కు ఫిలిం సిటీ కన్నా ఫంక్షన్ హాళ్ల అవసరం ఎక్కవగా వుంది. ఎందుకంటే హైదరాబాద్, సికిందరాబాద్, సైబరాబాద్ లో లెక్కకుమించి ఫంక్షన్ హాళ్లు వున్నాయి. కానీ ఏ ఒక్కటీ కూడా సామాన్యుడికి అందుబాటులోలేవు. అన్నింటికీ లక్షల్లోనే అద్దెలు వసూలు చేస్తున్నారు. ఓ కల్చరల్ కార్యక్రమం నిర్వహించాలంటే, రవీంద్రభారతి, త్యాగరాయ గానసభ దిక్కు. రవీంద్రభారతి ఫీజుకూడా తక్కువేమీ కాదు.

అందువల్ల జంటనగరాల్లో ప్రభుత్వ స్థలాలు వున్నచోట్ల ప్రయివేటు భాగస్వామ్యంతో ఫంక్షన్ హాళ్లు నిర్మించి, ప్రభుత్వమే నామినల్ అద్దెకు సామాన్యులకు అందించడం అవసరం,.ఇలా చేయడం వల్ల మరో సదుపాయం వుంది. సామాన్యులు రోడ్ల మీదనే కార్యక్రమాలు నిర్వహించడం తప్పుతుంది. ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. ప్రభుత్వం ఎప్పుడైతే తక్కువ అద్దెకు సదుపాయాలు కల్పిస్తోందో, లక్షల్లో అద్దెలు వసూలు చేసేవారు కూడా తగ్గిస్తారు. ఒక్క ఫిల్మ్ సిటీ నిర్మించే ఖర్చుతో కనీసం వందకు పైగా ఫంక్షన్ హాళ్లు నిర్మించవచ్చు. దానివల్ల సామాన్యుల అభిమానం సంపాదించవచ్చు. అందునా వచ్చేవి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు కాబట్టి, ఉభయతారకంగా  కూడా వుంటుంది.