నవ్విపోదురుగాక..ఈనాడుకేటి సిగ్గు?

‘…తెరచాటు రాజకీయ కుమ్మక్కుతో, జైలు నుంచి నిష్పూచీగా విడుదలైన అవినీతి ఆనకొండ జగన్..’ Advertisement ‘..జగన్ లాంటి జగత్ కిలాడీ, దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటూ ఊరేగుతున్నాడు..’  ‘చట్టానికి చీడపురుగులాంటి అరుణ్ గాన్లీ (మాఫియా నాయకుడి)కి…

‘…తెరచాటు రాజకీయ కుమ్మక్కుతో, జైలు నుంచి నిష్పూచీగా విడుదలైన అవినీతి ఆనకొండ జగన్..’

‘..జగన్ లాంటి జగత్ కిలాడీ, దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటూ ఊరేగుతున్నాడు..’ 

‘చట్టానికి చీడపురుగులాంటి అరుణ్ గాన్లీ (మాఫియా నాయకుడి)కి జగన్ కు తేడా ఏముంది?
(ఏప్రిల్ 26 ఈనాడు సంపాదకీయం)

‘..జగన్మాయకు లోబడితే, గాడాంధకారంలో మునిగిపోక తప్పదు…తెలుగు ఓటర్లు పదునైన తీర్పు ఇవ్వడమే..వారసుడి పీడకు సరైన విరుగుడు
(ఏప్రిల్ 29 ఈనాడు సంపాదకీయం)

‘..జగన్మాయగాళ్లు, ఇప్పుడు ప్రత్యక్ష అధికారానికి అర్రులు చాస్తున్నారు..ఎంతటి జగత్ కంత్రీలైనా ఎల్లకాలం తమను మోసం చేయలేరని ఓటర్లు నిరూపించాలి. దోపిడీ వారసత్వ వేళ్లూనుకోకుండా అందరూ ఒక్కటై వేటు వేటు వేయాలి
(ఏప్రిల్ 2 ఈనాడు సంపాదకీయం)

‘..తల్లీ తండ్రుల్ని నరికేసిన కసాయి కొడుకు, తీరా న్యాయస్థానంలో, అమ్మా బాబూ లేని అనాధను, దయచూపండి అని వేడుకున్నట్లుగా వుంది జగన్ ధోరణి.
(మే 1 ఈనాడు సంపాదికీయం)

సంపాదకీయం  అన్నది పత్రిక పాలసీని ప్రతిబింబిస్తుంది. ఆ లెక్కన నిత్యం ఒకే వ్యక్తికి వ్యతిరేకంగా సంపాదకీయం ప్రచురిస్తోందంటే, ఆ పత్రిక పాలసీ ఆ వ్యక్తి వ్యతిరేకత తప్ప మరేమీ కాదని స్పష్టమైపోతుంది. 

గడచిన నెల రోజులుగా ఈనాడు దినపత్రిక జగన్ వ్యతిరేక ప్రచారానికి నడుం బిగించిన వైనానికి కొన్ని సాక్ష్యాలివి. జగన్ లేదా అతగాడి పార్టీ వార్తలు ఎక్కడో లోపల సింగిల్ కాలమ్‌లో వేయడం తప్పుకాదు. పత్రిక ఇష్టం అది. 

జగన్ చేసిన దందాలు లేదా, స్కాములు వెలికి తీసి, వార్తలు ప్రచురించడం తప్పు కాదు. పత్రికా ధర్మంలో భాగమే అది.

కానీ అతగాడిని ఓడించడం కోసం అతని ప్రత్యర్థిని వీపున మోయడం ఏ మేరకు సబబు. 

తమకు గిట్టని వ్యక్తిని ఓడించాలనుకోవడం తప్పుకాదు. అతగాడిపై వార్తలు రాయడం అంతకన్నా తప్పు కాదు. కానీ రెండు విషయాలు కీలకం..ఒకటి అందుకు వాడే భాష. రెండవది..అందుకు వాడే కథనాలు. నెల రోజుల పాటు, నిత్యం పతాక శీర్షిక నుంచి, చివరి పేజీ వరకు జగన్ వ్యతిరేక కథనాలతో నింపేస్తున్న వ్యవహారాన్ని రాష్ర్ట పాఠకులు అందరూ గమనిస్తూనే వున్నారు. సుమారు అయిదు రూపాయిల విలువైన ఖరీదు వున్న పత్రిక, దాదాపు పదిహేను లక్షల సర్క్యులేషన్ కలిగి వుందంటే, నెల రోజుల పాటు రమారమి 15 కోట్ల పాఠకుల డబ్బుతో, తన స్వంత అభిమతం మేరకు తన శతృవు వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించుకుంటోందన్నమాట. అదే సమయంలో తన మిత్రుడికి చేతనైనంత సాయం చేస్తోందన్నమాట. ఇందుకు పాఠకులు చెల్లిస్తున్న ఫీజు అక్షరాలా పదిహేను కోట్లు. ఎవరైనా తమ తమ అభిప్రాయాలను ప్రజలకు వెల్లడి చేసేందుకు కరపత్రం ఉచితంగా పంచి పెడతారు. కానీ ఈనాడు అందుకోసం నెల రోజులకు సుమారు పదిహేను కోట్లు వసూలు చేస్తోంది. అంటే తన అభిమతం నెరవేర్చుకోవడానికి ప్రజల జేబుకు కత్తెర వేస్తోంది. ఇలా రాయగానే సహజంగానే మరి సాక్షి సంగతేమిటి? అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. ప్రజాశక్తి ఎంతమంది కొంటున్నారు..విశాలాంద్ర ఎంతమంది కొంటున్నారు. ఆయా పత్రికలను ప్రచురిస్తున్న పార్టీల సిద్ధాంతాలు నచ్చేవారే ఎక్కువగా వాటిని కొంటారు. అంటే అందులో అంశాలు వారికి ఇష్టమే కానీ కష్టం కాదు. అదే విధంగా తమ కుటుంబం కోసమే, తమ గొంతు వినిపించేందుకే పత్రిక, చానెల్ తెస్తున్నామని వైఎస్ అసెంబ్లీ సాక్షిగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసారు. అంటే సాక్షి పత్రిక, చానెల్ ఎలా వుండబోతున్నాయన్నది ఆయన ముందుగానే స్పష్టం చేసారు.. అంటే అది కూడా విశాలాంధ్ర, ప్రజాశక్తిల మాదిరి ఇప్పుడు వైకాపా పార్టీ పత్రిక అనుకోవాలి. కానీ ఈనాడు అలా కాదే..తెలుగువాడి గుండె చప్పుడు అని చెప్పుకుంటుంది. అంటే తెలుగువారి గుండె అంత పద్దతి పాడు లేకుండా కొట్టుకుంటుందా?

మాధ్యమం విలువలు ఎక్కడ?

కాలానుగుణంగా అన్ని రంగాలు, అన్ని వస్తువులు, అన్ని వ్యవహారాలు తమ విలువలు వదులుకుంటున్నట్లే మీడియా కూడా వదిలేసుకుంటున్నట్లనిపిస్తోంది. చెరకు తుద చెదలు కాకున్నా, పండులో ఒక్క తోన పాడయినా, పండు మొత్తాన్ని పక్కన పడేయడం అన్నది మానవ నైజం. రాజకీయాల్లోకి ఎలాగైతే వ్యాపారస్థులు చొరబడ్డంతో అవి కలుషితమైపోయాయో, పత్రికా రంగం కూడా అదే బాట పట్టేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటలైజేషన్ కలిసి పత్రికా రంగ పెట్టుబడి, నిర్వహణ వ్యయాన్ని భారీగా పెంచేసాయి. పత్రిక స్థాపించడం అన్నది కోట్ల వ్యవహారంగా మార్చేసాయి. వ్యాపార ప్రయోజనాల కన్నా, ఇతరత్రా ప్రయోజనాలు ఇబ్బడి ముబ్బడిగా వుండడంతో, బడా వ్యాపారులంతా, పత్రికారంగంలో పెట్టుబడిని, తమ ప్రయోజనాల రక్షణకు ఖర్చుగా భావిస్తున్నారు. దీంతో నిజాయతీగా, జనాలకు నిజం వివరించాలన్నా ఖరీదైన, అందని మావిపండైపోయింది. 

ఇదిలా వుంటే తెలుగునాట పత్రికలు ఆది నుంచి కాస్త నిజాయతీగానే వుంటూ వచ్చాయి. నిబద్ధత గల సంపాదకులు ఎందరో తెలుగు జర్నలిజం రంగాన్ని బలోపేతం చేసి, అపార కీర్తి ప్రతిష్టలు ఆర్జించి పెట్టారు. అంతకు మించి పాఠకుల్లో మీడియా అంటే ఓ నమ్మకాన్ని పెంచుకుంటూ వచ్చారు. నిజానికి పార్టీ పత్రికలైనా సరే,విశాలాంద్ర, ప్రజాశక్తి లాంటి పత్రికల సంపాదకులు కూడా వీలయినంత వరకు నిబద్ధతతో వ్యవహరించారు. వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టే వరకు ఎటువంటి వ్యక్తికత అజెండా లేకుండా పనిచేసిన ఈనాడు పత్రిక తొలిసారి, కాంగ్రెస్‌ను రాష్ర్టం నుంచి తరిమేయడం అన్నది హిడెన్ ఎజెండాగా పెట్టుకున్నట్లు వార్తలు రాయడం ప్రారంభించింది. అది అంతై..అంతింతై..ఎంతకు పెరిగిందంటే, రాష్ర్ట ప్రజలు ఈనాడు అంటే తెలుగుదేశం అనుకూల పత్రిక అనుకునేంత. ఈ వ్యవహారం ముదిరి ముదిరి, రాష్ర్టంలో ఇప్పుడు పార్టీకో పత్రిక అన్న రీతికి చేరిపోయింది. 

ముసుగు తీసిన వైఎస్

రెండు దినపత్రికలు తనకు వ్యతిరేకం అని పదే పదే చెప్పడం ద్వారా, ప్రజల్లో వైఎస్ ఓ అవగాహన తీసుకువచ్చారు. దీంతో రాష్ర్టం అంతటా ఓ విషయం స్పష్టమైపోయింది. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలకు వైఎస్ కుటుంబం అంటే గిట్టదు. అందుకని వారు వారికి వ్యతిరేకంగా రాస్తూనే వుంటారు. దాంతో వైఎస్‌కు కొంత ఊరట లభించింది. ఎందుకంటే వాటిల్లో రాసే వాటిని చదివే జనం శాతం సంగతి ఎలా వున్నా, నమ్మే శాతం గణనీయంగా తగ్గిపోయింది. వైఎస్ అక్కడితో ఆగకుండా, సిపిఐ కోసం విశాలాంధ్ర, సిపిఎమ్ కోసం ప్రజాశక్తి వున్నట్లే, తన కుటుంబం లేదా తన పార్టీ కోసం ఓ పత్రిక ఛానెల్ తీసుకువస్తున్నట్లు చెప్పేసారు. తమ గొంతు కూడా వినపడాలని, తమ వాదన కూడా నిలవాలని వీటిని ఆయన తేవడం ఎంత మాత్రం తప్పుకాదు. ఎదుటివాడు మైకు పట్టుకుని అరుస్తున్నపుడు, ఇవతలి వాడి పీల గొంతు వినపడదు. వాడూ మైకు అందుకోవాల్సిందే. 

గత ఎన్నికల తరువాయి

గడచిన ఎన్నికల సందర్భంగా నెల రోజుల పాటు ఈనాడు సాగించిన వైఎస్ కుటుంబ వ్యతిరేక ప్రచారాన్ని చూడాలంటే, అప్పటి పత్రికలు ఓసారి తిరగేయాలి. ఆ వార్తలు చదివినవారిలో సగం మంది (ఓ పత్రిక ఇంతమంది చదువుతారనే అంచనా ప్రకారం, దాని సర్క్యులేషన్ లెక్కల ప్రకారం అంతమంది చదివితే) ఓటు వ్యతిరేకంగా వేసినా వైఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేది కాదు. కానీ అలా జరగలేదు అంటే, ఈనాడును అభిమానించి కొనే పాఠకులే దాని వార్తలు పట్టించుకోలేదు. లేదా నమ్మలేదు, అని అనుకోవాలి. సరే ఎన్నికలు అయిపోయాయి. తరువాత రకరకాల పరిణామాలు సంభవించాయి. జగన్ వ్యతిరేక ధోరణి ఈనాడు కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఈ క్రమంలో ప్రచురించిన కథనాలను తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే వారి పరిశోధనవారిది. అందులో వారికి దొరికిన విషయాలు వారివి. కానీ మళ్లీ ఎన్నికలు వచ్చాయి. మరోసారి ఈనాడు కథనాలు వండి వార్చడం ప్రారంభించింది. చాలా కథనాలు గడచిన ఎన్నికల ముందు వండి వార్చినవే. 

సహజంగా ఓ విలేకరి గతంలో రాసిన వార్తనే పదే పదే రాసాడనుకోండి. ఎడిటోరియల్ విభాగంలో పనిచేసే ఉద్యోగులు..పదే పదే అవే వార్తలా అని బుస్సు మంటారు. చర్విత చరణం అంటే ఎవరికి మాత్రం ఇష్టం వుంటుంది. కానీ ఈనాడు గడచిన ఎన్నికల ముందు రాసిని అనేక వ్యాసాలను కాస్త అటు తిప్పి, ఇటు తిప్పి, శీర్షికలు మార్చి, అందులో కొన్ని భాగాలను కట్,పేస్ట్ చేసి మళ్లీ అందించడం ప్రారంభించింది. పోనీ అది వారి పాలసీ వదిలేయండి. సంపాదకీయాలు వండి వార్చడం ప్రారంభించింది. అది కూడా వారి పాలసీ. కానీ పత్రికలు అన్నాక కొంతయినా సంయమనం వుండాలి. పద్దతగా పదాలు వాడాలి. వ్యక్తిగత దూషణ తగదు. పైన కోట్ చేసిన సంపాదకీయాల పదజాలం చూడండి. అవినీతి ఆనకొండ, జగత్ కిలాడీ,  చీడపురుగు, జగన్మాయ, వారసుడి పీడ..ఇదా పదజాలం. చెడ్డవాడు మరణించినా, స్వర్గీయ అని రాయడం మనకు అబ్బిన సంస్కారం. ఎత్తి 

చూపడం అన్నది మీడియా లక్షణం కానీ, దూషణలు కాదు కదా? జగన్‌పై సవాలక్ష కేసులు వున్నాయి. అవన్నీ కోర్టుల్లో వివిధ దశల్లో వున్నాయి. కోర్టు బెయిల్ ఇచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ కాదు. పోనీ కాంగ్రెస్ పార్టీ వత్తిడి చేసి బెయిల్ ఇప్పించింది అనడానికి మన న్యాయవ్యవస్థను అంత తక్కువ అంచనా వేయడానికి లేదు. మరి అలాంటపుడు కుమ్మక్కుతో జగన్‌కు బెయిల్ వచ్చింది అని చెప్పడం అంటే, మన న్యాయ వ్యవస్థను తక్కువ చేసినట్లు కాదా?  హత్య లేదా దొంగతనం చేసినవాడు ఎవడైనా తీర్పు వచ్చే వరకు నిందితుడే కానీ, నేరస్థుడు కాదు. నిందితుడిని నేరస్థుడు లేదా నేరం చేసాడు అనే అధికారం ఎవరికి వుంది? మరి అలాంటపుడు జగన్‌పై కేసులు ఏవీ ఇంకా రుజువు కాకుండానే సిబిఐ చార్జిషీట్లు పట్టుకునో, లేదా మరో విధమైన డాక్యుమెంట్లు పట్టుకునే నిందించడానికి మీడియాకు మాత్రం ఎవరు అధికారం ఇచ్చారు? మరే రాజకీయ ప్రత్యర్థి అయినా ఆరోపిస్తే, విమర్శిస్తే, తాటికాయంత అక్షరాలతో రాసుకోవచ్చు. అభ్యంతరం లేదు. కానీ అలా కాకుండా పత్రిక తన స్వంత అభిప్రాయంగా చెబితే, తప్పు చేసినట్లు కాదా.  భవిష్యత్‌లో ఒకవేళ ఈ దేశపు న్యాయ చట్టాల ప్రకారం జగన్ నిర్దోషి అని తేలితే, ఈ ఉపమానాలు, బిరుదులు, ఈ అడ్డగోలు రాతలు అన్నీ ఏమవుతాయి. ఒకసారి వేసిన ముద్ర వీరు చెరపగలరా? లేదా అదే పత్రికలో తప్పు పదాలువాడాం..తప్పుడు ఆరోపణలు చేసాం అని క్షమాపణలు కోరగలరా? అలాంటి అవకాశం, సదుద్దేశం లేనపుడు, ఈ అత్యుత్సాహం ఎందుకు, అడ్డగోలు ఆగ్రహం ఎందుకు. ఆశ్రీతపార్టీ పక్షపాతం తప్ప  ఇందులో వున్న జనశ్రేయస్సు అన్నది ఎజెండా అని నమ్మేదెలా?

చాణక్య 

[email protected]