ఎమ్బీయస్‌ : తూర్పు తిరిగి దణ్ణం పెట్టమన్న మోదీ

మోదీగారి తిరుపతి ఉపన్యాసం చాలా ఉత్సుకతతో విన్నాను – కెసియార్‌ ఆరోపించినట్టు హైదరాబాదును యూటీ చేస్తామని చెప్తారా లేదా అని. ఆ మాటే లేదు. మొదట్లో ఆ ఐడియా వుందేమో, కెసియార్‌ ముందే చెప్పేసి…

మోదీగారి తిరుపతి ఉపన్యాసం చాలా ఉత్సుకతతో విన్నాను – కెసియార్‌ ఆరోపించినట్టు హైదరాబాదును యూటీ చేస్తామని చెప్తారా లేదా అని. ఆ మాటే లేదు. మొదట్లో ఆ ఐడియా వుందేమో, కెసియార్‌ ముందే చెప్పేసి ప్రీఎంప్ట్‌ చేశారేమో తెలియదు. ఏమైతేనేం, సీమాంధ్రులకు హైదరాబాదు విషయంలో కొత్తగా హామీ ఏదీ దక్కలేదు. మోదీగారు చెప్పినదేమిటి? ప్రపంచమంతా తూర్పువైపు చూస్తోంది. మీరూ చూడండి. సముద్రం కనబడుతుంది. పశ్చిమాన సముద్రతీరం వున్న గుజరాత్‌ కంటె తూర్పున సముద్రతీరం వున్న మీకు అవకాశాలు అధికంగా వుంటాయి. ఏం దిగులు పడకండి. కష్టపడడం మీకు ఎలాగూ అలవాటే. పడండి. పడుతూనే వుండండి, మరింత అలవాటు పడతారు. పెట్రోలు, గ్యాస్‌ వంటి సహజవనరులు మీకున్నాయి అని కూడా చెప్పారు. ఉంటే ఏం లాభం రిలయన్సు వాళ్లు మీ గుజరాత్‌కే పట్టుకెళ్లిపోతున్నారు కదాని జనాలెవరూ లేచి అడగలేదు. 
ఆ గ్యాస్‌బావులే వాళ్ల కొంప ముంచుతున్నాయి. ఆంధ్రలో వచ్చే ప్రభుత్వం తమ చెప్పుచేతల్లో వుండాలనే రిలయన్సు వారు యీ ఎన్నికలలో డబ్బు గుమ్మరిస్తున్నారని, అందుకే దేశం మొత్తంలో పట్టుబడిన డబ్బులో సగం యిక్కడే దొరికిందనీ అంటున్నారు. ఈ సాగరఘోషంతా గ్యాస్‌ కోసమే అని అర్థమవుతోంది. లేకపోతే ఆ సముద్రం యిప్పటిదా? 

భూమి పుట్టినప్పటినుండీ వుంది. దాన్ని యిప్పుడే ఆంధ్రులకు ఎవరో తెచ్చి యిచ్చినట్టు, యికపై దానిలో చేపలు పట్టుకుంటూ హాయిగా బతికేసేయవచ్చు అన్నట్టు యీ బిల్డప్‌ ఏమిటి? మాట్లాడితే సీమాంధ్రకు సముద్రం వుంది అంటున్నారు. దానివలన ఆ ప్రాంతం ఏమైనా బాగుపడిందా? పడితే అక్కడివాళ్లు హైదరాబాదు వంటి కొండలు, గుట్టల ప్రాంతానికి వచ్చి బతుకుతెరువు వెతుక్కోవడం దేనికి? సీమాంధ్ర నాయకులు ఏమైనా బాగుపరచారా? మోదీగారి పక్కనే చంద్రబాబుగారున్నారు. దాదాపు పదేళ్లు ముఖ్యమంత్రిగా వున్నారు. అంతకితం ఎన్టీయార్‌ పాలించినప్పుడు కూడా ముఖ్యపదవుల్లో వున్నారు. టిడిపి బాబు హస్తగతం అయ్యాక రాసిన ఎన్టీయార్‌ జీవితచరిత్రల్లో చాలామంది ఎన్టీయార్‌ పథకాలన్నిటి వెనకా బాబు మేధస్సే వుందని రాశారు. అందువలన మొత్తం టిడిపి పాలనను బాబు ఖాతాలో వేసినా తప్పులేదు. అంతటి సుదీర్ఘకాలంలో బాబు అక్కడ ఎన్ని పోర్టులు కట్టించారు? ఎన్ని ఓడలు తయారు చేయించారు? ప్రభుత్వం చేత ఎంత గ్యాసు తీయించారు? కేరళలా సీఫుడ్‌ ఎగుమతులు ఎన్ని చేయించారు?  

ఓ పక్క గుజరాత్‌లో మోదీ యివన్నీ చేస్తూ వుంటే అవి చూసి అప్పుడెందుకు యిన్‌స్పయిర్‌ కాలేదు? ఇప్పుడు మోదీయే నాకు ఆదర్శం ఎందుకంటున్నారు? మోదీ ఎడారి ప్రాంతానికి నీళ్లు తెప్పిస్తూ వుంటే, బాబుగారు రాయలసీమ మెట్టప్రాంతాన్ని గాలికి వదిలేసి తన ఆస్తులున్న హైదరాబాదుపైనే పడ్డారనుకోవాలా? కోస్టల్‌ కారిడార్‌ అనేది అద్భుతమైన ఆలోచన. అవినీతి గబ్బు పట్టించి భ్రష్టు పట్టించడం వేరే మాట. కానీ కోస్టల్‌ కారిడార్‌ వంటిది బాబు రూపకల్పన చేయించారా? తుపానులు వచ్చిపడుతున్నాయి కదా, వాటిని ఎదుర్కోవడానికి శాశ్వతమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఇవే ప్రశ్నలు కాంగ్రెసు పాలకులకూ వేయవచ్చు. సముద్రం వుంది కాబట్టి చెలరేగిపోతాం అని చేస్తున్న హంగామా చూస్తేనే ఒళ్లు మండుతోంది. దీనికి తోడు రాజధాని నిర్మాణం ఒకటి. ఏం మోదీ ఢిల్లీతో ఎందుకు పోల్చాలి? మా గాంధీనగర్‌లా సింపుల్‌గా కట్టుకోండి, అది చాలు అనవచ్చుగా. రాహుల్‌ గాంధీ ఓ పక్కనుంచి ఐఐటి, ఐఐఎమ్‌, వల్లకాడు, వశినాపురం అంటూ హామీలు దంచేస్తున్నాడు. మరో పక్క మోదీ ఢిల్లీని తలదన్నే నగరం కట్టండి, నేను నిధులిస్తాను అనేస్తున్నాడు. అప్పుడే అంతా ఫిక్సయిపోయినట్లు! 

మోదీ ప్రధాని అవుతాడో లేదో యిప్పటిదాకా తేలలేదు. కార్పోరేట్లు రంగంలోకి దిగి మీడియాను ప్రభావితం చేయడానికి చూస్తూండడంతో ఏ సర్వేను నమ్మలేకుండా వున్నాం. కామన్‌సెన్స్‌ ఉపయోగించి చూస్తే మార్చి మూడోవారంలో వీక్‌-సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌ కొంతవరకు వాస్తవంగా తోచింది. దాని ప్రకారం యుపిఏకు 111-123 (కాంగ్రెసుకు 94-106), ఎన్‌డిఏకు 234-246 (బిజెపికి 206-218) వచ్చేట్లు వున్నాయి. (దీనిలో టిడిపికి విడిగా 13-19 చూపారు. దాన్ని ఎన్‌డిఏకు కలపాలి). 1999లో వాజపేయి హవా నడిచినపుడు బిజెపి తెచ్చుకున్నది 183. అదే యిప్పటిదాకా హైయస్ట్‌. నాలుగైదు రోజులుగా ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిథి మోదీ హవాగురించి చాలా విశ్లేషాణత్మకంగా చక్కగా రాస్తున్నారు. అంచనాలు కూడా యిస్తున్నారు. ఇవి వీక్‌ కంటె లేటెస్టు. వాస్తవాలకు మరింత దగ్గరగా వుండవచ్చు. సానుకూల పవనాలు వీస్తే బిజెపికి 200-220 సీట్లు రావచ్చని ఆయన అంచనా. 

ఉత్తరాఖండ్‌(5), హిమాచల్‌(3), హరియాణా(3), ఛత్తీస్‌ గఢ్‌(8), ఝార్ఖండ్‌ (8), అసాం (5), కశ్మీర్‌ (1), గోవా (1), తమిళనాడు (2), మహారాష్ట్ర (15), బెంగాల్‌ (1-2) లలో యిద్దరిదీ ఏకాభిప్రాయం వున్నట్టు తోస్తోంది. ఇక్కడికి 53 అయ్యాయి. ఇక తక్కిన రాష్ట్రాలకు వస్తే వీక్‌ సర్వే ప్రకారం 141-182 మధ్య వస్తే యీయన అంచనా ప్రకారం 137-144 మధ్య వస్తాయి. వివరాలు కావాలంటే – 

రాష్ట్రం (మొత్తం సీట్లు) – వీక్‌ సర్వే – కృష్ణారావుగారి అంచనా

యుపి (80) –     42-50 –         35-40 
బిహార్‌ (40)       21-29           15
మధ్యప్రదేశ్‌ (29) 24-28            24
రాజస్థాన్‌ (25)    21-25           19 (తగ్గవచ్చు కూడా)
గుజరాత్‌ (26)    20-26           18-20
కర్ణాటక (26)      7-13            15
ఒడిశా (21)       3-7               6
ఢిల్లీ (7)            3-4              5

ఎలా చూసినా బిజెపికి సొంతంగా 200 దాటకపోవచ్చు. ఎన్‌డిఏలో భాగస్వాములు ఎన్ని పట్టుకురాగలరు? మహా అయితే 40, 50! 272 కంటె తక్కువ పడితే ప్రాంతీయపార్టీలను ఆశ్రయించవలసిందే. వారు తమ రాష్ట్రంలోని మైనారిటీల ఓటింగు సరళిని బట్టి మోదీని ప్రధానిగా ఒప్పుకోమంటే మోదీకి బదులు వేరెవరో, అతని సహచరుడే కావచ్చు – ప్రధాని కావచ్చు. ఇలాటి పరిస్థితుల్లో మోదీ అప్పుడే తను ప్రధాని అయిపోయినట్టు, నిధులిచ్చేసినట్లు, ఇక ముఖ్యమంత్రి హోదాలో బాబు ఖర్చుపెట్టడం మాత్రమే మిగిలినట్లు కాబోయే ప్రధానమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి వేదికపై ముచ్చట్లాడడం తమాషాగా తోచింది.

బాబుగారి ఉపన్యాసం మామూలుగానే అనేక హామీలతో వుంది కాబట్టి కొత్తగా చెప్పేదేమీ లేదు. పవన్‌ మాత్రం మంచి ప్రశ్న వేశారు. సీమాంధ్రులను తిడుతున్న కెసియార్‌ను సీమాంధ్రకు ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్న జగన్‌ ఎందుకు తిట్టడం లేదు? అని. నా మనసులోనూ అదే ప్రశ్న వేసుకుని విముఖత పెంచుకున్నాను. దానితో బాటు పవన్‌పై కూడా కొన్ని ప్రశ్నలు పుట్టుకుని వచ్చాయి. కెసియార్‌ సీమాంధ్రుల్ని తిడితే పవన్‌ ఓర్చుకున్నాడట. కానీ మోదీని తిడితే చికాకేసుకుని వచ్చి తాట తీస్తానన్నాట్ట. అంటే ఆంధ్రుల కంటె మోదీ ఎక్కువై పోయాడా? ఎందుకు? ఆయన తనను ఔట్‌సోర్స్‌ చేసుకున్నాడనా? నాకు దీనిలో దమ్మిడీ ఆదాయం లేదని పవన్‌ రెండు, మూడుసార్లు నొక్కి చెప్పడంతో దానిపైనే నా దృష్టి పోయింది. డబ్బు యివ్వడం లేదేమో, పోయిన ఆస్తులు తెప్పించి యిస్తున్నారేమో, లేక మనకు యిచ్చినట్టుగానే ఆయనకూ హామీలు యిస్తున్నారేమో అని సందేహం కలిగింది. 

తర్వాత – విభజన చేసేశారని యిప్పుడు వచ్చి లెక్చర్లు దేనికి? టిడిపి లేఖ యిచ్చినపుడో, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం చేసినపుడో, మంత్రుల ముఠా నివేదిక అప్పుడో, అసెంబ్లీకి తీర్మానం వచ్చినపుడో, పార్లమెంటులో తెలుగు ఎంపీలను తన్నించినపుడో నోరు విప్పలేదేం యీయన? యాక్టర్‌కు టైమింగ్‌ ముఖ్యమంటారు. బహుశా పవన్‌కూడా టైమింగ్‌ కోసం ఆగారేమో. కిశోర్‌ కుమార్‌ డబ్బు దగ్గర చాలా గట్టి. 'పాట రికార్డింగ్‌ చేసేయండి, డబ్బు దారిలో వుంది' అని నిర్మాత అంటే సరే అని మొదలుపెట్టి ఆ అనీ, వూ అనీ, దగ్గి, తుమ్మి, గొంతు సవరించుకుని టైము వేస్టు చేసేవాడు. ఇక ఆపండి మహాప్రభో అని నిర్మాత డబ్బు పట్టుకుని వచ్చి చేతిలో పెడితే గొంతు పెగిలేది. 

తనకు రాజకీయపరిజ్ఞానం బాగా వుందన్నట్లు పవన్‌ యింప్రెషన్‌ కలిగిస్తారు. జాతీయ నాయకుల పేర్లు తడుముకోకుండా చెప్తారు. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో కూడా నిన్న చరిత్ర చెప్పారు. 2004లో వైయస్‌ పాలన వచ్చాక ఆయనా, ఆయన అనుచరులూ కలిసి తెలంగాణలో భూములు కబ్జా చేయడం వలన తెలంగాణ ప్రజల్లో సీమాంధ్ర నాయకులపై కోపం వచ్చి ఉద్యమం వచ్చిందట! 2001లోనే టిడిపి పాలనలోనే తెలంగాణకు విద్యుత్‌, నీళ్లు విషయంలో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ కెసియార్‌ తెరాస పెట్టారని మనం అనుకుంటూ వచ్చాం, అమాయకులం. 2004 పాటికి తెరాస బలం పుంజుకుందని కాంగ్రెసు అధిష్టానం అనుకుని వారితో పొత్తు పెట్టుకుంది. ఆ తర్వాత వైయస్‌ ముఖ్యమంత్రి అయ్యారు. తిక్కలో పవన్‌ లెక్క తప్పినట్టున్నారు. ఇంతకీ కబ్జాలు చేసేవారెవరు? సీమాంధ్రులు అంటూ వచ్చారు తెరాస వారు. మొన్న ఎన్నికలలో పదం మార్చి కాంగ్రెస్‌ వారు – అన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్‌వారు దోచుకుంటూ వుంటే తెలంగాణ కాంగ్రెస్‌వారు హారతులు పట్టారన్నారు. ఇప్పుడీయన సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకుల్ని మరింత క్వాలిఫై చేసి వైయస్‌ అనుయాయులు అన్నారు. వైయస్‌ వున్నంతకాలం ఆయనతో అంటకాగి యిప్పుడు టిడిపిలోకి దూకిన నాయకులు కూడా ఆ బ్యాచ్‌లో వున్నారో లేదో పవనే చెప్పాలి. 

కబ్జా చేసినవారెవరని తెలంగాణ ఉద్యమకారులను అడిగితే పద్మాలయ నుండి మొదలుపెడతారు. అవన్నీ వైయస్‌ హయాంలోనే జరిగాయా అన్నది కూడా పవనే చెప్పాలి. అవునూ పవన్‌ కోటి రూపాయలిచ్చి పీపుల్స్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సో ఏదో పెట్టారు కదా. అదేం చేస్తోంది? కబ్జాదారుల నుండి భూమి సొంతదారులను రక్షించే పని పెట్టుకోలేదా? పోనీ యిప్పుడు జనసేనైనా ఆ పని తలకెత్తుకుని కబ్జాదారులను గుర్తించి తరిమివేస్తుందా? పవన్‌ సొంత భూమి కూడా అన్యాక్రాంతం అయిందని, ఆ సందర్భంగా ఆయనకు ఆర్థిక, హార్దిక నష్టం వాటిల్లిందని విన్నాం. అలా నష్టపరిచినది వైయస్‌ అనుయాయులా!? నేను వేరేలా విన్నానుస్మీ! అసలు విషయమేమిటో పవన్‌ 'ఇజం'కు కొనసాగింపుగా 'నిజం' రాస్తే తప్ప మనం వూరికే వూహించుకుంటూనే వుంటాం. పవన్‌, బాబు, మోదీ కలిస్తే పంగనామాలు అని కెసియార్‌ అంటే పవన్‌ మంచి రిటార్టు యిచ్చారు – మూడు ఒకట్లు చూస్తే తనకు ఆపదమొక్కులవాడు గుర్తుకు వస్తాడని. ఆయనకు వచ్చిన ఆపదలేమిటో తెలియదు కానీ యీ కలయిక వలన అవి తొలగిపోయేట్టున్నాయి. 

ఇక మోదీ సీమాంధ్రులకు యిచ్చిన వరాల మాట ఏమిటంటారా? ఆయనే చివర్లో అందరి చేతా అనిపించారు – గోవిందా గోవింద అని! అదే ఆయన మనకిచ్చిన సందేశం!

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2014)

[email protected]