టికెట్ లేని వాడు ముందు బస్ ఎక్కాడట..నడవడం కష్టం అన్నవాడు..పరుగు పందెంలో ఫస్ట్ ప్రయిజ్ నాదే అన్నాడట. అలాగ్గా వుంది వైకాపా వ్యవహారం. విశాఖ మేయర్ స్థానం మాదే అని హూంకరిస్తోంది..రంకెలు వేస్తోంది. పార్టీ అధ్యక్షురాలిని చివరి నిమిషంలో పోటీకి పెట్టి అభాసుపాలయింది. ఇప్పుడు ఏకంగా మేయర్ పదవికే గాలం వేస్తోంది.
మరోపక్క హుద్ హుద్ ను అవకాశంగా మార్చుకుని చంద్రబాబు ఇప్పటికే నాలుగువందల యాభై కోట్ల ప్రభుత్వ ధనాన్ని విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ లో పప్పు బియ్యంగా మార్చి జల్లేసారు. జనాలందరికీ ఫ్రీగా పంచేసారు. వరదలు వచ్చి సరుకులు కొట్టుకుపోతే అది వేరు. తుపాను వచ్చి చెట్లు చేమలు పడిపోయి, ఇళ్ల కు డామేజ్ జరిగితే సరుకులు పంచిన ఘనత బాబుదే.
పైగా ఎక్కడా ఎన్నికలు అన్న పదం బాబు నోటి వెంట ఇప్పటి దాకా వస్తే ఒట్టు. కానీ విశాఖలో గడచిన ఒకటి రెండు నెల్లలో తరచు బాబు మీటింగ్ లు పెడుతూనే వున్నారు. మెట్రో బృందాన్ని విశాఖ పంపించారు. విశాఖ జనాల మనసులు చాలా వరకు బాబు చూరకొన్నారనే చెప్పాలి.
ఇప్పుడు బాబును ఢీకొనాలంటే అంత చిన్న విషయం కాదు.పైగా వైకాపా దుకాణం దాదాపు ఖాళీ అయింది. విశాఖలోని కొన్ని ప్రాంతాల ఓటర్లను ప్రభావితం చేయగల సత్తా వున్నా దాడి, కొణతాల కూడా పార్టీని వదిలేసారు.
అయితే అలా అని వైకాపా పోటీ చేయకూడదని కాదు. దానికి ప్లాన్, పద్దతి అంటూ వుంటుంది. 'సాక్షి'మైకుల మందు రంకెలు వేస్తే సరిపోదు. ఈ సవాళ్లు చేసిన వాళ్ల స్టామినా ఏమిటన్నది చూడాలి. గుడివాడ అమరనాధ్ కానీ, వంశీకృష్ణ కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి చవిచూసిన వారే.
ఇప్పుడు జగన చేయాల్సింది మరోసారి విశాఖ జనాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం. అది ఇలాంటి నాయకుల వల్ల కాదు. దానికి నేరుగా జగన్ మాత్రమే రంగంలోకి దిగాలి. అలాగే లోటస్ పాండ్ లొ కూర్చుని మీటింగ్ లు పెడితే కుదరదు. అలా అని ధర్నాలు కాదు కావాల్సింది. విశాఖలో వుండి అక్కడి పార్టీ సమస్యలు ముందు పరిష్కరించాలి. నాయకులకు తనపై నమ్మకం కలిగించాలి.
తన చుట్టూ తిరిగే వారు కాదు, అసలు స్టామినా వున్నవారు ఎవరు అన్నది తెలుసుకోవాలి. వారిని చేరదీయాలి. అంతే కానీ ఇలా రంకెలువేసి, మైకుల ముందు సవాళ్లు చేసేవారు ఫీల్డ్ లోకి పోయి తెచ్చే ఓట్లు ఎన్నో వుండవని గమనించాలి. లేదంటే మరోసారి అభాసు పాలు కావాల్సి వస్తుంది,.